19, సెప్టెంబర్ 2012, బుధవారం

సీనియార్టీకి ఏదీ గౌరవం!

ఏదైన ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన చదివితే అందులో అనుభవం ఉన్నవారికే తొలి ప్రాధాన్యత అని తప్పకుండా ఉంటుంది. అనుభవం వల్ల సంస్థ పనితీరు బావుంటుందనేది వారి అభిప్రాయం. ఏ రంగంలో అయినా సరే అనుభవానికే పెద్దపీట వేస్తారు. చివరికి డ్రైవర్‌ ఉద్యోగానికి సైతం అనుభవం కావాలి. అయితే ఎలాంటి అనుభవం అవసరం లేని రంగం ఒకటుంది. అదే చిత్రరంగం. ఇక్కడ అనుభవం కంటే కొత్తవారికే ప్రాధాన్యత ఎక్కువ. కళారంగంలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం సబబే అయినప్పటికీ, సీనియర్లను పక్కన పెట్టడం సరికాదు. నేటి స్టార్లు, సూపర్‌స్టార్లు, మెగాస్టార్లు ఇలాంటి సీనియర్ల చలువ వల్లే నేడున్న స్థానాన్ని పొందగలిగారనేది అందరూ అంగీకరించేదే. చరిత్ర చెప్పుకునే చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన పలువురు సీనియర్‌ దర్శకులు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. అపారమైన వారి అనుభవం దేనికీ ఉపయోగపడడం లేదు. నాడు కొత్తవారిని ప్రోత్సహించి, వారు నిలబడడానికి దోహదం చేసిన వారున్నారు. అలాగే కొత్తగా వచ్చిన వారికి స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన పాత్రలను ఇచ్చినవారున్నారు. మహిళా ప్రేక్షకులను కంట తడిపెట్టించిన చిత్రాలను, మాస్‌ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించిన సినిమాను, విమర్శకులను సైతం ఆలోచింపజేసిన చిత్రాలను అందించిన మహనీయ దర్శకుల అనుభవం ఎందుకు ఉపయోగపడకుండా పోతోంది. పరిశ్రమ బాగుకోసం, మంచి సినిమాల నిర్మాణం కోసం వారి సలహాలు తీసుకునే ఆలోచనే పరిశ్రమకు లేదు. ఆధునిక పరిజ్ఞానం పాతవారికి తెలియదని చులకనగా చూసే వారికి, నేటి కంప్యూటర్లు లేనప్పడే మాయలు, మంత్రాల చిత్రాలను అందించిన ఘనత వారిదని గ్రహించలేకపోతున్నారు. కేవలం ఒకటి రెండు సక్సెస్‌లు అందించి కొత్త నిర్మాతలకు నిర్మాణంలో మెళకువలు నేర్పిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించుకునే నిర్మాతలు సీనియర్లను కేవలం ట్రంకు పెట్టెలో దాచిపెట్టే ఆస్థిగానే చూస్తున్నారు. మరికొందరైతే వారి సేవలకు గౌరవం కల్పించాలి ముఖ్య కో డైరక్టర్‌ అంటూ ప్రత్యేక పోస్ట్‌ను సృష్టించి వాడుకుంటున్నారు.
సినిమా అంటేనే కల్పితం ఇక్కడ అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ తెరపైనే చూపిస్తారు కానీ, నిజ జీవితంలో ఉండవని అంటారు. తమ కెరీర్‌కు అద్భుతమైన పునాదులు వేసిన దర్శకులను చివరి రోజుల్లో పలకరించడానికి సైతం హీరోలు ఇష్టపడరు. తమ తొలిచిత్రం దర్శకుడని చెప్పడానికి ఆసక్తి చూపించరు. ఈ రంగం గురించి విపులంగా తెలిసిన వారంతా ఇదంతా మామూలే అని తేలిగ్గా కొట్టిపారేస్తారు.
సీనియర్ల సేవలను దూరం చేసుకోవడం వల్ల తెలుగులో అద్భుత చిత్ర రాజాలు వస్తున్నాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఇప్పటికీ ఘనంగా చెప్పుకునే పాత చిత్రాల సృష్టికర్తలు మనముందే ఉన్నప్పటికీ వారికి ఏ విధంగానూ గౌరవించలేకపోతున్నారు.
