27, మార్చి 2011, ఆదివారం

పార్టీ ప్రతిష్ట దిగజారిస్తే ఊరుకోను

కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దిగజార్చేవిధంగా వ్యకిగత విమర్సలకు సైతం దిగుతున్న నేతలపై తీసుకు నెందుకు వెనుకాడ బోమని పీసిసి చీఫ్ డి.శ్రీనివాస్ స్పష్టం చేసారు. పీసీసీ అధ్యక్షునిగా మూడేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నవారిపై చర్యలు తీసుకోవడం పెద్దపనేమీ కాద ని ...ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో వుంచుకొని చర్య తీసుకోవడానికి సంకోచిస్తున్నామని అన్నారు.


2004లో ఉన్న ఐక్యత 2009 నాటికి పార్టీలో లేదని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో వై ఎస్ ఉన్నప్పుడే కన్పించిందని అన్నారు. ప్రస్తుతం అంతా ఐక్యంగా పనిచేయాల్సిన తరుణంలో పార్టీ నేతలు ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లు ప్రకటనలివ్వడం భావ్యం కాదని .. దీని వల్ల ప్రజల్లో చులకన భావం కలుగుతుందని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ అన్నారు. .

క్రమశిక్షణారాహిత్యానికి మారుపేరు జెసి

క్రమశిక్షణారాహిత్యానికి మారుపేరు జెసి అని.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జెసి దివాకర్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారని ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆరోపించారు.

ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2009 ఎన్నికలలో అంతపురం జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించడానికి జెసి తీవ్రం గా ప్రయత్నించారని.. ఈ విషయం అప్పట్లో వై ఎస్ దృష్టికి తీసుకు వెల్లినందునే మంత్రి వర్గంలోకి తీసుకోలేదన్నారు. మంత్రి రఘువీరా రెడ్డిపై పోటీ చేయడానికి తాను సిద్ధమని నిన్న జెసి విసిరిన సవాల్ కు వెంకటరామిరెడ్డి ప్రతిసవాల్ విసురుతూ మాజీ మంత్రి జెసి పై పోటీకి తాము సిద్దంగా ఉన్నామని .. ఆయన ఎ పార్టీ నుంచి పోటీకి దిగినా తాము గెలిచి తీరుతామన్న ధీమా వ్యక్తం చేరారు వెంకటరామిరెడ్డి.

వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ లోకి తెలంగాణా నాయకుడు?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ వైపు కాంగ్రెస్ నాయకుల ఆసక్తి పెరుగుతున్నట్లుంది.తెలంగాణ లోని కొన్ని జిల్లాల నాయకులు కూడా జగన్ ను కలవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా నాయకుడు ఎ.ఇంద్రకిరణ్ రెడ్డి ఆదివారంనాడు జగన్ ను కలిశారు. ఇంద్రకిరణ్ రెడ్డి గతంలో జడ్ పి ఛైర్మన్ గా పని చేశారు. తదుపరి 1991లో టిడిపి తరపున లోక సభకు ఎన్నికై, పి.వి.నరసింహారావు ప్రభుత్వాన్ని రక్షించడం కోసం కాంగ్రెస్ వైపు వెళ్లారు. అప్పటి నుంచి కాంగ్రెస్ ఐ లోనే ఉంటున్నారు. తొలుత కోట్ల విజయభాస్కరరెడ్డి అనుచరుడిగా ఉన్న ఈయన తర్వాత కాలంలో రాజశేఖరరెడ్డి అనుచరుడిగా కొనసాగారు.

వేసవిలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు

వేసవిలో డయేరియా, మలేరియా, డెంగీ, చికున్‌గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి.వి.రమేష్ అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నమోదయ్యే అన్ని రకాల జ్వరాల వివరాలనూ వారానికోసారి నివేదికలు ఇవ్వాలన్నారు. వీటి ఆధారంగా వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. పారిశుద్ధ్య నిధులతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టేలా కలెక్టర్లు ఆయా శాఖల అధికారులకు ఆదేశించాలన్నారు. గిరిజన, మైదాన ప్రాంతాల్లో మూడు సార్లు మలాథిన్ స్ప్రే చేయించాలని, నీటి వనరుల పరిస్థితులపై శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. ఆశ కార్యకర్తలకు నిర్ధేశించిన ఏరియాలో ప్రతిరోజూ ఇంటింటి సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జ్వరం వచ్చిన ప్రతి రోగికీ క్లోరిఫిన్, ప్రైమిఫిన్ మాత్రలు మూడు రోజుల పాటు వేయించాలని చెప్పారు.

