16, ఏప్రిల్ 2018, సోమవారం

భారత్‌లో 165 ఏళ్ల కిత్రం ఈ రోజు జరిగిన అద్భుతం....

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే టాప్- 5 నెట్‌వర్క్‌లలో ఒకటిగా పేరొందింది. సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద సంస్థ ఇది. కాగా మన దేశంలో 1853 ఏప్రిల్ 16న తొలి రైలు నడిచింది. ఇది 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ఈ రైలు బోరీబందర్ (ఛత్రపతి శివాజీ టర్మినల్-ముంబై) నుంచి ఠాణే మధ్య నడిచింది. బ్రిటన్‌లో రూపొందిన ఈ రైలులో మొత్తం 20 బోగీలున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు బయలు దేరిన ఈ రైలు 4.45కు గమ్యస్థానం చేరింది. 1845లో కోల్‌కతాలో గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్ కంపెనీ ఏర్పడింది. 1850లో ఈ కంపెనీ ముంబై నుంచి ఠాణె వరకూ రైల్వే లైన్ పనులను చేపట్టింది.
ఈ రోజు (ఏప్రిల్ 16) ప్రపంచ విఖ్యాత కమెడియన్ చార్లీ చాప్లిన్ జన్మదినం. ప్రపంచాన్ని నవ్వుల్లో ముంచెత్తిన చాప్లిన్ గురించి తెలియనివారెవరూ ఉండరు. చాప్లిన్ తల్లి స్టేజ్ కళాకారిణి. తండ్రి మద్యం మత్తులో నిత్యం మునిగి తేలేవాడు. వామపక్ష భావాలు కలిగిన చాప్లిన్‌పై అమెరికా నిషేధం విధించింది. చార్లీ చాప్లిన్ అసలు పేరు ట్రంప్. చార్లిన్ చెప్పిన జీవిత సత్యాలివే...
ఎవరి నిజమైన చరిత్ర అయినా వారు మత్తులో ఉన్నప్పుడే తెలుస్తుంది.
నవ్వు అనేది లేకుండా గడిపే ప్రతీరోజూ వ్యర్థమే!
ఈ ప్రపంచం చాలా కౄరమైనది. దీనితోపాటు నడిచేందుకు కౄరునిగా మారాల్సి వస్తుంది.
మనల్ని వంటరిగా వదిలేస్తే జీవితం ఆనందమయం అవుతుంది.
అంత్యకాలంలో ప్రతీదీ అబద్ధమే అనిపిస్తుంది.
నాకు భగవంతునితో ఏ సమస్యాలేదు... అంతా నా విరోధులతోనే!
నా విషయంలో సుఖం, సౌకర్యాలు అలవాట్లుగా మారిపోవడమే బాధాకరం.
మనం చాలా ఎక్కువగా ఆలోచిస్తాం... తక్కువగా అనుభూతి చెందుతాం.

ఆ ఊరికి ఆమే కాటికాపరి!

  • ‘తూర్పు’ జిల్లాలోని బండారులంకలో మృతదేహాలను కాల్చుతున్న మహిళ
  • శ్మశానవాటికలోనే సత్యామణి నివాసం
మహిళలు శ్మశానంలో అడుగుపెట్టడం ఒకనాడు నిషిద్ధం. ఆ కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, అక్కడక్కడా ఆ కట్లు తెంచుకొని మహిళలు ముందుకొస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు దగ్గరుండి అంత్యక్రియలు జరుపుతున్నారు. అయితే, అంత్యక్రియల్లో పాల్గొనడం కాదు.. ఆ కర్మకాండలను స్వయంగా తానే నిర్వహిస్తోంది కర్రి సత్యామణి. శ్మశానంలోనే ఉంటూ, దశాబ్దకాలంగా మృతదేహాలను కాలుస్తోంది ఈ మహిళా కాటికాపరి.
 
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం బండారులంకకు చెందిన కర్రి సత్యామణికి చదువు లేదు. వేర్వేరు కారణాలతో ఆమె కుటుంబం విచ్ఛిన్నమయింది. శ్మశానంలో గుడిసె వేసుకొని ఒంటరిగా జీవిస్తోంది. శ్మశానానికి వచ్చిన మృతదేహాలను కాలబెడుతూ కడుపు నింపుకొంటోంది. ఆమెది జంగమ దేవర్ల సంప్రదాయం. ఆమె ఎక్కడ నుంచి వచ్చింది, కుటుంబం ఏమయింది అనేది స్థానికులకు కూడా తెలియదు. సత్యామణిని చాలాకాలంగా కాటికాపరిగానే చూస్తున్నామని చెబుతున్నారు. ఊరి పిలుపులకు ఆమె దగ్గరగా ఉండి అంతిమ క్రతువులను పూర్తి చేస్తోంది.
 