పరిశ్రమనే కాదు సీనియర్లకు ప్రభుత్వ పరంగా లభిస్తున్న గౌరవం కూడా తక్కువే. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఇప్పటికీ పద్మశ్రీ పురస్కారం లభించలేదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. పొరుగు రాష్ట్రాల్లో తప్పటడుగులు వేస్తున్న వారికి సైతం ఇలాంటి గౌరవం దక్కింది. ఇలాంటి అనేక విషయాల్లో తెలుగు సీనియర్లకు జరుగుతున్న అన్యాయం గురించి పరిశ్రమ పెద్దలు మాట్లాడితే బావుంటుంది.
శతాధిక చిత్రాల సృష్టికర్తలు దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పరిశ్రమకు రెండు కళ్ళలాంటివారు. నేటి యువదర్శకుల చిత్రాలకు వారి చిత్రాలే ప్రేరణ. కొత్తతరం సాధిస్తున్న విజయాలు చూస్తూ పాతతరం కూడా వారితో పోటీపడడానికి ముందుకు రావడానికి ఉత్సాహపడుతుంది. మధ్యతరగతి జీవితాల్లోని సంఘర్షణకు వెండితెర రూపం ఇచ్చి అనేక చిత్రాలను సృష్టించి భారతీయ సినిమా రంగానికే ఆదర్శంగా నిలిచిన దాసరి నారాయణరావు ఏడాదిగా మెగా ఫోన్‌ పట్టడం లేదు. ఆయన శిష్యగణంలో కొందరు మాత్రం చిత్రాలు తీస్తూ వస్తున్నారు.
మాస్‌ ప్రేక్షకుల పల్స్‌ పట్టుకుని, హీరోలకు గ్లామర్‌ నగిషీలు చెక్కిన కమర్షియల్‌ చిత్రాల సృష్టికర్త కె.రాఘవేంద్రరావు పదేళ్ళ క్రితమే తన పంథా మార్చేశారు. రక్తి చిత్రాల నుండి భక్తి చిత్రాలకు మారారు. అయినప్పటికీ స్టార్‌ హీరోలతో భక్తిని ప్రేక్షకులకు చూపిస్తూ 'అన్నమయ్య, శ్రీరామదాసు', తాజాగా 'శిరిడిసాయి' అందించారు. మధ్యలో 'గంగోత్రి, ఝమ్మందినాదం' అంటూ తనదైన తరహా చిత్రాలు అందించినప్పటికీ, భక్తి చిత్రాలు ఆయన సెకండ్‌ ఇన్నింగ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. దర్శకుడిగా గ్యాప్‌ తీసుకోకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
కళాత్మక చిత్రాల సృష్టికర్తలు బాపు, కె.విశ్వనాథ్‌ అడపాదడపా తమ తరహా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇటీవలే బాపు 'శ్రీరామరాజ్యం' చిత్రం ద్వారా నేటి యువతరం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కె.విశ్వనాథ్‌ ఆ మధ్య 'శుభప్రదం' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది సంగీతం, నాట్యం ప్రధానాంశాలుగా తీసిన సినిమానే.
దక్షిణాదిలో పలు అద్భుత చిత్రాలు తీసిన సింగీతం శ్రీనివాసరావు ఇటీవల గ్యాప్‌ తీసుకున్నారు. 'ఘటోత్కచ' యానిమేషన్‌ సినిమా నిరాశపరిచింది. అయితే ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌ తీస్తారని ప్రచారం జరుగుతోంది. క్రీస్తుకు సంబంధించిన చిత్రంలో కొంతవర్క్‌ జరిగింది.
ఇటీవలే 'అరుంధతి' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన కోడిరామకృష్ణ తదుపరి చిత్రం కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. గ్రాఫిక్స్‌ సినిమాలను అందించిన ఘనత ఆయనది. శతాధిక చిత్రాలు తీసినా అలుపెరుగని ఉత్సాహంతో చిత్రాలు రూపొందిస్తుంటారు. తాజాగా పుట్టపర్తి సాయిబాబు జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ చిత్రాలంటే పి.సి.రెడ్డి సినిమా చూడాల్సిందే. ఎందరో శిష్యులను తయారుచేసి పరిశ్రమకు అందించిన పి.సి.రెడ్డి అనుభవానికి తగిన చిత్రం చేసే అవకాశం చాలాకాలంగా రావడం లేదని చెప్పవచ్చు. ఈ మధ్య తీసిన రెండు చిత్రాలు నిలబడలేదు.
కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ రేలంగి నరసింహారావు సినిమాలు. 'నేను మా ఆవిడ' నుండి వరుసగా ఆయన ఈ తరహా చిత్రాలే అందించిన తన ఇంటిపేరును సార్థకం చేసుకున్నారు. ఇతర దర్శకులకు భిన్నంగా సినిమాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. కామెడీ చిత్రాలు తీసేవారికి ప్రేరణగా నిలిచారు. రేలంగి కొంతకాలంగా కొత్త చిత్రాలేవీ చేయడం లేదు. ఆయన సేవలనూ పరిశ్రమ ఉపయోగించుకోవడం లేదు.
'పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం' విమర్శకుల ప్రశంసలు పొందిన అభ్యుదయ చిత్రాలు. చిరంజీవితో 'అన్నయ్య, హిట్లర్‌' చిత్రాలు అందించిన చరిత్ర ఉన్న దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. సెంటిమెంట్‌ పండించడంలో దిట్ట. మధ్యతరగతి కథలతో ఆయన తీసిన 'అమ్మాయి కాపురం, కలికాలం' వంటి చిత్రాలు ఆలోచింపజేసేవే. కొంతకాలంగా 'ముత్యాల సుబ్బయ్య' విరామం తీసుకున్నారు.
తెలుగు సినిమా చరిత్రలో తొలి బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా 'పెదరాయుడు'. సంచలన విజయం సాధించిన 'చంటి, యుముడికి మొగుడు', కంటతడి పెట్టించిన 'పుణ్యస్త్రీ' వంటి చిత్రాల దర్శకుడు రవిరాజా పినిశెట్టి చాలా కాలంగా మెగాఫోన్‌కు దూరంగా ఉన్నారు. తరం మారడమే ఇందుకు కారణమా?.
దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్న విజయనిర్మల ఎందరో మహిళలకు ప్రేరణ కలిగించిన దర్శకురాలు. నవలా చిత్రాలను, గ్రామీణ కథాంశం ఉన్న సినిమాలను ఆమె అందించారు. విజయం సాధించారు. కొద్దిరోజుల క్రితమే 'నేరము- శిక్ష' పేరుతో చిత్రం తీశారు. ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మంచి కథ లభిస్తే సినిమా చేయడానికి సిద్ధమే అంటున్నారు.
'న్యాయంకావాలి' చిత్రం తర్వాత ఎ.కోదండరామిరెడ్డి తీసిన 'ఖైదీ' ఘనవిజయం సాధించింది. చిరంజీవిని స్టార్‌ని చేసింది. అప్పటి నుండి కోదండరామిరెడ్డి పేరు చెబితే కమర్షియల్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. క్షణం తీరిక లేకుండా అందరి హీరోలతో చిత్రాలు తీసిన కోదండరామిరెడ్డి శత చిత్రాలకు చేరువలో ఉన్నారు. ఇప్పుడాయన చేతిలో సినిమాలే లేవు. నాడు ఆయన డేట్స్‌ కోసం వెంటపడిన హీరోలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమంది ఉన్నారు. కొత్తతరం వస్తే పాతతరం పక్కకి తప్పుకోవాలనేది నిజమే అయినప్పటికీ, వారి సేవలను ఉపయోగించుకుంటే పరిశ్రమలో మరిన్ని ఆరోగ్యవంతమైన చిత్రాలు రావడానికి దోహదపడినట్టు అవుతుంది. నేటి చిత్రాల ఫలితాలు ఎలా ఉంటున్నాయనేది తెలిసిందే. నేటి ఆధునిక యువత మెచ్చే చిత్రాలు పాతతరం దర్శకులు తీయలేనేది అపోహ మాత్రమే. కె.రాఘవేంద్రరావు తీసిన 'ఝుమ్మందినాదం', 'అన్నమయ్య'. 'శిరిడిసాయి', బాపు తీసిన 'శ్రీరామరాజ్యం', కోడి రామకృష్ణ అందించిన 'అరుంధతి' వంటి చిత్రాలు ఎలాంటి సంచలన విజయం సాధించాయో తెలిసిందే. నేటితరం దర్శకులకు తెలిసింది కేవలం ఖర్చు పెట్టడమే. ఆ తరానికి తెలిసింది పెట్టిన ఖర్చు తెరపై కనిపించేలా చేయడం. ఇలాంటి వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ తరం సినిమాలను ఇప్పటికీ ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. అందువల్ల ఎవరిగౌరవం వారిదే.

