28, ఫిబ్రవరి 2011, సోమవారం

మంత్రి పైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే

తెలంగాణ అంశంపై సోమవారం కూడా శాసనసభ దద్ధరిల్లింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, తెలంగాణను అడ్డుకున్నది ఎవరో బిజెపి అగ్రనేత అద్వానీ చెప్పారని తెలుగుదేశం పార్టీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కాంగ్రెసు, తెలుగుదేశం సభ్యుల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారి తీసింది.ఓ దశలో శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుపైకి తెలుగుదేశం శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి దూసుకెళ్లారు. ఆయనను కాంగ్రెసు సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తెలంగాణా వద్దన్నది చంద్రబాబే

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చంద్రబాబే అడ్డుకున్నారని బీజేపీ నేత అద్వానీయే చెప్పారని.. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీని తప్పుబట్టే అర్హత చంద్రబాబునాయుడుకు లేదని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. సోమవారం ఆయన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అంశం కేంద్రం పరిధిలో ఉందన్నారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని..తెలంగాణా పై చంద్రబాబు ద్వంద్వ విధానం వీడి ఓ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేసారు

మాజీ సిఎం రోశయ్యపై కేసు పెట్టండి : హైకోర్టు

హైదరాబాదీ అత్యంత ఖరీదైన ప్రాంతం మైత్రివనంలోని స్థల వివాదంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యపై విచారణపై విధించిన స్టేని సోమవారం హైకోర్టు ఎత్తివేసింది. అమీర్పేట భూముల వ్యవహారానికి సంబంధించి రోశయ్యతోపాటు మరో 14 మందిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని ఎసిబిని హైకోర్టు ఆదేశించింది.దీనితో ఈ వ్యవహారంలో జరిగిన అధికార దుర్వినియోగం, తదితర అంశాలపై ఎసిబి విచారణ జరపనుంది.

రైల్‌రోకో జరిపి తీరుతాం...

రేపు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు జరగనున్న తెలంగాణ రైల్‌రోకోను విరమించుకోలేదని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. రైల్‌ రోకో సందర్భంగా పట్టాలపైనే వంటా వార్పు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మార్చి 10వ తేదీన తలపెట్టిన 'మిలి యనీర్‌ మార్చ్‌'లో ఎటువంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు.

జైపాల్‌ హామీకి ప్రణబ్‌ ఎసరు ?

ఇప్పట్లో పెట్రో ధరలు పెంచే ప్రసక్తే లేదంటున్న ఆ శాఖ మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి హామీలకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఎసరుపెట్టారు. సోమవారం 2011-12 బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖర్జీ అన్నారు. బడ్జెట్‌లో కస్టమ్‌, ఎక్సైజ్‌ సుంకాలను యథాతథంగా కొనసాగించడంతో అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారల్‌ ముడిచమురు ధరలు 110 యూఎస్‌ డాలర్లకు పెరిగింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయికి సమానం.

ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై 7.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ విధిస్తున్నారు. అలాగే లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీ రూ.14.35, డీజిల్‌పై లీటరుకు రూ.4.60 విధిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగడంతో పెట్రో ధర పెంచక తప్పడంలేదు.

ప్రణబ్ బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

ఆర్థిక శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ సోమవారంనాడు పార్లమెంటులో 2011-2012 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించారు.

బడ్జెట్ ముఖ్యాoశాలు ఇవీ

-నల్లధనాన్ని వెలికి తీసేందుకు అయిదు అంచెల విధానం

-చేనేత రంగం ఉద్దీపనకు చర్యలు

-నాబార్డు ద్వారా రూ.3000 కోట్లు వితరణ

- 2011-12లో 7 నుంచి 8 లెదర్ హబ్స్ ఏర్పాటు

-నల్లధనం విదేశాలకు తరలకుండా ప్రత్యేక విధానం

-బ్లాక్ మనీ వెలికితీతకు చట్టం చేసే యోచన

- 15 మోగా ఫుడ్ పార్కుల ఏర్పాటు

-త్వరలో జాతీయ ఆహార భద్రతా బిల్లు

- 2012 ఏప్రిల్ 1 నుంచి ప్రత్యక్ష పన్నుల విధానం

-2.50 లక్షల గ్రామ పంచాయితీలకు గ్రామీణ ఇంటర్నెట్ సౌకర్యం

-అంగన్‌వాడీ కార్యకర్తల వేతనాలు పెంపు ( రూ.700 ఉన్నకార్యకర్తలకు రూ.1500, రూ.1500 ఉన్న కార్యకర్తలకు రూ.3000 చెల్లింపు)

