21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

పదిలక్షల మందితో సమైక్యాంధ్ర మార్చ్

ఈ నెల 30వ తేదిన తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చేపట్టనున్న తెలంగాణ మార్చ్‌కు ధీటుగా తాము సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్ర ప్రదేశ్ రైతాంగ సమాఖ్య శుక్రవారం ప్రకటించింది.
తెలంగాణ మార్చ్ నిర్వహించే రోజునే తాము సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందుకు రాని వారిని సమైక్యాంధ్ర వ్యతిరేకులుగా గుర్తిస్తామని, తమకు మద్దతు పలికే వారిని వచ్చే సాధారణ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీలు రాజీనామా చేయాలని వారు పిలుపునిచ్చారు.  తెలంగాణ నేతలు లక్ష మందితో మార్చ్ చేస్తే తాము పదిలక్షల మందితో చేస్తామన్నారు.

యూపీఏకు ములాయం మద్దతు

ములాయం సింగ్ యాదవ్ యూపిఏ ప్రభుత్వాన్ని ఆపద సమయంలో ఆదుకున్నారు. యూపీఏ సర్కాకు బయట నుంచే మద్దతు ఇస్తామని సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ పేర్కొన్నారు. అయితే డీజిల్ ధర పెంపు, వంట గ్యాస్ పరిమితి, ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. మతతత్వ శక్తులు అధికారంలో రాకూడదనే యూపీఏకు మద్దతునిస్తున్నామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా శుక్రవారం ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ యూపిఏకి మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రజా వ్యతిరేక కేంద్ర విధానాలపై తాము ఉద్యమిస్తామన్నారు. 2014లో మూడో ఫ్రంట్‌దే విజయమని ధీమా వ్యక్తపరిచారు. ప్రస్తుతం మద్యంతరానికి అవకాశం లేదని ములాయింసింగ్ యాదవ్ తేల్చిచెప్పారు.


ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

ఆ డబ్బు ఎక్కడనుండి తేవాలి ?

ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను ఏ ప్రభుత్వమూ తీసుకోదని ప్రధాన మంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించడానికై ప్రధాని శుక్రవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని, ఇటువంటి పరిస్థితులలో క్లిష్టమైన నిర్ణయాలను కఠినంగా అమలు చేయకపోతే దేశం పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. యు.పి.ఎ. ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదని చెబుతూ ప్రభుత్వం కొనసాగింపునకు ఎటువంటి అవరోధాలూ లే వని ఆయన చెప్పారు.

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులవల్ల రైతులకు మేలు జరుగుతుందంటూ మాల్స్ వంటివి రావడంవల్ల ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. వైద్య, విద్య, తదితర ఉపాధి రంగాలలో అవకాశాలు పెరగడానికి వీలుగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. సంస్కరణలను అమలు చేస్తున్నది ఇందుకోసమేనని ఆయన చెప్పారు. సబ్సిడీల భారం ప్రభుత్వానికి పెరిగిపోతున్నదంటూ, ఖరీదైన కార్లు వినియోగించేవారికి డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.


ఆంధ్రజ్యోతి సౌజన్యంతో 

కేంద్రం "దింపుడు" కళ్ళెం

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్లపై ఇప్పటి వరకు వసూలు చేస్తూ వచ్చిన కస్టమ్, ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆరు సబ్సీడీ సిలిండర్ల తర్వాత బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే ఒక్కో సిలిండర్‌ ధరపై రూ.140 తగ్గనుంది. ఇది వంటగ్యాస్ వినియోగించే పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కో వంటగ్యాస్ సిలిండర్‌ను సబ్సిడీ ధర రూ.394కు చొప్పున అందజేస్తోంది. అదే బహిరంగ మార్కెట్‌లో అయితే ఈ ధర రూ.754గా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల సబ్సిడీకి ఇచ్చే వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను యేడాదికి ఆరింటికి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆపై సిలిండర్లు కావాలనుకునే వినియోగదారులు బహిరంగ మార్కెట్ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఏడో సిలిండర్ ధరపై రూ.140 తగ్గనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం శుక్రవారం ప్రకటించారు. అలాగే డీజిల్‌పై బీహార్ ప్రభుత్వం రెండు శాతం పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని మంత్రి స్వాగతించారు. అదేసమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సబ్సిడీకి వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా చేయాలని చిదంబరం కోరారు.