- రామనారాయణరాజు

సుడిగాడు సెన్సార్ బిట్స్

సుడిగాడు సెన్సార్ బిట్స్ 
అల్లరి నరేష్‌ 'సుడిగాడు'గా టైటిల్‌ రోల్‌ పోషించి ద్విపాత్రాభినయం చేసిన చిత్రంలో మోనాల్‌ గజ్జర్‌ నాయిక. బ్రహ్మానందం, ఎం.ఎస్‌.నారాయణ, జయప్రకాష్‌ రెడ్డి, పోసాని, కోవై సరళ ముఖ్యపాత్ర ధారులు. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరుంధతి మూవీస్‌ పతాకాన చంద్రశేఖర్‌ డి.రెడ్డి నిర్మించారు. 'సుడిగాడు'ని చూసిన 'ఇసి' తలిదండ్రుల నిర్దేశకత్వంలో పిల్లలు చూడాలంటూ 5 కట్స్‌తో 'యుఎ' సర్టిఫికెట్‌ 17-8-12న జారీ చేసింది.

1. ''ఒక్క బబుల్‌ గమ్‌ ఎంతసేపు నముల్తారు'' కత్తెర పాలైంది.

1. ''శివ హైకోర్టు'' దృశ్యాలు కత్తెరింపుకి గురి అయ్యాయి.

3. ''పైన తగిలితే పనికి రాకుండా పోతావు'' డైలాగ్‌ తొలగించడమో శబ్దం వినరాకుండా చేయమనో సూచించగా తొలగించారు.

4. 'దానమ్మ, నీ యమ్మ, నీ తల్లి, నీ యయ్య, ఆడు ఎక్కించుకున్నాడు, కామనాథులు, గుడి, గర్భగుడి' పదాలున్న చోట శబ్దం వినరాకుండా చేయడమో, తొలగింపుకు గురి చేయమనో చెప్పగా తీసివేసారు.

5. ''ఆ బూతులు ఏంటి అధ్యక్షా - బూతులు వినబడుతున్నాయనే ఇది మన అసెంబ్లి అయ్యుంటుంది'' డైలాగ్‌ కత్తెర పాలైంది. 2గం20ని||ల సేపు ప్రదర్శితమయ్యే సుడిగాడు 24-8-12న విడుదల అయింది.

నగరంలో వినాయకుడు సెన్సార్ కట్స్‌

భారతం క్రియేషన్స్‌ పతాకాన ప్రేమ్‌చంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'నగరంలో వినాయకుడు'. కృష్ణుడు, రమ్య నాయకా నాయికలుగా కృష్ణ భగవాన్‌, దువ్వాసి మోహన్‌ ఇతరపాత్రలు పోషించారు. మాటలు, పాటలు బి.కె. ఈశ్వర్‌, సంగీతం సాహిణి శ్రీనివాస్‌, ఛాయాగ్రహణం జె. గణశన్‌, కూర్పు అనిల్‌ మల్నాడ్‌ నిర్వహించిన ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' ఏ విధమైన కట్స్‌ లేకుండా 4-7-12న 'యు' సర్టిఫికెట్‌ జారీ చేసింది. 17-8-2012న విడుదల అయింది. నిర్మాత ఎం. సూర్యకమల.