అమితాబ్, రేఖలే మర్గదర్శకులట

అందరూ మాజీ మిస్ ఇండియాల మాదిరిగానే ఈ మిస్సమ్మ కూడా చివరికి చిత్రసీమకు వచ్చేసింది. మిగతావారిలా హింగ్లిష్ (హిందీ, ఇంగ్లిష్ కలగలిసిన భాష) మాట్లాడకుండా స్వచ్ఛమైన హిందీ మాట్లాడాలన్నది ఈ అమ్మడు కోరిక. హిందీ నేర్చుకోవడానికి అమితాబ్, రేఖలే తనకు మార్గదర్శకురాలని మాజీ మిస్ ఇండియా వరల్డ్ సారా డయాస్ జేన్ చెబుతోంది. అభిషేక్ హీరోగా రూపొందుతున్న గేమ్ సినిమాతో ఈమె వెండితెరకు పరిచయమవుతోంది. ప్రతి డైలాగును స్పష్టంగా చెప్పడానికి చాలా కష్టపడుతోంది కూడా. ‘అమితాబ్, రేఖ సహజంగానే చక్కటి హిందీ మాట్లాడుతారు.

ఎంతో కష్టపడ్డారు కాబట్టే వాళ్లు నైపుణ్యం సాధించగలిగారు. చిన్నప్పటి నుంచి వీరిద్దరి సినిమా చూస్తూ డైలాగులను గమనిస్తున్నాను’ అని ఈ ముంబై భామ చెప్పింది.

మాస్, బూతు ఒకటి కాదు : భాస్కరభట్ల

ప్రస్తుతం సినిమాల్లో అశ్లీల పదాలు, ద్వంద్వార్థాలు బాగా తగ్గాయని సినీ గేయ రచయిత భాస్కర భట్ల రవికుమార్ అభిప్రాయపడ్డారు. 1980-90 దశకంలో విడుదలైన చిత్రాల్లో అధికంగా అశ్లీలం ధ్వనించేదన్నారు. అరుుతే 2000 సంవత్సరం నుంచి సెన్సార్ బోర్డు పటిష్టంగా పని చేస్తుండడంతో అలాంటి వాటికి తావులేకుండా పోయిందన్నారు.
మాస్ చిత్రాలకు ఆదరణ బాగా ఉందని, అయితే మాస్, బూతు సంభాషణలు ఒకటి కావని వివరించారు. సాహిత్యం సరిగా వినిపించకుండా సంగీతం మాత్రమే వినిపించే పాటలు ఎక్కువ కాలం మనగలగడం కష్టమని, రెండూ సమపాళ్లలో ఉన్న పాటలే కొంతకాలం గుర్తుంటున్నాయని అన్నారు.

పోకిరి చిత్రంలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..’ అనే పాట తనకు బాగా గుర్తింపు తెచ్చిందని, ఇందులో అశ్లీలత లేదని, ఆడవాళ్లు కూడా హాయిగా పాడుకుంటున్నారని అన్నారు. కొత్తగా ‘తీన్‌మార్’లో టైటిల్ సాంగ్‌ను, పబ్ సాంగ్‌ను రాశానని, ఆడియో హిట్ అయిందని చెప్పారు.

సీఎం,హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా..? వద్దా..?

ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప, ఆయన కుటుంబసభ్యులు, రాష్ట్ర హోం మంత్రి ఆర్.అశోక్‌లపై లోకాయుక్త పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుకు సిద్ధమయ్యారు. సోమవారం లేదా మంగళవారం ప్రథమ సమాచార నివేదికను నమోదు చేసే అవకాశాలున్నాయి. ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆదేశాల మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి న్యాయ నిపుణులతో లోకాయుక్త పోలీసులు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

లోకాయుక్త న్యాయ నిపుణుడు చంద్రశేఖర్ సెలవుపై మైసూరు వెళ్లినందున ఆయన వచ్చిన తరువాత చర్చించి సీఎం,హోం మంత్రిపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా..? వద్దా..? అనేది సోమవారం నిర్ణయిస్తామని లోకాయుక్త ఏడీజీపీ రూప్‌కుమార్ దత్తా తెలిపారు.

ఫైనల్ మ్యాచ్ రోజు ప్రత్యేక సెలవు

ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు ఏప్రిల్ రెండున ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఫైనల్ మ్యాచ్ రోజు సెలవు దినంగా ప్రకటించాలన్న ప్రస్తావనపై తొందర్లోనే నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ దక్షిణ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్ రెండున జరగనున్న విషయం విదితమే.

కాలయాపన కోసమే..కమిటీలు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్సే ప్రధాన శత్రువని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ రాష్ట్ర కో-కన్వీనర్ విమలక్క విమర్శించారు. ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎంటీబీఎఫ్) కన్వీనర్లుతో తెలంగాణ విషయమై చర్చ అనంతరం ఆమె మాట్లాడుతూ... ఉద్యమాన్ని అణచివేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

డిసెంబర్ తొమ్మిది ప్రకటనను వెనక్కితీసుకున్న కేంద్ర మంత్రి చిదంబరం, రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీకృష్ణ కమిటీ నివేదికకు సహకరించారని, దీన్నిబట్టి తెలంగాణ రాష్టస్రాధనకు కాంగ్రెస్ పార్టే ప్రధాన శత్రువని దుయ్యబట్టారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎటువంటి కమిటీలు పనిచేయలేదని చరిత్ర చెబుతోందన్నారు. ఇవి కేవలం కాలయాపన కోసమేనని చెప్పారు.

