27, సెప్టెంబర్ 2012, గురువారం

బాబు ముస్లిం సాధికారిక విధాన0

ముస్లింల సాధికారిక విధానాన్ని(ఎంపవర్‌మెంట్ పాలసీ) తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు గురువారం ప్రకటించారు. శాసనసభలో ముస్లింలకు 15 ఎమ్మెల్యేల సీట్లు రీజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ముస్లిం మహిళలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు.

నిరుద్యోగ మైనారిటీ యువతకు స్వయం ఉపాధి పథకాలు, ముస్లింల ఆర్థికాభివృద్ధికి, సామాజికభ్యున్నతికి వీలుగా వార్షిక బడ్జెట్‌లో రూ. 2,500 కోట్లు కేటాయించాలని చంద్రబాబు నాయుడు మైనారిటీ విధాన నిర్ణయంగా ప్రకటించారు.

హైదరాబాద్‌లో నిషేధాజ్ఞలు

ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో ప్రభుత్వం నగరంలో హైఅలర్ట్ ప్రకటించింది. నగరమంతటా నవంబర్ 18 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ సీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.

రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలను కూడా ఈ నిషేధాజ్ఞల పరిధిలో చేర్చారు. నగరంలో ఎక్కడా సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకోలు జరుపరాదని నిషేధాజ్ఞల్లో పేర్కొన్నారు.

వ్యతిరేకత విషయం ఆజాద్‌కు తెలియదట

 బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల విభజన సమయంలో వ్యతిరేకత వచ్చిన విషయం ఆజాద్‌కు తెలియదని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గొంటానని, నాయకత్వం వహిస్తానని పేర్కొన్నారు.
తెలంగాణపై ఏకాభిప్రాయం అవసరమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఏ అంశంపైనా ఏకాభిప్రాయం సాధ్యం కాదని ఆయన తెలిపారు.

మార్చ్‌కు ప్రభుత్వం వ్యతిరేకం కాదు

రత్యేక తెలంగాణపై రాష్ట్రంలో ఏకాభిప్రాయం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లోనే తెలంగాణపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. విభజనపై తీవ్ర వ్యతిరేకత వస్తోందని, ఏకాభిప్రాయం ద్వారానే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నిర్ణయంపై కేంద్రానికి గడువు విధించలేమని, స్వేచ్చగా నిర్ణయం తీసుకునేందుకు కేంద్రానికి అవకాశం ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అన్ని పార్టీలతో కేంద్రం చర్చించాల్సి ఉందన్నారు.

చిత్రసీమకు వరాల పంట విఠలాచార్య

జానపద చిత్రాలే విఠలాచార్యకు మంచిపేరు తెచ్చాయి. జానపదాలకు భక్తినిగాని ఫాంటసీ గాని మేళవించి ఆకట్టుకునేలా తీశారు. సాంఘిక చిత్రాలు రూపొందించి అదే విధమైన పేరు తెచ్చు కోవాలని కృషి చేసినా ఆయనకు అచ్చిరాలేదు. కాంతారావుతో రూపొందించిన తొలి సాంఘిక 'కన్యాదానం' చలం, కృష్ణకుమారితో 'వద్దంటే పెళ్లి' తీశారు. ఆ తర్వాత 'పెళ్లి మీద పెళ్లి' అన్నా చెల్లెలు, చిత్రాలు చాలాకాలం తర్వాత అక్కినేనితో రూపొందించిన 'బీదలపాట్లు' వంటి సాంఘిక చిత్రాలు ఇందుకు ఉదాహరణ.