శ్రీనివాస కళ్యాణం 25

యువచిత్ర పతాకాన కోడి రామకృష్ణ దర్శకత్వంలో కె. మురారి నిర్మించిన 'శ్రీనివాస కళ్యాణం' సెప్టెంబర్‌ 1982లో విడుదలై ఈ 25వ తేదీతో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కె. మురారి నిర్మించిన మంచి చిత్రాల్లో ఇది ఒకటి. జి. సత్యమూర్తి కథ సమకూర్చారు.
తలిదండ్రులను కోల్పోయిన శ్రీనివాస్‌ (వెంకటేష్‌) అతని సోదరి మేనమావ (సుత్తివేలు) ఇంట ఉంటారు. సుత్తివేలు వారిని ఆదరంగా చూడడు. దాంతో సుత్తివేలు కూతురు (గౌతమి) సలహాతో ఇల్లుని వదిలివెళ్ళి రైల్వేట్రాక్‌ పక్కన గల కాలనీలో వుండే గొల్లపూడి మారుతీరావు ఆశ్రయంలో వార్తా పత్రికలు పంపిణీ వంటి పనులు చేస్తూ పెరుగుతారు. ఉద్యోగాన్వేషణలో వచ్చిన లలిత (భానుప్రియ) తన అక్క ఇంట వుంటూ శ్రీనివాస్‌కి పరిచయం అవుతుంది. భానుప్రియకి ఆసక్తిగల డ్యాన్స్‌ స్కూల్లో జేర్పిస్తాడు శ్రీనివాస్‌. భానుప్రియ శ్రీనివాస్‌ ప్రేమలో పడుతుంది. గొల్లపూడి ఇంట్లో అద్దెకుండటానికి వచ్చిన గౌతమి తన బావ శ్రీనివాస్‌ని గుర్తిస్తుంది. ఆమె కూడా ప్రేమలో పడడంతో కథ మలుపులు తిరుగుతుంది. గొల్లపూడి మారుతీరావు, వై. విజయ, లంబోదరంగా మోహన్‌బాబు చక్కని నటనతో ఆకట్టుకుంటారు. ప్రసాద్‌బాబు, శుభలేఖ సుధాకర్‌, వంకాయల సత్యనారాయణ, భీమేశ్వరరావు, వరలక్ష్మి మిగతా పాత్రధారులు. కె.వి.మహదేవన్‌ సంగీతం సమకూర్చిన 'ఎందాకా ఎగిరావమ్మా... జాబిల్లి వచ్చి.... తుమ్మెదా ఓ దుమ్మెదా.... తొలి పొద్దులో... కదలిక కావాలిక... ఇలా అయిదు పాటలు ఉన్నాయి. వెంకటేష్‌ నటించిన 7వచిత్రం సాత్వికమైన పాత్ర పోషించారు.

కొన్ని జ్ఞాపకాలు
- గొల్లపూడి మారుతీరావు
శ్రీనివాస కళ్యాణం కోడి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం. నా పాత్రల మీద ప్రత్యేకమైన శ్రద్ధ, అప్పటి నా పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని తీర్చిదిద్దేవాడు కోడి. ఆ చిత్రానికి నేనే మాటలు రాశానేమో గుర్తులేదు! ఒక్కటి ప్రస్ఫుటంగా గుర్తుంది. గౌతమికి అది మొదటి చిత్రం. ఆమె నా మిత్రులు డాక్టర్‌ శేషగిరిరావు గారి కుమార్తె. ఆయన విశాఖలో మా రోజుల్లో ప్రముఖ రేడియాలజిస్టు. గౌతమితో ఆమె అమ్మగారు ఉండే వారు. చెన్నై విమానాశ్రయం దాటాక పల్లవరంలో ఒక ఇంట్లో షూటింగ్‌. పక్కనే రైలు ట్రాక్‌. రైళ్లు వచ్చినప్పుడల్లా ఆ దృశ్యం బాక్‌ డ్రాప్‌గా ఉండేటట్టు షాట్‌ తీసేవాడు కోడి. అదొక ఏనిమేషన్‌. ప్రతీరోజూ షూటింగ్‌ తల్లితో మా ఇంటికి వచ్చేది గౌతమి. మేం ముగ్గురం కలిసి షూటింగ్‌కి వెళ్లేవారం. నాది ఆమెకి తండ్రిలాంటి పాత్ర. గౌతమికి కాంటాక్ట్‌ లెన్స్‌లు వుండేవి. సీన్‌ అయ్యాక కళ్ల వెంబడి వచ్చే నీళ్లు. కళ్లు ఎప్పటి కప్పుడు తుడుచుకుంటూ ఉండేది. చక్కని క్రమశిక్షణ, సంస్కారం ఉన్న వ్యక్తి గౌతమి. ఇప్పటికీ నన్ను తన తండ్రిలాగ గౌరవిస్తుంది.
మురారి నిర్మాత. నేనూ వై.విజయ ఇంటి పొరుగున ఉండే దంపతులం. చక్కని ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించాడు దర్శకుడు. చిత్రం బాగా నడించింది. అభిరుచికి పెట్టింది పేరు మురారి. కాస్త చాదస్తం ఉన్నా చివరకు మంచి సినిమాతో ఆయన చాదస్తాన్ని, పెళుసుతనాన్నీ అంగీకరించేటట్టు చేస్తాడు, వెంకటేష్‌కి కూడా అదొక భిన్నమైన పాత్ర.
మా అందరికీ ఓ మంచి పాట ఉన్న గుర్తు. ఆ ఇంటిముందు మామిడి చెట్టు నీడల్లో చేశాం. కొన్ని సినిమాలు చక్కని జ్ఞాపకాలుగా మనస్సుల్లో నిలిచిపోతాయి. అలాంటి చిత్రాలలో 'శ్రీనివాస కళ్యాణం' ఒకటి.

