16, ఆగస్టు 2011, మంగళవారం

కుంభకోణాల జాతర!

కల్పనాథ్‌ ఆధ్వర్యంలో చక్కెర కుంభకోణం ఆనాడు పార్లమెంటు ను కుదిపివేసింది. అప్పుడు ప్రభు త్వం తీసుకున్న అస్తవ్యస్త చర్యలు అవినీతి ఫలితంగా ప్రజలపై భారం 3వేల కోట్లకుపైగా పడింది. స్వేచ్ఛా విపణిలో చక్కెర ధర కేజీ రూ.11ల నుంచి రూ.17లకు పెరగడంవల్ల చౌక ధరల దుకాణాలలో సరఫరా చేసే చక్కెర ధర కేజీ రూ. 1.75పైసలు పెంచడం వల్ల చక్కెర ధర 66 శాతం పెరిగింది. చివరకు కేంద్ర పౌరసరఫరాల శాఖమంత్రి ఎ.కె ఆంటోని, చక్కెర కుంభకోణంలో ప్రధాన పాత్ర వహించిన కల్పనాథ్‌ మంత్రి పదవులకు రాజీనామాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. మరొక ముఖ్యమైంది హవాలా కుంభకోణం. హవాలా అంటే విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించిన అనధికార లేదా అక్రమ లావాదేవీల ప్రక్రియను హవాలా అని పేరు. అంతేకాక హవాలా అంటే అప్పగింత అని కూడా అర్థం. అంతర్జాతీయ స్థాయిలో సాగే అక్రమ లావాదేవీలకు హవాలా ఒక ముఖ్యమైన యంత్రాం గంగా వ్యవహరించింది. రకరకాల తప్పుడు మార్గాల్లో ఈ సొమ్మును అటు ఇటు చేరవేయడంలోనూ, హవాలా నిర్వాహకు లు నిర్వహిస్తారు. వీరు ఇండియాలోనూ, విదేశాల్లోనూ బినామీ ఖాతాలు ప్రారంభించి నల్లడబ్బును ఈ ఖాతాల ద్వారా బదలాయిస్తారు. విదేశాలలో విలాసాలు జరపాలనుకునే వారు. విలువైన వస్తువులు పొందగలిగేవారు. అంతర్జాతీయంగా అక్రమ వ్యాపారాలు చేసే వారు హవాలాను ఆశ్రయిస్తారు. గతంలో ఫారిన్‌ ఎక్స్చేంజ్‌ రెగ్యులేషన్‌ యాక్టు ద్వారా విదేశీ మారకం కావలసిన వారు అందుకు సంబంధించిన వివరాలను అధికారులకు తెలియజేసి కొన్ని పరిమితులకు లోబడి డాలర్లు తీసుకునే వీలయ్యేది. ఇటీవల కాలంలో మన్మోహన్‌ ఆర్థిక విధానాల వలన ఈ చట్టం రద్దు అయింది. సరళీకరణ ఆర్థిక విధానాల వలన, విదేశీ కంపెనీలు యదేచ్ఛగా ప్రవేశం కల్పించడంలో హవాలా లావాదేవీలు కొనసాగుతున్నాయి. లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకులలో మూలుగుతున్నది. హవాలా కుంభకోణం ప్రక్రియలో పి.వి. నరసింహారావు, యస్‌కె జైన్‌, ఆరిష్‌ మహ్మద్‌ఖాన్‌, మదన్‌లాల్‌ ఖురానా, కె.కె. ధావన్‌, మాధవరారు సింధియాలకు సంబంధము ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ఇక యుపిఏ 1, 2 ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాలు దేశాన్ని కుదిపివేసినవి. 2జీస్పెక్ట్రమ్‌ కుంభకోణం 1లక్ష 76వేల కోట్ల రూపాయలు. చివరకు మంత్రి డి. రాజా, ఎంపీ కనిమొళి కటకటాల వెనుక ఊచలు లెక్కపెడుతున్నారు. కామన్‌వెల్త్‌ క్రీడల కుంభకోణంలో, స్టేడియం నిర్మాణం, మరమ్మత్తులు, క్రీడలు మౌలిక సదుపాయాల ఏర్పాట్లు, క్రీడలకు అవసరమైన సామాగ్రి కొనుగోలునించి అన్ని వ్యవహరాలలోనూ అధికార యంత్రాంగం అంతులేని అవినీతి చేసిందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నవి. క్రీడల కమిటీ చైర్మన్‌ సురేష్‌ కల్మాడిని కాంగ్రెస్‌ పార్లమెంటరీ కార్యదర్శి పదవి నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. ఈ కుంభకోణంలో వేల కోట్ల నష్టం జరిగిందని తేలింది. మహారాష్ట్రలో బయటపడిన అతిపెద్ద కుంభకోణం ఆదర్శసొసైటీ. చివరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోకచేవాన్‌ పదవి నుండి వైదొలగిన పరిస్థితికి దారితీసింది. యుద్ధంలో మరణించిన వీర జవానుల భార్యా, పిల్లలకు చెందాల్సిన ప్లాట్లను కూడా వదలలేదు. ముంబాయిలోని విలాసవంతమైన కోలాబో ప్రాంతంలో 31 అంతస్థులను నిర్మించారు. 103 మీటర్లు ఎత్తు, 103 ప్టాట్లలో ఒక్క ప్లాటు కూడా యుద్ధ వీరుల భార్యలకు, పిల్లలకు కేటాయించలేదు. ఈ ప్లాటులన్నింటినీ ఉన్నతస్థాయి అధికారులు, రాజకీయ నాయకులు పంచుకొని మార్కెట్‌ ధరకు ఒక్కొక్క ఫ్లాట్‌ రూ. 10 కోట్లు ఉన్న వాటిని రూ. 80 లక్షలకు విక్రయించడం జరిగింది. ఇందులో కాంగ్రెస్‌ మాజీ మంత్రులు, ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఉన్నతాధికారులు ఉన్నారు. సత్యం కంప్యూటర్స్‌లో వేలాది కోట్ల రూపాయల అవినీతి లావాదేవీలు ప్రపంచ దేశాలలో ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోయే విధంగా కుదిపేసిన అతి పెద్ద కుంభకోణం. ఈ కుంభకోణంలో ప్రభుత్వ భూములు, అక్రమ సంపాదనలు, బంధువుల పేర్లపై ఉన్న ఆస్తుల వివరములు పరిశీలిస్తే అంతర్జాతీయ అవినీతి ఈ విధంగా ఉన్నది అనేది సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం ద్వారా తెలిసింది. వై.యస్‌. రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అల్లుడైన అనిల్‌ కుమార్‌కు ఖమ్మం జిల్లాలో 1లక్ష 20వేల ఎకరాలు గనుల భూములు కట్టిపెట్టడం ప్రజలందరికీ తెలిసిన విషయం.

