25, మార్చి 2011, శుక్రవారం

'ఆంధ్ర కసబ్‌' రాజగోపాల్‌

తెలుగుదేశం శాసన సభ్యుడు రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌ను 'ఆంధ్ర కసబ్‌'గా అభివర్ణించారు. ఆయన రాసిచ్చిన అంశాన్నే శ్రీకృష్ణ కమిటీకి ప్రభుత్వానికి ఇచ్చిందని ఆరోపించారు. ఈ 8వ అధ్యాయం తెలంగాణ ప్రజలను అగౌరపరిచేలా ఉందని, ఇందుకు బాధ్యుడైన జస్టిస్‌ శ్రీకృష్ణకు ఉరిశిక్ష వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. శ్రీకృష్ణ కమిటీకి అనువాదకులు సీమాంధ్రవాదులేనని, ఈ పరిస్థితుల్లో తెలంగాణకు అనుకూలంగా నివేదిక ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర పెట్టుబడిదారులు ఇచ్చిన కాసుల మూటలకు లొంగిపోయారని తెలంగాణ ప్రజలు ఆ మూటలు ఇవ్వలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకృష్ణను న్యాయమూర్తిగా పోల్చడం విచారకరమని కమిటీ నివేదిక న్యాయబద్ధంగా లేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

చర్చలు జరపడం శుద్ధ దండగ

తెలంగాణ ప్రజల ఆత్మహత్యలపై, ఉద్యమాలపై ఎక్కడా ప్రస్తావించకపోవడం విడ్డూరమని, ఈ కమిటీ నివేదికపై అఖిలపక్షాలు ఏర్పాటు చేయడం, చర్చలు జరపడం శుద్ధ దండగని, వెంటనే పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ సారథ్య బృంద కో నిర్వాహకుడు జి.నిరంజన్‌ డిమాండ్‌ చేశారు. అందరిని మేనేజ్‌ చేయడంలో సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు ఎంత సిద్ధహస్తులో దీంతో రుజువైందన్నారు. ఈ కమిటీని వదిలిపెట్టమని కమిటీ చైర్మన్‌తో సహా సభ్యులకు శిక్ష పడేంత వరకు న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను కమిటీ సభ్యులు నిర్లజ్జగా మోసగించారని ఆరోపించారు.

శ్రీకృష్ణ శకుని పాత్ర

శ్రీకృష్ణ కమిటీ నివేదిక న్యాయ వ్యవస్థపై విశ్వాసం కోల్పేయే విధంగా ఉందన్నారు హరీష్‌రావు. శ్రీకృష్ణుని పాత్ర పోషిస్తాడనుకున్న జస్టిస్‌ శ్రీకృష్ణ శకుని పాత్ర పోషించాడని కమిటీ తన రక్తదాహాన్ని చూపించిందన్నారు. శ్రీకృష్ణ కమిటీ సీమాంధ్ర నేతలకు అమ్ముడుపోయి వారు చెప్పిందే నివేదికలో పొందుపరిచారని ఆయన ఆరోపించారు. వీరి నిర్వాకం వల్ల కమిటీలపై ప్రజల్లో విశ్వసనీయత తగ్గి, ప్రజాస్వామ్యంపై విలువ కోల్పోయేదిగా ఉందన్నారు. లగడపాటి రాజగోపాల్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు ఈ కమిటీ నివేదికలో ఉండడం గమనించాల్సిన విషయమన్నారు.

'8వ అధ్యాయం'పై నీరు-నిప్పు

రాష్ట్రంలోని పరిస్థితులను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం మాత్రం రహస్యంగా ఉంచింది. ఈ రహస్య నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కొన్ని అంశాలు వెల్లడయ్యాయి. దీంతో ఈ 8వ అధ్యాయం కలకలం రేపుతోంది. శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఈ విధంగా పరిధులు దాటి నివేదికలో కొన్ని అంశాలను పొందుపర్చిందంటూ తెలంగాణ వాదులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేయగా, సమైక్యవాదులు శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాష్ట్ర ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉందంటూ పలువురు నాయకులు స్వాగతిస్తున్నారు.

రహస్యంగా ప్రభుత్వానికి అందజేసిన శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల కొంతమేర బయటపడింది. ఈ బయటపడిన అంశాలలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జరిగే పరిణామాలు, ఇబ్బందులకు గురిచేస్తాయని నక్సలిజం వ్యాప్తి చెందడంతో పాటు, మత ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంటుందని నివేదికలో శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమాన్ని నియంత్రించేందుకు తీసుకోవలసిన చర్యలపై కూడా కమిటీ కొన్ని సలహాలు సూచించింది. ఈ విషయాలన్నీ తెలంగాణాకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల సభ్యులే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి మరొక అడుగు ముందుకేసి తీవ్రమైన ఆరోపణలు గుప్పించింది.

