రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..పాఠశాలలకు శాపం
-గత ఏడాది ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు ఇచ్చిన కేంద్రం
-ఖర్చుల మార్గదర్శకాల జారీలో ఆర్‌ఎంఎస్‌ఏ తీవ్ర నిర్లక్ష్యం
- రెండుసార్లు మార్గదర్శకాలతో గందరగోళం..వస్తువుల కొనుగోళ్లలో ఆలస్యం
- మార్చిలోగా కేంద్రానికి చేరని యుటిలైజేషన్ సర్టిఫికెట్లు.. ఈ ఏడాది నిధుల్లో కోత భారీగా కోత
- ఒక్కో పాఠశాలకు రూ.35 వేల కోత.. రూ.15 వేలు విదిలింపు
రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు లేనేలేవు. ప్రయోగాలు చేయడమెలాగో పుస్తకాల్లో చదవడమే తప్ప, మెజార్టీ పాఠశాలల్లో విద్యార్థులకు బ్యూరెట్, పిప్పెట్, కొలజాడీలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. లైబ్రరీ అనే బోర్డు తప్ప పుస్తకాలను ఎరగరు. అనేక రాష్ట్రాల్లో ఈ దుస్థితిని గుర్తించిన కేంద్రం మూడేళ్ల కిందట ఉన్నత పాఠశాలలకు ఏటా కొన్ని నిధులివ్వడం మొదలుపెట్టింది. ఇచ్చిన నిధులను ఖర్చు చేసి కొనుగోలు చేసిన వస్తువులకు యూసీ(యుటిలైజేషన్ సర్టిఫికెట్)ను పాఠశాలలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 10,368 ఉన్నత పాఠశాలల నుంచి యూసీలను సేకరించి ఆర్‌ఎంఎస్‌ఏ రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారులు కేంద్రానికి ఆర్థిక సంవత్సరం చివర్లో కేంద్రానికి సమర్పించాలి. దీని ఆధారంగానే మరుసటి ఏడాదికి నిధులు విడుదలవుతాయి. గత ఏడాది గరిష్టంగా ఒక్కో పాఠశాలకు రూ.50 విడుదలైతే ఖర్చుపెట్టే విషయమై ఆర్నెళ్ల వ్యవధిలో రెండుసార్లు మార్గదర్శకాలను జారీ చేయడంతో వస్తువుల కొనుగోళ్లలో ఆలస్యమైంది. మార్చిలోగా యూసీలు సమర్పించకపోవడంతో 2013-14కు ఒక్కో పాఠశాలకు కేంద్రం కేవలం రూ.15వేలు మాత్రమే విడుదల చేసింది.అంటే ఈ ఏడాది కూడా రూ.50వేల చొప్పున లెక్కేస్తే రూ.36.34 కోట్లు కోతపడింది. పాఠశాలలకు ఎలాగూ నిధులివ్వని రాష్ట్ర సర్కారు, కేంద్రం నిధుల వినియోగంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించింది. అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్న పాఠశాలలకు సర్కారు నిర్లక్ష్యం శాపంగా మారింది.
గత ఏడాది రూ.50 వేలకు పెంపు
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు పాఠశాల అభివృద్ధి నిర్వహణ గ్రాం టు కింద కేంద్రం ఏటా వేలాది రూపాయలను 2010-11 నుంచి మంజూరు చేస్తోంది. రెండేళ్లుగా రాష్ట్రంలోని 10,368 ఉన్నత పాఠశాలలకు ఈ నిధులు మంజూరవుతున్నాయి. 2010-11లో మూడు నెలలకు ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.12, 112, అలాగే 2011-12లో ఒక్కో పాఠశాలకు ఏడాదికి రూ.34,250 ఇచ్చింది. ఈ గ్రాంటు చాలడం లేదని క్షేత్రస్థాయినుంచి ఫిర్యాదులు అందాయి. ఈ మొత్తాన్ని పెంచాలని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో 2012-13 నుంచి ఏటా రూ.50 వేలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు గత ఏడాది రాష్ట్రంలోని ఒక్కో ఉన్నత పాఠశాలలకు రూ.50 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇక ఉన్నత పాఠశాలల నిర్వహణకు ఢోకా లేదని భావిస్తున్న తరుణంలో తాజాగా ఒక్కో పాఠశాలకు కేంద్రం రూ.35,000ల కోత విధించింది. రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తోంది.