- వి.ఎస్‌.కేశవరావ్‌

30 సంవత్సరాల 'మేఘసందేశం'

చక్కని నాటకీయత, వినసొంపైన పాటలతో, కుటుంబం పరువు ప్రతిష్ఠలు గురించి ఆలోచించే వ్యక్తులు, సెంటిమెంట్స్‌తో అక్కినేని దాసరి నారాయణరావు కాంబినేషన్లో రూపుదిద్దుకుని కళాత్మక చిత్రం 'మేఘసందేశం'. దాసరి నారాయణరావు గానీ, కె. రాఘవేంద్రరావు గానీ సంగీత ప్రధానమైన కళాత్మక చిత్రం ఏదైనా తీసారా అని అభిమానులు విజయవాడలో ఓ సినిమా పంక్షన్‌ తర్వాత వాదోపవాదాలకి తీవ్రంగా దిగడంతో ఇది విన్న తర్వాత దాసరి, రాఘవేంద్రరావు ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం చేసారు. కొంతకాలానికి దాసరి అక్కినేని నాగేశ్వరరావుతో మేఘసందేశం'. చాలా కాలం తర్వాత నాగార్జునతో కె. రాఘవేంద్రరావు 'అన్నమయ్య' చిత్రాలు రూపొందించడం ఈ రెండు చిత్రాలు విశేష ఆదరణ పొందడం విశేషం.
4-9-82న సెన్సార్‌ శాఖ నుంచి 'యు' సర్టిఫికెట్‌ని కట్స్‌ లేకుండా లభించగా సెప్టెంబర్‌ 1982లో విడుదలైన 'మేఘసందేశం' 24వ తేదీతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య, మంగళంపల్లి బాలమురళికృష్ణ, సుభాషిణి ముఖ్యతారాగణం. తారక ప్రభు ఫిలింస్‌ పతాకాన దాసరి పద్మ నిర్మించగా సంగీతం రమేష్‌నాయుడు, ఛాయాగ్రహణం పి.ఎన్‌.సెల్వరాజ్‌ సమకూర్చారు. కథ మాటలు స్క్రీన్‌ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు సమకూర్చారు. 2 జయదేవ్‌ గీతాలు, 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతాలు, 4 వేటూరి పాటలు రాయగా, జేసుదాస్‌, సుశీల, మంగళంపల్లి బాలమురళికృష్ణ ఆలపించారు.
జేసుదాస్‌ పాడిన 'ఆకాశ దేశాన ఆషాడ మాసానా.... ప్రియే చారుశీలే... నవరస సుమ మాలికా.... బాల మురళీకృష్ణ ఆలపించిన 'పాడనా వాణి కళ్యాణిగా... పి సుశీల పాడిన ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై... ముందు తెలిసినా ప్రభూ...సిగలో అవి విరులో... శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు... నిన్నటి దాకా శిలనైనా... జేసుదాస్‌, సుశీల కలసి ఆలపించిన రాధికా కృష్ణా రాధికా... గీతాలు హిట్‌ కావడమే కాక పలు ప్రశంసలు పొందాయి. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డులు సాధించింది 'మేఘసందేశం'. రాష్ట్రస్థాయిలో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడు (అక్కినేని) ఉత్తమనటి (జయసుధ), ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ గీత రచయిత (దేవులపల్లి), ఉత్తమ గాయకుడు (జేసుదాస్‌), ఉత్తమ గాయని, ఉత్తమ ఆడియో గ్రాఫర్‌ అవార్డులు లభించాయి. ఇండియన్‌ పనోరమ, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమై ప్రముఖుల ప్రశంసలు పొందింది.
చక్కగా సంసార జీవితాన్ని గడిపే రవీంద్రబాబు (అక్కినేని నాగేశ్వరరావు) కవి, మంచి మనసున్న వ్యక్తి. ఈయన భార్య జయసుధ, బావమరిది జగ్గయ్య. ఒకానొక సందర్భంలో దేవదాసి (జయప్రద) కనిపించడంతో రవీంద్రబాబులో కవితావేశం, సృజనాత్మక భావాలు మరింత పెంపొందుతాయి. జయప్రదతో వుండడం, ఆ తర్వాత కుటుంబ పరంగా మనస్పర్థలు రావడంతో కథ మలుపులు తిరుగుతుంది.

