3, మార్చి 2011, గురువారం

'హెల్‌'చల్‌-సెల్‌

''ఏంట్రా... పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్‌. మర్యాదగా నేను చెప్పినట్లు వింటావా? కాళ్లూ చేతులూ విరగ్గొట్టమంటావా'' అని బస్సులో చివరి వరసలో మాటల తూటాలు పేలడం విని, ముందు వరసలో కూర్చున్న మీరు... అక్కడ ఏదో యుద్ధం ప్రారంభం కాబోతుందని కంగారు పడితే, ఖచ్చితంగా తప్పులో కాలేసినట్లే! అది సెల్‌ఫోన్‌ బాగోతమై ఉంటుంది!!

గంటల తరబడి తన ప్రియుడితో సెల్‌ఫోన్‌లో శృంగార సంభాషణ చేసే అమ్మాయికి గానీ, అప్పు వసూలుకు ఫోన్‌ ద్వారా భయంకర హెచ్చరికలు చేసే ఆసామీకి గాని -తాము తోటి ప్రయాణీకులకు ఈ తరహా శబ్దకాలుష్యం ద్వారా బోలెడంత అసౌకర్యం కలిగిస్తున్నామనే 'కనీస జ్ఞానం' కూడా ఈ రోజుల్లో ఉండడం లేదు. ఇలాంటి సందర్భాలలోనే టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండర్‌ గ్రాహంబెల్‌ మీద అనవసరంగా ఆగ్రహం కలుగుతుంది. ఆయన పుట్టినరోజు (3.3.1847) సందర్భంగా సంతోషించడానికి బదులు విచారం కలుగుతుంది!

తాజా బడ్జెట్‌ ప్రభావం వల్ల మొబైల్‌ ఫోన్ల ధరలు తగ్గే 'ప్రమాదం' ఉంది కాబట్టి, ఇక కొత్తగా కొనుక్కునే వాళ్లు రెచ్చిపోతే, పరిస్థితి ఎలా ఉంటుందో... ఏమో!

ఒక మిత్రుడు ఆ పరిస్థితిని ఇలా కూడా ఊహించాడు. బిచ్చగాళ్లు సెల్‌ఫోన్ల ద్వారా ఎవరు ఏయే ఏరియాలకు వెళ్లాలో మాట్లాడుకుని ముందస్తుగానే నిర్ణయాలు తీసుకుంటారట. ఎక్కడైనా పెళ్లి లేదా అలాంటి వేడుక సందర్భంగా భోజనాలు గట్రా ఉంటే, ఆ సంగతి తక్కిన వాళ్లకు 'సెల్‌' ద్వారా తెలియజేసేలా 'జెంటిల్‌మన్స్‌ అగ్రిమెంట్‌' చేసుకుంటారట!

సెల్‌ఫోన్‌ చేత్తో పట్టుకుని మాట్లాడడానికి కూడా బద్ధకించే పెద్దమనుషులకు ఓ సదుపాయం ఉంది. మెడకు వైర్లు లాంటివి చుట్టుకుని ఉన్నవాళ్లు రోడ్డుమీద -గట్టిగా మాట్లాడుకుంటూ, చేతులతో పిచ్చి పిచ్చి విన్యాసాలు చేస్తూ వెళ్తుంటే, ఇదంతా సెల్‌ఫోన్‌ సంభాషణ అని తెలియని అమాయకులు 'పాపం.. పిచ్చోడిలా ఉన్నాడు' అని సానుభూతి చూపడమూ కద్దు. ఈ సెల్‌ఫోన్లు సినిమాల్లో కామెడీ ట్రాక్‌లు (హాస్యం విడిగా రాసి, తీసి కలపడన్నమాట!) రాసేవాళ్లకి మంచిచేసే 'ప్రమాదమూ' ఉంది. ఉదాహరణకు ఒక చిత్రంలో ఋణదాత అప్పుతీసుకున్న వాణ్ణి చివాట్లు పెడుతూ వస్తుంటే, ''నేను ఊళ్లోలేను స్వామీ... రాగానే ఇచ్చేస్తానుగా అంటూ ఋణగ్రహీత సమాధానం చెబుతూ వస్తుంటే -ఇద్దరూ ఒకరి కొకరు ఎదురవుతారు!

ఇక టెలివిజన్‌ సీరియల్స్‌లో ప్రధానపాత్రధారులెవరైనా షూటింగ్స్‌కు హాజరు కాలేని పరిస్థితి ఏర్పడినప్పుడు -తప్పనిసరిగా 'ఎపిసోడ్‌' టెలికాస్ట్‌కు అందించాల్సి వచ్చినప్పుడు -రచయిత, దర్శకులను ఈ టెలిఫోనే కాపాడుతుంది!

ఇవతల ఉన్న పాత్రధారి టెలిఫోన్‌ పట్టుకుని -తన 'గోడు' వెళ్లబోసుకుంటూ, అవతలి పాత్రధారి తరఫున జరిగే కథను తానే చెబుతుంటాడు. ''ఏమిటి... అనసూయ నిన్ను అంతమాట అందా. దాంతో నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావా... దిలీప్‌ నువ్వేనా ఆమాట అంటున్నది. మనం టాంక్‌బండ్‌ మీద కూర్చుని, ఒకపక్కన హుసేన్‌సాగర్‌ కంపుకొడుతున్నా కూడా... భవిష్యత్తు గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం... ఎన్ని పథకాలు వేసుకున్నాం... అవన్నీ ఆ హుసేన్‌సాగర్‌లో కలిసిపోవలసిందేనా... అన్నట్లు ఆ రోజు జరిగిన సంగతి నీకు గుర్తుంది కదూ... (ఇది వరకు ప్రసారమైన ఒకటి రెండు సీన్లు ఫ్లాష్‌బ్యాక్‌లా మళ్లీ వేసేస్తే, మరికాస్త సమయం కలిసొస్తుంది!.. మరి మన ఆశలు, ఆశయాలు ఫలించాలంటే నువ్వు బ్రతికి తీరాలి దిలీప్‌... బ్రతికి తీరాలి...'' అని అలా ఆ 'ఏకపాత్రాభినయం' సాగుతూనే ఉంటుంది!

ఆ విధంగా గ్రాహంబెల్‌ గారి టెలిఫోన్‌ వల్ల ఆ తర్వాత సోదరుడిగా వచ్చిన సెల్‌ఫోన్‌ వల్ల ఈ ప్రపంచానికి ఎంతమంచి జరిగిందో, దాన్ని దుర్వినియోగం చేస్తున్న వారివల్ల అంత చెడు కూడా జరుగుతోంది. సెల్‌ఫోన్‌లో ఇలా 'అధిక ప్రసంగం' చేస్తే తొందర్లోనే నరాలు దెబ్బతిని, తొందరగా చచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నా ఎవరూ వినడం లేదు! సెల్‌ ద్వారా 'హెల్‌'కు వెళ్దామనే వారి కోరిక కాబోలు!

మూగజీవాల పరిరక్షణలో ముద్దుగుమ్మలు

హాలీవుడ్‌ భామ పామెలా ఆండర్సన్‌ మూగజీవాల హక్కుల కోసం నడుంబిగించింది. వన్య ప్రాణుల సంరక్షణ కోసం శ్రమిస్తున్న సంస్థ పెటా తరపున ఆమె ఇప్పుడు మూగజీవాల కోసం ఢిల్లిdలోని అఖిల భారత విజ్ఞాన సంస్థ పై ఓ కన్నేసింది.

