2, మార్చి 2011, బుధవారం

మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాం : కొండా సురేఖ

తెలంగాణా కోసం తాము నిజాయితిగా పోరాటం చేస్తున్నట్లు భావిస్తే తక్షణం కావూరి చేసిన వ్యాఖ్యలకు భాద్దులై తెలంగాణా ప్రాంత ప్రజా ప్రతినిధులంతా రాజీనామాలు చేయాలనీ పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, జగన్ వర్గ నేత కొండా సురేఖ. బుధవారం ఆమె వరంగల్ లో మీడియాలో మాట్లాడుతూ రైల్ రోకోల వాళ్ళో, ప్రజలని ఇబ్బందులు పెట్టడం వల్లో, దాడులు నిర్వహించడం వల్లో తెలంగాణా రాదన్న విషయం గుర్తెరగాలని. రాజీనామాల ద్వారానే ప్రభుత్వాలని కదిలించి తెలంగాణా సాధించవచ్చని చెప్పారామే. తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసేందుకు ముందుకొస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామన్నారు సురేఖ.

పాస్ పోర్ట్ కావాలన్న వైఎస్ మాటలు నిజమవుతున్నాయి

తెలంగాణా ఏర్పాటు జరిగితే పాస్ పోర్ట్ కావాల్సి వస్తుందని నాటి ముఖ్యమంత్రి వైఎస్ చేసిన ప్రకటనలు వాస్తవ రూపం దాలుస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి జేసి దివాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. బుధవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల ప్రజాభిప్రాయాన్ని చెపితే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు.. అనుక్షణం చస్తు బతకమని... ఆదేసాలిస్తున్నారని ఇదేమైనా పాకిస్తానా? ఇతర దేశమా? మాట్లాడనిచేది లేదంటే ఎలా? ఇన్నాళ్ళు తెలంగాణా నేతలు ఎం మాట్లాడినా ఉరుకొంటున్నమంటే.. మా మౌనాన్ని అంగీకారంగా రెచ్చి పోతున్నారని.. దాడులు చేసి భాద్యత గల నేతల పైనే దాడులు చేస్తుంటే సామాన్యుడు బెoబెలెత్తి పారి పోతాడని తెరాస నేతలు భావిస్తున్నట్లు కనిపిస్తోందని జేసి విమర్శించారు.

మమ్మల్ని రాజీనామా చేయమనడానికి కావూరి ఎవరు?

తెలంగాణా ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలనీ చెప్పడానికి కావూరి ఎవరని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపిల ఫోరం కన్వినర్ పొన్నం ప్రభాకర్. బుధవారం కావూరి తన ఇంటిపై తెలంగాణా న్యాయవాదులు దాడి చేసాక మీడియాలో తెలంగాణా ప్రాంత ప్రజా ప్రతినిధులపై చేసిన వ్యాఖ్యలని ఖండించారాయన.

తెలంగాణా రాష్ట్ర ఈర్పాటు ఆసన్నమైన తరుణంలో సీమాంధ్ర పెట్టుబడి దారుల కొమ్ముకాసే కావూరి ఇష్టానుసారం మాట్లాడటం పద్దతి కాదన్నారు. పదవులు మాకు లెక్కలేదు... తెలంగాణా కావాలి... తెలంగాణా ఇవ్వమనిఅధిష్టానం చెప్పిన మరుక్షణం తన పదవికి రాజీనామా చేస్తాని స్పష్టం చేసారు పొన్నం .

తెలంగాణాకోసం ఏమి త్యాగాలు చేసారో...నిలదీయండి

తెలంగాణా ప్రాంత ప్రజల అభిప్రాయాల మేరకు ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాలను ప్రతిబింభించడంలో తప్పులేదని..తానూ కూడా వారి పద్దతిలోనే తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంత ప్రజలు కోరుకుంటున్న సమైక్యతని తమ ప్రాంత ప్రజల అభిప్రాయాలను తాను ప్రతిబింభించవలసిన అవసరం తనకి ఉందన్నారు కాంగ్రెస్ ఎంపి రాయపాటి సాంబశివరావు.