ఫొటోగ్రఫీ జిమ్మిక్సూ, గ్రాఫిక్సూ తెలియని కాలంలో దెయ్యాలూ భూతాలు లాంటి అభూత కల్పనలతో, చిత్రవిచిత్రమైన ప్రయోగాలతో సినిమాలు రూపొందించిన విఠలాచార్య గురించి ఎంత చెప్పినా తక్కువే. అద్భుతమైన 'వైర్‌ వర్క్‌'ని తనదైన శైలిలో జానపద చిత్రాల్లో చూపిస్తూ అచ్చెరువొందేలా చేశారు బి. విఠలాచార్య. కన్నడ దేశస్తుడు అయినప్పటికీ తెలుగు చిత్రాల నిర్మాణం చేపట్టారు. దర్శకత్వంలో అపురూపమైన మెలకువలు చూపారు. మాతృభాష కన్నడంలో కేవలం అయిదు చిత్రాలే డైరెక్టు చేశారాయన.
హీరో ప్రముఖుడైనప్పుడు ఆయన్ని ఎలా చూపించినా, ఎన్ని సాహసాలు చేయించినా అందులోని లోపాలను ప్రేక్షకులు పట్టించుకోరని, అదే తన టెక్నిక్‌ అని చెప్పేవారాయన. ఆర్టిస్టుల రెమ్యూనరేషన్‌ పెరగడానికి, పెంచడానికి కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. ఏ నిర్మాత అయినా అలా తన చిత్రాల్లో నటించే వారికి పారితోషికం పెంచుతున్నారని తెలిస్తే వారితో వాదించి పారితోషికం పెంచకుండా అడ్డుకునేవారు. అలానే ఆర్టిస్టు కనుక సహకరించకపోయినా లేదా తన పంథాను విమర్శిస్తున్నట్లు తెలిసినా సినిమాలో కథను మార్చేసి శాపగ్రస్తుడిగా చేసి చిలుకగానో, పాముగానో, రాయిగానో మార్చేసేవారని విఠలాచార్య గురించి తెలిసిన సన్నిహితులు చెప్తుంటారు.
జానపద చిత్రాలే విఠలాచార్యకు మంచిపేరు తెచ్చాయి. జానపదాలకు భక్తినిగాని ఫాంటసీ గాని మేళవించి ఆకట్టుకునేలా తీశారు. సాంఘిక చిత్రాలు రూపొందించి అదే విధమైన పేరు తెచ్చుకోవాలని కృషి చేసినా ఆయనకు అచ్చిరాలేదు. కాంతారావుతో రూపొందించిన తొలి సాంఘిక 'కన్యాదానం' చలం, కృష్ణకుమారితో 'వద్దంటే పెళ్లి' తీశారు. ఆ తర్వాత 'పెళ్లి మీద పెళ్లి' అన్నా చెల్లెలు, చిత్రాలు చాలాకాలం తర్వాత అక్కినేనితో రూపొందించిన 'బీదలపాట్లు' వంటి సాంఘిక చిత్రాలు ఇందుకు ఉదాహరణ. విఠలాచార్య వాస్తును, జాతకాలను, గ్రహాలను ఎక్కువగా నమ్మేవారు. సినిమా పూజా కార్యక్రమాల్లో ఎవరైనా సరిగా కొబ్బరికాయ కొట్టకపోతే వంకరగా పగులుతుందేమో, అలా పగిలితే సినిమాకి విఘాతం కలుగుతుంది అని గాఢంగా విశ్వసించేవారు.
జయవిజయ, వరలక్ష్మి వ్రతం, ఖైదీ కన్నయ్య, మదన కామరాజు కథ, గురువును మించిన శిష్యుడు. నవగ్రహ పూజామహిమ, జ్వాలాద్వీప రహస్యం, అగ్గిదొర, ఇద్దరు మొనగాళ్లు, చిక్కడు దొరకడు, పేదరాశి పెద్దమ్మ కథ, భలే మొనగాడు, బందిపోటు, అగ్గిపిడుగు, మంగమ్మ శపథం, అగ్గిబరాటా, గండికోట రహస్యం, లక్ష్మీకటాక్షం, అలీబాబా 40 దొంగలు, జగన్మోహిని - మొదలైన చిత్రాలు విఠలాచార్య రూపొందించినవే. 'కదలి వచ్చిన కనకదుర్గ' ఆయన రూపొందించిన చివరి చిత్రం. ఆరోజుల్లో ఇప్పటిలా టెక్నాలజీ లేదు. అయితేనేం అభూత కల్పనలతో కూడిన ఫాంటసీ చిత్రాలు రూపొందించి గొప్ప టెక్నిక్‌ కనబరిచారు. విఠలాచార్య చిత్రసీమకు వరాలపంట అంటే అతిశయోక్తి కాదు.
- వి.ఎస్‌.కేశవరావ్‌

