1, మార్చి 2011, మంగళవారం

సీమాంధ్ర ఉద్యోగులకీ జీతాల్లేవ్.....

తెలంగాణాలో జరుగుతున్న సహాయ నిరాకరణ ఎఫెక్ట్ సీమంధ్ర ఉద్యోగులపైనా పడింది. సర్కారి ఖర్చులకీ కటకట లాడుతుండటంతో ప్రస్తుత పరిస్తితిలో తెలంగాణాలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకి మినహా ఎవ్వరికీ జీతాలు చెల్లించే పరిస్తితి లేదని ప్రభుత్వ వర్గాల కధనం. ఇప్పటికే "నో వర్క్ - నో పే" నినాదాన్ని తీసుకొన్న సర్కారు, పలుమార్లు తెలంగాణా ఉద్యోగ సంఘాలతో చేసిన చర్చలు విఫలమైన నేపధ్యంలో తెలంగాణా ఉద్యోగులకి ఫెబ్రవరి జీతాలు ఇచ్చేలా కనిపించడం లేదని వినిపిస్తుంటే తాజాగా సీమంధ్రలో ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేమని మరి 10,15 రోజులు వేచి చూడాలని సంభందిత శాఖాధీపతులకి  చెప్పినట్లు సమాచారం. అలాగే పెన్షనర్ల ఖాతాలలో సొమ్ములు జమచేయవద్దని తెజరీలకు మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.

రేపటి వరకు కొనసాగనున్న రైల్‌ రోకో

రైళ్ల రాకపోకలు స్తంభించడంతో ప్రయాణికులు ఇప్పటికే పలు ఇబ్బందుల ఎదుర్కొంటుంటే... మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈరోజు తెలంగాణ జేఏసీ నిర్వహించిన రైల్‌రోకో కార్యక్రమాన్ని రేపటి వరకు పొడిగించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రైల్‌ రోకో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈరోజు చేపట్టిన కార్యక్రమం విజయవంతం కాలేదనో ఏమో కానీ రేపు కూడా రైల్‌ రోకో నిర్వహిస్తే ప్రజల ఆగ్రహాని తెలంగాణ జేఏసీ నేతలు గురికావడం ఖాయం.

ముగ్గురు దర్శకుల 'పెళ్లి'

ముంబాయి వదిలి హైదరాబాద్‌లో మకాం వేసిన రాం గోపాల్‌ వర్మ వరుసగా చిత్రాలు తీస్తున్నారు. ప్రకటిస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందే హడావుడి ప్రచారం చేయడం ఆయన ప్రత్యేకత. ఐదు రోజుల సినిమా 'దొంగలదోపిడి' ఇంకా పూర్తికాలేదు. తీస్తానని ప్రకటించిన 'బెజవాడరౌడీలు', 'అమ్మ' చిత్రాల గురించి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. తాజాగా మరో కొత్త సినిమా గురించి ప్రకటించారు. కొత్త చిత్రం పేరు పెళ్లి. ఈ చిత్రం ప్రత్యేకత ఏమంటే దీనిని ముగ్గురు దర్శకులు కలిసి డైరెక్ట్‌ చేస్తారట. రాంగోపాలవర్మతో పాటుగా పూరి జగన్నాథ్‌, హరీష్‌శంకర్‌ దర్శకులు. ఇలా ముగ్గురు కలిసి దర్శకత్వం వహించడం గతంలో ఎప్పుడూ లేదు. మూడు వేరు వేరు కథల ప్రభావం, మరో నాలుగో కథ మీద ఎలా ఉండబోతున్నదనేది ఈ చిత్రం ప్రత్యేకత. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ అతనికి పెళ్లి అనే వ్యవస్త మీద వివిధ కారణాల వల్ల విభిన్న అభిప్రాయాలు ఏర్పడతాయి. ఆ కారణాల చేత పెళ్లి చేసుకున్న మూడు జంటలు, పెళ్లి మూలాన వారు ఎదుర్కొన మానసిక స్థితులు అతనికి తెలిసి ఉండడం. ఈ నేపథ్యంలో తను తన పెళ్లి గురించి ఏ విధంగా, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఈ చిత్రం ఇతివృత్తం అని రాంగోపాల్‌వర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు.

ముళ్లపూడికి 'శ్రీరామరాజ్యం' అంకితం

ప్రముఖ రచయిత ముళ్లపూడి వెంకటరమణ ఇటీవల కాలధర్మం చెందిన విషయం తెలిసిందే. బాపు, రమణ కలిస్తే అచ్చతెలుగు సినిమా. వీరి కాంబినేషన్‌లో ఎన్నో ఆణిము త్యాలనదగిన చిత్రాలు వచ్చాయి. తాజాగా వీరిద్దరు కలిసి 'శ్రీరామరాజ్యం' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ రాముని గా, అక్కినేని వాల్మికిగా నటిస్తున్నారు. రమణకు ఇది చివరిచిత్రం. ఈ చిత్రం కోసం ఆయన అహర్నిషలు కృషి చేశారు. ఆయనలేని లోటు తీర్చలేనిది. ఆయన జ్ఞాపకార్థం ఈ చిత్రాన్ని ముళ్లపూడికి అంకితం ఇస్తున్నామని నిర్మాత సాయిబాబు ప్రకటించారు. జూన్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకువస్తుంది అని ఆయన తెలిపారు.