బుధవారం తెలంగాణ న్యాయవాదులు తన ఇంటిని ముట్టడించిన నేపధ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తెలంగాణ వ్యతిరేకులను బెదిరిస్తే... ఇతరుల ఇళ్లపై దాడి చేస్తే..ప్రత్యేక రాష్ట్రం వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రమే తెలంగాణా సమస్యకి పరిష్కారం చూపాలని... రాజ్యాంగం తెలిసిన విజ్ఞులైన న్యాయవాదులు తన ఇంటి పై దాడి చేస్తేప్రయోజనం ఉండదని, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి తెలంగాణాకోసం ఎలాంటి త్యాగాలు చేసారో... కేంద్రాన్ని ఈమేర ఒప్పించాగలిగారో అడగాలని అన్నారు. తాను తెలంగాణ వాదనను వ్యతిరేకించలేదని... ఈ రాష్ట్రాన్ని జిల్లాకి ఓ రాష్ట్రము చొప్పున 24 రాష్ట్రాలు చేసినా తనకి అబ్యంతరం లేదన్నారు. తెలంగాణాని ఇస్తామంటే కావురో, కిరణ్ కుమార్ రెడ్డో అడ్డుకొంటే ఆగిపోయే చిన్న అంశం కాదన్నారు.

శ్రీకృష్ణ కమిటి వేసినప్పుడు ఆమోదించిన.. దానికి నివేదికలిచ్చిన నేతలు... దాని కి తాము కట్టుబడి ఉంటామంటే.. వారు మాత్రం ఇప్పుడు శ్రీకృష్ణ కమిటి ఫార్సు అంటూ ప్రకటనలు చేస్తున్నారని ...అసలు తెలంగాణా నేతలకు చిత్తశుద్ది లేదని. తెలంగాణా విషయంలో వారి మధ్యనే అభిప్రాయ భేదాలున్నాయి.. అంతమాత్రాన దాడులు చేసుకొంటారా అని నిలదీసారు. తెలంగాణా లోని కొందు నేతలు తెలంగాణా కోరుకొనే ప్రజల కోసం ఏం త్యాగాలు చేయాలో అవి చేయకుండా, కావూరి, లగడపాటి లాంటి డబ్బులున్నవారి పేర్లు నాలుగు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.ప్రజలు మంచివాళ్లు కాబట్టి ఇంకా వారి మాటలు వింటున్నారన్నారు.

తెలంగాణా ప్రాంతంలో ఒక్క పైసా సంపాదించలేదని.. తానూ ఈప్రాంతానికి దూరంగా ఇతర దేశాలలో సైతం నేను కష్టపడ్డా , పదిమందికీ ఉపాధి చూపించా.. వారితో పాటే నేను ఎదిగా... అని ఇది తప్పేలా అవుతుందన్నారు. సీమాంధ్ర నేతలు తమ ఇంట్లో ఐదవ తేదీన కలుస్తున్నట్లు తాను ఎవరికైనా చెప్పానా? ఓ వేలా తము కలవాల నుకొంటే ఇక్కడి నేతల అనుమతి తీసుకోవాలా? ఇది ప్రజాస్వామ్యమా? రాజరికమా? ఇది ఎవరైనా రాజుగారి పాలనలో ఉందా? అని కావూరి ప్రశ్నించారు.

మళ్లీ దాడులు ప్రారంభించిన తెలంగాణా వాదులు

గాంధేయ మార్గంలో తమ పోరాటం ఉంటుందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే. చంద్ర శేఖర్ రావు ప్రకటించినా... తెరాసా శ్రేణులు, తెలంగాణా వాదులు ఆదిశగా పయనిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు సరికదా రోజు రోజుకి ఉద్యమ కారులు రేచ్చిపోతూనే ఉన్నారు. విద్వంసాలకు, దాడులకు దిగుతూనే ఉన్నారు. ఓ యు విద్యార్ధి జెఎసి రైలుని తగలబెడితే... తెరాస ఎమెల్యేలు... అసెంబ్లీ సాక్షిగా సాటి ఎమ్మెల్యే అని చూడకుండా... తమకు అనుకూలంగా మతలాడలేదని దాడికి దిగి, వ్యక్తిగత స్వతంత్రం హరించేలా ప్రవర్తించిన ఘటనలు మరువక ముందే... మరోమారు సినిమా ఇండస్ట్రీ పై దాడులకి తెరదీయగా.. కాంగ్రెస్ ఎంపి కావూరి ఇంటిపై తెలంగాణా న్యాయ వాదులు దాడిచేసి విద్వంసానికి తెగబడ్డారు.

బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు సమీపంలో జరుగుతున్న అల్లరి నరేష్ సినిమా షూటింగ్‌ను తెలంగాణవాదులు అడ్డుకుని సెట్స్‌ను ధ్వంసం చేశారు. దాంతో షూటింగ్‌కు ఆటంకం ఏర్పడింది. షూటింగ్‌ను తెలంగాణావాదులు లో సృష్టించిన భీభత్సానికి యూనిట్ సభ్యులు హడలి పోయి ప్రాణాలు అరచేత పెట్టుకొని పరుగులు తీసారు.

ఈ నెల 5 న సమైక్య వాదుల సమావేశానికి వేదికగా నిలవనున్నఎంపి కావూరి సాంబశివరావు ఇంటిని తెలంగాణ న్యాయవాదులు ముట్టడించారు. ఇంటిబైట ఉన్న పూల మొక్కల్ని చిందర వందర చేసి కిటికీలు, తలుపుల అద్దాలు విరగోట్టారు.ఈ దాడిలో దాదాపు 50 మంది న్యాయవాదుల పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడే నాయకులను ఇక్కడ తిరగనివ్వం అని వారు హెచ్చరించారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

కెసిఆర్ కుటుంబం కూడా ఆరోజు రోడ్డు మీదే

ఈ నెల 10 తేదీన మిలీనియర్ టూ హైదరాబాద్ కార్యక్రమానికి యావత్ తెలంగాణా పల్లెలన్ని కడలి రావాలని టిఆర్ఎస్ నేత నాయిని నరసింహారెడ్డి పిలుపు ఇచ్చారు.

టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన అనంతరం తెలంగాణ భవన్'లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఆ రోజు హైదరాబాద్ ప్రజలు రోడ్డుపైనే వంట చేసుకోవాలని ఆయన కోరారు. కెసిఆర్ కుటుంబం కూడా ఆరోజు రోడ్డు మీదే వంట వండుకుంటుందని ఆయన చెప్పారు.

రాత్రికి రాత్రే తెలంగాణ సమస్య పరిష్కారం కాదని చిదంబరం అనటం సరికాదని మండిపడ్డారు. ఓ మతిలేని మంత్రని చిదంబరం తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను నాయని తప్పుపట్టారు.

తమిళనాట పెట్రోల్‌పై విక్రయ పన్ను తగ్గింపు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి పోతున్నా, తమిళనాడు ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పెట్రోల్‌ కొనుగోలుపై సేల్స్‌ టాక్స్‌ మూడు శాతం తగ్గిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ తమిళనాడులో పెట్రోల్‌ విక్రయ పన్ను 30 శాతంగా ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా భారతీయ చమురు సంస్థలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. అయితే రాష్ట్రంలోని ద్విచక్ర వాహన చోదకులకు సహకరించేందుకు పెట్రోల్‌పై విక్రయ పన్ను మూడు శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు కరుణానిధి ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.210 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని కరుణానిధి తెలిపారు. దీంతో రాష్ట్రంలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.38 తగ్గుతుంది. తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరుణానిధి ప్రభుత్వ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఇది ప్రజాస్వామ్యమా..? రాక్షస పాలన..?