-పప్పుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు 60వేల గ్రామాలకు రూ.300 కోట్లతో ప్యాకేజీ

-రూ.7,300 కోట్లు పట్టణాల దగ్గర

- రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు పావలా వడ్డీకే రుణాలు

-పశుగ్రాస నివారణకు రూ.300 కోట్లు

- భారత నిర్మాణ రంగ కార్యక్రమానికి రూ.58వేల కోట్లు

-విద్యారంగానికి రూ. 52,057 కోట్లు

-విద్యాహక్కు చట్టం కింద మరో రూ.21 కోట్లు

-అట్టడుగున ఉన్న గిరిజనుల అభివృద్ధికి రూ.244 కోట్లు

- గ్రామీణ బ్యాంకుల స్థాపనకు రూ.500 కోట్లు

-ఆరోగ్య రంగానికు రూ.26, 760 కోట్లు

-చిన్న, సన్నకారురైతుల రుణాల కోసం ప్రత్యేక నిధి

-అసంఘటిత రంగాలలో స్వాలంభన పింఛన్ విధానం మరింత సరళీకృతం

-హరిత భారత్ పథకానికి రూ.200 కోట్లు

-రుణాల ఎగవేతను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

- ఈ సమావేశాల్లోనే ఇన్సూరెన్స్ సవరణ , ఎల్‌ఐసీ బిల్లులు

-2వేలు జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకుల ఏర్పాటు

-ఈ ఏడాది కొత్తగా 20వేల గ్రామాలకు బ్యాంకింగ్ సదుపాయం

-జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి రూ.8వేల కోట్లు

-వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 9,890 కోట్లు

-ఐఐటీ ఖరగ్‌పూర్‌కు రూ.200 కోట్లు , ఐఐఎం కోల్‌కతాకు రూ.20 కోట్లు

-రక్షణ రంగానికి రూ.69,199 కోట్లు

- కొత్త గిడ్డంగుల ఏర్పాటుకు రూ.2వేల కోట్లు

-ముస్లిం వర్సీటీలకు రూ.50 కోట్లు

-గంగానది మినహా నదులు, సరస్సుల శుద్ధికి రూ.200 కోట్లు

-ముస్లిం యూనివర్శిటీలకు రూ.50 కోట్లు

-మ్యూచ్‌వల్ ఫండ్స్‌లో విదేశీ పెట్టుబడులు పెంపు

-వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి 1.8 లక్షలకు పెంపు

జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ కులాల ఆధారంగా జనగణన

-ఇప్పటివరకూ 20 లక్షల ఆధార్ నెంబర్లు జారీ

- త్వరలో కొత్త రుపాయి నాణాలు.

- చిన్న, సన్నకారు రైతుల కోసం ప్రత్యేక నిధి

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

శివరాత్రి మాహాత్మ్యం

సంస్కృతి

ఈశ్వర: స్వరూపము సమస్తము అని ఈశ్వరుడు స్వయంగా ''ఈశ్వర సర్వభూతానాం'' అన్నాడు. సర్వవ్యాపకుడైన ఈశ్వరుని స్వరూపముగా విరాజిల్లుతున్న ఈ సృష్టిలోని ప్రత్యణువులో చరాచరములైన అన్నింటిలోనూ ఆత్మస్వరూపుడై ఆ శివుడే నిండి వున్నాడు. ''ఓం నమ: శివాయ:'' అనే శివ పంచాక్షరి మంత్రం పంచ భూతాత్మకమైన సర్వవ్యాపకతత్వం.

ఓం ్స పరమేశ్వరుడు; 'న' నభ అనగా ఆకాశము;

'మ:' ్స మరత్తు అనగాలి; 'శి' ్స శిఖ అనగా అగ్ని;

'వ' వారిజ అనగా నీరు; 'య' పృధ్వివి అనగానేల.