లుగు సినిమాలో నటించాలని అనుకుంటున్నా..పునీత్‌రాజ్‌కుమార్‌

కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ నటవారసుడు పునీత్‌రాజ్‌కుమార్‌ కన్నడంలో సక్సెస్‌ఫుల్‌ కథానాయకుడు. ఆయన నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. పునీత్‌ తొలి కన్నడ చిత్రానికి తెలుగువాడైన పూరి జగన్నాథ్‌ దర్శకుడు కావడం విశేషం. ఆ తర్వాత కూడా పలువురు తెలుగు దర్శకులు ఆయనను డైరెక్ట్‌ చేశారు. తాజాగా పునీత్‌ నటించిన 'జాకీ' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. సూరి దర్శకుడు. సూరజ్‌ ఫిలింస్‌ అనువదిస్తోంది. శ్రీమతి పార్వతమ్మరాజ్‌కుమార్‌ సమర్పకురాలిగా ఉన్నారు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ప్రఖ్యాత నటులు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు, యువనటుడు అల్లు అర్జున్‌, ఇంకా సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, నిర్మాతలు కె.యస్‌.రామారావు, సి.కల్యాణ్‌, వీరశంకర్‌తో పాటుగా చిత్ర కథానాయకుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ హాజర య్యారు. అల్లు అర్జున్‌ ఆడియో సిడిని విడుదల చేసి అక్కినేనికి తొలి సిడిని అందజేశారు.
అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ 'రాజ్‌కుమార్‌ గారి కుటుంబంతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ఎంతమంచి నటుడో అంతటి మంచి వ్యక్తి. అలాంటివారు అరుదుగా ఉంటారు. ఆయన లక్షణాలు వారి ముగ్గురు కొడుకుల్లో ఉన్నాయి. రాజ్‌కుమార్‌ గారి అబ్బాయి నటించిన చిత్రం కాబట్టి ఈ వేడుకకు హాజరయ్యాను' అన్నారు.
'తెలుగు ప్రేక్షకులు ఎవరిని అయినా సరే ఆదరిస్తారు. పునీత్‌ను తెలుగు పరిశ్రమ తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాను' అన్నారు అల్లు అర్జున్‌.
పునీత్‌రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ 'జాకీ చిత్రం కన్నడంలో మంచి విజయం సాధించింది. ఆంధ్ర ప్రజలు నా కుటుంబసభ్యుల్లాంటివారు. నేను తెలుగు సినిమాలో నటించాలని అనుకుంటున్నాను' అన్నారు.