ఈ సంస్థ (ఎఐఐఎంఎస్‌) నిర్వహిస్తున్న పరిశోధన లపై తీసిన వీడియోను చేజిక్కించుకుంది. ఆవీడియోలో కోతులను ఏ విధంగా పరీక్ష లకు గురి చేసిందీ చూసి చకితురాలైంది. ఈ ఘోరమైన టెస్టులనుండి కోతులను మినహాయించాలని సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.సి. దేశాయ్‌కు ఫిర్యాదు చేసింది.

అంతేకాకుండా సంస్థలో పరిశోధనలు మానవీయ కోణంలో జరగాలని మెడికల్‌ సర్వీస్‌ సంస్థకు సలహాలు ఇచ్చింది. ఇది వరకే జంతు పరి రక్షణ చట్టం 2011 ప్రకారం జంతువులను టెస్ట్‌లకు ఉపయో గించరాదని వుంది. ఆయా పరీక్షలలో అవి విపరీతమైన బాధకు, భయా నికి గురవుతాయని డ్రాఫ్ట్‌ బిల్లులో పేర్కొ న్నారు. సంస్థలు నిర్వహించే పరీక్షలలో వాటికి ఎటువంటి బాధ కలుగకుండా శ్రద్ధవహించా లని, ఎప్పటికప్పుడు పరిశీల నకై, ప్రభుత్వేతర సంస్థలు, కేంద్ర జంతు ప్రదర్శన శాల, పశువుల వైద్యులను ఎంపిక చేసింది.

పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత, జంతు వుల పరిశోధనలలో వాటికి తీవ్రమైన బాధ కల్గితే, ఆయా పరిశోధనలు జరిపేవారిపై తీవ్ర చర్యలుంటాయి. పామెలా ఆండర్సన్‌, ఆ వీడి యాలో కేవలం కోతులే కాకుండా కుందేళ్లు, చుంచులు, తదితర జం తువులను పరిశోధనలు చేసి, కొత్తమందు లను తయారు చేయనున్నారు. పామెలా, తక్షణమే ఆ పరిశో ధనలను నిలిపి వేయమన్నది.

కేంద్ర జంతువుల ఫెసిలిటీని ఆధుని కీకరించాలన్నది. అలాగే శిక్షణ పద్ధతులను మెరు గుపరచి, పరిశోధన లను మానవీయ కోణం లోనే చేయాలన్నది. హాలీ వుడ్‌ నటి భారతదేశంలోని మూగజీవాలపట్ల చూపి స్తున్న శ్రద్ధపట్ల, పలువురు మద్దతు అందిస్తున్నారు. పెటా సంస్థ, హాలీవుడ్‌ నటులకు మానవీయ థృక్కోణంపై ఆసక్తిని కల్పించడం ముదావహం.

పారిస్హిల్టన్నేస్తం బుల్లి వానరం

పారిస్‌ హిల్టన్‌కి మూగజీవాలంటే ఆసక్తి మెండు. ఈ మధ్య తన 30వ జన్మది నాన్ని ఉడుతలా వుండే బుల్లి వానరం తది తర వన్య జంతువులతో హాలీ వుడ్‌ హిల్స్‌లో ఘనంగా జరుపు కొంది. పెంపుడు జంతువుల ప్రదర్శ నశాలను తరచు సందర్శి స్తుంది. వాటి ఆరోగ్య పరిరక్షణ, ఆహారాన్ని సరిగా సమయా నికి అంద జేస్తున్నా రనే అంశా లపై శ్రద్ధ వహిస్తున్నది. పారిస్‌ హిల్టన్‌ తన జన్మదినం వేడుకలలో మూగ జీవాలకు కూడా ప్రాధాన్యత కల్పించటం పలువురిని ఆశ్చర్యపరిచింది.

కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.

కమలినీ ముఖర్జీకి చిన్నతనం నుంచీ నటనమీద ఆసక్తి ఏర్పడటంతో స్కూల్లో చదివేటప్పుడే నాటకాల్లో నటించేది. ఎక్కువగా పురుష పాత్రలు పోషించేది. అందుకే థియేటర్‌ ఆర్ట్‌ కోర్స్‌ కూడా చేసింది. కవిత్వం రాయడం, పెయింటింగ్‌ చేయడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం ఆమె హాబీలు. భరత నాట్యం కూడా నేర్చుకుంది. నటిగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందు కవిత్వానికి సంబంధించిన ఓ వెబ్‌ సైట్‌తో ఆమె పొందుపరచిన థాట్స్‌, కన్ఫ్యూజన్‌, సాలిట్యూడ్‌ అనే టైటిల్స్‌తో రాసిన పద్యాలు వల్ల దలైలామా అధ్యక్షత వహించిన అమెరికాలోని వాషింగ్టన్‌ డిసి సభకి హాజరు కాగలిగింది. ముంబయిలో థియేటర్‌ ఆర్ట్‌ కోర్స్‌ చేసాక చాలా నాటకాల్లో నటించింది. అయితే ఈసారి స్త్రీ పాత్రలే పోషించింది. నీల్‌ కమల్‌, పారాచ్యూట్‌, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, ఆయుష్‌ వంటి ప్రకటనలకు మోడలింగ్‌ చేసింది.

యాడ్‌ మోడల్‌గా ఆకట్టుకోవడంతో రేవతి దర్శకత్వంలో రూపొందిన రెండో చిత్రం 'ఫిర్‌ మిలేంగీ' చిత్రంలో నటించగలిగింది. ఎయిడ్స్‌ ప్రధాన అంశంగా గల ఈ చిత్రంలో రేడియో జాకీగా ఆమె నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'ఆనంద్‌' లో నటించే అవకాశం లభించింది. 2004లో విడుదలైన ఈ చిత్రానికి ఉత్తమనటిగా నంది అవార్డు స్వీకరించింది.

మీనాక్షి, స్టైల్‌, గోదావరి, క్లాస్‌మేట్స్‌, పెళ్ళయింది కానీ, హ్యేపీడేస్‌, గమ్యం, జల్సా, బ్రహ్మానందం డ్రామా కంపెనీ, గోపి గోపిక గోదావరి, పోలీస్‌ పోలీస్‌, మా అన్నయ్య బంగారం, నాగవల్లి తెలుగు చిత్రాల్లో నటించింది. 'గోదావరి, హ్యాపీడేస్‌, గమ్యం, గోపి గోపిక గోదావరి చిత్రాల్లో చక్కన నటన ప్రదర్శించిందనే పేరు వచ్చింది. 'వెట్టయ్‌యాడు విలయ్‌ యాడు' తమిళ చిత్రంతో 2006లో తమిళరంగానికి పరిచయమై 'కాదలన్‌ సుమ్మ ఇల్లయ్‌' చిత్రంలో నటించింది. ఆ తరువాత తమిళంలో ఆఫర్లు రాలేదు. ఒక కన్నడ చిత్రం 'సావరి' చేసి ఊరుకుంది. మలయాళ చిత్రం కుట్టి ష్రాంకు చేసింది. మలయాళంలో ఆఫర్లు వస్తున్నా ఇంకా అంగీకరించని కమలినీ ముఖర్జీ తెలుగు చిత్రాల్లో మంచి నటిగా పేరొచ్చినా ప్రస్తుతం ఒక చిత్రంలోనే చేస్తూ ఇంకా అవకాశాలు ఎందుకు రావట్లేదా అనే ఆలోచనల్లో పడింది. కోల్‌కతాలో 1984లో జన్మించిన కమలినీ ముఖర్జీ పుట్టినరోజు మార్చి 4.

