5, అక్టోబర్ 2012, శుక్రవారం

వేల కోట్లని చెప్పి రూ.74 కోట్లకు లెక్క

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచారని చెప్పి రూ.74 కోట్లకు మాత్రమే సిబిఐ లెక్క చెప్పిందని జగన్ తరఫు న్యాయవాది సుబ్రహ్మణ్యం శుక్రవారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదించారు. ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభమైంది. జగన్ అరెస్టు అక్రమమని చెప్పారు. జగన్ నేరస్తుడు అని చెప్పడానికి సిబిఐ ఇంత వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. అరెస్టు చేసి 130 రోజులు దాటిందని, అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాది  అన్నారు. ఒక పార్టీ అధినేత  జైలులో ఉండటం సరికాదన్నారు.

పన్నులు లేని భారతదేశం

అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని కర్ణాటక లోకాయుక్త మాజీ జస్టిస్ సంతోష్ హెగ్డే పేర్కొన్నారు. స్వాతంత్య్రం సాధించిన 65 ఏళ్లలో దేశంలో 74 కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. ప్రతి కుంభకోణం ఒక రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగానే ఉందన్నారు. స్విస్ బ్యాంక్‌లో దాచిన కోటి నాలుగులక్షల బిలియన్ల అమెరికన్ డాలర్లను భారతదేశానికి తిరిగి తీసుకురాగలిగితే 24 గంటల్లో దేశానికి ఉన్న అప్పును తీర్చేయచ్చన్నారు. పన్నులు లేని భారతదేశంగా తీర్చి దిద్దొచ్చన్నారు. కామన్‌వెల్త్ క్రీడల్లో రూ. 70వేల కోట్ల మేర అవినీతి జరిగితే ప్రశ్నించేవారే లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచి ప్రైవేట్‌వైపు వెళ్లే విధంగా నాయకులే ప్రోత్సహిస్తున్నారన్నారు. అన్నా హజారే బృందం అవినీతిని నిర్మూలించలేకపోయినా అవినీతి గురించి ప్రశ్నించే ఒక వేదికను అందించిందన్నారు.

దోపిడీదార్లను ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు

రానున్న ఎన్నికల్లో దొంగలను ఎమ్మెల్యేలుగా, దోపిడీదార్లను ఎంపీలుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి . జగన్ జైలుకెళ్లి వంద రోజులు గడిస్తే ఆ పార్టీ కార్యకర్తలు శత దినోత్సవాలను జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు దమ్ముంటే సోనియాగాంధీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో పదవులకు రాజీనామా చేయాలని అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దానంతటదే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని , ప్రభుత్వంలో ప్రాంతీయ, నాయకత్వ విబేధాలు ఏర్పడి ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సఖ్యత కొరవడి ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారన్నారు.

ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్‌తో టీఆర్ఎస్‌ను, జగన్‌ను జైలు నుంచి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన  కాంగ్రెస్‌  టీడీపీని బలహీనపర్చేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు.

ప్యాకేజీ కోసం కేసీఆర్ ఆరాటం:ఎర్రబెల్లి

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఇన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేశారని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్,   ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.   టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై తెలంగాణ ప్రాంతంలో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపానని కేసీఆర్ ప్రకటించుకోవడం తగదని విమర్శించారు.
టీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌తో చర్చించే సీనియర్ నాయకులే లేరా ? కేవలం కేసీఆర్, ఆయన కుటుంబీకులు చర్చలు జరపడంలో ఆంతర్యం ఎమిటన్నారు. కాంగ్రెస్‌నేతలు తాము ఎవ్వరిని పిలువలేదని ప్రకటించినా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ నాయకులే ఆహ్వానించారని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదలచుకుంటే సీమాంధ్ర, రాయలసీమ నాయకులతో చర్చలు జరపాలి, కానీ కేసీఆర్‌తో చర్చలు జరుపడంలో రహస్యం ఏమిటన్నారు. గతంలో సకల జనుల సమ్మె   నీరు గార్చడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో రూ.500కోట్ల ఒప్పందం కుదుర్చుకొన్నారని ,  తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చడానికి యత్నించాడని ఎర్రబెల్లి ఆరోపించారు.  మార్చ్‌కు సంఘీభావం తెలిపినట్లుగా నటించి ఆ పార్టీ నాయకులు మధ్యలోనే వెళ్లిపోయారన్నారు.
పరకాల ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడు నెలల్లో తెలంగాణ ఏర్పడుతుందని కే సీఆర్, హరీష్‌రావు ప్రకటించి ఓట్లు దండుకున్నారని నేడు తెలంగాణ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 

3, అక్టోబర్ 2012, బుధవారం

తెలంగాణ భవన్‌లో టి.వి. ఛానలా ?

తెలంగాణ భవన్‌లో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని హై కోర్టు బుధవారంనాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ పార్టీకి కేటాయించిన భూమిలో ఒక టి.వి. ఛానల్ పెట్టి వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు ఉమేశ్ రావు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఎందుకు స్వీకరించలేదని కూడా కోర్టు ప్రశ్నించింది.

1, అక్టోబర్ 2012, సోమవారం

రేపు పార్టీని ప్రకటించనున్న కేజ్రీవాల్


రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయడం ద్వారా మంగళవారం రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాన్టిట్యూషనల్ క్లబ్‌లో ఏర్పాటు చేసే సమావేశంలో పార్టీ ఏర్పాటు ప్రకటనను మనీష్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పార్టీ ప్రకటన, విధివిధానాలను రేపు ప్రకటిస్తామని చెప్పారు. తనకు హజారేతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

కేజ్రీవాల్ పార్టీకి ప్రచారం: హజారే

అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెడితే ఆయన పార్టీకి మద్దతుగా తాను ప్రచారం నిర్వహిస్తాననిప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే సోమవారం ప్రకటించారు. అవినీతిరహిత పార్టీగా అది ఉంటుందని,. ఆ పార్టీకి ప్రచారం చేసినప్పటికీ తాను ఎప్పటికీ ఎన్నికలలో పోటీ మాత్రం చేయనని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే తన ఉద్దేశ్యమన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్‌తో, తన బృందంలో కూడా తనకు ఎవరితోనూ విభేదాలు లేవని  అందరం కలిసి అవినీతిపై ఉద్యమిస్తున్నామన్నారు. తాను ఇప్పటి వరకు 70 మంది బ్యూరోక్రాట్లతో చర్చించానని, పలువురు మాజీ ఆర్మీ అధికారులను కలిశానని,నవంబరులో దేశవ్యాప్తంగా పర్యటిస్తానని హజారే చెప్పారు.