వికృత రాజకీయాలకు వేదికగా తమిళనాడు

తమిళనాట మక్కల్ శక్తి కట్చిగా ఆవిర్భవించిన లోక్‌సత్తా పార్టీ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టింది.
ఒకప్పుడు సంస్కృతి సంప్రదాయాలకు, సామాజిక ఉద్యమాలకు, ఆత్మగౌరవానికి మారుపేరు తమిళనాడు .. కొ న్నేళ్లుగా
తమిళనాడు వికృత రాజకీయాలకు వేదికగా మారిందని లోక్‌సత్తా పార్టీ జాతీయ కన్వీనర్, ఎమ్మెల్యే జయప్రకాష్ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాట అధికారం కోసం తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అభ్యర్థులను రంగంలోకి దించామని అన్నారు. ఎన్నికల కమిషన్ పిరికితనానికి పరాకాష్టగా తమిళనాడులో ఉచిత పథకాలు ఉన్నాయని విమర్శించారు. ఉచితాల పై ఎన్నికల కమిషన్ మేలుకోని పక్షంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓటు వేస్తే నెలకు ఐదు సీసాల మద్యం ఇస్తాం, స్కూటరిస్తాం.. అన్న వాగ్ధానాలు పుట్టుకొచ్చే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశా రు.

మొహాలీకి మన్మోహన్, గిలానీ

భారత ప్రధాని మన్మోహన్ క్రికెట్ దౌత్యం ఫలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొహాలీలో ఈ నెల 30న జరిగే భారత్-పాక్ క్రికెట్ వరల్డ్‌కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని మన్మోహన్ పంపిన ఆహ్వానానికి ప్రధాని గిలానీ అంగీకరించవచ్చని సంకేతాలు వచ్చాయి. ఉజ్బెకిస్థాన్ పర్యటనలో ఉన్న గిలానీకి ఈ ఆహ్వానం గురించి అధికారులు తెలపగా ఆయన చిర్నవ్వు చిందించార ని సమాచారం. మొహాలీకి వెళ్లే అంశంపై ఆయన తమ అధికారులతో చర్చించారని పాక్ మీడియా కథనం.

చిరంజీవిని ఆహ్వానించి ఏం సాధించిందో ...

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు సీట్లు నెగ్గడం ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్తాకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు.. ఎవరు ఎన్ని మాట్లాడినా జగన్ తన దైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారనే సంకేతాలు ఈ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు. ఎవరు ఎటువైపు ఉన్నారో తెలుసుకోలేకుండా కేంద్ర, రాష్ట్ర రాజకీయాలు గందరగోళంలో పడ్డాయన్నారు.. జగన్కి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వం చిరంజీవిని ఆహ్వానించి ఏం సాధించిందో అర్ధం కావడం లేదని ఆయన పేర్కొన్నారు.

గెలిచే అవకాశాలు జగన్‌కే : బొత్స

కడప ఉప ఎన్నికలో గెలిచే అవకాశాలు యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే ఉన్నాయని రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ లాబీలోని తన చాంబర్లో ఆయన మీడియాతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కడప ఉప ఎన్నిక ఫలితాలెలా ఉంటాయని అడిగితే, ‘‘నాకు తెలిసినంతవరకు జగన్‌కే అనుకూలంగా ఉంటాయి. న్యాయంగా, సాంప్రదాయికంగా చూసినా ఆయనే గెలిచే అవకాశాలున్నాయి. అసలక్కడ నామినేషన్లు పడతాయనే నేను అనుకోవడం లేదు’’అని బదులిచ్చారు. నామినేషన్లు పడకపోవడమేంటి, కాంగ్రెస్ తరపున కూడా వేయరా ఏమని ప్రశ్నిస్తే, ‘‘నేనింతకంటే ఎక్కువ మాట్లాడను. మీరే ఆలోచించుకోండి’’ అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మూడు సీట్లు వచ్చాయంటున్నారు.

అసలేమీ లేని జగన్‌కు మూడు సీట్లు రావడం గురించి మాట్లాడరా? దీనంతటికీ కారణం మా పార్టీవాళ్లే. జగన్‌ను వాళ్లెవరూ ప్రత్యర్థిగా భావించకపోవడంవల్లే ఇలాంటి ఫలితాలొస్తున్నాయి. ఓవైపు జగన్ పార్టీ పెట్టి కాంగ్రెస్‌ను ఓడించేందుకు సిద్ధమవుతుంటే, మా వాళ్లేమో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లోకి వస్తారని మాట్లాడుతున్నారు. జగన్‌ను ప్రత్యర్థిగా చూడలేక పోవడమనే బలహీనత. విజయనగరం జిల్లాలో జగన్ ఓదార్పు యాత్రకు జనం బాగానే వస్తారని..జగన్ పార్టీలోకి మా జిల్లా కాంగ్రెస్ నేతలెవరూ వెళ్లరు’’ అన్నారు.