పెళ్లి ఉత్తరం

ఆదివారం అంటే గవర్నమెంట్‌ ఉద్యోగస్తులకు తెగ ఆనందం. ప్రతిరోజూ ఆఫీసులో చేసేది ఏమీలేనప్పటికీ, విధిగా ఆదివారం మాత్రం ఎంజాయ్‌ చేయాలనే ఉద్దేశంతో ఉన్న అనేకమందిలో సత్యమూర్తి ఒకరు. మార్నింగ్‌ ఇంట్లో పేపర్‌ చదువుతూ కాఫీ తాగుతు న్నాడు. భార్యతో సండే ప్రోగ్రామ్స్‌ గురించి చర్చించాడు. 'సండే రోజున ఎవరైనా పెళ్ళికి పిలిస్తే బావుండు. ఎంచక్కా భోజన ఖర్చులు కలిసివచ్చేవి అనుకున్నాడు' మనసులో. ఇంతలో కాలింగ్‌ బెల్‌ మోగింది. ''సండే నాడు ఎవరా అనుకుంటూ'' విసుగ్గా తలుపుతీశాడు. ఎదురుగా కొరియర్‌ బాయ్‌ చిరునవ్వులు చిందిస్తూ ''గుడ్‌మాణింగ్‌ మీకు కొరియర్‌ వచ్చింది'' అంటూ సిన్సియర్‌గా చెప్పాడు.