నిరాకారం నిరామయం

మానవుడు జన్మించినపుడుగాని, మరణించినపుడు గాని బట్టతో రాడు మరియు పోడు కదా! జీవుడే దిగంబరుడు పరమేశ్వరుడు దిగంబరుడే. శరీరమంతా విభూతిని రాసుకుంటాడు.
ఇక్కడ విభూతి అంటే జ్ఞాన సంపద. దీన్నే జీవులు ఎల్లప్పుడు కలిగి ఉండాలని వేదాంత విదులు చెబుతున్నారు. లౌకికపరంగా ఆలోచిస్తే మానవునితో వెంటవచ్చేది ఏదియు లేదు. జ్ఞాన సందప (విభూతి) ఒక్కటే వెంట వస్తుంది.
కనుక నశ్వరమైన మానవ శరీరంపై వ్యామోహం వదిలి శాశ్వతమైన మోక్షాన్ని పొందాలంటే శివరాత్రి రోజునైనా మానవుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలన్నదే పరమార్థ తత్త్వంగా భక్తులు స్వీకరిస్తారు.
రాగరహితుడైన శివుడు దిగంబరుడు. స్మశానవాసి. విభూతితో నిండిన శరీరం. బిక్షాటన, పులిగజ చర్మధారణ నిరాడంబరత్వం ఇలా ఈ శివుడిచ్చే దర్శనంతో భక్తులు నిరాడంబరత్వానికి హేతువుగా మనుగడ సాగిస్తారు. ఏ జీవుడైనా మరణించిన తర్వాత స్మశానంలోనే కదా శాశ్వతంగా నిద్రపోయేది.
మానవాళి కూడా నిరాడంబరమైన మనుగడను సాగించమని సందేశంగా గైకొంటారు. అంతేకాక ఈ శివరాత్రి పర్వం శిశిర రుతువు చివరలో వసంతాగమనంలో వస్తుంది.
వేదాంతపరంగా ఆలోచిస్తే అజ్ఞానపు చీకట్లు తొలగి మానవాళిని జ్ఞానవంతులుగా చేయడమే మహా శివరాత్రి ఆంతర్యం.
ప్రకృతి పరంగా ఆలోచిస్తే వృక్షాలు శిశిర రుతువులో ఆకులు రాలిస్తే మరల వసంతాగమనంతో ఆ చెట్లు చిగుర్చి నవనవోన్మేషంగా విలసిల్లుతుంటాయి.
అలాగే మానవాళి పాతబాధల (రుగ్మతలు) విరణమకూ, కొత్త ఆశలు చిగురించడానికి ఈ శివరాత్రి ప్రతీకయైందని భావించవచ్చు కదా!
శివతత్త్వం :
సృష్టి స్థితిలయకారాల్లో మూడవవాడు. అయిదు మోములు కలవాడు. మూడు కన్నులవాడు. జఠలను ధరించినవాడు. తెల్లని దేహవర్ణం కలిగినవాడు. నిడివి కన్నులవాడు. భస్మము (విభూతి) పూయబడిన శరీరం కలవాడు. పదిచేతులతో ప్రకాశించే నీలకంఠుడు. నాగుబాములనే ఆభరణాలుగా ధరించిన సర్వాంగ సుందరుడు. దిగంబరుడు నిర్వికారుడు. నిరంజనుడు నిరాడంబరుడు. భస్మత్రి పుండ్రమంచే అలంకరింపబడిన లలాటం కలవాడు. దయామయుడు. బోళాశంకరుడని లోకోక్తి కలదు. జగత్స్వరూపుడు. మహా ప్రళయకర్త.
లింగాకారంలో శివుణ్ణి పూజించుట :
''నిన్నే రూపముగా భజింతు మదిలో
నీ రూపు మోకాలో, స్త్రీ
చన్నో, కుంచమొ, మేకపెంటికయొ, యీ
సందేహముల్మాన్పింప నా
కన్నారన్భవదీయ మూర్తి గుణా
కారంబుగా జూన్‌
చిన్నీరేజ విహారమత్త మధుసా!
శ్రీకాళహస్తీశ్వరా!''
- మనసు అనెడి పద్మాన విహరించు తుమ్మెద వంటి వాడవగు ఓ శ్రీకాళహస్తీశ్వరా! నిన్ను ఏ రూపంగా భావించి కొలవను. పూజింతమన్న నీ రూపం మోకాలో, స్త్రీ చన్నా, కుంచనూ, మేకపెంటికా, ఎటూ తేల్చుకోలేని సందేహంతో ఉన్న నన్ను కరుణించి నాకనులారా నీ రూపాన్ని నా ఎదుట ప్రత్యక్షమగునట్లుగా అనుగ్రహించమని ధూర్జటి ఆ పరమశివుణ్ణి ప్రార్థించాడు.
ఈ జగత్తు ఆవిర్భవించక ముందే జగత్తంతా శూన్యం ఆ శూన్యమే నికాకారం. ఆ నిరాకారమే పరమాత్మ. ఈ పరమాత్మను జ్ఞాన సాధనతో గుర్తించాల్సిందే తప్ప బాహ్య రూపంలో దృగ్గోచరం కాదు. ఇలా గుర్తించబడిన చిహ్నానికి 'లింగం' అని అంటారు. కనుకనే భౌతిక రూపంలేని శివుణ్ణి లింగాకారాన్ని బాహ్యరూపంగా పూజించడం ప్రారంభమైంది.
''లింగ గర్భం జగత్సర్వం - త్రైలోక్యంచ చరాచరమ్‌
లింగ బాహ్యాత్సర్వం నాస్తి - తల్లింగంచ ప్రపూజయేత్‌''
- అని స్మృతి కదా!
సకల చరాచర సృష్టి ఈ లింగాకారంలోనే దాగుంది. శివ పురాణం విద్యేశ్వర సంహితలో శివలింగం బిందునాదాత్మ కమైందని విశదీకరించింది.
ఎట్లన - బిందు స్వరూపిణియైన ఆదిశక్తే తల్లి, నాద స్వరూపుడైన ఈశ్వరుడు (శివుడు) తండ్రి.
కాళిదాసు చెప్పినట్లు ఈ జగత్తుకు జనన జనకుల స్వరూపమే శివలింగం. జగత్తు యావత్తూ శివశక్త్యాత్మకం, బిందువుకు నాదమే ఆధారం. బిందు, నాదం రెండూ జగతికి ఆధారాలు కనుక దానిచేతనే ఆవిర్భవించింది.
ఈ లింగాలు రెండు రకాలు.
(1) స్థావర జంగాలు అనగా చలనం లేనివి.
(2) జంగమలింగాలు అనగా చలనలింగాలు.
ఈ చలన లింగాలు మరల ఆరు విధాలున్నాయని ఆధ్యాత్మిక కోవిదులు విశదీకరించారు.
(1) క్షణికలింగాలు - గంధం, ఇసుకలతో చేయబడిన లింగా లు, వీనినే సైకతలింగాలు అంటారు.
ఈ సైకత లింగాన్ని శ్రీరామచంద్రుడు ప్రతి ష్ఠించడంతో
'రామేశ్వరం'గా పేరుగాంచిందని ప్రతీతి.
(2) శైలజలింగాలు - శిలలతో చేయబడినవి.
(3) దారుజలింగాలు - కొయ్యతో చేయబడినవి.
(4) రత్నజలింగాలు - రత్న వైడుర్యాలతో చేయబడినవి.
(5) లోహజ లింగాలు - లోహాల (ఇనుము వైగరాలు)తో చేయబడినవి
(6) మృణ్మయలింగాలు - మట్టితో చేయబడినవి.
భక్తిని, ముక్తిని ఇచ్చే శంభుడు లింగంలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. లింగం యొక్క వేది మహాదేవియగు ఉమ. లింగం సాక్షాత్తుగా మహేశ్వరుడు. దానిపట్ల జగత్తంతయు లయ మగుటచే 'లింగ'మని పేరు వచ్చిందని శివ పురాణం వివరిస్తోంది.
