11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

స్వర్ణమయం పథకం కొనసాగించాలని పిటిషన్

అనంత స్వర్ణమయం పథకం కొనసాగించాలని కోరుతూ టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు సహకారంతో సుప్రీంకోర్టును పిటిషన్ వేసినట్లు సమాచారం. ఏపీ భవన్‌లో ఆదికేశవులు విలేకరులతో మాట్లాడుతూ సాధికారమండలిపై ధ్వజమెత్తారు. అనంత స్వర్ణమయానికి బంగారం ఇచ్చిన దాతలకు దాన్ని తిరిగి ఇచ్చేయాలనడాన్ని తప్పుపట్టారు.

పురావస్తుశాఖకు దేవాలయాన్ని అప్పగించాలన్న మండలి నిర్ణయం తొందరపాటు చర్యగా అభివర్ణించారు. రేషన్‌దర్శన ప్రతిపాదనను ఖండించారు. 20, 30 గంటలు ప్రయాణం చేసి వచ్చి కొన్ని నిమిషాలపాటు స్వామిని దర్శించి తరించిపోయే భక్తులను విమాన వేంకటేశ్వరుని దర్శించి వెళ్లాలనడం సరికాదన్నారు. మరోసారి అవకాశం ఇస్తే చైర్మన్ పదవి చేపట్టేందుకు సిద్ధమేనన్నారు.

ఎట్టకేలకు చంద్రబాబుకి కొత్త 'జామర్‌'

ఎట్టకేలకు ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వాడుతున్న కాన్వాయ్‌లోకి ప్రభుత్వం జామర్‌ వాహనాన్ని సమకూర్చింది. ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు ప్రభుత్వం టాటా కంపెనీ తయారు చేసిన సఫారీ వాహన శ్రేణిని అందజేసింది. అయితే జామర్‌ వాహనాన్ని ఇవ్వకుండా పాత అంబాసిడర్‌ జామర్‌నే వాడుకోవాలని అప్పట్లో పోలీసు శాఖ కోరింది. అప్పటికే మూడు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబాసిడర్‌ జామర్‌ వాహనం రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కొంత కాలం చంద్రబాబు జామర్‌ వాహనం లేకుండానే తిరిగారు. ప్రతిపక్ష నేతగా ఐదు సంవత్సరాలు డొక్కు అంబాసిడర్‌ కారులోనే చంద్రబాబు తిరిగారు. ఎప్పటికప్పుడు తన వాహన శ్రేణిని మార్చాలని అప్పటి వైఎస్‌ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు వాహన శ్రేణిని మార్చలేదన్న ఫిర్యాదులు వచ్చాయి.

వజ్రాల స్మగ్లింగ్‌ కి కండోమ్స్‌

ఏదైనా పని నిర్విఘ్నంగా చేయాలనుకుంటే మార్గాలు అనేకం. అయితే మంచి కోసం ఆ మార్గాలను వినియోగించుకోవచ్చు. కానీ ఓ వ్యక్తి కడుపులో విలువైన వస్తువులు దాచుకుని స్మగ్లింగ్‌ పాల్పడిన ఘటన గురువారం చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం బయట వెల్లడైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీలంక వాసి (43) అయిన స్మగ్లర్‌ కండమ్స్‌లలో భారీ సంఖ్యలో వజ్రాలు నింపి కడుపులోకి మింగేసి అమాయకుడిగా చెన్నైకి చేరుకున్నాడు. ఈ విషయమై చెన్నై సబర్బన్‌ పోలీసులు స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం బయట అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న ఈ వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించారు. తొలుత తనకేం తెలియదని సదరు స్మగ్లర్‌ బుకాయించాడు. కానీ పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి 'ఎక్స్‌ రే' తీయడంతో అసలు విషయం బయట పడింది.

పోలీసులు అతన్ని ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసి అరటి పండ్లు, కొన్ని మందులు తినిపించడంతో వాంతి చేసుకున్నాడు. దాంతో కడుపులో ఉన్న వజ్రాల ప్యాకెట్లన్నీ బయట పడ్డాయి. 42 ప్యాకెట్లలో 2065 వజ్రాలున్నాయని పోలీసులు తెలిపారు.కేవలం రూ.10,000 కోసమే తానీపని చేస్తున్నానని చెప్పాడు.

సిఎంకు కొత్త బుల్లెట్‌ప్రూఫింగ్‌ కాన్వాయ్

ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి పోలీసు శాఖ కొత్త కాన్వాయ్‌ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్కార్పియో సంస్థ తయారు చేసిన మూడు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలను, జామర్‌తోపాటు మరో ఐదు వాహనాలను వాడుతుండగా వీటిని తొలగించి వాటి స్థానంలో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ఫోర్డ్‌ సంస్థ కొత్తగా తయారు చేసిన 'ఎండీవర్‌' వాహన శ్రేణిని సమకూర్చేందుకు ప్రభుత్వం అవసరమైనన్ని నిధులు కేటాయించడంతోపాటు వాహనాలకు ముంబయి నగరంలో వాహనాలను సిద్ధం చేసేందుకు ఫోర్డ్‌ సంస్థ సమాయత్తమవుతోంది.

కెసిఆర్ రాజీనామా చేయడుగాని మిగిలినవారికి నీతి సూత్రాలు చెబుతారు.

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని బజారుకీడుస్తానని గతంలో బీరాలు పలికిన టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ ఇప్పుడు ఆమెను పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏమిటని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. కాంగ్రెస్. పార్టీతో  కెసిఆర్ కుమ్ముక్కు అవుతు...కేశవరావు ఇంటికి వెళ్ళి కాంగ్రెస్.ని బలోపేతం చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఈ రోజు వరకూ సోనియా గాంధీ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. కారణం ఏమిటి? మీ ఇద్దరి మధ్య రహస్యం ఏమిటి? తెలంగాణకు జరిగిన అన్యాయానికి కాంగ్రెస్...కెసిఆర్ కారణం..కెసిఆర్ రాజకీయ స్వార్ధం వల్ల తెలంగాణ ఉద్యమం నీరుగారుతోందని ఆయన ఆరోపించారు.ఆయన రాజీనామా చేయడుగాని మిగిలినవారికి నీతి సూత్రాలు చెబుతారు.

ముందు ఆయనను రాజీనామా చేసి పార్టీ పక్కనబెట్టి స్వతంత్రునిగా పోటీచేయమనండి. మేం కూడా ఆలోచన చేస్తాం. ఆయనకు తన పార్టీ కావాలిగాని మిగిలినవారికి వద్దా' అని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.