కొరియర్‌ అనగానే సత్యమూర్తి కళ్ళలో మెరుపు మెరిసింది. అనారోగ్యంతో ఉన్న తన అత్తయ్య ఢమాల్‌మని కొంతకాలమైంది. ఆస్తి కాగితాలు పంపిందేమో అనుకుంటూ కొరియర్‌ ఇచ్చిన కవర్‌ ఆతృతగా విప్పబోయాడు. ప్రమాదాన్ని శంకించిన కొరియర్‌ బాయ్‌ టక్కున మూర్తి చేతిలోని కవర్‌ లాక్కున్నాడు. మూర్తి వంక అనుమానంగా చూశాడు. ''సత్యమూర్తి అంటే నిజంగా మీరేనా?'' డౌట్‌తో అడిగాడు.
''అవునవును ఎందుకలా అడిగావ్‌?''
''సైన్‌ చేయకుండా కవర్‌ చించేస్తుంటే అనుమానం వచ్చింది. ఎందుకైనా మంచిది మీ ఐడీ కార్డు చూపించండి'' అంటూ కవర్‌ను వెనక దాచేసుకున్నాడు.
సత్యమూర్తికి ఆవేశం వచ్చేసింది. తమాయించుకున్నాడు. తానే తొందరపడినట్టు గ్రహించాడు. కూల్‌గా ''చూడు మిస్టర్‌.. జస్ట్‌ కవర్‌లో ఏముందో చూడాలనే టెన్షన్‌తో అలా చేశానన్నమాట. అందుకే చింపబోయాను. నిజంగా నేనే సత్యమూర్తినయ్యా, కావాలిస్తే నేమ్‌బోర్డు చూడు'' అంటూ గోడకున్న తన నేమ్‌బోర్డును చూపించాడు. దాంతో కొరియర్‌ బాయ్‌ శాంతించాడు. సంతకం తీసుకుని, కవర్‌ ఇచ్చేశాడు. బాయ్‌ వీధి మలుపు తిరిగాక, కవర్‌ ఓపెన్‌ చేశాడు. అందులో మూర్తి ఆశించినట్టు ఆస్తి కాగితాలు లేవు. శుభలేఖ ఉంది. ఫ్రమ్‌ అడ్రస్‌ చూశాడు. తన బంధువు.. వరుసకు బాబాయ్‌ అవుతాడు. అతని కుమారుడి పెళ్ళి అని అర్థమైంది. భర్తచేతిలో శుభలేఖ చూసి ఆనందంగా దగ్గరకు వచ్చింది భార్య ప్రసూన. ''పెళ్ళి ఎవరిదండీ.. మొన్న కొనుక్కున్న పట్టుచీర కట్టుకుంటాను'' అని ఆతృతగా అంది.
సత్యమూర్తి మాత్రం ఎలాంటి భావాలు పలికించకుండా ఉన్నాడు. దానికి కారణం శుభలేఖతో పాటుగా కనిపించిన లెటర్‌. శ్రీమతి అండ్‌ శ్రీ అని ప్రింట్‌ చేసివుంది. ఆ పక్కన సత్యమూర్తి పేరును పెన్నుతో రాశారు. మిగతా మ్యాటర్‌ మొత్తం ప్రింటింగ్‌లో ఉంది. శుభలేఖతో పాటుగా ఇలాంటి లెటర్‌ రావడం ఆశ్చర్యం కలిగించింది. ప్రసూన కూడా సేమ్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి ''లెటర్‌ ఏమిటండీ?'' ఉండబట్టలేక అడిగేసింది.
''నేనూ అదే చూస్తున్నాను. సరే లెటర్‌ చదివి చెబుతాను'' అంటూ కుర్చీలో రిలాక్స్‌డ్‌గా కూర్చుంటూ అన్నాడు.
''నో నో నేను కూడా చదువుతాను. శుభలేఖతో లెటర్‌ అంటే టీవీ సీరియల్‌లో ఉన్నంత ట్విస్ట్‌ ఉందనిపిస్తోంది. 'చావులేఖా.. శుభలేఖా' సీరియల్లో హీరోయిన్‌ ఇలాగే చేసిందండి..''
''అబ్బ ఇప్పుడు కూడా సీరియల్స్‌ గురించేనా కాస్త కుదురుగా ఉండు లెటర్‌ చదివేస్తాను'' విసుగ్గా అన్నాడు మూర్తి.
''మళ్ళీ మాట తప్పుతున్నారండీ ఇద్దరం కలిసి చదువుదాం నాకు టెన్షన్‌గా ఉంది''
భార్య తన మాట వినదని గ్రహించిన సత్యమూర్తి ఎప్పటిలాగే కాంప్రమైజ్‌ అయ్యాడు. ''సరే ఇద్దరం కలిసే చదువుకుందాం. కాస్త కాఫీ తీసుకురా''
భర్త ఎత్తుగడ తెలిసిన ప్రసూన ''అబ్బ ఆశ.. కాఫీ తేవడానికి నేను వెళ్ళగానే మీరు లెటర్‌ చదివేస్తారు. ఆ పప్పులేం ఉడకవ్‌. నిజంగా కాఫీ కావాలంటే ఆ లెటర్‌ ఇటు ఇచ్చేయండి. కాఫీతో వచ్చాక ఇస్తాను''
ఇకలాభం లేదనుకున్నాడు సత్యమూర్తి. ''సరే మనిద్దరి డిస్కషన్‌ వల్ల ఆల్‌రెడీ హాఫెనవర్‌ వేస్ట్‌ అయింది'' అంటూ ఇద్దరు కలిసి లెటర్‌ చదవడానికి ఉపక్రమించారు.
''శ్రీ, శ్రీమతి సత్యమూర్తిగారికి నమస్కారాలు. శుభలేఖలో నా పెళ్ళి డీటెయిల్స్‌ ఉన్నాయి. నెక్ట్స్‌ సండే నా పెళ్ళి...'' అని చదువుతూ, మధ్యలో ఆపి, భార్యవంక చూసి ''వచ్చే ఆదివారం మనకు ఫుడ్‌ ఖర్చు తగ్గిందే. ఎంచక్కా పెళ్ళికి వెళ్ళిరావచ్చు'' అన్నాడు మూర్తి.
