30, నవంబర్ 2012, శుక్రవారం

 అందుకే.. ఆంగ్లం....

ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి.. బెంగళూరులో ఆదివారం జరిగిన సన్నాహక సమావేశ ఆహ్వాన పత్రికను తెలుగులోనే ముద్రించామని తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షుడు డాక్టర్ ఎ.రాధాకృష్ణరాజు పేర్కొన్నారు. తెలుగు రాని మీడియా కోసం, స్థానిక ప్రజాప్రతినిధుల కోసం కొన్ని ఆహ్వానపత్రికలను ప్రత్యేకంగా ఆంగ్లంలో ముద్రించామని, మిగతా వారికి తెలుగులో ముద్రించిన ఆహ్వానపత్రికలే పంపామని ఆయన వివరించారు. ఈ ఆహ్వానపత్రికపై 'తెలుగు ముక్క ఉంటే ఒట్టు..!' అంటూ ఆంధ్రజ్యోతిలో గురువారం ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ లేఖను పంపారు.

తెలుగు చదవడంలో ఇబ్బందేంటని .....

'దేశ భాషలందు తెలుగు లెస్స' అని కృష్ణ దేవరాయలు కీర్తించిన భాష! 'సుందర తెనుంగు' అని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి పొగిడిన కమ్మటి భాష.. మన మాతృభాష. కానీ, ఆంగ్లమోజులో ఇన్నాళ్లుగా తెలుగును పట్టించుకోలేదు. ఇప్పుడా తప్పును సరిదిద్దుకుంటూ.. పాఠశాలల నుంచి కాలేజీ వరకు తెలుగు భాషను తప్పనిసరిగా చదవాల్సిందేననే విధాన నిర్ణయాన్ని తీసుకునేందుకు సర్కారు సిద్ధమైంది. కానీ.. ఆదిలోనే హంసపాదులాగా ప్రభుత్వ నిర్ణయం పట్ల కొందరు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. తెలుగును తప్పనిసరి చేయడం వల్ల ఇతర రాష్ట్రాలనుంచి ఇక్కడికి వచ్చిన విద్యార్థులు వెనకబడతారని కొందరు వాదిస్తున్నారు.

ఇప్పటి వరకూ ఇతర భాషలు చదువుకున్నవారు ఒకేసారి తెలుగు తీసుకోవడం వల్ల మార్కులపరంగా వారికి నష్టం జరుగుతుందని అంటున్నారు. అసలు ఈ నిర్ణయాన్ని సీబీఎస్ఈ, కేంద్రీయ విద్యాలయాల్లో అమలు చేయడం సాధ్యం కాదంటున్నారు. అయితే, తెలుగును తప్పనిసరి చేయడం వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం ఉండదని సాహితీవేత్తలు, విద్యావేత్తలు స్పష్టం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రంలో ఉంటున్నప్పుడు తెలుగు చదవడంలో ఇబ్బందేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

తెలుగు భాష గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు తప్పనిసరి పాఠ్యాంశం కాకపోవడం వల్ల గడచిన రెండు దశాబ్దాల్లో ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థులకు తెలుగు భాష దాదాపుగా దూరమైందనే చెప్పాలి. ఆంగ్లం, హిందీ, ఉర్దూ మాధ్యమాల్లో చదివే వారు రెండో భాషగానో, మూడో భాషగానో తె లుగును చదివే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో మాత్రమే ఇది అమలవుతోంది.

భాషపై పట్టు పెరిగే అవకాశం
డిగ్రీవరకూ తెలుగును తప్పనిసరి చేయడం వల్ల నష్టం జరుగుతుందనే వాదనలో శాస్త్రీయత లేదు. పైగా.. దీనివల్ల వారికి స్థానిక భాషపై పట్టు పెరిగే అవకాశం ఉంది. తరగతిలో వెనకబడతారనడం కూడా తప్పే. ఇతర రాష్ట్రాల్లో 7, 8 తరగతులు చదువుకున్న విద్యార్థులు మన రాష్ట్రంలో 9, 10 తరగతుల్లో చేరేటప్పుడు తెలుగుకు బదులుగా స్పెషల్ ఇంగ్లిష్ చదవడానికి అభ్యర్థించే వీలుంది. ఇప్పుడు వీరికికూడా.. ఉన్నతస్థాయిలో కాకుండా ప్రాథమిక స్థాయిలో తెలుగు భాషను పరిచయం చేసేలా ప్రభుత్వం యోచిస్తోంది.

రెండు, మూడేళ్లలో తెలుగు అక్షరాలు నేర్చుకోవడానికి ప్రతిబంధకాలేమీ ఉండవు. ఇక.. కేంద్రీయ విద్యాలయాల్లో 15 కంటే ఎక్కువమంది విద్యార్థులు తెలుగు చదువుకోవడానికి ఇష్టపడితే తెలుగును బోధించే అవకాశంఉంది. మొత్తమ్మీద.. పాఠశాల స్థాయి నుంచే తెలుగును తప్పనిసరి చేయడం వల్ల భాష పట్ల గౌరవం పెరగడంతోపాటు తెలుగు సంస్కృతి పట్ల అవగాహన పెరుగుతుందని భారత్ విద్యాసంస్థల అధినేత వేణుగోపాల్‌రెడ్డి అంటున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఏ ప్రాంతం వారు వెళ్లి అక్కడ చదువుకున్నా ఆ రాష్ట్ర భాషను రెండో భాషగానో, మూడో భాషగానో చదవాల్సిందేనని.. మనదగ్గర మాత్రమే అది సాధ్యం కాదంటూ అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. తెలుగును తప్పనిసరి చేస్తే ఇబ్బందులు ఏమీ లేవని, అది భాష అభివృద్ధికి తోడ్పడుతుందని హైదరాబాద్ స్కూల్ 'తల్లిదండ్రుల సంఘం' అధ్యక్షుడు రమణకుమార్ అభిప్రాయపడ్డారు. తెలుగు గడ్డ మీద పుట్టినవారంతా తెలుగును తప్పనిసరిగా చదవాల్సిందేనని.. వేరే ఏదో భాష నేర్చుకుంటున్నాం కాబట్టి తెలుగును మర్చిపోతామంటే కుదరదని పలువురు తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న నిబంధన మన దగ్గర మాత్రమే ఎందుకు సాధ్యం కాదని, అదే నిబంధనను ఇక్కడ అమలు చేస్తే ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకుడు రాళ్లబండి కవితా ప్రసాద్ అన్నారు.

తెలుగు బోధనతో ఇబ్బందేం లేదు
రాష్ట్రంలో చదివే విద్యార్థులు తెలుగును తప్పనిసరిగా చదివేలా నిర్ణయం తీసుకుంటున్నాం. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థులు ప్రత్యేక అనుమతితో తెలుగుకు బదులు స్పెషల్ ఇంగ్లిష్ తీసుకునే వీలుండేది. ఇక వారు సైతం తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాల్సిందే. ఉన్నత తరగతుల్లో చేరినవారైనా సరే.. ప్రాథమిక స్థాయి తెలుగు నేర్చుకోవాల్సిందే. ఏడేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నవారు తెలుగును ఒక సబ్జెక్టుగా చదవాలి. దీని వల్ల ఇబ్బందేమీ లేదు. పైగా ఇతర రాష్ట్రాల విద్యార్థులు మరింత సులభంగా తెలుగు నేర్చుకునే అవకాశం ఉంటుంది.