జగన్‌ అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలి

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకునే వేలకోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాదించిన కడప మాజీ ఎంపీ వై.ఎస్‌.జగన్‌ ముఖ్యమంత్రి అయితే ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేయడం ఖాయమని రాష్ట్రానికి చెందిన సీనియర్‌ కాం గ్రెస్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. సొం త పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్న జగన్‌ కూడబెట్టిన అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని ఆయన గురువారంనాడిక్కడ ఏర్పాటు చేసిన పత్రికా గోష్ఠిలో డిమాండ్‌ చేశారు. దివంగత నేత వైఎస్‌ అధికారంలో ఉండగా దానిని అడ్డుపెట్టుకుని జగన్‌ రాష్ట్రాన్ని దోచుకొన్నట్లు ఈమధ్య కాలంలో వెలుగులోకి వస్తున్న అనేక విషయాలతో స్పష్టమౌతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం జగన్‌ వద్ద ఉన్నంత డబ్బు దేశంలోని ఏ ముఖ్యమంత్రి వద్ద కూడా లేదని, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న జగన్‌ తన విశ్వసనీయతను పెంచుకోవాలంటే కేవలం ఆరేళ్ల వ్యవధిలో ఇన్ని వేలకోట్ల ఆస్తులు ఎలా సమకూరాయో వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. జగన్‌ ఆస్తులపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డిని కోరినట్లు హనుమంతరావు వెల్లడించారు.

అయితే, వైఎస్‌ హయాంలోనే విపరీతమైన అవినీతి చోటుచేసుకున్నట్లు ప్రతిపక్ష తెలుగు దేశం చేసిన ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ గత ఆరేళ్లుగా ఎందుకు నోరుమెదపలేదన్న ప్రశ్నలకు సమాధానంగా ఆనాడు ప్రతిపక్షం కావాలనే కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిపై బురద జల్లుతున్నదనే అభిప్రాయం ఉండేదని, అయితే, ఆ తర్వాత వెలుగులోకి వస్తున్న అనేక కుంభకోణాలు, అవకతవకలను చూసిన తర్వాత తండ్రి అధికారంలో ఉండడాన్ని జగన్‌ అడ్వాంటేజ్‌గా తీసుకొన్నారని రుజువౌతున్నదని వివరించారు.

కృష్ణ... కృష్ణా...నిందలెందుకు?

అర్ధ శతాబ్దానికి పైగా వివిధ రూపాల్ని సంతరించుకున్న తెలంగాణ ఉద్యమం రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా కాలరాచే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజనాంశాలపై అధ్యయనం చేసి సిఫార్సులిచ్చే నిమిత్తం కేంద్రం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల భావప్రకటనా స్వేచ్ఛను కూడా తప్పుబడుతోంది. కమిటీ సభ్యులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదని, తమ మనోభావాల్ని గౌరవించలేదని, వారందరినీ ప్రాసిక్యూట్‌ చేసి జైలుపాలు చేయాలంటూ ఉద్యమాకారులు చేస్తున్న డిమాండ్‌లు ఉద్యమగతికి అద్దం పడుతున్నాయి. కేంద్రంపై విభజనవాదులు తెచ్చిన ఒత్తిడి కారణంగానే గత ఏడాది మార్చిలో యుపిఎ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని నియమించింది. ఈ కమిటీ పది మాసాల పాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించింది. వివిధ వర్గాల ప్రజల మనోభావాల్ని తెలుసుకుంది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలు, సామాన్యుల నుంచి సంపన్నులు, నిరక్షరాస్యుల నుంచి విద్యాధికులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా సమాజంలోని అన్ని వర్గాల్లో విభజనపై నెలకొన్న అభిప్రాయాల్ని ఆరాతీసింది. తమ దృష్టికొచ్చిన అంశాలన్నింటితో ఒక నివేదికను రూపొందించి కేంద్రానికి అందజేసింది. అయితే సమస్య మూలాలు జటిలంగా ఉండడంతో ఏకపక్ష పరిష్కారం సాధ్యం కాదని తలచి కొన్ని సిఫార్సులు చేసింది. వీటిలో ప్రభుత్వానికి అనుకూలమైన ప్రతిపాదనలపై సానుకూల నిర్ణయం తీసుకోమని సూచించింది. వీరి సిఫార్సులేవీ తమకనుకూలంగా లేవన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. తాజాగా ఎనిమిదో ప్రతిపాదనపై వీరు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ తమకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ సభ్యుల్ని దూషిస్తున్నారు.

ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్లో ఏ ఒక్కరికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో గాని, ఇక్కడి రాజకీయాలు లేదా ప్రాంతాలు, రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో రంగంలో నిష్ణాతులు. తమ తమ రంగాల్లో అనేక రకాల అధ్యయనాలు నిర్వహించి ప్రభుత్వానికి సమర్పించిన మేధావులు. రాష్ట్ర విభజన చేయాల్సొస్తే నైసర్గిక భౌగోళిక స్వరూపంతో పాటు ఖనిజాలు, జలవనరులు, విద్యుత్‌, సంపద ఇలా సంయుక్త వనరుల విభజనపై కూడా అధ్యయనం నిర్వహించి సిఫార్సులు చేస్తారన్న ఉద్దేశంతోనే వీరిని కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. వీరిలో ఒక మహిళ, ముస్లిం కూడా ఉన్నారు. ఇలా అన్ని వర్గాలకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం కల్పించారు. కమిటీ సభ్య కార్యదర్శిగా వ్యవహరించిన వినోద్‌ కుమార్‌ దుగ్గల్‌ కేంద్ర హోమ్‌ శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు. 1968 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్‌ అధికారి ఆయన. తొలుత నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో కొంతకాలం సేవలందించారు. ఆ తర్వాత ఐఎఎస్‌కు ఎంపికయ్యారు. దీర్ఘకాలం పాటు జలవనరుల శాఖలో ఆయన పని చేశారు. దేశంలో జలవనరుల పంపిణీపై ఆయనకు స్పష్టమైన అవగాహన ఉంది. అంతేకాదు కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాల్ని పునర్‌నిర్వచించే నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్‌ పూంచి కమిషన్‌లో కూడా ఆయన సభ్యుడిగా వ్యవహరించారు. డాక్టర్‌ రవీంద్రకౌర్‌ పంజాబీ మహిళ. ఢిల్లీ ఐఐటిలో సోషియాలజీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. భారత సమాజంలో సామాజిక వర్గాల మధ్య విభేదాలు, రిజర్వేషన్లపై ఆమె ప్రత్యేక అధ్యయనం నిర్వహించారు. దేశంలో పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య సంబంధాలపై ఆమె పలు పుస్తకాలు వెలువరించారు. సామాజిక రంగంలో ఆమె విశేష కృషి చేశారు. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య భావ ప్రకటన స్వేచ్ఛలో వ్యత్యాసాలు, జీవన విధానాలపై అధ్యయనాలు నిర్వహించారు. మరో సభ్యుడు అబుసలేషరీఫ్‌ ఇండియన్‌ ముస్లిం. మంచి ఆర్థికవేత్త. నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చీఫ్‌ ఎకానమిస్ట్‌గా సేవలందించారు. ఆయన ఆహార విధానంపై పలు అధ్యయనాలు

నిర్వహించారు. ఆర్థిక వ్యత్యాసాలు, ఆహారం సమకూర్చుకోవడంలో అసమానతలు, తద్వారా ఒనగూరే నష్టాలపై అనేక పేపర్లను ప్రజెంట్‌ చేశారు. అమెరికాలోని ఎకనామిక్‌ గ్రోత్‌సెంటర్‌కు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా సేవలందించారు. దేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్యాపర వివరాలపై అధ్యయనం నిర్వహించి కేంద్రానికో నివేదిక సమర్పించారు. ఇటీవలె భారత్‌లో మానవ వనరుల అభివృద్ధిపై పుస్తకాన్ని వెలువరించారు. దీర్ఘకాలం పాటు కేంద్ర హోమ్‌ మంత్రిత్వ శాఖలో సభ్యుడిగా పనిచేశారు. ప్రతిష్టాత్మక ఇండియా టుడే మ్యాగజైన్‌ 2000 జనవరి నాటి సంచికలో ప్రపంచ వ్యాప్తంగా పేరెన్నికగన్న మేధావుల జాబితాను ప్రచించింది. ఇందులోని 25 మందిలో షరీఫ్‌ స్థానం సంపాదించారు. ఇక రణబీర్‌సింగ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌గా వ్యవహరించారు. న్యాయ వ్యవస్థను పరిరక్షించే వేలాది మంది న్యాయ నిపుణుల్ని ఆయన తీర్చిదిద్దారు. కమిటీకి నాయకత్వం వహించిన జస్టిస్‌ బిఎన్‌ శ్రీకృష్ణ దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు.

