4, మార్చి 2011, శుక్రవారం

వాళ్ళిద్దరికీ చెరొకటిస్తారట......

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసాక చిరంజీవి గ్యాంగ్‌కి మంచి ఛాన్సే దొరికింది. తాజాగా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డితో చిరంజీవి జరిపిన చర్చలు ఫలించి పీఆర్పీకి ఓ ఎమ్మెల్సీ సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. అలాగే ఎంఐఎంకి కూడా ఓ ఎమ్మెల్సీ సీటు ఖాయంగా కనిపి స్తోంది.

శాసన సభ్యుల కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యేందుకు ఆశావాహులు పదుల సంఖ్యలో క్యూలో ఉన్నప్పటికి తాజా రాజకీయ పరిణామాలలో పీఆర్పీ, ఎంఐఎంల ఎమ్మెల్యేల సహకారం అవసరం కావటంతో చెరో సీటు ఇచ్చేందుకు ఇప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం సూచించినా.. పీఆర్పీ రెండు సీట్ల కోసం పట్టుబట్టినా ఫలితం లేకపోయిందన్నది వాస్తవం.

మిలియన్‌ మార్చ్‌పై జెఏసీకి హైకోర్టు నోటీసులు

మిలియన్‌ మార్చ్‌ ప్రభావం ఇంటర్‌ విద్యార్ధుల పరీక్షలపై పడుతోందని... పరీక్ష జరుగుతుందని మంత్రి చెపుతుంటే, వాయిదా వేస్తూన్నట్లు ముఖ్యమంత్రి విపక్షాలకు హామీ ఇస్తూ అయోమయం సృష్టించడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ... దాఖలైన పిటీషన్‌ని విచారణకు స్వీకరించింది.

వరంగల్‌ జిల్లాకు చెందిన సాంబరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్‌లో మార్చ్‌ 10న తెలంగాణా ఐకాస ఆధ్వర్యంలో జరుగు మిలియన్‌ మార్చ్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షని వాయిదా వేయాలని కోరటం సమంజసం కాదని.. ప్రస్తుత పరిస్ధితి కారణంగా లక్షలాది విదార్ధులు, వారి తల్లిదండ్రులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని... పరీక్షలకు అడ్డకులు సృషించవద్దని ఆదేశాలివాలని కోరుకున్నారు.ఈ పిటీషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు తీవ్రంగా స్పందిస్తూ..రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై తీసుకున్న చర్యలని వివరించాలని ఆదేశాలివ్వటమే కాకుండా మిలియన్‌ మార్చ్‌ నిర్వహిసున్న తెలంగాణా ఐకాసకు, ఉద్యోగ జేఏసీకి కూడా నోటీసులు జారీ చేసింది.

సాక్షాలు లేక భోఫర్స్‌ కేసు మూసేసారు..

కాంగ్రెస్‌ అవినీతి భాగోతమంటూ దేశాన్ని ఓ కుదుపు కుదిపిన బోఫోర్స్ కేసుని మూసివేశాయడానికి ఢిల్లీ హైకోర్టు అంగీకరించింది. తాము విచారణ జరుపుతూ ఏళ్లు గడుస్తున్నా.. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లభించనందున కేసుని మూసివేసేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టుని సిబిఐ కోరింది.

సిబిఐ పిటీషన్‌ని పరిశీలించిన హైకోర్టు వారి విన్నపాన్ని మన్నిస్తూ.. కేసు ఉపసంహరణకు సూచన ప్రాయంగా అంగీకరించడంతో.. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఖత్రోచిపై కేసుని వెనక్కి తీసుకునేందుకు రంగం సిద్దం చేస్తోంది.

ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు

తెలంగాణపై రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపజేసినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనాలేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పార్లమెంట్ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన ఢిల్లీలోని మీడియా సమావేశంలో మాట్లాడుతూ రోజంతా పార్లమెంట్‌ను స్తంభింపచేసినా కేంద్రంలో స్పందన కరువైందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో.. ప్రజలు రోడ్డుపైకి వచ్చినా, ఉద్యోగుల సహాయనిరాకరణ జరుగుతున్నా, రాష్ట్రంలో పరిపాలన స్తంభించినా..తెలంగాణ కోసం 600 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితిలో లేదని పేర్కొన్నారు.ఉద్యోగులు సహాయనిరాకరణ చేస్తున్నా..ఉద్యమాలు, రాస్తారోకోలు, రైల్‌రోకోలు.. చేస్తున్నా కేంద్రం దున్నపోతు మీద వర్షం పడినట్లు వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు.

పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని,పార్లమెంట్ లో తెలంగాణపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కూడా తమతో గొంతు కలిపారని, బీజేపీ, ఇతర పార్టీల విజ్ఞప్తి మేరకు సభకు అడ్డుతగలకుండా వాకౌట్ చేశామని ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని, కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణ పొలిటికల్ జేఏసీతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై..తమ రాజీనామాలపై నిర్ణయాన్ని ప్రకటిస్తామని అన్నారు.

అధిష్టానం మా గొంతులు నొక్కేస్తోంది...

