28, ఫిబ్రవరి 2011, సోమవారం

ఆస్కార్ విజేతలు వీరే

1. ఉత్తమ చిత్రం : ది కింగ్స్ స్పీచ్
2. ఉత్తమ నటుడు : కోలిన్ ఫిర్త్ (ది కింగ్స్ స్పీచ్)
3. ఉత్తమ నటి : నటాలీ పోర్ట్‌మన్ (బ్లాక్ స్వాన్)
4. ఉత్తమ సహాయ నటుడు : క్రిష్టియన్ బాలే (ది ఫైటర్)
5. ఉత్తమ సహాయనటి : మెలిసా లియో (ది ఫైటర్)
6. ఉత్తమ దర్శకుడు : టామ్ హూపర్ ( ది కింగ్స్ స్పీచ్)
7. ఉత్తమ విదేశీ భాష చిత్రం : ఇన్ ఎ బెటర్ వరల్డ్ (డెన్మార్క్)
8. ఉత్తమ స్క్రీన్ ప్లే : ఆరాన్ సోర్కిన్ (ది సోషల్ నెట్‌వర్క్)
9. ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే : డేవిడ్ సీడ్లర్ (ది కింగ్స్ స్పీచ్)
10. ఉత్తమ యానిమేషన్ చిత్రం : టాయ్ స్టోరీ 3
11. ఉత్తమ యానిమేషన్ (లఘు) : ది లాస్ట్ థింగ్
12. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్
13. ఉత్తమ సినిమాటోగ్రఫీ : ఇన్‌సెప్షన్
14. ఉత్తమ శబ్దగ్రహణం, ఎడిటింగ్ : ఇన్‌సెప్షన్
15. ఉత్తమ గీత రచన : ట్రెంట్ రెజ్నర్, అటికస్ రాస్ (ది సోషల్ నెట్‌వర్క్)
16. ఉత్తమ సంగీతం : రాండీ న్యూమన్ (వియ్ బిలాంగ్ టుగెదర్ టాయ్‌స్టోరీ 3)
17. ఉత్తమ దుస్తుల రూపకల్పన : అలైస్ ఇన్ వండర్‌ల్యాండ్
18. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) : ఇన్‌సైడ్ జాబ్
19. ఉత్తమ డాక్యుమెంటరీ (లఘు) : స్ట్రేంజర్స్ నో మోర్
20. ఉత్తమ ఎడిటింగ్ : ది సోషల్ నెట్‌వర్క్
21. ఉత్తమ మేకప్ : ది వుల్ఫ్‌మన్
23. ఉత్తమ లైవ్ యాక్షన్ (లఘు) : గాడ్ ఆఫ్ లవ్
24. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఇన్‌సెప్షన్

ఈసారి ఎ.ఆర్.రహ్మాన్‌కు నిరాశే ..

అమెరికాలోని లాస్ ఎంజెలిస్, కోడక్ థియేటర్‌లో 83వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి.ఈసారి ఆస్కార్‌పై భారత్ ఆశలు గల్లంతయ్యాయి. రెండేళ్ల కిందట దేశానికి మొట్టమొదటి ఆస్కార్ సాధించి పెట్టిన ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రహ్మాన్ ఈ ఏడాది కూడా ఉత్తమ నేపథ్యం సంగీతం, గీతం విభాగాల్లో నామినేషన్ పొందినా చివరకు ఉత్త చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.

కటకటాల వెనక్కి మాజీ ఖాకీ

చట్టం తన చేతుల్లో ఉందన్న ధైర్యమో.. లేక ఎంతమందినైనా పెళ్లాడవచ్చని మతం చెప్పిందని సాకు చెప్పించవచ్చన్న ధైర్యమో తెలియదు గానీ ఓ ఖాకీ తన కంటికి అందంగా కనిపించిన.. మనస్సు మెచ్చిన అమ్మాయిలను వలచి మనువాడేశాడు వరుసగా... ఇదేదో ఒక్కసారో రెండు సార్లోకాదు.. ఏకంగా ఐదుగురిని. ఒకరిని తెలియకుండా మరొకర్ని పెళ్లాడేశాడు. ఈమధ్యే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా పదవీ విరమణ కూడా చేసిన ఈయన గారి భాగోతం ఆయన నాలుగో భార్య పోలీసు స్టేషన్‌ మెట్లెక్కినా ఫలితం లేకపోవడంతో మీడియాను ఆశ్రయించటంతో బయటపడింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ నివాసి అయిన గులాం మహ్మద్‌ పోలీసు శాఖలో పని చేస్తూ ఎక్కడ పని చేస్తే అక్కడ ఓ అమ్మాయిని నమ్మించి పెళ్లి చేసుకోవడం అనవాయితీగా మార్చుకున్నాడు. ఇప్పటికే నలుగురిని వదిలించుకుని ఐదో భార్యతో కాపురం చేస్తున్న ఈయన గారు తనని పట్టించుకోవడంలేదని నాలుగో భార్య పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఖాకీ చొక్కాలు తమ మాజీ బాస్‌ వ్యవహారంపై స్పందించకుండా ఎప్పటిలాగానే ఆమెను స్టేషన్‌ చుట్టూ తిప్పించుకున్నారు. దీంతో విసిగివేసారిన ఆమె నగర పోలీసు కమీషనర్‌ ఏకే ఖాన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. దానికీ స్పందన లేకపోవడంతో మీడియా సాక్షిగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.

