3, ఏప్రిల్ 2011, ఆదివారం

భారత జట్టుపై జరిమానా

వాంఖడే స్టేడియంలో శ్రీలంకపై జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నిర్ణీత సమయంకంటే ఎక్కువ సమయంలో బౌలింగ్ కోటాను పూర్తి చేయకపోవడంతో ప్రపంచకప్ విజేత భారత జట్టుపై ఐసీసీ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో జరిమానావిధించాడు. భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్ ఫీజులో 20 శాతం, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. స్లో ఓవర్ రేట్ నిబంధన 2.5.1 ను అతిక్రమించడంతో ఐసీసీ విధించిన ఈ జరిమానాను భారత జట్టు అంగీకరించింది

కడపలో ఉప ఎన్నికల యుద్ధం

కడపలో ఉప ఎన్నికల యుద్ధం జరగబోతోందని అందుకు కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో టీడీపీ పులివెందులలో బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సహకరించేలా ప్రయత్నిస్తోందన్నారు. అలాగే కడపలో కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపి టీడీపీకి సహకరించేలా రెండు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికలు సోనియాగాంధీ, వైఎస్ఆర్‌ల మధ్య జరుగుతున్నాయంటూ పేర్కొన్నారు.

15న జగన్ నామినేషన్

కడప పార్లమెంట్ స్థానానికి ఈనెల 15వ తేదీ వైఎస్ఆర్ పార్టీ తరపున మాజీ ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. 16న పులివెందుల అసెంబ్లీకి విజయమ్మ నామినేషన్ వేయనుండగా అదేరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి నామినేషన్ వేయనున్నారు.