6, అక్టోబర్ 2012, శనివారం

ప్రపంచ ఉత్తమ లిపుల్లో తెలుగు ఒకటి

ప్రపంచ ఉత్తమ లిపుల్లో తెలుగు ఒకటని, ప్రపంచంలోని అనేక ధ్వనుల్ని ఈ లిపిలో రాయవచ్చని, ప్రపంచంలోని అనేక భాషలకు లేని ఈ సదుపాయం తెలుగుభాషకు మాత్రమే వుందని మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన బ్యాంకాక్‌లోని 'ది ఇంటర్నేషనల్ ఆల్ఫబేట్ అసోసియేషన్' నిర్వహించిన రెండో ప్రపంచ లిపుల సదస్సులో పాల్గొని తెలుగు లిపిపై సమగ్రమైన పత్రాన్ని సమర్పించారు. కొరియాకు చెందిన 'ది ఇంటర్నేషనల్ ఆల్ఫబేట్ అసోసియేషన్' థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ సదస్సును నిర్వహించింది. 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన ఈ సదస్సులో 33 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి తెలుగు, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతి, ఉర్దూ, పంజాబీ తదితర భాషలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా, డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ తెలుగు లిపిపై పత్ర సమర్పణ చేశారు.

తెలుగు లిపి బ్రాహ్మీలిపి నుంచి పరిణామం పొందిందని, క్రీ.పూ.400 సంవత్సరాల నుంచి తెలుగు లిపి ఉనికి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలో క్రీ.పూ.3500 సంవత్సరాల నుంచి బ్రాహ్మీలిపి వుందని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మీలిపి నుంచే భారతీయ భాషలన్నీ తమ లిపిని రూపొందించుకున్నాయన్నారు. బ్రాహ్మీ, దక్షిణ బ్రాహ్మీ, శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, వేంగీ, చాళుక్య, కాకతీయ తదితర పేర్లతో తెలుగు లిపి ఆయా కాలాల్లో రూపాంతరం చెందుతూ వచ్చి తెలుగు లిపిగా స్థిరపడినట్లు ఆయన తెలుగు లిపి పరిణామాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రత్యేకతలను సభకు తెలియజేశారు. తెలుగు లిపి అందంగా వుండడమే కాకుండా, అనేక భాషల కన్నా ఎక్కువ ధ్వనులను రాయగలిగిన సామర్థ్యం వుందన్నారు. ఉచ్ఛారణా విధేయమైన లిపి కలిగిన భాషని ఆయన సోపపత్తికంగా నిరూపించారు.

తెలుగు భాషా పదాలు ఎక్కువ భాగం అచ్చులతో అంతమవ్వడం వల్ల భాషకు అందం వచ్చిందన్నారు. అచ్చు, హల్లు ఒకదానితో ఒకటి కలిసి ఒకే లిపి ద్వారా సూచితం కావడం వల్ల రాతలో వర్ణాల సంఖ్య తక్కువగా వుంటుందన్నారు. తెలుగు లిపి సాధారణంగా ఎడమవైపు నుంచి ప్రారంభమవుతుం దన్నారు. తెలుగు లిపిలో వర్ణాలు ఎక్కువగా కనిపించినప్పటికీ, ఒకే మాదిరిగా వున్న వర్ణాలు ఎక్కువగా వున్నందువల్ల నేర్చుకోవడం కష్టం కాదని, అదే సమయంలో ఉచ్చరించినట్లే రాసే అవకాశం వున్నందువల్ల సులభంగా నేర్చుకోవచ్చని అన్నారు. కాగా ఈ సదస్సులో సంపత్‌కుమార్ సమర్పించిన పత్రాన్ని ఉత్తమ పత్రంగా తొమ్మిదిమంది న్యాయనిర్ణేతలు, యాభైమంది పరిశీలకులు «ద్రువీకరించారు. కొరియా లిపికి మొదటి స్థానం లభించగా, తెలుగు లిపికి రెండవ స్థానం లభించడం విశేషం. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ... ఎన్నో భాషా మేధావులు సమర్పించిన పత్రాల్లో తెలుగుకు ద్వితీయ స్థానం రావడం సంతోషంగా వుందన్నారు.