పెదవులతో పెదవుల ముద్దులకు ఫుల్‌స్టాప్‌

పెదవులతో పెదవులు కలిపి ఎక్కువ సమయం తీసుకుంటూ ఘాటుగా ముద్దాడే ప్రక్రియ హాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి అక్కడ నుంచి దక్షిణాదికి పూర్తిగా పాకింది. కెమెరా ముందు తెరమీద కనిపించడానికే కాకుండా పెదవులుతో పెదవులు కలపడం, గట్టి కౌగిలింతలు వివిధ వేడుకలు జరిగే వేదికల మీద కూడా ఉత్తరాది నాయికలు రంగ ప్రవేశంతో ఎక్కువై, కామన్‌ అయిపోతోంది, సినిమాల్ని చూసి జనం, జనాన్ని చూసి సినిమాలు అన్నట్టు.

క్రమంగా ముద్దుల మీద ఒక్కొక్కరూ మెల్లిగా వ్యతిరేఖత వ్యక్తం చేయడం ప్రారంభించారు. అనుభవం నేర్పిన పాఠాలు వల్లనో ఏమో, గాఢ చుంబనాలు వల్ల నోటి దుర్వాసన, ఉఛ్వాస నిశ్వాసాల వల్ల భరించాల్సిన కంపు కొంత ఇబ్బంది పెడుతున్నట్టున్నాయి. దానికి తోడు టూత్‌పేస్టులకు సంబంధించిన ప్రకటనలు కూడా స్పందింప చేస్తున్నాయి. అందుకే నేమో కంగనారానౌత్‌ ''ఇకనుంచి పెదవితో పెదవి కలపను కెమెరా ముందు'' అంటోంది. మరిన్ని వివరాల్లోకి వెడుతూ నోట్లో చాలా క్రిములుంటాయని, అవి ఒకరి నోట్లోంచి మరొకరి నోట్లోకి అలా మరొకరి నోట్లోకి వెళుతుంటాయి. ఆ విషయం ఆలోచిస్తేనే చిరాగ్గా వుండి ఏహ్యభావం కలిగిస్తోందని అందుకే ఇక ముద్దులకు ఫుల్‌స్టాప్‌ పెట్టడానికి నిర్ణయం చేసుకున్నానంటోంది.

మిక్కిలి వ్యాపకాల మిక్కిలినేని

రంగస్థల నటుడుగా, ప్రజానాట్యమండలి కళాకారుడుగా సినీ నటుడుగా, రచయితగా మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. కృష్ణానది వరదల్లో కృష్ణాష్టమినాడు గుంటూరు తాలూకా కృష్ణాయపాలెంలో 1916లో జన్మించినపుడు పశునష్టం, పంటనష్టం తమ కుటుంబంలో కూడా ఏర్పడితే గొంతులో వడ్లగింజ వేసి చంపేయాలని నిర్ణయించిన సమీప బంధువులు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వల్లా రాధాకృష్ణమూర్తి పేరుతో క్రమక్రమంగా కృష్ణాజిల్లా కోలవెన్నులో ఎదుగుతూ, పునాదిపాడు హైస్కూల్లో చదివారు. చిన్న తనంలోనే జంగం కథలు, వీధి భాగవతాలు, పగటివేషాలు, తోలు బొమ్మలాటలు, చెక్క భజనలు, హరికథలు చూస్తూ, వింటూ జానపద కళల మీద అభిరుచి ఏర్పరుచుకున్నారు. చిత్ర లేఖనం కూడా నేర్చుకున్నారు బందరు జాతీయ కళాశాలలో కొంతకాలం.

తండ్రి మరణంతో చదువు అర్థంతరంగా ఆగిపోతే పుస్తకాల ద్వారా చదువు కోవచ్చని గ్రంథాలయ ఉద్యోగిగా నెలకు రెండు రూపాయల జీతంతో చేరారు. కాంగ్రెస్‌ అభిమానిగా వుంటూ పునాదిపాడు వచ్చిన గాంధీని చూసి ఉత్తేజం పొందారు. తరువాత కమ్యూనిజం వేపు మళ్ళారు. పశువైద్యం అభ్యసించి 'పశువైద్యాచార్య' డిగ్రీ పొంది పశువైద్యం కొంతకాలం చేసారు.

విజయవాడ చెట్ల బజారులో 'చౌదరి విలాస్‌' అనే హోటల్‌ టేబుల్‌ మీల్స్‌తో పెట్టి భోజనం చేసాక విశ్రాంతి తీసుకునేందుకు మడతమంచాలు ఇచ్చే విధానం అదనంగా ప్రారంభించారు.

ఫొటోగ్రాఫీ కూడా నేర్చుకున్నారు. తన గ్రామానికి చెందిన సీతారత్నంని ప్రేమించి 1937లో పెళ్ళి చేసుకోవడమే కాకుండా, ఆడవాళ్ళు నటించడంపై శంకలున్న ఆ రోజుల్లో ఆమెతో 'మా భూమి' నాటకంలో తనతో పాటు హీరోయిన్‌గా నటింపజేసారు. ఈ నాటకాన్ని బొంబాయి, పూనా, షోలాపూర్‌, అహమ్మదాబాద్‌ తదితర ప్రాంతాల్లో పలుమార్లు ప్రదర్శించారు.

ఉప్పు సత్యాగ్రంహంలో 16వ ఏటనే పాల్గొన్నారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని అయిదునెలలు జైలు శిక్షనూ అనుభవించారు.

విజయవాడలో 'ఆంధ్రా ఆర్ట్‌ క్రియేటర్‌' నాటక సంస్థ ఏర్పాటులో ఆత్రేయ, నాగభూషణం, రమణారెడ్డి, వి. మధుసూదనరావుతో కలిసారు. పలు నాటకాలు ప్రదర్శించారు. స్వాతంత్య్రం వచ్చాక, ప్రజానాట్య మండలి కళాకారులకి ఇబ్బందులు ఎక్కువైతే, చాలమందిలాగే మిక్కిలినేని కూడా కె.ఎస్‌.ప్రకాశరావు ప్రోత్సాహంతో మద్రాసు చేరి 'దీక్ష' చిత్రంలో నటించారు. అలా 1951లో 'దీక్ష' చిత్రం విడుదల కావటంతో సినిమా నటుడయ్యారు. ఫలానా వేషమే అని పట్టు బట్టకుండా వచ్చిన ప్రతి వేషమూ వేయడం వల్ల ఎక్కువగా తక్కువ నిడివిగల పాత్రలే లభించాయి. మొత్తం నాలుగొందల చిత్రాల్లో నటిస్తే అందులో ఎన్టీఆర్‌తో నటించిన చిత్రాలు 150.