ద్వాదశ జ్యోతిర్లింగాలు :
మన భారతదేశంలో ప్రసిద్ధమై అతి ప్రాచీన కాలంనుంచి ద్వాదశ జ్యోతిర్లింగాలు విరాజిల్లుతున్నాయి.
1. ఎల్లోరా - ఘసృణశ్వరుడు
2. హిమాలయం - కేదారేశ్వరుడు
3. మిథిలానగరం - త్య్రంబకేశ్వరుడు (సీత జన్మించిన ప్రదేశం)
4. రామేశ్వరం - రామేశ్వరుడు (శ్రీరామ చంద్రుడు ప్రతిష్ఠించిన ప్రదేశం)
5. జున్మారుదం పుణ్యక్షేత్రం - భీమశంకరుడు
6. దారుకావనం - నాగేశుడు
7. కాశీ - విశ్వేశ్వరుడు
8. వర్గీవైద్యనాదం - వైద్యనాధుడు
9. ఓంకార క్షేత్రం - అమరేశ్వరుడు
10. శ్రీశైలం - మల్లిఖార్జునుడు
11. ఉజ్జయినీ - మహాకాళేశ్వరుడు
12. సౌరాష్ట్రం - సోమనాధుడు
ముఖ్యమైన పంచజ్యోతిర్లింగాలు ప్రసిద్ధికెక్కాయి.
అవి. 1. భీమేశ్వరుడు, 2. రామేశ్వరుడు, 3. విశ్వేశ్వరుడు, 4. మల్లిఖార్జునుడు, 5. విరూపాక్షుడు.
కనుకనే లింగానికి ఇంతటి విశిష్టత కలిగింది. ఈ లింగం ఆద్యంతాలు కనుగొనుటకు, నేను గొప్పంటే నేను గొప్ప అనుచు తగవులాడుకొన్న బ్రహ్మ, విష్ణువు లిరువురూ దివ్యకాంతులతో ప్రకాశించే లింగంలోకి ప్రవేశించారు. వారిరువురూ చెరొక వైపునకు వెళ్లారు. కాని వారి కది సాధ్యం కాలేదు. అంత వారిరువురు బయటికి మరలివచ్చి తమకంటే అధికుడైన లింగరూపంలోనున్న శివుడని గ్రహించారు.
శివుని రూపానికి పూజలేదు. భృగమహర్షి శాప కారణంగా లింగాకారంగానే శివుడు భూ లోకంలో పూజింపబడుతున్నాడు.
ప్రణవమ్‌ - పంచాక్షరీ మంత్ర మహిమ :
'ఓం'కారం ప్రణవం. ఆ ఉ మ్‌ - 'ఓమ్‌' మంగళప్రదమైంది. ఇది ఈశ్వరబీజం. ఓంకారంలో భూత భవిష్యత్వర్తన కాలాలు, త్రిగుణాత్మకాలు ఇమిడి ఉన్నాయని వేదాంత విదుల అభిభాషణం.
ప్రపంచానికి మూలం 'ఓం'కారం, సర్వ శక్తిమయం. పరమ పవిత్రమైన ఓంకారానికి చినమంత్రం మరొకటి లేదు.
'ఓం నమశ్శివాయ' అనునది ఓంకార సహిత పంచాక్షరీ మంత్రమని యజుర్వేదం విశదీకరించింది.
'ఓం'కారం - పరబ్రహ్మ స్వరూపం. 'న' - పృథ్వీ, బ్రహ్మ, 'మ' - జలము, విష్ణువు, 'శి' - అగ్ని, మహేశ్వరుడు 'వా' - వాయువు, ఆత్మ, 'య' - ఆకాశం, పరమాత్మ, 'నమశ్శివాయ' అనగా పంచాక్షరీ మంత్రంలో ఇమిడియున్న జీవాత్మ పరమాత్మలు.
'నమ' - జీవాత్మ, 'శివ' పరమాత్మ, 'ఆయ' ఐక్యం అనగా జీవాత్మ పరమాత్మయందు ఐక్యము పొందుట అనియర్థం.
ఈ విధంగా ఏకాక్షర నిఘంటువు వివరించింది. సమస్త వాఙ్మయ రూపమైన నిత్యశుద్ధమైన బీజాక్షరమే ఈశ్వరుడని పెద్దలు చెబుతున్నారు.
ఈ పంచాక్షరీ మంత్రాన్ని ద్విజులు (బ్రాహ్మణులు) 'నమ:' పూర్వకముగాను (ఓంనమశ్శివాయ), బ్రాహ్మణతరులు 'నమ:' అంతముగను, (ఓం శివాయనమ:) జపించాలి. అలాగే స్త్రీలు కూడా నమ: అంతముగానే జపించాలి. బ్రాహ్మణ స్త్రీలు మాత్రం 'నమ:' పూర్వకంగానే జపించాలి. ప్రతిరోజూ ఉదయం వెయ్యిసార్లు జపించినచో శివసాయుజ్యం పొందుదురని శివపురాణం వివరించింది.
లింగాభిషేకం :
''అలంకార ప్రియోవిష్ణు:
అభిషేక ప్రియశ్శివ:''
శ్రీమన్నారాయణునికి ఎంత సుందరంగా అలంకరిస్తే అంత ఇష్టమనియు, శివునికి ఎంత అభిషేకాన్ని చేస్తే అంత సంతోషమని పై శ్లోకార్థం.
పరమేశ్వరునికి మహన్యాసంతో కూడిన అభిషేకమంటే చాలా ప్రీతి. శివునికి ఒక్కో పదార్థంతో అభిషేకం చేస్తే ఒక్కో ఫలితం కలుగుతుందని పురాణ ప్రవచనం.
ఆవు పాలతో - సర్వసౌఖ్యాలు
ఆవు పెరుగుతో - ఆరోగ్యం మరియు బలం
ఆవు నెయ్యితో - ఐశ్వర్యం
మెత్తని పంచదారతో - దు:ఖ నాశనం
తేనెతో - తేజోవృద్ధి
భస్మజలంతో - మహా పాపహరం
గంధోదకంతో - పుత్రలాభం
పుష్పోదకంతో - భూలాభం
బిల్వజలంతో - భోగభాగ్యాలు
నువ్వుల నూనెతో - అపమృత్యుహరం
రుద్రాక్షోదకంతో - మహా ఐశ్వర్యం
సువర్ణ జలంతో - దంద్రనాశనం
అన్నంతో - రాజ్యప్రాప్తి మరియు ఆయుర్వృద్ధి
ద్రాక్షరసంతో - సకల కార్యసిద్ధి
ఖర్జూర ఫలరసంతో - శత్రువులకు హాని
నేరేడు పండ్లరసంతో - వైరాగ్యం
కస్తూరీ జలంతో - చక్రవర్తిత్వం
నవరత్న జలంతో - ధాన్యం, గృహప్రాప్తి
మామిడి రసంతో - దీర్ఘవ్యాధి నాశనం
విభూది - పుణ్యం, అష్టైశ్వర్యాలు కలుగుతాయి.,
పూజా పుష్పఫలం :
శివుణ్ణి పూజిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుంది. ఉమ్మెత్తలతో - సంతానం, జిల్లేడు పువ్వులతో - శౌర్యం, కలువపూలతో - విక్రమవృద్ధి, గన్నేరు పూలతో - శత్రు నాశనం, బంధూక సుమములతో పూజిస్తే భూషణ ప్రాప్తి, జాజిపూలతో - వాహన ప్రాప్తి, మల్లెపూలతో - భోగప్రాప్తి, అవిసెపూలతో - పరమేశ్వరునితోఎ స్నేహం, కొండగోగు పూలతో - వస్త్రలాభం, శిరీష పుష్పాలతో - సంతోష ప్రాప్తి, నువ్వు పువ్వులతో - మౌవన ప్రాప్తి, తుమ్మ పువ్వులతో - మోక్షలాభం, నందివర్ధన పుష్పాలతో అర్చిస్తే సౌందర్యం కలుగుతుందని శివపురాణం విశ్లేషించింది.
శివకేశవుల విశిష్టత :