అంతేకాదు, నిరుపేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు, మంత్రం నుంచి కట్టెల మీద కాల్చేదాకా ప్రతి కార్యక్రమం తానే చూసుకొంటుంది. మంత్రాలు చెప్పేపాండిత్యం ఎక్కడ సంపాదించావు అని సత్యామణిని ప్రశ్నిస్తే, శ్మశానవాటికలో పురోహితులు శ్లోకాలు చదువుతుంటే విని కొన్ని శబ్దాలను, పదాలను తాను చెవినేసుకొన్నట్టు వివరించింది. అంత్యక్రియలు పూర్తి చేసినందుకుగాను మృతదేహానికి రూ.వెయ్యి చొప్పున తీసుకొంటానని సత్యామణి తెలిపింది.

భారత్‌మాల నుంచి ఆంధ్రా అవుట్‌...

భారత్‌మాల నుంచి ఆంధ్రా అవుట్‌...
భారీ తీర‌ప్రాత‌మున్నద‌క్షిణాదిని కాద‌ని. ఉత్తరాదికే పెద్దపీట
కేంద్ర ప్ర‌భుత్వ మ‌రో క‌క్ష‌సాధింపు
రహదారుల నిర్మాణంతో దేశానికి మణిమాలను తయారు చేయాలనుకున్న భారత్‌మాల ప్రాజెక్టులో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరిగింది. ఉత్తరాది రాష్ట్రాలు.. మరీ ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్దఎత్తున ప్రా జెక్టులు ఇచ్చి నవ్యాంధ్యకు చిల్లర పడేసినట్లుగా విదిల్చారు. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ విడుదల చేసిన భారత్‌మాల ప్రాజెక్టుల్లోని గణాంకాల్లో ఈ విషయం తేటతెల్లమవుతోంది. మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌తో భారత్‌మాలను నింపేశారు. ఆర్థికాభివృద్ధి కారిడార్‌, ఫీడర్‌, ఇంటర్‌ కనెక్టివిటీ, ఎక్స్‌ప్రెస్‌ వేల జాబితాలో ఏపీ రాష్ట్రం దాదాపు మాయమైంది. తీరప్రాంత రహదారుల్లో.. అదీ విదేశీ నిధులతో చేపట్టే ప్రాజెక్టుల కింద రెండే రెండు ప్రాజెక్టులు ప్రతిపాదించారు. అత్యంత కీలకమైన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వేకు చోటుకల్పించలేదు.

నేడు జైల్లో ఉన్న ఆశారాంబాపు... ఒకప్పుడు బొగ్గువ్యాపారే...



మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూపై జోథ్‌పూర్ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఈనెల 25న తీర్పు వెలువరించనుంది. ఆశారాంబాపూ గురువుగా మారడం వెనుక ఆసక్తికర కథనం ఉంది. ఇతని పూర్వీకులు పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతానికి చెందినవారు. ఆశారాం అసలు పేరు అసుమల్ థావుమల్ హర్పలానీ. దేశ విభజన అనంతరం వారి పూర్వీకులు అహ్మదాబాద్‌లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆశారాంబాపూ ఆత్మకథ పుస్తకాన్ని అనుసరించి ఆయన మూడవ తరగతివరకే చదువుకున్నారు. తండ్రి చనిపోయాక విద్యకు దూరమై బొగ్గు వ్యాపారం చేశారు. అయితే ఆ వ్యాపారం అతనికి నచ్చలేదు. తన 15 వ ఏట ఇంటిని విడిచిపెట్టి ఒక ఆశ్రమానికి చేరుకున్నారు. పెళ్లి నిశ్చయమైన 8 రోజులకు మందు ఆశ్రమానికి వచ్చేశారు. అయితే తరువాత అతనికి వివాహం జరిగింది. లీలాషా అనే గురువు నుంచి ఆశారాం దీక్ష తీసుకున్నారు. అప్పడే అతని పేరు ఆశారాంబాపూగా మారింది. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఆశారాంబాపూ మొత్తం 400 ట్రస్టులను ఏర్పాటు చేశారు. కాగా మైనర్ బాలికపై అత్యాచారం కేసులో చిక్కుకున్నఆశారాంబాపూ 2013 నుంచి జైలులో ఉంటున్నారు.