నటుడు పెరుమాళ్ళు ఇంటికి వెళ్లాక వచ్చి ఆలోచనతో తొలిసారి 'ఆంధ్ర నాటక రంగ చరిత్ర'ని రాసి బహుమతి తెచ్చుకున్నారు. అక్కినేని ఆర్థిక సహాయం ప్రోత్సాహంతో అది గ్రంథ రూపంగా వెలువడటంతో అక్కినేని దానికి కృతిభర్తను చేసారు. దీనికిముందు నార్ల వెంకటేశ్వరరావు సూచనతో నటనమీద పలువ్యాసాలు, కందుకూరి వీరేశలింగం మీద కొన్ని వ్యాసాలు రాసారు. తరువాత 'నటరత్నాలు' అని రంగస్థల నటీ నటులమీద రాసి ఎన్టీఆర్‌కి అంకితమిచ్చారు. దీనికి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 'నటరత్నాలు' ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్‌గా 25 సంవత్సరాల పాటు ప్రచురణ కావడం తనకెంతో ఆనందం కలిగించేదని, ఆంధ్రప్రభ చదివి పలువురు కళాకారులకు అనేకమంది ఆర్థిక సహాయం చేయడం వల్ల సంతృప్తి కల్గిందని మిక్కిలినేని చెప్పేవారు. ఆ తరువాత 'తెలుగువారి జానపద కళారూపాలు' అనే గ్రంధాన్ని రచించి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి బహుమతి పొందారు.

మాయాబజార్‌లో కర్ణుడుగా, జగదేకవీరుని కథ, గులేబకావళికథలో ఇంద్రుడుగా, సీతారామకళ్యాణం సంపూర్ణరామాయణం, సీతాకళ్యాణం చిత్రాల్లో జనకుడుగా, దక్షయజ్ఞంలో బ్రహ్మగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో బలరాముడుగా నర్తనశాల, బబృవాహన, శ్రీకృష్ణావతారం చిత్రాల్లో ధర్మరాజుగా, పాండవ వనవాసంలో దుశ్శాసనుడుగా, 'బాలభారతం, దానవీరశూరకర్ణ' చిత్రాల్లో ధృతరాష్ట్రుడుగా 'శ్రీకృష్ణ పాండవీయం, శ్రీమద్విరాట్‌పర్వం'లో భీష్ముడుగా పౌరాణిక చిత్రాల్లో నటించారు.

పల్లెటూరు, పరివర్తన, పుట్టిల్లు,కన్నతల్లి, సంతానం, అప్పుచేసి పప్పుకూడు, కులగోత్రాలు, గుండమ్మకథ, లక్షాధికారి, రాముడు భీముడు, అంతస్థులు, ఆలీబాబా 40 దొంగలు, పవిత్ర హృదయాలు, లక్ష్మీ కటాక్షం, మంచిమనిషి, సిఐడి, బాలరాజు కథ, రాం రాబర్ట్‌ రహీం, పులి బెబ్బులి, వంటి సాంఘిక చిత్రాల్లో తెనాలి రామకృష్ణ, సారంగధర, మహామంత్రి తిమ్మరుసు, పల్నాటియుద్ధం మున్నగు చారిత్రక చిత్రాల్లో మిక్కిలినేని నటించారు. 1997లో విడుదలైన 'శ్రీకృష్ణార్జున విజయం' చివరి చిత్రం. అప్పటినుంచి విజయవాడలో కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళతో గడుపుతున్నారు.

ఎం.ఎస్‌.రెడ్డి, సినారె, వేణుమాధవ్‌లతో మంచి స్నేహం ఉంది. జగ్గయ్య, గుమ్మడి, ఆరుద్ర, శ్రీశ్రీ, ఆత్రేయ, ప్రభృతుల స్నేహం ప్రోత్సాహం వల్ల తను రచనల మీద కూడా దృష్టి పెట్టినట్టు చెబుతారు. విజయవాడలో ఫిబ్రవరి 22న అంతిమ శ్వాస వదిలారు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి.

ఆర్టిస్టులతో క్యూ కట్టించిన పితాంబరం

ప్రముఖ రూపశిల్పి, చిత్ర నిర్మాత పితాంబరం (90) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చెన్నయ్‌లో ఫిబ్రవరి 21న మృతి చెందారు. ఎన్‌.టి.రామారావుకు పెర్సనల్‌ మేకప్‌మెన్‌గా 40 సంవత్సరాలు పనిచేసారు. ఎన్టీఆర్‌ నటించిన మాయాబజార్‌ నుంచి పలు పౌరాణిక చిత్రాల్లో, చారిత్రాత్మక, సాంఘిక, జానపద చిత్రాల్లో పీతాంబరం చేసిన మేకప్‌ ఆ చిత్ర విజయాలకు, ఆయా పాత్రలకు పేరు ప్రతిష్ఠలు రావడానికి చాలా దోహదం చేసాయి. ఎం.జి.ఆర్‌కి కూడా 30 సంవత్సరాలపాటు మేకప్‌ చేసారు. ఎస్వీ రంగారావు, సావిత్రి, నాగభూషణం ఇలా పలువురికి పీతాంబరం చేసిన మేకప్‌ వల్ల పేరొచ్చింది. వెయ్యి సినిమాలకు మేకప్‌ మేన్‌గా వ్యవహరించారు. ఆ రోజుల్లో ఎవరికివారు ఎన్టీఆర్‌ నుంచి అనేకమంది ముందు మేకప్‌ వేయించుకోవాలని వాహినీ స్టూడియో మేకప్‌రూమ్‌ ముందు అర్థరాత్రి దాటాక పడుకునో, కూర్చునో నిరీక్షించేవారు.

బాలకృష్ణ తొలిసారి మేకప్‌ వేయించుకున్నది పీతాంబరం వద్దనే. పీతాంబరంకు భార్య ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు వున్నారు. దర్శకుడు పి. వాసు ఈయన కుమారుడే. మరో కుమారుడు విద్యాసాగర్‌ చిత్ర పంపిణీదారునిగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌.టి.ఆర్‌ నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రాన్ని ఎస్‌.డి.లాల్‌ దర్శకత్వంలో 1975లో నిర్మించారు. పి.సి.రెడ్డి దర్శకత్వంలో చంద్రమోహన్‌, లత నటించిన 'పంచభూతాలు'చిత్రాన్ని 1979లో నిర్మించారు.

ఎల్‌బిడబ్ల్యూ సెన్సార్ కట్స్

ఎ వర్కింగ్‌ డ్రీమ్‌ ప్రొడక్షన్‌ పతాకాన ప్రవీణ్‌ సత్తారు కథ, సంభాషణలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సమకూర్చగా రూపొందిన చిత్రం ఎల్‌బిడబ్ల్యూ. అసిఫ్‌ తేజ్‌, రోహన్‌ గుడ్లవల్లేటి, అభిజిత్‌ పండ్లా, సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. అనిల్‌ ఆర్‌ సంగీతాన్ని, ఆండ్రూ రెడ్‌, సురేష్‌ బాబు ఛాయాగ్రహణాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి నిర్మాతలు డెబ్రాస్టోన్‌, నవీన్‌ సత్తారు.

ఎల్‌బిడబ్ల్యూ చిత్రాన్ని చూసిన ఇసి ఏ విధమైన కట్స్‌ లేకుండా 'వి/యు' (యూనివర్సల్‌ వీడియో)గా డిజిటల్‌ థియేటర్స్‌లో ప్రదర్శించే చిత్రంగా 3-2-11న సర్టిఫికెట్‌ జారీ చేసారు.

2 గంటల 19 నిముషాల పాటు ప్రదర్శితమయ్యే ఈ చిత్రం 18-2-11న విడుదలయింది.