సర్వము హరిహర స్వరూపము, అద్వైత సిద్ధి సాధకము అనే తత్త్వానికి మూలం 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే'' అనే అద్వైత భావన. శివకేశవుల అభిదత్వ ప్రతిపాదన. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు, ''ఈశ్వర: సర్వభూతానాం అనే పంచభూ తాత్మకమైన సృష్టి శిమయం. అదే శివతత్త్వం. కాలం ఈశ్వరాధీనం, ఆ కాల జ్ఞానమే శివతత్త్వము. కాల స్వరూపుడైన సర్వేశ్వరుడు కాలనిర్ణయం చేస్తాడు. ఈశ్వర ఆజ్ఞానుసారమే కాలచక్రం నిర్ణయించబడి నడుస్తున్నది. ఇదే కాల జ్ఞాన తత్త్వం.

''శివరాత్రి మహారాత్రం నిరాహారో జితేంద్రియ:

అర్చయేద్వా యథాన్యాయం యథాబల మవంచక:

యత్ఫలం లభతే సద్య: శివరాత్రౌ మదర్చనాత్‌''

మహాశివరాత్రినాడు పగలు రాత్రి ఉపవాసముండి, ఇంద్రియ నిగ్రహం పాటించి, భక్తి శ్రద్ధలతో, విధివిధానంగా శివలింగాన్ని పూజించే వారు, ఒక సంవత్సరకాలం శివుని పూజిస్తే లభించే ఉత్తమ ఫలాన్ని ఈ ఒక్కరోజే పొందగలరు. ఈ మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రియమైనది కనుక ఈనాడు శివనామ స్మరణ చేసినవారు కూడా శివసన్నిధి చేరుకుంటారు.

'లీయతి గమ్యతే ఇతి లింగ:

'లిం' అనగా లీయతి. 'గం' అనగా గమయతి. ఈ జగత్తు దేనితో సంచరించి దేనిలో లయం చెందుతుందో అదే 'లింగం'. ఆద్యంతములు లేని జ్యోతిర్లింగం జగత్తుకి ఉనికి పట్టయిన బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం యొక్క ఉపాధియే పరబ్రహ్మం. ఆపరబ్రహ్మమే మహాశివుడు. నిరాకరుడయిన శివుడి సాకారరూపమే లింగం. పరమశివుని ఆరాధ్య చిహ్నం లింగం. 'అ'కార 'ఉ'కార, 'మ' కారముల సమ్మేళణమైన 'ఓం' కారమే లింగం. అదే త్రిమూర్తుల ఏకరూపం, పరంబ్రహ్మరూపం. బ్రహ్మాండం నుండి మహాలింమై, మహాలింగం నుండి తేజోలింగంగా, జ్వాలాస్తంభంగా ఆవిర్భవించాడు మహా శివుడు, తనని పూజించి అర్చించుకోవడానికి అనువైన శివలింగంగా అవతరించాడు ఆ సర్వేశ్వరుడు.

అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగ స్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరంనుడి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరుకాగానే, వెళ్ళి పోగానే శుభప్రదమైన దేహం 'శివము' నుండి అమంగళకరమైన 'శవము'గా మారిపోతుంది. అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం.

''శృతి స్మృతి పురాణా నామాలయం కరుణాలయం

నిమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్‌''

శృతులలో, స్మృతులలో, పురాణాలలో మూలస్వరూపుడుగా కీర్తింపబడిన, శుభాల నొసగేవాడు, ఆదిగురువువైన శంకర భగవానుని దివ్యపాదార విందాలకు నమస్కరిస్తున్నాను.

'శం' అంటే చిదానందం 'కర' అంటే ప్రసాదించేవాడు అంటే చిదానందాన్ని ఇచ్చేవాడు 'శం కరోతి శంకర:' శంకరుడు, శుభకరుడు అని భావం. శంకరుడు అంటే శివుడు. ఎవరికి చిదానందం లభిస్తుందో వారికి అన్ని శుభాలు చేకూరినట్లే. 'శంభో శంకర హరహర మహదేవ' అంటూ భక్తి ప్రపత్తులతో తనని స్మరించే ప్రతి జీవికి ఇహ పరసుఖములతోబాటు ముక్తిని ప్రసాదించి పరబ్రహ్మమే శివుడు. త్రేతా యుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పరమశివుని పూజించి తమ కోరికల్ని సిద్ధించు కున్నారు.

తత్పురుషాయ విద్మహే...

మహాదేవాయ ధీమహి....