కేసీఆర్‌ను ఇంతవరకు కలవని కోదండరాం

తెలంగాణ మార్చ్ విజయవంతమైన నేపథ్యంలో జేఏసీ చైర్మన్ కోదండరాం ఆ కార్యక్రమానికి సహకరించిన వారిని కలుస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఇంతవరకు కలవలేదు. ఉద్యమ నేతలిద్దరూ కలవని వైనం ఇటు టీఆర్ఎస్, అటు జేఏసీ వర్గాల్ల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ గతనెల 5న ఢిల్లీ వెళ్లారు. అంతకంటే ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు జేఏసీ సెప్టెంబర్ 30న మార్చ్ నిర్వహించింది. కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే.. ఆయన పాల్గొనకుండానే కోదండరాం ఆధ్వర్యంలో మార్చ్ విజయవంతమైంది. ఈనెల 3న కేసీఆర్ హైదరాబాద్ వచ్చారు.

మార్చ్ జయప్రదానికి సహకరించిన భాగస్వామ్య పక్షం బీజేపీతోపాటు, సంఘీభావం ప్రకటించిన సీపీఐ, తెలంగాణ నగారా సమితి నేతలను కోదండరాం బృందం రెండు రోజులుగా కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు. మిగిలిన వారిని కలిసినట్టే టీఆర్ఎస్ అధ్యక్షుడినీ కలవటానికి కోదండరాం బృందం ప్రయత్నించినట్టు సమాచారం. "కోదండరాం, ఇతర ముఖ్య నేతలందరం నివాసానికి వస్తామం''టూ జేఏసీ కన్వీనర్ కె.స్వామిగౌడ్ గు రువారం కేసీఆర్ తోడల్లుడి తనయుడు జోగిన్‌పల్లి సంతోష్‌కుమార్ ద్వా రా కేసీఆర్‌కు కబురు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ "కలుద్దాంలే'' అని బదులిచ్చారు.

కేసీఆర్ అపాయింట్‌మెంట్ స మాచారం టీఆర్ఎస్ శిబిరం నుంచి జేఏసీకి శుక్రవారం రాత్రి వరకు అం దలేదు. మరోవైపు ఆయన మధ్యాహ్నమే మెదక్ జిల్లా ఫామ్ హౌస్‌కి వెళ్లారు. ఈమేరకు ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. "కేసీఆర్‌ను కలవటానికి టైం అడిగాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఆయనే కలుస్తారులే అని ఊరుకున్నాం'' అని జేఏసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. మరోవైపు కోదండరాం, కొంత మంది జేఏసీ నేతలపై టీఆర్ఎస్‌లో ఆగ్రహం చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

జేఏసీ చైర్మన్ పదవి నుంచి కోదండరాంను తప్పించి స్వామిగౌడ్‌ను కూర్చోబెట్టాలనే కేసీఆర్ వ్యూహం.. జేఏసీలోని మిగిలిన పక్షాల ప్రతి వ్యూహంతో బెడిసికొట్టింది. పరకాల ఉప ఎన్నికలతో వారి మధ్య వైరుధ్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. కోదండరాం, కేసీఆర్ ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అనివార్య పరిస్థితుల్లో గులాబీ నేతలు తెలంగాణ మార్చ్‌కు చివరి దశలో మద్దతు ప్రకటించారు. మార్చ్‌కు జన సమీకరణ చేసిన టీఆర్ఎస్ నేతలకు వేదికపై తగిన ప్రాధాన్యం లభించకపోవటం కోపం తెప్పించింది.

హరీశ్‌రావును ఉద్దేశించి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ పై విమలక్క చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు మా ర్చ్ మధ్యలోనే వెనుదిరిగారు. ఈక్రమంలో జేఏసీ భాగస్వామి అయిన న్యూడెమోక్రసీ నేతలను కేసీఆర్ గురువారం తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడినప్పుడు కూడా.. కోదండరాం తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. అయినా కోదండరాం, కేసీఆర్ రాబోయే రోజుల్లో ముఖాముఖి సమావేశమవుతారా? లేదా? కనీసం జేఏసీలోని మిగిలిన నేతలతో అయినా కలిసి వారిద్దరు భేటీ అవుతారా ? అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.