తన పిల్లలకు ఉన్నత జీవితాన్నందించడమే లక్ష్యం: ఆస్కార్‌ అవార్డు గ్రహీత కాటే విన్స్‌లెట్‌

తన పిల్లలకు సమాజం నుంచి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నదే తన లక్ష్యమని ఆస్కార్‌ అవార్డు గ్రహీత, నటిగా మారిన మోడల్‌ కాటే విన్స్‌లెట్‌ పేర్కొన్నారు. తన పిల్లలకు ఉన్నత జీవితాన్ని అందించాలని భావిస్తున్నానని గత ఏడాది సినీ దర్శకుడు శామ్‌ మెండెస్‌తో విడాకులు తీసుకున్న కాటే అమెరికాకు చెందిన ఓ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమెకు మియా (10), జాయ్‌ (7) పిల్లలున్నారు. గతంలో తనను సమాజం విభిన్నంగా చూసిన పరిస్థితులు తన పిల్లలను రానివ్వబోనని కాటే తెలిపారు. వారిని మానవీయతకు ప్రతిబింబాలుగా తీర్చి దిద్దాలని భావిస్తున్నానని ఆమె చెప్పారు. తన పిల్లలు చాలా మంచి నడవడిక కలవారని తోటి వారు చెప్పడమే తనకు అత్యున్నత ప్రశంస అని కాటే పేర్కొన్నారు. తాను లావుగా ఉంటే ప్రజలు వెనక్కు నెట్టివేసేవారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తన శరీరంలో ప్రతి అవయవం తనకిష్టమేనని కాటే ఆ మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

లిబియా సైన్యానికి చిక్కిన డచ్‌ నౌకలు

రాజకీయ సంక్షోభంలో ఉన్న లిబియా నుంచి తమ దేశస్థులను తరలించేందుకు వచ్చిన మూడు డచ్‌ నౌకలు లిబియా సైన్యానికి బందీలుగా చిక్కాయి. ఐదు రోజుల క్రితం లిబియా సైన్యం ఆధీనంలో ఉన్న నౌకల విడుదలకు డచ్‌ ప్రభుత్వం చర్చలు నిర్వహిస్తోంది. తాము నౌకల సిబ్బందితో సంబంధాలు కొనసాగిస్తున్నామని డచ్‌ రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒట్టే బీక్‌స్మా తెలిపారు. సాధ్యమైనంత త్వరలో నౌకలకు విముక్తి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నౌకలతోపాటు లైంక్స్‌ అనే హెలికాప్టర్‌ కూడా లిబియా అధ్యక్షుడు గడాఫీ అనుకూల సైన్యం చేతిలో చిక్కుకున్నాయి. ఈ విషయాన్ని డచ్‌ దినపత్రిక టెలిగ్రాఫ్‌ గురువారం సంచికలో ఓ వార్తాకథనం ప్రచురించింది. సెర్టే ప్రాంతంలోని తీరానికి నౌకలు చేరుకోగానే గడాఫీ అనుకూల సైన్యం వాటిని చుట్టుముట్టింది. నౌకల్లోని ఇద్దరు సిబ్బంది తప్పించుకునేందుకు ప్రయత్నించగా సైన్యం వారిని అదుపులోకి తీసుకుంది. లిబియా సైన్యానికి బందీలుగా చిక్కిన వారు త్వరలోనే స్వదేశానికి చేరుకుంటారని డచ్‌ ప్రధాని మార్క్‌ రుట్టే తెలిపారు.

జగన్‌ పార్టీ ఏర్పాటు వాయిదా?

తేడా వచ్చిందో? రాజీనామా చేసి పారేస్తాం....

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకంగా ప్రవర్తించిన ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు హెచ్చరించారు.గురువారం లోక్‌సభ రేపటికి వాయిదా పడిన తర్వాత తెలంగాణ ఎంపీలు విలేకరులతో .... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పదవులు వదులుకునేందుకు సిద్ధమని..రాజీనామా పత్రాలు వెంట పెట్టుకుని తిరుగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో ఈ రాత్రి సమావేశమవుతున్నట్టు వారు చెప్పారు.

తాము పదవులకోసం వెంపర్లాడుతూ.. కావూరి, లగడపాటి లాంటి నేతల పేర్లు చెప్పి తెలంగాణా ప్రజల్ని మోసం చేస్తున్నట్లు కావూరి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు..

కావూరి ఓ దోపిడీదారుడు..

తెలంగాణా రాష్ట్ర సమితి నేతలో, సీమాంధ్ర పెట్టుబడి దారులో తమని రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేసినంత మాత్రాన తాము రాజీనామాలు చేయబోమని స్పష్టం చేసారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

గురువారం ఆయన శాసనసభ ఆవరణలో మీడియాలో మాట్లాడుతూ.... తెలంగాణా వాదులను, నేతల్ని తప్పుపటేలా సీమాంధ్ర ఎంపీ కావూరి సాంబశివరావు వాఖ్యలు చేయటాన్ని ఖండిస్తూ...సీమాంధ్రలో కావూరి, లగడపాటిలాంటి పెట్టుబడిదారులు దోపిడీదారులు తెలంగాణా లో ఎవరైనా ఉన్నారా? అని నిలదీసారు. తొలిసారి ఎంపికైన దగ్గుబాటి పురంధీశ్వరికి మంత్రి పదవి వచ్చిందని.. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైనా నేటికి కావూరికి మంత్రి పదవి రాలేదంటేనే ఆయన పట్ల కాంగ్రెస్‌ అధిష్టానంకి ఏమేరకు నమ్మకం ఉందొ.. ఎందుకు ఆయన్ని గుర్తించలేదో అర్ధమవుతుందని, పదవులు లేకపోతే బతకలేనిది వ్యాపారాలు మూల పడిపోతా యన్న బాధ ఉన్నది సీమాంధ్ర ఎంపీలకేనని ఘాటుగా విమర్శించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

కావూరి సాంబశివరావు తన వ్యాఖ్యలతో తమ ప్రాంత ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. తామరాజీనామాలే కాదని, తలచుకుంటే ఏదైనా చేయగలమన్నారు.

అలా చేస్తే రాజీనామా అవుతుందా : జెసి

రాజీనామా చేశానని ఒకవైపు చెబుతూనే మరోవైపు తన విధులకు హాజరవుతానని దేవాదాయ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్నారని అలా చేస్తే రాజీనామా అవుతుందా అని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం మంత్రి జూపల్లి రాజీనామా చేస్తున్నానని ప్రకటించడం పట్ల ఆయన స్పందిస్తూ...ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి రాజీనామా లేఖను రాశానని మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్నారని, రాజీనామా అని ప్రకటించిన అనంతరం విధులకు హాజరు కావడాన్ని రాజీనామా చేసినట్లుగా భావించాలా..అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు...

రాజీనామానా? ఆకాశరామన్న లేఖనా?

దేవాదాయశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా లేఖ ఆకాశ రామన్న లేఖలా ఉందని. ప్రత్యేక తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే రాజీనామా ను ఆమోదించే వరకు జూపల్లి విధులకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు.


గురువారం ఆయన మీడియాలో మాట్లాడుతూ....తమ పార్టీకి శాసనసబ్యుల బలం తగురీతిన లేదని తెలిసే...గత 2007-08 ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టిడిపి తన అభ్యర్థిని నిలపలేదని..అప్పుడు నిలపనట్టుగానే ఇప్పుడు కూడా నిలపలేదని ఆ విషయం జగన్‌కు తెలియదా అని ప్రశ్నించారు.నిత్యం కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అంటున్న జగన్ వర్గం ఎమ్మెల్యే కోటాలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో అభ్యర్థిని ఎలా నిలబెట్టిందని ఆయన నిలదీసారు.