1991--92లో ముంబయ్‌లో జరిగిన మతకల్లోలాలపై ప్రభుత్వం నియమించిన కమిషన్‌కు ఆయనే నేతృత్వం వహించారు. బాబ్రీ మసీదు విధ్వంసానంతరం జరిగిన ఈ అల్లర్లతో ముంబయ్‌ నగరం అతలాకుతలమైంది. ఆయనకు ముందు మరికొంత మంది న్యాయ నిపుణుల్ని కేంద్రం సంప్రదించినప్పటికీ ఆ కమిటీకి నాయకత్వం వహించేందుకెవరూ ముందుకురాలేదు. 1998 వరకు సాక్షుల్ని విచారించిన జస్టిస్‌ శ్రీకృష్ణ ముంబయ్‌ అల్లర్ల మూలకారకుల వివరాల్ని బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఆయన పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. ఆ తర్వాత మద్రాస్‌ హైకోర్టులో 2009 ఫిబ్రవరి 19న జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ నేతృత్వంలోనే ఏకసభ్య కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో కూడా ఆయన ఇచ్చిన నివేదిక నిందితుల్ని బయటపెట్టింది. యుకెలోని ఇంటర్‌నేషనల్‌ బార్‌ అసోసియేషన్‌లో జీవితకాల సభ్యుడిగా ఉన్న శ్రీకృష్ణకు భారత్‌లోనేకాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని శ్రీకృష్ణ కమిటీ సభ్యులుగా కేంద్రం నియమించింది. తెలంగాణ ప్రాంతంలోని ముస్లింల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే సభ్యుల్లో ఒక ముస్లింను కూడా చేర్చింది. తెలంగాణ , సీమాంధ్ర ప్రాంతాల మధ్య నెలకొన్న ఆర్థిక అసమానతలు, జీవన వైరుధ్యాలపై స్పష్టమైన నివేదికిచ్చే నిమిత్తమే ఆయన రంగాల్లో ప్రతిభావంతులకు కమిటీలో స్థానం కల్పించింది. వీరంతా తమకు నిర్దేశించిన విధుల్ని పూర్తి చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధికుల మనోభావాల్ని గౌరవించి తీరాల్సిందే. అలాగే ప్రతిఒక్కరికి స్పష్టమైన భావప్రకటనా స్వేచ్ఛ ఉంది. ఈరెండింటికి రాజ్యాంగం తగిన రక్షణ కల్పించింది. కానీ తెలంగాణ వాదులు తమకనుకూలంగా సిఫార్సులివ్వలేదన్న ఏకైక కారణంతో రాష్ట్రానికి సంబంధంలేని జాతీయ స్థాయి మేధావులైన కమిటీ సభ్యుల భావ ప్రకటనా స్వేచ్ఛను కూడా ప్రశ్నించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని పరిశీలకులు పేర్కొంటున్నారు. అయినా తెలంగాణ ఏర్పాటు అన్నది ఓ రాజకీయ ప్రక్రియ. ఇంత వరకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలేవీ దీనిపై ఇదమిత్ధంగా తమ విధానాల్ని స్పష్టం చేయలేదు. కాంగ్రెస్‌, తెలుగుదేశం రెండూ తకూడా దోబూచులాట లాడుతున్నాయి. తెలంగాణ వాదులు రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెచ్చిరాష్ట్ర విభజనపై ఏకాభిప్రాయ తీర్మానాన్ని అమోదింపజేయడం ద్వారానే తెలంగాణ ఏర్పాటు సాధ్యపడుతుందని వీరు సూచిస్తున్నారు. అంతేగాని ఓ గౌరవనీయ వృత్తి అయిన ప్రొఫెసర్‌ హోదాలో ఉన్న కోదండరామ్‌ కూడా శ్రీకృష్ణ కమిటీ సభ్యులపై విరుచుకుపడటం వారి రాజ్యాంగ హక్కులకు విరుద్ధంగా మాట్లాడటం తగదని వీరు పేర్కొంటున్నారు.

రాజీనామా చేస్తాం జగన్‌ పార్టీలో చేరతాం

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి అభిమానులమైన తాము అవసరమైతే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలో చేరతామని కాంగ్రెస్‌ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రజారాజ్యం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, తెదేపాలు కలిసి జగన్‌ను ఎదుర్కొనడానికే పనిచేస్తున్నాయని ఆయనను దెబ్బతీసేందుకు టార్గెట్‌ పెట్టుకున్నారని వారు ఆరోపించారు. జగన్‌ను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ ఎవరైన కామెంట్‌ చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. జగన్‌ గురించి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రజల కోసం మాట్లాడితే మంచిదన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన తెదేపా నేతలకు నైతిక విలువలు ఉన్నాయా? అని వారు ప్రశ్నించారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంత్రులు అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారని, టిడిపి ఎంపిటిసిలతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు. కడపలో జగన్‌ తరఫున గెలిపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థికి వైఎస్సార్‌ బొమ్మ చూసి ఓటర్లు ఓట్లు వేశారన్నారు. ఇదిలావుండగా, చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రోజు ఏదో గొడవ సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.