5, అక్టోబర్ 2012, శుక్రవారం

జగన్‌కు జైలే

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారత అత్యున్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీం కోర్టు శుక్రవారం జగన్‌కు బెయిల్‌ను నిరాకరించింది. ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. సిబిఐ తరఫు న్యాయవాది.... దర్యాఫ్తు కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఆయన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని, కాబట్టి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందన్నారు. బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందన్నారు. తాము నాలుగు ఛార్జీషీట్లలో మూడువేల అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు. జగన్ విచారణకు సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించి, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.



వేల కోట్లని చెప్పి రూ.74 కోట్లకు లెక్క

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచారని చెప్పి రూ.74 కోట్లకు మాత్రమే సిబిఐ లెక్క చెప్పిందని జగన్ తరఫు న్యాయవాది సుబ్రహ్మణ్యం శుక్రవారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదించారు. ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభమైంది. జగన్ అరెస్టు అక్రమమని చెప్పారు. జగన్ నేరస్తుడు అని చెప్పడానికి సిబిఐ ఇంత వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. అరెస్టు చేసి 130 రోజులు దాటిందని, అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాది  అన్నారు. ఒక పార్టీ అధినేత  జైలులో ఉండటం సరికాదన్నారు.

పన్నులు లేని భారతదేశం

అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని కర్ణాటక లోకాయుక్త మాజీ జస్టిస్ సంతోష్ హెగ్డే పేర్కొన్నారు. స్వాతంత్య్రం సాధించిన 65 ఏళ్లలో దేశంలో 74 కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. ప్రతి కుంభకోణం ఒక రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగానే ఉందన్నారు. స్విస్ బ్యాంక్‌లో దాచిన కోటి నాలుగులక్షల బిలియన్ల అమెరికన్ డాలర్లను భారతదేశానికి తిరిగి తీసుకురాగలిగితే 24 గంటల్లో దేశానికి ఉన్న అప్పును తీర్చేయచ్చన్నారు. పన్నులు లేని భారతదేశంగా తీర్చి దిద్దొచ్చన్నారు. కామన్‌వెల్త్ క్రీడల్లో రూ. 70వేల కోట్ల మేర అవినీతి జరిగితే ప్రశ్నించేవారే లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచి ప్రైవేట్‌వైపు వెళ్లే విధంగా నాయకులే ప్రోత్సహిస్తున్నారన్నారు. అన్నా హజారే బృందం అవినీతిని నిర్మూలించలేకపోయినా అవినీతి గురించి ప్రశ్నించే ఒక వేదికను అందించిందన్నారు.

దోపిడీదార్లను ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు

రానున్న ఎన్నికల్లో దొంగలను ఎమ్మెల్యేలుగా, దోపిడీదార్లను ఎంపీలుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి . జగన్ జైలుకెళ్లి వంద రోజులు గడిస్తే ఆ పార్టీ కార్యకర్తలు శత దినోత్సవాలను జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు దమ్ముంటే సోనియాగాంధీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో పదవులకు రాజీనామా చేయాలని అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దానంతటదే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని , ప్రభుత్వంలో ప్రాంతీయ, నాయకత్వ విబేధాలు ఏర్పడి ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సఖ్యత కొరవడి ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారన్నారు.

ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్‌తో టీఆర్ఎస్‌ను, జగన్‌ను జైలు నుంచి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన  కాంగ్రెస్‌  టీడీపీని బలహీనపర్చేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు.

ప్యాకేజీ కోసం కేసీఆర్ ఆరాటం:ఎర్రబెల్లి

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఇన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేశారని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్,   ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.   టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై తెలంగాణ ప్రాంతంలో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపానని కేసీఆర్ ప్రకటించుకోవడం తగదని విమర్శించారు.
టీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌తో చర్చించే సీనియర్ నాయకులే లేరా ? కేవలం కేసీఆర్, ఆయన కుటుంబీకులు చర్చలు జరపడంలో ఆంతర్యం ఎమిటన్నారు. కాంగ్రెస్‌నేతలు తాము ఎవ్వరిని పిలువలేదని ప్రకటించినా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ నాయకులే ఆహ్వానించారని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదలచుకుంటే సీమాంధ్ర, రాయలసీమ నాయకులతో చర్చలు జరపాలి, కానీ కేసీఆర్‌తో చర్చలు జరుపడంలో రహస్యం ఏమిటన్నారు. గతంలో సకల జనుల సమ్మె   నీరు గార్చడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో రూ.500కోట్ల ఒప్పందం కుదుర్చుకొన్నారని ,  తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చడానికి యత్నించాడని ఎర్రబెల్లి ఆరోపించారు.  మార్చ్‌కు సంఘీభావం తెలిపినట్లుగా నటించి ఆ పార్టీ నాయకులు మధ్యలోనే వెళ్లిపోయారన్నారు.
పరకాల ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడు నెలల్లో తెలంగాణ ఏర్పడుతుందని కే సీఆర్, హరీష్‌రావు ప్రకటించి ఓట్లు దండుకున్నారని నేడు తెలంగాణ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.