శాసనమండలి సీటుకోసం కాంగ్రెస్‌తో తమ పార్టీ కుమ్మక్కయిందని జగన్‌ వర్గం తమ సాక్షి పత్రిక ద్వారా బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని...విమర్శించారు అసలు జగన్‌ వర్గానికి ఎలాంటి సంఖ్యాబలం లేకుండా పోటీకి దిగుతోందని... శాసనసభ్యుల కొనుగోళ్ల వ్యవహరం చేసేందుకు... కాంగ్రెస్‌ అధినేత్రి ముందు తన బలం నిరూపించుకునేందుకు జగన్‌ ఎత్తుగడలు వేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కుమ్మక్కు అయ్యిందన్న వార్తలను ఖండించారు.

జూపల్లి స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలి

మంత్రి జూపల్లి వ్యవహారంలో తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ స్పందిస్తూ..తెలంగాణ ప్రాంత మంత్రులందరూ ఇదే స్ఫూర్తితో ముందుకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. జూపల్లి రాజీనామాను స్వాగతిస్తున్నప్పటికీ తన రాజీనామా లేఖను సోనియాగాంధీకి కాకుండా స్పీకర్‌కు అందచేయాలన్నారు.

తెలంగాణ సమస్యను ఎలా పరిష్కరించాలో మాకు తెలుసు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమస్యను ఎలా పరిష్కరించాలో మాకు తెలుసునని..కేంద్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణ సమస్యను పరిష్కరిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని ఆయన అన్నారు. అలాగే తెలంగాణ సమస్యకు కేంద్రం ఓ పరిష్కారాన్ని త్వరలో సూచిస్తుందని త్వరలోనే.. కేంద్రం ఈ తెలంగాణ అంశంపై దృష్టి సారిస్తుందని చెప్పారు.

తెలంగాణకు చెందిన కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు పార్లమెంటులో తెలంగాణ నినాదాలు చేస్తూ... సభా కార్యక్రమాలకు అడ్డు తగల టంపై సమాధానమిస్తూ..."రాత్రి 9 గంటలకు తెలంగాణ ప్రాంత ఎంపీలతో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ మినహా కోర్ కమిటీ అంతా భేటీ అయ్యే అవకాశం ఉంది.వారికి తగురీతిన సమాధానం ఈ సమావేశంలో లభిస్తుందని" జవాబిచ్చారు మొయిలీ.

ఆత్మ ప్రభోధం సాక్షిగా రాజీనామా : జూపల్లి

మంద బలంతో సీమంద్ర నేతలు తెలంగాణాని అడ్డు కొంటున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గురువారం తన రాజీనామా లేఖని ముఖ్యమంత్రికి అందచేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ... దమ్ము ధైర్యం గురించి కొందరు సీమాంధ్ర నేతలు రేచ్చగోట్టే లా మాట్లాడుతున్నారని.. వారి బెదిరిపులకి తానూ లొంగలేదని.. గతంలో ఉస్మానియాలో విద్యార్దుల సమక్షంలోనే తానూ ఏ త్యాగానికైనా సిద్దమని చెప్పానని చెప్పారు. పదవులతో పాటుగా తాము పుట్టలేదని... తెలంగాణా వాడిగా.. తన ఆత్మ ప్రభోదం మేరకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ...తెలంగాణా విషయంలో హై కమాండ్ పై వత్తిడి తెచ్చేన్డుకీ ఈ రాజీనామా... అప్పటికీ కేంద్రం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలో తెలంగాణా బిల్ పెట్టకపోతే తానూ ఆమరణ దీక్షకు దిగుతానని చెప్పారు. ఎప్పుడు ఎలాంటి ఎత్తుగడ అవసరమో అదే అవలంబిస్తున్నానని స్పష్టం చేసారు జుపల్ల్లి... తమ రాజీనామా తరువాత ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని భావిస్తున్నా.. ఉదోగుల సహాయనిరాకరణకి తన మద్దతు ఉంటుందని ప్రకటించారాయన.

తెలంగాణా కోసం జూపల్లి రాజీనామా

నిన్న కావూరి చేసిన వ్యాఖ్యలు తెలంగాణా నేతలపై వత్తిడి చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఈమేరకే జూపల్లి కృష్ణారావు గురువారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తెలంగాణపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ జూపల్లి తన రాజీనామా లేఖను సోనియాకు పంపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో తిరిగే పరిస్థితులు లేనందున ఆయన పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో జూపల్లి దేవాదాయా శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. జూపల్లి రాజీనామాకి తెలంగాణా వాదులు మద్దతునిస్తుండగా... మిగిలిన మంత్రులు కూడా రాజీనామాలు చేయాలన్న డిమాండు వినిపిస్తోంది. మరో వైపు జుపల్లిని బుజ్జగించే పనిలో అధిష్టానం పెద్దలు రంగంలోకి దిగీ ఆవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణా పై ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిందే..

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిం దేనని, ఈ డిమాండ్‌తో లోక్‌సభ సమావేశాల ను అడ్డుకుంటామని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. బుధవారం తెలం గాణా భవన్‌లో జరిగిన తెరాస రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా మార్చి 10న జెఎసి పిలుపు మేరకు నిర్వహించతలపెట్టిన హైదరాబాద్‌ దిగ్బంధన కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఆయన పార్టీ నాయకులకు పిలుపునిచ్చి నట్టు తెలిసింది.
తెలంగాణా ప్రజలు శాంతియుతంగా తీవ్రమైన స్థాయిలో ఉద్యమిస్తున్నా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదని, ఇక ఉద్యమాలను ఉధృతం చేయడం ద్వారానే తెలంగాణాను సాధించు కోవాలని ఆ దిశలో పార్టీ శ్రేణులు ఉద్యమాలకు సమాయత్తం కావాలని కూడా ఆయన సూచించి నట్టు తెలిసింది. జాతీయస్థాయిలో 90 శాతానికి పైగా పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా లేఖలను యుపిఎ ప్రభుత్వానికి ఇచ్చినా ఇంకా ఏకాభిప్రాయమంటూ తాత్సారం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం తెలంగాణా ఒక్క రాత్రికిరాత్రే పరిష్కారమయ్యే సమస్య కాదని చెప్పడంపై కెసిఆర్‌ మండిపడ్డట్టు తెలిసింది.
2009 డిసెంబర్‌ 9న ఆయనే తెలంగాణా ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి అనంతరం శ్రీకృష్ణ కమిటీని నియమించి నివేదికను తెప్పించుకున్న తర్వాత కూడా ఈ విధంగా మాట్లాడడంలో అర్థమేమిట ని ఆయన నిలదీశారు. ఢిల్లిdలో సీమాంధ్రుల లాబీయింగ్‌ ఉధృతంగా కొనసాగుతుందని, ఈ పరిస్థితుల్లో తెలంగాణాకు అనుకూలంగా పార్టీల మద్దతును కూడగట్టేందుకు ఢిల్లిdలో ఉండాల్సిన అవసరం ఉన్నం దున 10న జరిగే హైదరాబాద్‌ దిగ్బంధన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించినట్టు తెలిసింది. ఆయన మార్చి 10న హైదరాబాద్‌ దిగ్బంధనానికి సంబంధించిన పోస్టర్‌ను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.