వ్యాస భారతాన్ని ఆంధ్రీకరించిన కవిత్రయంలో రెండవ వాడైన తిక్కన మాత్యుల వారు శివకేశవులకు భేదం లేదని తెలియజెప్పుటకై హరిహరనాథుని దేవాలయాన్ని ప్రతిష్ఠించాడు. తను ఆంధ్రీకరించిన భారతాన్ని ఆ దేవునికే అంకితం ఇచ్చాడు.
శాంతి పర్వంలో ఇలా విశదీకరించాడు.
''విష్ణుండనగా - శివుడన నొక్కటే దివ్యచిత్తమ యెఱుగన్‌'' అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
'విష్ణువు అన్నా శివుడు అన్నా ఒక్కరే' అనిఒ నీ దివ్య చిత్తానికి తెలుసును కదా! శివుణ్ణినుగ్రహిస్తే విష్ణువును గ్రహించినట్లే. అలాగే విష్ణువుని సేవిస్తే శివుణ్ణి సేవించినట్లే, శివకేశవు లిరువురు భేదం లేదు.
విష్ణువు గుండెలపైనున్న శ్రీవత్సం శివుని శూలానికి ప్రతీకయైంది. ఈశ్వరుని కంఠంపైనున్న నలుపు విష్ణువు చేతి ముద్రగా ఖ్యాతి పొంది శివుడు శ్రీకంఠుడైనాడని భారతం తెలియజేస్తోంది.
అలాగే వైష్ణవులు శివనింద చేసినా, శైవులు వైష్ణవ నింద చేసినా వారు కోటి జన్మలు నరకంలో ఉంటారని పురాణాలు ఘోషిస్తున్నాయి.
శివ పూజావిధి :
శివ పూజా విధానాన్ని ఎఱ్ఱాప్రగడ తన హరివంశంలో చక్కని రీతిలో విశదీకరించాడు.
శ్రీకృష్ణ పరమాత్మ గోప బాలబాలికలకు శివభక్తిని, మంత్ర జ్ఞానాన్ని, ఆచార క్రమాన్ని, బ్రాహ్మణుల్ని సేవించే విధానాన్ని విశదీకరించి శివపూజా వ్రతాన్ని చెప్పాడు.
''పంచామృతమ్ముల బంచగవ్యంబుల
విములోదకంబుల గ్రమముతోడ
నభిషేక మొనరించి యఖిలేశ్వరుని సమం
చిత గంధ సమితి నర్చితుని జేసి
భూరి సౌరభ చారు పుష్పదామంబుల
బూజించి బహువిధ స్ఫురిత ధూప
తల యిచ్చి కపిలాఘృత ప్లుత వర్తికా
రమ్య దీపముల నారతుల మర్చి
భక్ష్యభోజ్య లేహ్య పానీయ బహుళ నై
వేద్యములు ఘటించి హృద్యవీల
బలుగ రేలు నట్లు పరిచర్య నడపు చు
గొలిచి రేడు దివసములు గ్రమమున''
(హరివంశం. పూర్వభాగం - 6:57)
ఈ విధంగా శివపూజచేస్తే పరమాత్మ అయిన ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించి రోగ నివారణ కలిగి మనశ్శాంతి కలుగుతుందని ఆధ్యాత్మిక కోవిదులు చెబుతున్నారు.
1. పంచామృతములు : ఆవుపాలు, ఆవునెయ్యి, ఆవు పెరుగు, తేనె, పంచదార,
2. పంచగవ్యాలు : ఆవుపాలు (ఇంద్రుని స్థావరం), ఆవుపు పెరుగు (వాయువుని స్థావరం), ఆవునెయ్యి (సూర్యుని స్థావరం), ఆవుపేడ (అగ్ని స్థావరం), ఆవుమూత్రం (వరుణుని స్థావరం)
కనుకనే వీనిని పంచగవ్యాలనియు, సర్వదేవతామయమని అన్నారు.
3. విమలోదకములు : కృష్ణా, గంగా, కావేరి, గోదావరి, సింధు నదీజలాలు.
4. దివ్య పుష్పాలు : (సువాసన కలిగిన పువ్వులు) మరియు గంధం, ధూపం, పసుపు, కుంకుమ, అక్షతలు సామగ్రితో పూజించుట. కర్పూర హారతిచ్చుట.
5. కపిల ఘృతం : నల్లని ఆవు పాలలో వచ్చిన నెయ్యితో దీపారాధన చెయ్యాలి.
6. భక్ష్యాలు - పిండివంటలు
7. భోజ్యాలు - పులిహోర, శర్కర పొంగలి, దధ్యోదనం, చిత్రాన్నములు
8. లేహ్యాలు - రకరకాల పాయసాలు
9. పానీయాలు - మధుర ఫలరసాలు
వీనితో గొప్పగా నైవేద్యం చేయాలి. అప్పుడు వ్రతం పూర్తవుతుంది.
అంతేకాక వ్రత విధానాన్ని శ్రీనాథుడు 'శివరాత్రి మహాత్మ్యం'లో చాలా అద్భుతంగా విశదీకరించి చెప్పాడు.
''మకర రాశిస్థుడై మార్తాండు డుండంగ
సమకొన్న మాఘ మాసంబునందు
సిత చతుర్దశి నిశి శివరాత్రి యనుపేర
ప్రఖ్యాతి గనిన యారాత్రి యందు
నట్టి నాల్జాలును నవధాన పరతమై
జాగర వ్రతచర్య జరుపవలయు
నాజాగర వ్రతం బనఘ ప్రాజాపత్య
సత్ఫలంబీనోపు సాధకునకు
నవని సురుడాది చండాలుడాదిగా గ
నీ వ్రతము సేయగా నర్హులెల్ల వారు
నన్న చందాల నీవ్రతం బలఘ ఘోర
పాతకంబుల నెల్ల గాల్పం గ జాలు
(శివరాత్రి మాహాత్మ్యం - 5:36)
సూర్యుడు మకరరాశిలో ఉన్నప్పుడు వచ్చు మాఘమాస శుక్ల పక్ష చతుర్దశి రాత్రి శివరాత్రి అని ప్రసిద్ధి పొందింది. ఆ రాత్రి నాలుగు జాములును ఏకాగ్ర బుద్ధితో జాగరణ వ్రతాన్ని చేయాలి. ఆ జాగరణ వ్రతం సాధకునకు ప్రాజాపత్య (ప్రజాపతివల్ల పుట్టినది) సత్ఫలాన్ని కలిగిస్తుందిట. బ్రాహ్మణుడుగాని, చండాలుడు గాని లేదా ఎవ్వరైనను కాని ఈ వ్రతం చేయడానికి అర్హులు. అన్ని విధాలా ఈ వ్రతం భయంకరమైన పాపాల్ని దహింపవేస్తుంది.
ఫలశ్రుతి :
జ్ఞానాజ్ఞాన కృతంబులయ్యు బశు హిం
సా బ్రహ్మహత్యా సురా
పానన్తేయము లాదిగా గలుగు పా
పంబుల్‌ దహించున్నిమే
షానన్‌ శంభు నిశావ్రతంబు ప్రజల జ్వా
లా వ్రతం బగ్నియె
ట్లేనిం గాలుచు నార్ద్ర శుష్కముల నొ
క్కింతి ధ్మ భారంబులన్‌
(శివరాత్రి మాహాత్మ్యం - 5:37)
మిక్కిలి తీక్షణములైన జ్వాలలతో కూడిన యగ్ని తడిసిన వయినను, ఎండిన వయినను కొలదిపాటి కట్టెల బరువు నెట్లు కాల్చునో, అట్లే శివరాత్రి వ్రతము తెలిసి చేసినవైనను, తెలియక చేసినవైనను ప్రాణిహింస, బ్రహ్మహత్య, మద్యపానం, దొంగతనం మున్నగు పాపాలు నిముష కాలంలో నశించి పోతాయి.
- ఆచార్య శ్రీవత్స