తనని తన పిల్లల్ని వదిలేశాడని దీనివల్ల తామంతా అనాథలంగా మారిపోయామని కన్నీరుమున్నీరైంది. ఎట్టకేలకు సిటీ పోలీసు బాస్‌ స్పందించి ఆదేశాలు జారీ చేయడంతో గులాం అహ్మద్‌ను అంబర్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని కటకటాల వెనక్కి నెట్టారు. మరి ఈయన గారికి ఏ శిక్షపడుతుందో... లేక ఖాకీల అండదండలతో తప్పించుకుంటాడో వేచిచూడాలి.

రేపు రైళ్లు నడవవు...

తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు 'రైల్‌రోకో' నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల ప్రయాణాలకు వాయిదా వేసుకోవలసిందిగా అధికారులు ప్రయాణికులకు సూచించారు. అలాగే విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌ రావలసిన గరీభ్‌రథ్‌ రైలును కూడా రద్దు పరిచారు. దీంతో పాటు హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌ రైళ్ల రాకపోకలపు కూడా రద్దు పరుస్తున్నట్లు తెలిపారు.

ఐ హేట్ బాలయ్యపై బాలకృష్ణ ఫిర్యాదు

ఐ హేట్ బాలయ్య అనే వెబ్‌సైట్‌పై తెలుగు సినిమా హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాదు నగర నేర పరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు కావాలనే వెబ్ఃసైట్ఃలో తనపై వ్య0గ్యంతోకూడి వ్యాఖ్యలు పెడుతున్నారని, ఎస్ఎంఎస్లు పంపుతున్నారని బాలకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐటి, ఐపిసిల కింద కేసు నమోదు చేశారు.

రాజకీయంగా, సామాజికంగా, వృత్తిపరంగా తనను దెబ్బ తీసేందుకు వెబ్‌సైట్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారని..వైబ్‌సైట్ తీరు పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా చిత్రపరిశ్రమలో ఉన్న తనపై కొందరు కావాలనే తన ఇమీజ్ దెబ్బతీసేవిధంగా..బురద జల్లుతున్నారని... తన కుటుంబం, తన అభిమానుల మనస్సుని నొప్పించేవిధంగా కొందరు ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు. వెబ్‌సైట్‌లో అసత్యప్రచారం సాగిస్తున్నారని, మెసేజ్‌లు తన అభిమానులను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఈ వెబ్‌సైట్ తనను మానసిక వేదనకు గురి చేస్తోందని ఆయన అన్నారు.

పేల్చినవి రబ్బరువే.. ఐనా చనిపోయారు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరాపల్లిలో ఈస్టుకోస్టు థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ కి వ్యతిరేకంగా.. ఆందోళన చేస్తున్న వారిని అదుపు చేయమని చెప్పామే తప్ప.. ఎక్కడా తము కాల్పులకు ఆదేశాలు జారీ చేయలేదని డిజిపి అరవింద రావు చెప్పారు.

రబ్బరు బుల్లెట్లు మాత్రమే ప్రయోగిస్తున్నారని, వాటి వల్ల ప్రాణానికి హాని జరుగదని తెలిపారు. ఐతే రబ్బర్ బుల్లెట్ కాల్పులలో ఒకరు మృతి చెందారని డిజిపి ప్రకటించడం ఆశ్చర్యకరం..పోలీసులు, ప్రజలు సంయమనం పాటించాలని ఓ వైపు కోరుతూనే...ఆందోళనకారులు పోలీస్ జీపు తగులబెట్టడాన్ని ఆయన ఖండించారు.

ధర్మాన ఇలాఖాలో మళ్ళి పేలిన 'ధర్మల్' తూటా..

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి ధర్మాన ప్రసాదరావు తన పట్టు చూపించేందుకు 'ధర్మల్'నే శ్రీకాకుళం ప్రజల మీద ఆయుధంగా ప్రయోగిస్తున్నట్టు ఉంది. తమ ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన థర్మల్ విద్యుత్ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న ఆందోళనకారులపై సోమవారం పోలీసులు మూడుసార్లు బాష్పవాయివు ప్రయోగించారు. పల్లె ప్రజలపై పోలీసు తూటాలు.. పొగబాంబులు వెల్లువలా కురిశాయి.దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీస్ జీపులను తగులబెట్టారు.

పొగబాంబుల తాకిడికి పూరిళ్ళు అంటుకుని మంటలు ఎగసిపడుతున్నాయి. సుమారు 150 ఇళ్ళు అంటుకున్నట్లు సమాచారం. బాధితుల ఆక్రందనలు,, పోలీసుల బూట్ల చప్పుడు, ఆందోళనకారుల పరుగులతో వడ్డితాండ్ర వణికిపోతున్నది. ఈ ఘటనలతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.