ప్రచారం ఒక్కోసారి సినిమాకు ప్రతికూలం

అట్టహాసంగా చేసే ప్రచారం ఒక్కోసారి సినిమాకు ప్రతికూలం అవుతుంది. ఇలాంటి ప్రతికూల పరిస్థితి తాజాగా విడుదలైన 'కుదిరితే కప్పు కాఫీ' ఎదుర్కొంది. ప్రచారానికి తగినట్టుగా సినిమాలేదని ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. చిత్రం అంచనాలు తారుమారు చేస్తూ డల్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి. ఇది సినీ వాణిజ్య వర్గాలని ఆశ్చర్యపరిచింది. చేసిన ఓవర్‌ ప్రచారం రివర్స్‌ అయిందని, మార్నింగ్‌ షోతోనే జాతకం తెలిసిపోయిందంటున్నారు. ప్రేమకథా చిత్రాల హీరోగా జోరు మీద ఉన్న వరుణ్‌సందేశ్‌కు బ్రేక్‌ పడినట్టే. కథలో కొత్తదనం లేనప్పుడు ప్రచారాలు కూడా పనికిరావని ఈ చిత్రం నిరూపించింది.

ఇక మరోవైపు కామెడీ చిత్రాల హీరో రాజేంద్రప్రసాద్‌ కొత్త సినిమా 'భలే మొగుడు-భలే పెళ్ళాం' చిత్రం పరిస్థితి కూడా సేమ్‌. వినోదభరిత చిత్రాలను అమితంగా ఇష్టపడే ప్రేక్షకులు సైతం ఈ చిత్రాన్ని వీక్షించడానికి రాకపోవడం గమనార్హం. ఒకే రోజు విడుదలైన ఈ రెండు చిత్రాల ఫలితం నిరాశ కలిగించడంతో పరిశ్రమలో ఫ్లాప్‌ల పరంపర కొనసాగుతున్నట్టుగా ఉంది. నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ సినిమా అనగానే ఒక మోస్తరు ప్రేక్షకులైనా సరే ఉండాలి. అయితే నేటితరం ప్రేక్షకులు మాత్రం కొత్తదనం ఉంటేనే సినిమా చూడ్డానికి ఇష్టపడుతున్నారని సినీ పండితుడు ఒకరు చెప్పారు.

చిదంబరం డయ్యర్ పాత్ర పోషిస్తున్నారు

తెలంగాణ కోసం..శివుడిని కోరుకున్నా..గద్దర్‌

తెలంగాణ రాజకీయ నాయకులు,ప్రజలు ఒక్కటైనప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తధ్యమని ప్రజాగాయకుడు,ప్రజాఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ఘట్‌కేసర్‌ మండలం పోచారం గ్రామంలో గల శ్రీస్పటికలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో తెలంగాణ ఏర్పాటు కోసం మహాశివరాత్రి సందర్భంగా శివనామం జపిస్తూ ఉపవాసదీక్ష కార్యక్రమంలో బుధవారం రాత్రి గద్దర్‌ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కోసం తెలంగాణ బిడ్డలు ప్రాణాలు తీసుకుంటున్నారని, పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు గ్రహించి ఒక్కటవ్వాలని అన్నారు. ఓటు వేసిన ప్రజలు తెలంగాణ కోసం పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తున్న ఎందుకు పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

కేంద్రం తెలంగాణ విషయంలో శ్రీకృష్ణకమిటిని ఏర్పాటు చేస్తే సమస్యను పరిష్కరించకుండా ఆరు అంశాలను ముందుంచి చేతులు దులుపుకుందని ఎద్దెవా చేశారు. తెలంగాణలోని విలువైన భూములను సీమాంధ్రపాలకులు వ్యాపారవేత్తలకు అమ్మివేసి అక్కడి ప్రాంతాలను అభివృద్ది చేసుకుంటున్నారని విమర్శించారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి 5,500 ఎకరాల భూమిని ఎకరాకు 100 రూపాయల చొప్పున దారాదత్తం చేశామన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాలు కట్టిన వారు తెలంగాణ వారు అయితే నీళ్లను ఆంధ్రవాళ్లు వాడుకొని కన్నీళ్లను తెలంగాణవాదులకు మిగుల్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆస్తులను మింగెటోడిని శివుడు మూడోకన్ను తెరిచి బస్మం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలకు వివరించి చెప్పారు.తెలంగాణ కోసం ఇంకా ఎంత మంది అమరులు కావాలని అడ్డుపడుతున్న ,ఇచ్చేవాళ్లకు మంచి బుద్దిని ప్రసాదించాలని శివుడిని కోరుతున్నట్లు తెలిపారు.జై తెలంగాణ అనగానే సరిపోదని, అన్ని గ్రామాల జెఎసి నాయకులు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.తాను పాట కోసం పాట పాడనని ఆట కోసం ఆట ఆడనని ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల్లో నుండి నా పాట పుడుతుందన్నారు. 

జైబోలో తెలంగాణలో గద్దర్‌ ఆలపించిన 'పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా'అనే పాటను సభలో పాడినప్పుడు ప్రజలంతా డ్యాన్సులు చేసి సభ ప్రాంగణమంతా ఉర్రూతలూగించారు.జై తెలంగాణ నినాదాలతో గ్రామం మారుమ్రోగింది. అక్కడి పిల్లలను తెలంగాణ వస్తే లాభం ఏమిటని అడిగి తెలుసుకున్నారు.

భగ్గుమన్న పండ్ల ధరలు

మహాశివరాత్రి సందర్బంగా వివిధ రకాల పండ్లకు మంచి గిరాకి ఉండటంతో వాటి ధరలు భగ్గుమన్నాయి. శివరాత్రిని పురస్కరించుకొని ఉపవాసదీక్ష చేపట్టే భక్తులు సాయంత్రం దేవాలయాలకు వెళ్ళి పూజలు నిర్వహించిన తరువాత పండ్లు తినండ ఆనవాయితీ. దీంతో తప్పని సరిగా పండ్లను కొనుగోలు చేయాల్సి ఉండగా ధరలు మాత్రం చుక్కలనంటాయి. ఇదే అదనుగా పండ్ల వ్యాపారులు ధరలు పెంచి విక్రయిస్తూ రెండు చేతులా ఆర్జించారు. పండగ సందర్బంగా పండ్లకు గిరాకి అధికంగా ఉండటంతో ఘట్‌కేసర్‌ మండల కేంధ్రంలోని బస్‌టర్మినల్‌ సమీపంలో వరంగల్‌, హైదరాబాద్‌ జాతీయ రహదారి పొడవునా టెంట్లు వేసుకొని పండ్ల వ్యాపారులు మరీ విక్రయించారు. పండ్ల ధరలను పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయి. కజ్జూర కిలో రూ.250, ద్రాక్షా కిలో రూ.70, యాపిల్‌ ఒకటి రూ.20, అరటిపండ్లు డజన్‌ రూ.50, సంత్రాలు ఒకటి రూ.5, పుచ్చపండు ఒకటి రూ.100 చొప్పున విక్రయించారు. పండగ రోజు ఉపవాస దీక్ష చేసే వారికి తప్పని సరిగా పండ్లు అవసరం ఉండటంతో ధరలు ఎంత ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితిలో కొనుగోలు చేసినట్లు భక్తులు తెలిపారు. ఏది ఏమైనా ఇంత మంచి సమయం మించితే దొరకదు అనే విధంగా ఇష్టాను సారంగా వ్యాపారులు వ్యవహరించారని చెప్పారు.