జెనీవా మోటార్‌ షోలో 'టాటా పిక్సెల్‌'

టాటా నానో ప్లాట్‌ఫాంపై కేవలం మూడు మీటర్ల పొడవున్న సరికొత్త చిన్న కారు 'పిక్సెల్‌'ను టాటా మోటార్స్‌ ప్రదర్శించింది.  81వ మోటార్‌షోలో టాటా మోటార్స్‌ గ్రూప్‌ సంస్థల సిఇఒ కార్ల్‌ పీటర్‌ ఫ్రోస్టర్‌ పిక్సెల్‌ను ఆవిష్కరించారు. నాలుగు సీట్ల ఈ కారు చిన్న కుటుంబానికి సరిగ్గా సరిపోతుందని, రద్దీ నగరాల్లో ట్రాఫిక్‌ చిక్కులను తప్పిస్తుందని ఆయన తెలిపారు.

'అవాంఛిత కాల్స్‌'పై మరోసారి మారిన డెడ్‌లైన్‌

మొబైల్‌ కస్టమర్లు ఎదుర్కొంటున్న అవాంఛిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లపై కొత్త విధానం అమలు మరోసారి వాయిదా పడింది. తొలుత ఫిబ్రవరి 1 వరకూ గడువు పెట్టిన ట్రాయ్‌ దాన్ని మార్చి 1కి పొడిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్ని ఈ నెల 21 వరకూ పొడిగిస్తున్నామని, కొత్త నిబంధనలు మార్చి ఆఖరి వారం నుంచి అమలయ్యేలా చూస్తామని ట్రాయ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిక్సెడ్‌ ఫోన్లకు కొత్త నెంబర్‌ సిరీస్‌ను త్వరలోనే డాట్‌ విడుదల చేస్తుందని వివరించింది.

మరింత పెరిగిన వెండి ధర

వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశ రాజధాని బులియన్‌ మార్కెట్లో కిలో వెండి ధర క్రితం ముగింపుతో పోలిస్తే 150 రూపాయలు పెరిగి 50,700 రూపాయలకు చేరి సరికొత్త గరిష్ఠస్థాయిని నమోదు చేసింది. వారాంతంలో డెలివరీ అయ్యే వెండి ధర 755రూపాయలు పెరిగి 51,200 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో బంగారం ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. మంగళవారం నాడు పది గ్రాముల బంగారం ధర 110 రూపాయలు పడిపోయి 21,070 రూపాయలకు చేరింది. ఆభరణాల బంగారం 10 గ్రాములకు 20,950 రూపాయల వద్ద కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు వెండి ధర 0.7 శాతం పెరిగి 34.11 డాలర్లకు చేరింది.

అంతా ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే తెలంగాణా

తెలంగాణా అంశం రాత్రికి రాత్రి పరిష్కారమయ్యే అంశం కాదని దానికీ కొంత సమయం పడుతుందని అన్ని పార్టీల నేతలు గ్రహించాలని కేంద్ర మంత్రి చిదంబరం తేల్చి చెప్పారు. మంగళవారం ఆయన న్యూ డిల్లిలో మీడియాలో మాట్లాడుతూ...ఇప్పటికే శ్రీ కృష్ణ కమిటీ అందించిన నివేదికని కేంద్రం అన్నివిధాల పరిశీలిస్తోందని... చెప్తూ... అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే విషయంపై అడిగిన ప్రశ్నకు వారంతా ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడంటూ సమాధానమిచ్చారు. తెలంగాణా సమస్య పరిష్కారానికి అంతా ఊపికతో సహకరించాలని, శాంతి భద్రతకు విఘాతం కలిగించవద్దని సూచించారు చిదంబరం.

ప్రత్యేక పాత్రలో కె.భాగ్యరాజ్‌

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు కె.భాగ్యరాజ్‌ అందించిన కథ, స్క్రీన్‌ప్లేతో చంద్ర మహేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పూర్ణచంద్ర మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం కోసం ఒక రోజు షూటింగ్‌ మినహా పూర్తయింది. నల్ల మోతు విజయ్‌ సమర్పణలో, లోక రమేష్‌రెడ్డి, గూడూరు జీవితరెడ్డి, ఆముదాల దేవేశ్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. శంతన్‌ భాగ్యరాజ్‌, అంద్రిత నాయికలుగా నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో కె.భాగ్యరాజ్‌ నటిస్తున్నారు. ఈనెల మొదటివారంలో టైటిల్‌ లోగోను ఆవిష్కరిస్తారు. మూడవ వారంలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు ప్రకటించారు.
ఇతర పాత్రల్లో కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, షాయాజీషిండే, ఎమ్మెస్‌. నారాయణ, సత్యప్రకాష్‌, కౌశ, సన, అన్నపూర్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఛాయాగ్రహణం: ఎ.విజయ్‌కుమార్‌, ఫైట్స్‌: హార్స్‌మెన్‌బాబు.

'మహాప్రస్థానం' ప్రారంభం

పి.యస్‌.ఎమ్‌. ప్రొడక్షన్స్‌ శ్రీకృష్ణ గొర్లెని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న మహాప్రస్థానం చిత్రం షూటింగ్‌  రామానాయుడు స్టూడియోలో నిర్వహించిన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పి.శ్రీనివాసరావు ఈ చిత్రానికి నిర్మాత. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్త సన్నివేశానికి డాక్టర్‌. డి.రామానాయుడు క్లాప్‌ ఇవ్వగా, సీనియర్‌ నటుడు సుమన్‌ కెమెరా స్విచాన్‌ చేశారు.
నలుగు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు వీరి మధ్య ప్రారంభమైన ప్రేమ ఎన్నెన్ని మలుపులు తిరిగి చివరికి ఏగమ్యానికి చేరింది అనేది చిత్రకథాంశం అన్నారు.నిర్మాత పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈనెల 15 నుండి రగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. హైదరాబాద్‌, వైజాగ్‌, గోవా, మలేషియాలో షూటింగ్‌ చేస్తాం. ఒక ప్రముఖ హీరో ప్రత్యేక పాత్రని చేస్తారు. మనిషాచటర్జీ నాయికగా నటిస్తుంది. ఆగస్టు 15న సినిమాను రిలీజ్‌ చేస్తాం అన్నారు.
ఈ చిత్రానికి పాటలు చంద్రబోస్‌, సంగీతం కనిష్క, ఛాయాగ్రహణం పెమ్మసాని సురేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.నందు.