లెటర్‌ చదువుతుంటే మధ్యలో బ్రేక్‌ వేయడం నచ్చలేదు ప్రసూనకు. ''అబ్బ ఎప్పుడూ తిండిధ్యాసే మీకు. ముందు లెటర్‌ కంటిన్యూ చేయండి'' అన్నది.
మూర్తి కంటిన్యూ చేయసాగాడు. ''నేడు అందరూ బిజీగా ఉంటున్నారు. వారి పర్సనల్‌ లైఫ్‌ను డిస్టర్బ్‌ చేయడం నాకు ఇష్టం ఉండదు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో కూడా ఇంతే. దాన్నే నేను ఫాలో అవుతున్నాను....'' మళ్ళీ మూర్తికి డౌట్‌ వచ్చింది. 'ఇంతకీ వీడు ఏం చెప్పబోతున్నాడు?' అనే అనుమానం వ్యక్తపరుస్తూ భార్య వైపు చూశాడు.
ప్రసూన కళ్ళు మిటకరించడంతో సిన్సియర్‌గా లెటర్‌ చదవడం కంటిన్యూ చేయసాగాడు. ''...అందువల్ల నేను పెళ్ళికి పిలిచానని భావించవచ్చు. పిలిచి మీ పర్సనల్‌ టైమ్‌ వేస్ట్‌ చేయలేను. అందుకే జస్ట్‌ నేను పెళ్ళి చేసుకుంటున్న విషయాన్ని మాత్రమే మీకు ఇన్‌ఫామ్‌ చేస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్‌, కజికిస్థాన్‌లో కూడా ఇలాగే ఇన్‌ఫామ్‌ చేస్తుంటారు. అందుకే నేను మీకిలా తెలియజేస్తున్నాను...'' లెటర్‌ చదువుతున్న సత్యమూర్తి ఫేసులో రంగులు మారసాగాయి. భర్త ముఖంలో రంగుమారడం ప్రసూనకు తెగ ఆనందం కలిగింది. ''ఏవండేవండీ మీ ఫేస్‌ బ్లాక్‌ కలర్‌ నుండి రోజ్‌ కలర్‌కు మారుతోంది. అబ్బ తెగ ముద్దొస్తోంది. కనీసం మన పెళ్ళి రోజైనా ఇలా రోజ్‌ కలర్‌లో కనిపించవచ్చుకదా!'' మురిపెంగా అడిగింది. ఊసరవెల్లిలా భర్త కలర్స్‌ మార్చడం ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
సత్యమూర్తి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. లెటర్‌ లోని విషయాలే చిత్రంగా అనిపిస్తూ, ప్రమాదసూచికను తెలియజేస్తున్నాయి. ధైర్యం తెచ్చుకుని లెటర్‌ కంటిన్యూ చేయసాగాడు ''...అందువల్ల జస్ట్‌ శుభలేఖ ద్వారా నా పెళ్ళి విషయాన్ని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అయితే నా పెళ్ళి చూడాలని మీకు తెగముచ్చటగా ఉండవచ్చు. అందుకే పెళ్ళైన మరుక్షణమే వీడియోను యూ ట్యూబ్‌లో పెడతాను. ఇంకా నా బ్లాగ్‌లో కూడా ఉంటుంది. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ డాట్‌ సర్వం బ్లాగ్‌స్పాట్‌లో చూడండి. వన్‌ వీక్‌ తర్వాత మీ ఇంటికి కొరియర్‌లో మా పెళ్ళి సీడీ పంపిస్తాను...'' లెటర్‌ చదువుతున్న సత్యమూర్తి చేతులు వణికాయ్‌. కోపం హండ్రెడ్‌ డిగ్రీలకు చేరుకుంది. భర్తతో పాటుగా లెటర్‌ ఫాలో అవుతున్న ప్రసూనకు కూడా కోపం వచ్చినా అది కొద్దిసేపే. ''ఏవండీ ఈ ఐడియా బావుంది కదూ... మనబ్బాయిలకు కూడా ఇదే ఫాలో అవుదామా'' ఉత్సాహంగా అడిగింది. భార్య అడిగిన ప్రశ్నతో సత్యమూర్తి కోపం ఒక్కసారిగా జీరో డిగ్రీలకు పడిపోయింది. లెటర్‌ పూర్తిగా చదివేశాక తన నిర్ణయం ప్రకటిద్దామనుకున్నాడు. ''....మా పెళ్ళి సీడీ చూశాక సేమ్‌ బ్లాగ్‌కు మీ అభిప్రాయాలను పోస్ట్‌ చేయండి. పెళ్ళికి రాలేదని, గిఫ్ట్‌లు ఇవ్వలేదని, పెళ్ళి భోజనం చేయలేదనే బాధ మీలో ఉంటుందని నాకు తెలుసు. అందుకే మీరు ఇవ్వాల్సిన గిఫ్ట్‌లకు ఒక సౌకర్యం ఏర్పాటు చేశాను. డీటెయిల్స్‌ నా బ్లాగ్‌లో ఉంటాయి. ఇక పెళ్ళి భోజనం చేసే వీలు కూడా కల్పించాను. శుభలేఖతో పాటుగా నాలుగు భోజనం టికెట్స్‌ పంపిస్తున్నాను. ఇవి నాలుగువారాలు చెల్లుబాటులో ఉంటాయి. మీరెప్పుడైనా అమీర్‌పేట్‌ వచ్చినపుడు అక్కడ మెస్‌లో ఈ భోజనం టికెట్స్‌ ఇచ్చి భోంచేయండి. ఇట్లు మీ వీధేయుడు సూర్యనారాయణమూర్తి'' అని ఉంది. లెటర్‌ పూర్తిగా చదివాక సత్యమూర్తి, ప్రసూన దంపతుల ముఖంలో మల్టిdకలర్స్‌ కనిపించసాగాయి. శుభలేఖ వంక దానివెంట వచ్చిన లెటర్‌ వంక వారిద్దరూ ఎగాదిగా చూడసాగారు.