ఐర్లాండ్‌ సంచలనం.. ఇంగ్లాండ్ కి షాక్

బెంగళూరు: ఉపఖండం ప్రపంచకప్‌లో తొలి సంచలనం నమోదైంది. గురువారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ఐర్లాండ్‌ మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై సంచలన విజయం సాధించింది. కెవిన్‌ ఓబ్రియాన్‌ విధ్వంసకర సెంచరీ సాధించడంతో 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్‌ మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన కెవిన్‌ 63 బంతుల్లోనే 13 ఫోర్లు, ఆరు భారీ సిక్సర్లతో 113 పరుగులు సాధించి ఐర్లాండ్‌కు అద్భుత విజయం అందించాడు. ఒక దశలో 111 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి కోరల్లో చిక్కుకున్న ఐర్లాండ్‌ను కెవిన్‌ ఆదుకున్నాడు. కుసక్‌ అండతో ఇంగ్లండ్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఇద్దరూ కలిసి సమన్వయంతో ఆడుతూ స్కోరును ముందుకు నడిపించారు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో స్కోరు వేగం తగ్గకుండా చూశారు. చెలరేగి ఆడిన కెవిన్‌ 50 బంతుల్లోనే 13 ఫోర్లు, 6సిక్సర్లతో సెంచరీని పూర్తి చేశాడు. ఇదే క్రమంలో కుసక్‌తో కలిసి 94 బంతుల్లోనే ఆరో వికెట్‌కు 150 పరుగులు జోడించాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కుసక్‌ (47) పరుగులు చేశాడు. చివర్లో మూనీ అజేయంగా 33 పరుగులు చేసి జట్టును విజయపథంలో డిపించాడు. సెంచరీ హీరో కెవిన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.
శుభారంభం...
అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌కు ఓపెనర్లు స్ట్రాస్‌, పీటర్సన్‌ శుభారంభం అందించారు. ఇద్దరూ ఐర్లాండ్‌ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. ఒకవైపు వికెట్లు కాపాడుకుంటూనే పరుగుల వేగం తగ్గకుండా చూశారు. స్ట్రాస్‌ సింగిల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వగా, పీటర్సన్‌ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ స్కోరు 7.5 ఓవర్లలోనే 50 పరుగులు దాటింది. వీరిని ఔట్‌ చేసేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయితే 37 బంతుల్లో 2ఫోర్లు, ఒక సిక్స్‌తో 34 పరుగులు చేసిన స్ట్రాస్‌ను డాక్‌రెల్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. దీంతో 91 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు చెలరేగి ఆడిన పీటర్సన్‌ 50 బంతుల్లో 7ఫోర్లు, రెండు సిక్సర్లతో 59 పరుగులు చేసి స్టిర్లింగ్‌ బౌలింగ్‌లో బౌలింగ్‌ లో పెవిలియన్‌ చేరాడు. దీంతో ఇంగ్లండ్‌ 111 పరుగుల వద్దే రెండో వికెట్‌కు కోల్పోయింది.
రాణించిన ట్రాట్‌, బెల్‌..
ఈ దశలో క్రీజులోకి వచ్చిన జోనాథన్‌ ట్రాట్‌, ఇయాన్‌ బెల్‌ ఇన్నింగ్స్‌ కుదుట పరిచే బాధ్యత తమపై వేసుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగుల వర్షం కురిపించారు. ఇద్దరూ పోటీ పడి షాట్లు కొట్టడంతో స్కోరు బోర్డు పరిగెత్తింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ స్కోరు 25.3 ఓవర్లలోనే 150 పరుగులు దాటింది. మరోవైపు వేగంగా ఆడిన ట్రాట్‌ 55 బంతుల్లో 5ఫోర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే ఇయాన్‌ బెల్‌ కూడా 61 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్‌తో హాఫ్‌ సెంచరీ మార్క్‌కు చేరుకున్నాడు. అంతేగాక ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు సెంచరీ భాగస్వా మ్యాన్ని కూడా నమోదు చేశారు. అయితే 86 బంతుల్లో 6ఫోర్లు, ఒక సిక్స్‌తో 81 పరుగులు చేసిన బెల్‌ను మూనీ ఔట్‌ చేశాడు. దీంతో 167 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే ట్రాట్‌ (92) కూడా పెవిలియన్‌ చేరాడు. ఈ వికెట్‌ కూడా మూనీ ఖాతాలోకే వెళ్లింది. చివర్లో ఐర్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టడంగా బౌలింగ్‌ చేయడంతో ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 327 పరుగులకే పరిమితమైంది. ఐర్లాండ్‌ జట్టులో మూనీ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
స్కోరుబోర్డు
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: ఆండ్రూ స్ట్రాస్‌ (బి) డాక్‌రెల్‌ 34, పీటర్సన్‌ (సి) నియాల్‌ ఓబ్రియాన్‌ (బి) స్టిర్లింగ్‌ 59, ట్రాట్‌ (బి) మూనీ 92, ఇయాన్‌ బెల్‌ (సి) స్టిర్లింగ్‌ (బి) మూనీ 81, కాలింగ్‌వుడ్‌ (సి) కెవిన్‌ ఓబ్రియాన్‌ (బి) మూనీ 16, ప్రియర్‌ (బి) జాన్‌స్టన్‌ 6, బ్రెస్నన్‌ (సి) జాన్‌స్టన్‌ (బి) మూనీ 4, మైఖేల్‌ యార్డీ (బి) జాన్‌స్టన్‌ 3, స్వాన్‌ (నాటౌట్‌) 9. ఎక్స్‌ట్రాలు 23, మొత్తం 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 327 పరుగులు.
బౌలింగ్‌: రాన్‌కిన్‌ 7-0-51-0, జాన్‌ స్టన్‌ 10-0-58-2, అలెక్‌ కుసక్‌ 4-0-39-0, డాక్‌రెల్‌ 10-0-68-1, మూనీ 9-0-63-4, స్టిర్లింగ్‌ 10-0-45-1.
ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: పోటర్‌ఫీల్డ్‌ (బి) అండర్సన్‌ 0, స్టిర్లింగ్‌ (సి) పీటర్సన్‌ (బి) బ్రెస్నన్‌ 32, జోయ్స్‌ (స్టంప్డ్‌) ప్రియర్‌ (బి) స్వాన్‌ 32, నియాల్‌ ఓబ్రియాన్‌ (బి) స్వాన్‌ 29, విల్సన్‌ ఎల్బీ-స్వాన్‌ 3, కెవిన్‌ ఓబ్రియాన్‌ (రనౌట్‌) 113, కుసక్‌ (రనౌట్‌) 47, జాన్‌ మూనీ (నాటౌట్‌) 33, జాన్‌స్టన్‌ (నాటౌట్‌) 7. ఎక్స్‌ట్రాలు 33, మొత్తం 49.1 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 329 పరుగులు.
బౌలింగ్‌: అండర్సన్‌ 8.1-1-49-1, బ్రాడ్‌ 9-0-73-0, బ్రెస్నన్‌ 10-0-64-1, యార్డీ 7-0-49-0, స్వాన్‌ 10-0-47-3, కాలింగ్‌వుడ్‌ 5-0-26-0.