మొన్న సోంపేట సంఘటన మరువక ముందే ప్రభుత్వం మరో దుర్మార్గపు చర్యకు పాల్పడడమనేది ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు అంగీకరించరని ఉత్తరాంధ్రా దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు ఆదాడ మోహనరావు అన్నారు. మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశ ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకర్లపల్లిలో పోలీస్‌ కాల్పుల్లో ముగ్గురిని దారుణంగా దగ్గర నుంచే కాల్చి చంపడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా సైనికపాలన రీతిలో ముందుకెళ్లడాన్ని దళిత ఐక్యవేదిక తీవ్రంగా ఖండించింది. తక్షణమే ప్రభుత్వం గద్దె దిగాలని, ఈ ప్రభుత్వాన్ని పాలించే అర్హత లేదని ఎవరిని ఆదేశించి క్రమశిక్షణలో పెట్టే సక్రమంగా ప్రభుత్వాన్ని నడిపించే స్థోమత ఈ ప్రభుత్వానికి లేదని, చనిపోయిన మృతుల కుటుంబానికి పది లక్షలు ఏక్స్‌గ్రేషియా చెల్లించాలని, గాయపడిన వారికి రెండు లక్షలు చెల్లించి వారి వైద్య ఖర్చులు కూడా ఏర్పాటు చేయాలనుకున్న థర్మల్‌ ప్లాంట్‌ను తక్షణమే అక్కడ నుంచి ఉపసంహరించుకోవాలని మరే ఇతర కంపెనీ అయినా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

'దేశం' స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్దులు వీరే

చిత్తూరు, పశ్చిమగోదావరి మినహా అన్ని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు   అభ్యర్థుల పేర్లను తెలుగుదేశంపార్టీ బుధవారం  ఖరారు చేసింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయ్ .. 

తూర్పుగోదావరి - భాస్కర రామారావు
శ్రీకాకుళం -   నారాయణ మూర్తి
అనంతపురం - మెట్టు గోవిందరెడ్డి
కర్నూలు - నంద్యాల భాస్కర్ రెడ్డి
నెల్లూరు - బీదా రవి చంద్రయ్య
కాగా చిత్తూరు, పశ్చిమగోదావరి  అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించే అవకాశం ఉందని దేశం వర్గాల సమాచారం.

మియాపూర్ లో లాకప్ డెత్?

మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఓ నిందితుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మెదక్ జిల్లా చెల్లాపూర్‌కు చెందిన ఓ హత్యకేసులో నిందితుడు మేకల అంజయ్య పీఎస్‌లోని బాత్‌రూమ్‌లో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారని.. పలురకాలుగా హింసించారని..పోలీసుల దెబ్బలు తాళలేకే అంజయ్య మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.

గిల్టు నగలతో "శివుడి" పని కానిచ్చేసారు

శ్రీకాళహస్తిలో ఉత్సవమూర్తులకు అలంకరించే నగలపై వివాదం నెలకొంది. మహా శివరాత్రి సందర్బంగా శ్రీకాళహస్తిలో బుధవారం అద్దెకు తెచ్చిన గిల్ట్ నగలతోనే ఉత్సవ మూర్తులకు అలంకరణ చేశారు. పాత ఆలయ ఈవో లాకర్ బాధ్యతలను ప్రస్తుత ఈవోకు అప్పగించకపోవటంతో ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. ముక్కంటి స్వర్ణ ఆభరణాలు లేక బోసిపోయాడు. స్వామివారికి ఆభరణాలు అలంకరించకపోవటంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అవినీతికి వ్యతిరేకంగా...240 మైళ్ళ దండి యాత్ర

దండియాత్ర తరహాలో అమెరికాలో నివాసముంటున్న మన భారతీయులు దాదాపు 240 మైళ్ళ యాత్రని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా.."దండియాత్ర-2 " పేరుతొ నిర్వహించే ఈ యాత్ర ఈ నెల 12 వ తేదీన కాలిఫోర్నియాలోని మార్టిన్ లూథర్ కింగ్ జునియర్ మెమోరియల్ పార్క్ నుంచి ప్రారంభమై శాన్ఫ్రాన్సిస్కో లోని గాంధి విగ్రహం వరకు సాగుతుంది. ఇదీ రోజుల్లో అమెరికాలోని పది ప్రధాన నగరాలతో పాటు భారత్లోని అన్ని ముఖ్య పట్టణాలలో స్తానిక స్వచ్చంద సంస్తలు, ప్రజల సహకారంతో ఈ యాత్రని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా...పనిచేస్తున్న వారితో పాటుగా భారత్లో అవినీతిని పారద్రోలాలనుకొనే ప్రతివొక్కరు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపిచ్చారు. కాగా. ఈ దండి యాత్ర-2 నాడు గాంధి దండియాత్ర చేపట్టిన తేదీలలోనే జరుగుతుండటం గమనార్హం.