''శ్రీ, శ్రీమతి సత్యమూర్తిగారికి నమస్కారాలు. శుభలేఖలో నా పెళ్ళి డీటెయిల్స్‌ ఉన్నాయి. నెక్ట్స్‌ సండే నా పెళ్ళి...'' అని చదువుతూ, మధ్యలో ఆపి, భార్యవంక చూసి ''వచ్చే ఆదివారం మనకు ఫుడ్‌ ఖర్చు తగ్గిందే. ఎంచక్కా పెళ్ళికి వెళ్ళిరావచ్చు'' అన్నాడు మూర్తి.
లెటర్‌ చదువుతుంటే మధ్యలో బ్రేక్‌ వేయడం నచ్చలేదు ప్రసూనకు. ''అబ్బ ఎప్పుడూ తిండిధ్యాసే మీకు. ముందు లెటర్‌ కంటిన్యూ చేయండి'' అన్నది.

- రామనారాయణరాజు

వైకాపా నిర్లక్ష్యం గిరిజనుల నిలదీత

భద్రాచలంలో బుధవారం జరిగిన వైకాపా నియోజకవర్గ సమావేశంలో తిరుగుబాటు గళం పెల్లుబికింది. గతంలో మాదిరిగానే ఈ సమావేశంలో కూడా వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఒకే సామాజిక వర్గానికి జిల్లా నాయకత్వం కొమ్ముకాస్తుందంటూ గిరిజనులు ఎదురుదాడికి దిగారు. గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీలో సముచిత స్థానం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ గిరిజనులు జిల్లా నాయకత్వాన్ని నిలదీశారు. ఈ సమయంలో జిల్లా కన్వీనరు పువ్వాడ అజయ్‌కుమార్‌కు, వివిధ మండలాలకు చెందిన గిరిజన నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటు చేసుకుంది. సభా వేదికపైకి ఒకే వర్గానికి చెందిన నాయకులను పిలిచి గిరిజనులను వేదికపైకి పిలవకుండా కించపరిచారంటూ సమావేశంలో నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వివాదంకు దిగిన గిరిజన నాయకులపై జిల్లా నాయకులు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీంతో డివిజన్లో భద్రాచలం, చింతూరు మండలాల్లో వైకాపా కోసం కష్టపడుతున్నగిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చూస్తున్నారని జిల్లా నాయకత్వాన్ని ఆ మండలానికి చెందిన పలువురు గిరిజన నాయకులు నిలదీశారు. దీంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళ వాతావరణం చోటు చేసుకొంది. కష్టపడుతున్న వారిని విస్మరించి ఒక సామాజిక వర్గానికి జిల్లా నాయకత్వం కొమ్ముకాస్తుందంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. అలాగే డివిజన్‌స్థాయిలో జరిగే పార్టీ కార్యక్రమాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఆందోళనకారులను జిల్లా నాయకులు సర్ది చెప్పేందుకు పలుమార్లు ప్రయత్నించారు.