వెంకటేశ్‌ నాయకత్వంలో తారల క్రికెట్‌

సెలబ్రిటీస్‌ క్రికెట్‌ లీగ్‌ (సి.సి.యల్‌) మార్చి 5న డే, నైట్‌ మ్యాచ్‌ కర్టెన్‌రైజర్‌గా నిర్వహిస్తారు. తెలుగు, కన్నడ, తమిళ బాలీవుడ్‌ హీరోల మధ్య క్రికెట్‌ పోటీ జరుగుతుంది. దక్షిణాది టీమ్‌కు కెప్టెన్‌గా వెంకటేశ్‌ వ్యవహరిస్తారు. టీమ్‌కు యజమాని మంచు మనోజ్‌. సిసియల్‌ గురించి వివరించడానికి శనివారం ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌లో విలేఖరుల సమావేశం ఏర్పాటుచేశారు.
కెప్టెన్‌ హోదాలో వెంకటేశ్‌ మాట్లాడుతూ జూన్‌ నుండి క్రికెట్‌ మ్యాచ్‌లు మొదలవుతాయి. నాలుగు టీమ్‌లుంటాయి. తెలుగు, కన్నడ, తమిళ భాషల నుండి ఒక టీమ్‌, ముంబాయి నుండి మరో టీమ్‌ ఏర్పడుతుంది. వైజాగ్‌లో ఈనెల 5న వీరిమధ్య 20-20 మ్యాచ్‌ కర్టెన్‌రైజర్‌గా జరుగుతుంది అన్నారు.

కెప్టెన్‌గా వెంకటేశ్‌ వ్యవహిస్తున్న టీమ్‌కు సుదీప్‌ వైస్‌ కెప్టెన్‌. ఇందులో సూర్య, శరత్‌కుమార్‌, మంచు విష్ణు, సిద్ధార్థ్‌, తరుణ్‌, తారకరత్న, అబ్బాస్‌, ఆర్య, శ్యామ్‌, శంతన్‌ భాగ్యరాజ్‌ ఉన్నారు. టీమ్‌ అంబాసిడర్‌లుగా శ్రీయశరణ్‌, ప్రియమణి, ఛార్మి, తాప్సి, సమంతా, అంద్రిత, రాగిని వ్యవహిస్తారు. ముంబాయి హీరోస్‌ టీమ్‌లో సల్మాన్‌ఖాన్‌, సునీల్‌శెట్టి, రితీష్‌దేశ్‌ముఖ్‌, సోహాలిఖాన్‌, సోనూసూద్‌ తదితరులుంటారు. జనీలియా, సోనాలి అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తారు.

అభిమానుల కోసమే డాన్స్‌ చేశా

జూ.ఎన్టీఆర్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న భారీచిత్రం 'శక్తి' పాటల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదికపై జూనియర్‌ డాన్స్‌ చేయడం ప్రత్యేక ఆకర్షణ. మెహర్‌రమేష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఇలియానా కథానాయికగా నటించింది. జాకీష్రాప్‌, సోనూసూద్‌, మణిశర్మ, మంజరి, భోగవల్లి ప్రసాద్‌, బోయపాటి శ్రీను, మంజుభార్గవి, పైడిపల్లి వంశీ తదితరులు పాల్గొన్న ఈ వేడకకు అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 'నందమూరి వంశంలో మూడు తరాలవారితో తాను చిత్రాలు నిర్మించినట్టు' ఈ సందర్భంగా అశ్వనీదత్‌ తెలిపారు. 'భవిష్యత్తులో బాలకృష్ణ కుమారుడితో కూడా చిత్రాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. శక్తి చిత్రాన్ని భారతదేశంలోని పలు ముఖ్య ప్రాంతాలతో పాటుగా విదేశాల్లో షూటింగ్‌ చేశామన్నారు'.'ఈ చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలియని శక్తి ఏదో నన్ను నడిపించింది' అని దర్శకుడు మోహర్‌రమేష్‌ పేర్కొన్నారు. 'బడ్జెట్‌కు పరిమితులు విధించకుండా తీసినట్టు తెలిపారు. ఇంతవరకు ఎవరూ చేయని కొత్త లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. పాటలు అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకాదరణ చూరగొంటాయనే నమ్మకం ఉంది' అన్నారు.
'అభిమానుల కోసమే నేను డాన్స్‌ చేశాను. వారి కేరింతలు విని పై లోకంలో ఉన్న తాతగారు సంతోషిస్తారు. నేను మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, అభిమానుల ఆశీర్వాదంతో కొనసాగుతున్నాను' అని జూ.ఎన్టీఆర్‌ అన్నారు.
'శక్తి' పాటల సీడీని జూ.ఎన్టీఆర్‌ ఆవిష్కరించి మణిశర్మకు అందజేశారు.

సీమాంధ్ర పొలిమేరల దాకా తరిమి తరిమి కొడతాo

తెలంగాణాకి అడ్డు పడుతున్నచంద్రబాబు నాయుడు, జేసీ దివాకర్ రెడ్డితో సహా ఇతర సీమాంధ్ర నాయకులను తెలంగాణాలో తిరగనివ్వమనీ, వారిని సీమాంధ్రకు తరిమికొడతామని.. ఉస్మానియా జేఏసీ హెచ్చరించింది.మంగళవారం తెలంగాణా జేఏసీ పిలుపు మేరకు జరిగిన రైల్ రోకో కార్యక్రమంలో ఉస్మానియా విద్యార్దులు విద్యానగర్ రైల్వే స్టేషన్ నుంచి కాచిగూడ వరకు భారీ ఎత్తున పట్టాలపై కూర్చొని తమ నిరసన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా విద్యార్ధి నేతలు మాట్లాడుతూ.. తెలంగాణా ఏర్పాటుకు సహకరిస్తే ఆత్మీయుల్లా కలిసి ఉండటం జరుగుతుందనీ,లేదంటే సీమాంధ్ర వాసుల ఆస్తులపై భౌతిక దాడులకు దిగుతామని, సీమాంధ్ర పొలిమేరల దాకా తరిమి తరిమి కొడతామని హెచ్చరించింది.