ఆరు నెలల తర్వాత మార్గదర్శిక సూత్రాల జారీ
కేంద్ర నిధులు మంజూరైన వెంటనే వాటిని ఎలా వినియోగించాలో సూచిస్తూ మార్గదర్శక సూత్రాలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ మన రాష్ట్ర అధికారులు దీనికి భిన్నంగా వ్యవహారించారు. 2012-13కు సంబంధించి ఒక్కో పాఠశాలకు రూ.50 వేలను గత ఏడాది మార్చిలో కేంద్రం విడుదలచేసింది. వీటి వినియోగానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారులు ఆగస్టులో జారీచేశారు. నిధులు మంజూరైన తర్వాత ఆర్నెళ్ల సమయం తీసుకున్నారు. ఈ నిధుల్లో ప్రయోగశాల పరికరాలకు రూ.25వేలు, లైబ్రరీ పుస్తకాలకు రూ.10 వేలు, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్‌నెట్, టెలిఫోన్‌చార్జీలకు రూ.15 వినియోగించాలని సూచించారు. ఆలస్యంగానైనా మార్గదర్శక సూత్రాలు విడుదలవడంతో వస్తువులు కొనుగోలుకు సిద్ధమవుతుండగానే కొత్త ఆదేశాలు వస్తాయంటూ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గ్రాంటు పాఠశాల ఖాతాల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది జనవరిలో ల్యాబ్ పరికరాలకు రూ.15వేలు, రూ.10వేలు ఆటలు, సాంఘికశాస్త్రం వస్తువులు, రూ.10వేలు లైబ్రరీ, రూ.15 నీరు, విద్యుత్తు, ఇంటర్‌నెట్, టెలిఫోన్ బిల్లులకు వినియోగించాలని ఆదేశాలు జారీ ఆయ్యాయి. తక్షణమే వస్తువులు కొనుగోలుచేసి యూసీలు సమర్పించాలంటూ ఆదేశించారు. దీంతో తక్కువ సమయంలో రూ.50వేలు వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. మెజార్టీ పాఠశాలలు కొనుగోలు చేసినా, యూసీలను మండల అధికారులకు సమర్పించలేకపోయారు. యూసీలు జిల్లాకు రాకపోవడం, అక్కడి నుంచి రాష్ట్ర ఆర్‌ఎంఎస్‌ఏకు చేరలేదు. ఫలితంగా మార్చిలోగా కేంద్రానికి యూసీలు సమర్పించలేకపోయారు.
ప్రతి పాఠశాలకు రూ.35వేల కోత
నిబంధనల ప్రకారం మార్చి-2013లోపే యూసీలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. ఒక ఏడాది యూసీలు మార్చిలోగా సమర్పిస్తే తదుపరి ఏడాదికి ఈ ఖర్చును పరిగణలోకి తీసుకుని నిధుల పెంపు, తగ్గింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో 2012-13 యూసీలు కేంద్రానికి చేరకపోవడంతో 2013-14 ఏడాదికి కనీస మొత్తంగా రాష్ట్రంలోని 10,368 ఉన్నత పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు రూ. 15వేలు మాత్రమే తాజాగా కేంద్రం విడుదలచేసింది. గత ఏడాదితో పొల్చితే ఒక్కో పాఠశాలకు రూ.35వేలు కోత పడింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా రూ.36.34 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చేతులు కాలాక అకులు పట్టుకున్నట్లు..కోట్లకు కోట్లకు కోతలు పడ్డాక ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులు ఈసారి తేరుకున్నారు. గత అనుభవం దృష్ట్యా వెంటనే మార్గదర్శక సూత్రాలు జారీచేశారు. రూ.15వేలల్లో రూ.5 వేలు లైబ్రరీ, రూ.10వేలను నీరు, విద్యుత్తు, ఇంటర్‌నెట్, టెలిఫోన్‌చార్జీలకు వినియోగించాలని (పొసీడింగ్‌నంబర్ 71/ ఆర్‌ఎంఎస్‌ఏ/ 2013 తేదీ 25-3-2013)ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఏడాది ఉన్నత పాఠశాలలు కనీస సౌకర్యాలు సమకూర్చుకోలేని దుస్థితి ఏర్పడింది.
(నమస్తే తెలంగాణ నుంచి )