కేసీఆర్ తీరుపై జగన్ అసంతృప్తి

తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటే ఢిల్లీలో కేసీఆర్ ఏమి చేస్తున్నారని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ అన్నారు. కేసీఆర్ తీరుపై జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి వచ్చి తెలంగాణ మార్చ్ విజయవంతం చేయడానికి కృషి చేయాలని కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. అంతేకాక తెలంగాణ మార్చ్‌ను విజయవంతం చేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. అంతేకాక తెలంగాణపై తాజాగా చంద్రబాబు లేఖ ఇవ్వడాన్ని డ్రామా కొట్టిపడేశారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని జగన్ విమర్శించారు.

టీడీపీకి బైరెడ్డి బై.. బై..

తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కానీ రాయలసీమ అంటే ఎందుకు చంద్రబాబుకు లెక్కలేనితనం ఉందోనని బైరెడ్డి మండిపడ్డారు. బాబుకు సలహాలు ఇస్తున్నవారు పార్టీని ముంచడానికే తప్ప, పెంచడానికి కాదని టీడీపీ నేతలను విమర్శించారు.

తనకు రాజకీయాల కన్నా రాయలసీమ ప్రయోజనాలే ముఖ్యమని బైరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు అవ్వడానికి రాయలసీమను ఉపయోగించుకుంటున్న నేతలు ఆ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ నాలుగు జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 40 రోజులపాటు రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర చేస్తానని ఆయన తెలిపారు.

వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ప్రవీణ్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి లేఖ రాయడంపై ఆ పార్టీ సీమాంధ్ర నేతల్లో చిచ్చురేపుతోంది. తంబళ్లపల్లి టీడీపీ శాసనసభ్యుడు ప్రవీణ్‌రెడ్డి చంద్రబాబు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమవాసి అయ్యిండి ఇలా లేఖ రాయడం సరికాదని అన్నారు. టీడీపీ అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. లేదంటే టిడిపి పేరును తెలంగాణ దేశంగా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.

మార్చ్ అంటే సీమాంధ్రులపై పరోక్షంగా దాడి జరిపుతున్నట్లే ప్రవీణ్‌రెడ్డి అన్నారు. అలాంటి మార్చ్‌కి తమ సహచర తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మద్దతివ్వడం దారుణమన్నారు. తెలంగాణపై పార్టీ ఇచ్చిన లేఖను నిరసిస్తూ తాను ఆయన నిర్వహించబోయే పాదయాత్రలో నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. టిడిపి అంటే తెలంగాణ దేశం పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.  కాగా ప్రవీణ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకు తగిన కారణం దొరకక ఇంతకాలం అగినట్లు తెలిసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానికి రాసిన లేఖ కారణంగా చూపుతూ పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు తెలియవచ్చింది. 

సచివాలయానికి తాళం... ప్రభుత్వం అదేశాలు

తెలంగాణసెగ రాష్ట్ర సచవాలయానికి తాకింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ రాజకీయ జేఏపీ పిలుపు మేరకు ఈనెల 30న తెలంగాణ మార్చ్ జరుగనున్న నేపథ్యంలో సచివాలయంపై దాడులు జరిగే అవకాశం ఉన్నందున, పోలీసుల ఉత్తర్వుల మేరకు 29, 30 ఈ రెండు రోజులు సెలవుగా ప్రకటిస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. అలాగే సచివాలయం ప్రాంగంలో ఐదుగురు గుమిగూడి ఉండకుండా 144 సెక్షన్‌ను అధికారులు విధించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు

ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోటా ఆన్‌లైన్ విధానం పిటిషన్‌పై సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. అన్‌లైన్ అడ్మిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధిస్తూ గురువారం సుప్రీం తీర్పు నిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు విచారణ జరిపిన సుప్రీం కోర్టు విద్యా సంవత్సరం మధ్యలో నిబంధనలు మార్చడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది.

కావాలంటే వచ్చే సంవత్సరం నుంచి ఆన్‌లైన్ విధానం అవలంభించ వచ్చని సూచించింది. ఇంజినీరింగ్ అడ్మిషన్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఆన్‌లైన్ విధానంపై దాఖలైన కేసులో తీర్పునిస్తూ ఆన్‌లైన్ విధానం చెల్లదని ప్రభుత్వాన్ని తప్పుబడుతూ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో పైతీర్పు వెలువడింది.