తన్నో రుద్ర: ప్రచోదయాత్‌...'' అనే రుద్ర గాయత్రి పఠనం అశరీరవాణి చేస్తుంటే, త్రిమూర్తులలో తానే అధికుడననే సత్య నిరూపణ కోసం అరుణాచలంలో మాఘ బహుళ చతుర్దశినాడు జ్వాలాస్తంభంలో తేజోలింగంగా మహాశివుడు ఆవిర్భవించిన కారణంగా ఈ దినం మహాశివరాత్రిగా లోక ప్రసిద్ధమైనది.

క్షీర సాగర మధనం జరిగినప్పుడు ఉద్భవించిన కాలకూట విషాన్ని అవలీలగా ఔపోసనపట్టి, తన కంఠంలోనే దాచిపెట్టిన అమృతమూర్తి శివుడు నీలకంఠుడు. ఎలాంటి విషభావననైనా మనసులోపలికి పోనీయరాదనే అద్భుత సందేశానికి అది ప్రతీక. చెడుమాటల్ని కంఠంలో నిలిపి ఉంచేయాలనే దానికి ఇది సూచిక. ఆ నీలకంఠం చుట్టు ఉండే విషనాగులు కాలసర్పాలు. సర్పం మనలో దాగిన అజ్ఞాత కుండలిని శక్తికి చిహ్నం. ఆ శక్తిని నియంత్రించే అధిదేవత ఆ సర్పభూషణుడు.

శివుడు ధరించే త్రిశూలం సృష్టి స్థితి, లయలకు కారకుడు అతడే అనడానికి సంకేతం. ఢమరుకం అంటే శబ్దం. ఈ విశ్వమంతా శబ్దజనితం. శబ్దం వల్లె అర్థం వస్తుంది. శబ్ధార్థాలు రెంటినీ స్ఫురింపజేసే ఢమరుకాన్ని చేత ధరించే ఆ అర్థనారీశ్వరుడే జగత్తుకి తల్లిd తండ్రీ అని సూచించే శబ్ధార్థమే ఢమరుకం.

మహాకవి కాళిదాసు తన 'రఘువంశం' కావ్య అవతారికలో జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరులలా తన కావ్యంలో శబ్దార్థాలు కలసి ఉంటాయని ఆ ఆదిదంపతులను ఇలాస్తుతించాడు.

''వాగార్థావ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తయే

జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ''.

మనిషిలోని మృగాన్ని అణిచి ఉంచాలనేది శివుడి చర్మధారణలోని సందేశం. శివుడి మూడో నేత్రం జ్ఞానానికి సంకేతం, కోపానికి కాదు. ఆ నేత్రం తెరిచి చూసినప్పుడు, మనలోని జ్ఞాన నేత్రం తెరుచు కున్నప్పుడు మనస్సులోని మాలిన్యాలు, అరిషడ్వర్గాలు మాడిమసి అయి బూడిద అవుతాయి. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా, చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువునా ఒంటపట్టించు కోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరి స్తూండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములనిపేరు. శివుడు లయకారకుడే కాదు ముక్తి ప్రదాత కూడా. ధ్యాన యోగమే ముక్తికి రాచమార్గమని ముల్లోకాలకు చాటడానికే తాను నిరంతర ధ్యాయోగాన్ని ఆచరిస్తూ దాన్ని పరోక్షంగా భోదిస్తున్న పరమగురువు, మహాశివుడు, అందువలన ఆయన మహాదేవుడు. శివుని అనుగ్రహంతో వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో అతి శ్రేష్ఠమైనది 'శివపురాణం'.

పఠనాచ్ఛ శ్రవణాదస్య భక్తి మాన్నర సత్తమ:

సద్య శివపద ప్రాప్తిం లభ్యతే సర్వసాధనాత్‌||

భక్తితో శివపురాన్ని పఠించేవారు, ఆ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించే వారు, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారు మానవుల్లో ఉత్తములై ఇహలోకంలో అన్ని సుఖాలు పొంది, ఆ జన్మాంతంలోని మోక్షాన్ని పొంది శివపదాన్ని చేరుకుంటారు. వేదమే జ్ఞానం. జ్ఞానమే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం మహాశివుడు. శివుడు సర్వస్వమని ఆరాధించడమే జ్ఞానం. శివుడు స్వయంగా చెప్పిన శివ పురాణం లోని కథలు, శివలీలలన్నీ ఈ విషయాన్నే చెబుతున్నాయి.