అపోహలు మధ్య సమంత

వివాదాలు, అనుమానాలు, అపోహలు వీటి మధ్య నటి సమంత కెరీర్‌ కొనసాగుతోంది. ఐదు నెలలుగా 'ముఖం చాటేసిన సమంత ఇటీవల చెన్నైలో మీడియా ముందు ప్రత్యక్షమయింది. కొద్దిరోజులుగా కారణాలు చెప్పకుండానే సినిమాలు వదిలేసుకున్న సమంత ఆరోగ్యంపై రకరకాల వదంతుల షికారు చేశాయి. ఆమె అనారోగ్యంతో ఉన్నారని, కాదు స్కిన్‌ సమస్య వల్ల ముఖంపై మచ్చలు వచ్చాయని ఈ కారణం చేతనే సినిమాలు వదిలేసుకుందని అంటున్నారు. అగ్రదర్శకుడు శంకర్‌, మణిరత్నం చిత్రాలను సైతం సమంత వదులుకుంది. ఇద్దరు పెద్ద దర్శకుల సినిమాలు కూడా కాదనుకోవడంతో ఆమె ఇప్పుడు తీవ్ర సమస్యతో బాధపడుతోందని వదంతులు పుట్టుకొచ్చాయి. వీటిని సమర్థిస్తున్నట్లుగా తన వ్యక్తిగత సిబ్బందికి సైతం ఆమె కొద్దిరోజులు సెలవు మంజూరు చేశారు. ఈ ఐదు నెలలూ సమంత మీడియా ముందుకు రాలేదు. అయితే పక్షం రోజుల నుండి ఆమె షూటింగ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందింది. పూర్తి ఆరోగ్యవంతురాలుగా తిరిగివచ్చి తన పాత కమిట్‌మెంట్‌ను పూర్తి చేయడానికి సిద్ధమైంది. సమంత వెనకడుగు వేయడంతో ఆమె పోటీదారులు 'కాజల్‌, తమన్నా' కొంత రిలాక్స్‌ అయ్యారు అని చెన్నైవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్‌ చిత్రం చెన్నైలో జరిగిన ఆడియో విడుదల వేడుకలో సమంత పాల్గొని అపోహలకు తెరదించారు.

వెనకబడ్డ వెంకటేష్‌

విక్టరీ వెంకటేష్‌ ప్రస్తుతం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, షాడో' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్‌ పూర్తిచేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. 'బాడీగార్డ్‌' తరువాత వెంకటేష్‌ చిత్రమేదీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. రెండు సంవత్సరాల క్రితం మాంచి ఊపుమీదున్న ఆయన ఈ మధ్య నెమ్మదించారు. తన సహచర నటులు బాలకృష్ణ, నాగార్జున చాలా స్పీడ్‌ మీదున్నారు. వారు ఎక్కువ చిత్రాలు అంగీకరిస్తూ మూడు, నాలుగు నెలలకు ఒక్కో చిత్రం పూర్తిచేస్తూ మళ్ళీ కొత్తవి కమిట్‌ అవుతున్నారు. వారి సమకాలికుడైన వెంకటేష్‌ మాత్రం ఈ విషయంలో చాలా వెనకబడి ఉన్నారని ఆయన సన్నిహితులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్యప్రధానమైన కుటుంబ కథా చిత్రాల కథానాయకుడుగా పేరున్న వెంకటేష్‌ కొంతవేగాన్ని పెంచితే బావుంటుందని పరిశ్రమ వర్గాలు సైతం అభిప్రాయపడుతున్నాయి.