జడ్జిపై సుప్రీం కోర్టులో ఫిర్యాదు

రాష్ట్ర పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి అందించిన నివేదిక లోపభూయిష్టంగా ఉందని కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జస్టీస్‌ శ్రీకృష్ణపై రాష్ట్రహైకోర్టు జడ్జి ఎల్‌.నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్‌ సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేశారు.

ఈమేరకు జడ్జిపై చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీకి ఫిర్యాదు చేశారు. సమన్యాయం పాటించాల్సిన జడ్జిగారు చేసిన వ్యాఖ్యలు ఒక ప్రాంతానికి మద్దతుగా ఇచ్చేలా ఉన్నాయని, దీని వల్ల న్యాయవ్యవస్థలోనూ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయని వెంటనే రాష్ట్రాన్ని విడగొట్టాలని వాదన చేస్తున్నవారికి బలం చేకూర్చడం సమంజసమని అడుసుమిల్లి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీమంధ్ర నేతల భేటీని అడ్డుకుంటాo

తెలంగాణ ఉద్యమం అదుపు తప్పకముందే కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించక పొతే రాజస్థాన్‌లో గుజ్జర్ల తరహాలో నిరవధిక రైలురోకోలు చేస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు. మౌలాలీలో మంగళవారం రైలు రోకో కార్యక్రమంలో పాల్గొని కాసేపు  రైలుపట్టాలపై వాలీబాల్ ఆడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాసనసభలో తెలంగాణ, సీమాంధ్ర సభ్యులు కలిసి కూర్చునే పరిస్థితి లేదన్న విషయాన్ని కేంద్రం గుర్తించాలని అన్నారు. 5 వ తీదీన కాంగ్రెస్ ఎమెల్యే జేసీ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే సీమంధ్ర నేతల భేటీని అడ్డుకుంటామని..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుకోవటానికి ప్రయత్నిస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులను, పెట్టుబడిదారులను హైదరాబాద్‌లో తిరగనివ్వమని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ హెచ్చరించారు.

"ధర్మల్"కాల్పులపై జైరాం రమేష్ మండిపాటు

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లిలో తలపెట్టిన ఈస్ట్‌కోస్ట్ థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ ఆదేశించారు. మంగళవారం రాజ్యసభలో కాకరాపల్లి కాల్పుల ఘటనపై జరిగిన చర్చలో కాల్పులు జరిగేంత వరకు పరిస్తితి వెళ్ళడం ఆందోళనకరమని వ్యాఖ్యానిస్తూ.. జరిగిన ఘటన పై పూర్తీ స్తాయి విచారణ జరపాలని ఆదేశాలిచ్చారు.

విద్యుత్ ప్లాంట్‌కు అనుమతులు లేవని, అనుమతులు లేకుండా నిర్మాణం ఎలా చేపడతారని.. ప్లాంట్ యాజమాన్యం పర్యావరణ నిబంధనలు పాటించలేదని..ప్లాంట్ వ్యవహారంపై సాయంత్రంలోగా నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.

తెలంగాణ బాబు చేతుల్లోనే ఉంది

తెలంగాణపై తెలుగుదేశం పార్టీ పూటకో మాట మాట్లాడుతోందని..ఆ పార్టీ చేస్తున్న విన్యాసాల వల్లనే తెలంగాణ సమస్య జఠిలమైందని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...తెలంగాణపై కేంద్రం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చంద్రబాబు ప్రకటిస్తే సమస్య పరిష్కారమవుతుందని.. తెలంగాణ సమస్య పరిష్కారం తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చేతుల్లోనే ఉందని, తెలిసి కూడా ఆయన తో నేటికీ ఎలాంటి ప్రకటనా చేయించని నేతలు... కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం సమంజసం కాదని.. ఇప్పటికైనా బాబు తన వైఖరి చెపితే కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయం తీసుకొనే వీలు కలుగుతుందని వ్యాఖ్యానించారు బొత్స.


ఈ రాష్ట్రంలో 34 శాతం ఓట్లు వచ్చిన తెలుగుదేశం పార్టీని ప్రతిపక్షంగా గౌరవించి విస్మరించకూడదని కాంగ్రెసు పార్టీ భావిస్తోందని..అందువల్లే చంద్రబాబు నిర్ణయం కోసమే వేచి చూస్తోందని... తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్రానికి కొంత సమయం పట్టవచ్చునని ఇప్పటికైనా చంద్రబాబు తెలంగాణాపై తన వైఖరి ప్రకటించి సమస్యకు ముగింపు పలికేందుకు ముందుకు రావాలని డిమాండ్ చేసారు బొత్స.

గోద్రా రైలు దగ్ధం కేసులో 11 మందికి ఉరి

గోద్రా రైలు దగ్ధం కేసులో అహ్మదాబాద్ ప్రత్యేక కోర్టు తొమ్మిదేళ్ల తర్వాత సంచలన తీర్పు వెలువరించింది. 11 మందికి ఉరిశిక్ష విధిస్తూ, మరో 20 మందికి జీవితఖైదు విధిస్తూ కోర్టు మంగళవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మౌల్వీ ఉమర్జీతో పాటు 63 మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ... 31 మందిని దోషులుగా నిర్ధారించింది.
గుజారత్‌లో 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం సంఘటనలో 59 మంది మరణించారు. అనంతరం చెలరేగిన అల్లర్లలో 1200 మంది దాకా చనిపోయారు.మొత్తం 94 మందిపై నేరారోపణ చేస్తూ పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ 2009 జూన్‌లో సబర్మతి జైలు ఆవరణలో ప్రారంభమైంది. గోద్రా రైలు ఆరో కోచ్‌ను దగ్ధం చేయడంలో క్రిమినల్ కుట్రకు పాల్పడి, 59 మంది మరణానికి కారణమయ్యారంటూ వారిపై నేరారోపణ చేశారు. తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గోద్రా రైలు దగ్ధం కేసులో హజీ బిల్లా, రజాక్ కుర్కుర్‌లతో పాటు ప్రధాన నిందితుడు ఉమర్జీకి కేసు నుంచి విముక్తిని ప్రసాదించింది.