నిన్న లోక్'సభలో తెరాస సభ్యులతో కల్సి తెలంగాణ కోసం నినాదాలు చేసిన అరుపులు కేకలు వేసిన కాంగ్రెస్ పార్టీ ఎంపిలు నోటికి నల్ల గుడ్డలు అడ్డు పెట్టుకుని వచ్చి లోక్‌ సభలో నిరసన తెలిపారు. మరోవైపు తెలంగాణా కావాలంటూ ప్లే కార్డులు ప్రదర్శించడం పట్ల స్పీకర్‌ మీరాకుమార్‌ ఆ విధంగా వ్యవహరించకూడదని..అసహనం వ్యక్తం చేసినా... ఫలితం లేకపోయింది.

ఓ దశలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ చెప్పినా వారు పట్టించుకోకపోవటం కాంగ్రెస్‌ నేతలకు మింగుడు పడలేదు. నిన్న రాత్రి ప్రణాబ్‌తో సమావేశమైన ఎంపీలు అధిష్టానం తమ గొంతు నొకేస్తోందన్న అభిప్రాయం సర్వ్‌త్రా వినిపిస్తుండటంతో పాటు నిన్న రాజీ నామాలకు రడీ అయిన వారు నేడు నిరసనకే పరిమితం కావటం వెనుక ఆంతర్యం అంతు పట్టకుండా ఉందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

జీతాల చెల్లింపునకు అoగీకరించిన ప్రభుత్వం

జీతాలు చెల్లించాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు ప్రభుత్వం దిగివచ్చింది. ఎట్టకేలకు జీతాల చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించింది. శుక్రవారం సచివాలయం ఉద్యోగులు జీతాల కోసం సీఎం కార్యాలయం 'సి'బ్లాక్‌ ఎదుట బైఠాయించారు. తమ జీతాలు వెంటనే చెల్లించాలని వారు నినాదాలు చేశారు. దీంతో సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వచ్చి ఉద్యోగులతో చ ర్చలు జరిపారు. జీతాలు చెల్లించేందకు ప్రభుత్వం అగీకరించటంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు.

ఇంటర్‌ పరీక్ష వాయిదా కుదరదు...

ఈనెల 10వ తేదీన మిలియన్ మార్చ్ సందర్భంగా ఇంటర్ పరీక్షను వాయిదా వేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్ పరీక్ష వాయిదాపై మాధ్యమిక విద్యా శాఖమంత్రి, ముఖ్యమంత్రి ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించి.. లక్షలాది విద్యార్ధుల భవిష్యత్‌ని దృషిలో ఉంచుకుని ఎట్టి పరిస్ధితిలోనూ వాయిదా వేయకూడదని నిర్ణయించారు. ఈమేరకు ఇంటర్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల నిర్వాహణకు ఉద్యోగులు సహాయ నిరాకరణ పేరుతో సహకరించకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు రంగం సిద్ధం చేస్తోంది.పరీక్షల నిర్వహణపై అఖిలపక్షంతో కూడా చర్చించాలని.. రిటైర్డ్ లెక్చరర్లతో పరీక్షలు నిర్వహించాలని.... నిర్ణయించినట్లు సమాచారం.

జగన్ బలపడడానికి కారణమని మెయిలీని పీకి పారేశారు....

తెలంగాణా ఏర్పాటుపై ఏదో ఓ నిర్ణయాన్ని అధిష్టానం ప్రకటిస్తుందని యావత్‌ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎదురు చూస్తుంటే... కాంగ్రెస్‌ అధిషానం మాత్రం పార్టీలో ప్రక్షాళన ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటివరకూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిగా చక్రం తిప్పిన వీరప్ప మొయిలీ.. వై.ఎస్.జగన్ పట్ల చాలా మెత్తగా వ్యవహరించడం వల్ల జగన్ బాగా బలపడడానికి పరోక్ష కారణం కావడం వంటి అంశాలవల్ల ఆయనను మార్చి ఆయన స్థానంలో గతంలో ఇన్‌ఛార్జిగా పనిచేసిన గులాంనబీ ఆజాద్‌ను నియమించారు. అలాగే ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాగాంధీపై నిప్పులు చెరిగి, ఆమె దేశీయతని ప్రశ్నించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యత్వం నుంచి జి. వెంకటస్వామికి ఉద్వసన చెప్పారు.

కాగా తెలంగాణా వాదాన్ని బలంగా వినిపిస్తునే... అధినేతికి విధేయుడిగా ఉన్న సైతం సిడబ్ల్యూసి నుండి కె. కేశవరావుని తొలగించడం ఆశ్చర్యకరం ...అలాగే సీమాంధ్ర ప్రాంతాల నుండి ఎంపీలుగా ఉండి ఎలాంటి వాదనలు వినిపించని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిశోర్ చంద్రదేవ్ లను కూడా తొలగించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా బి. సంజీవరెడ్డిని, మరోవైపు అధిష్టానం ప్రసన్నం పొందిన సీనియర్ నాయకులు పొంగులేటి సుధాకర్‌ రెడ్డికి, అధినేత్రిపై ఈగ వాలనీయకుండా చూసే వి. హనుమంతరావుకు కార్యదర్శులుగా నియమించారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (సి.డబ్ల్యు.సి.) శుక్రవారం విడుదల చేసిన జాబితాలో రాష్ట్రానికి ప్రాతినిథ్యం లేకపోవడం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు దిగ్భ్రాంతి కలిగించింది.