కె.జి గ్యాస్‌ భారీ కుంభకోణం చాలా ప్రముఖమైంది. కృష్ణా, గోదావరి బేసిన్‌ నుండి వెలువడే గ్యాస్‌ను కేంద్ర ప్రభుత్వానికి రిలయన్స్‌ ఇండిస్తీస్‌కు మధ్య పంపిణీ ఒప్పందానికి సంబంధించినది. రిలయన్స్‌ సంస్థ మొదట 2.4 బిలియన్‌ డాలర్ల అభివృద్ధి ఖర్చు చూపించి తర్వాత 8.5 బిలియన్‌ డాలర్లకు పెంచి చూపేందుకు ఎందుకు అనుమతించారని కాగ్‌ ముసాయిదా నివేదిక ప్రశ్నించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ మొత్తంలో సుమారు 45000 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేసారు. రిలయన్స్‌వారు, పెట్రోలియం శాఖ అధికారులు కుమ్మక్కైనారని కాగ్‌ నివేదిక తెలిపింది.

అత్యున్నత నైతిక విలువల కోసం ఉన్నామని చెప్పుకుంటున్న బిజెపి బండారం కూడా బయటపడింది. అవినీతి అంశాన్ని గత ఎన్నికలలో ప్రధాన అంశంగా ప్రచారం చేసిన బిజెపి నాయకులు అద్వానిపైన అప్పటి బీహర్‌ శాసనసభా పక్ష నాయకుడు యశ్వంత్‌ సిన్హాపైన చార్జీషీటు దాఖలు కావడంతో బిజెపి బండారం బయటపడింది. కానీ ముడపులు ముట్టిన వారిలో మదన్‌లాల్‌ ఖురానా, యల్‌.కె. అద్వానీ ఉన్నారనేది వాస్తవం. కర్నాటకలో బిజెపి ముఖ్యమంత్రి యెడ్డ్యూరప్పలు అవినీతి కుంభకోణాలలో చిక్కుకుని అవినీతిలో కూరుకుపోయిన సంగతి వేల కోట్లు అవినీతి చేశాడని బంధుప్రీతి, అడ్డగోలు నిర్ణయాలు చేశాడని, గనుల మాఫియాకు, సంబంధిత తదితర అంశాలపై సాక్షాత్తూ లోకాయుక్త సంతోష్‌ హెగ్డే, ఆ రాష్ట్ర గవర్నర్‌ భరద్వాజ్‌ హెచ్చరికలు మనందరికి తెలిసినవే. చివరకు అప్ప వైదొలగినా తనమనిషినే సిఎం చేశారు.

ఇక నల్లడబ్బు సంగతి పరిశీలిస్తే దేశంలో అవినీతి ఏ స్థాయిలో ఉందో భరించలేని స్థాయికి చేరుకున్నదనేది వాస్తవం. మనదేశం నుండి అక్రమంగా తరలించబడిన సొమ్ము 20లక్షల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. 1990-2010 సం్ప్పల మధ్య దేశం నుండి అక్రమంగా నిధులు తరలిపోవడం అధికమయిందని ఒక అధ్యయన సంస్థ పేర్కొంది. ఇతర దేశాలలో ఎవరి పేరున ఎంతెంత ఉన్నది అనే వివరాలు చెప్పడానికి మన్మోహన్‌సింగ్‌ సర్కారు ముందుకు రాకపోవడం నల్ల డబ్బు లాబీలు ఎంత బలంగా ఉందో అర్థమౌతోంది. 1966లో మొట్టమొదటగా లోకపాేల్‌ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పటిష్టమైన, స్వతంత్రమైన లోకపాేల్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడాన్ని దాటవేస్తూ వచ్చారు. వి.పి.సింగ్‌ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో వామపక్షాల కోరికను అనుసరించి 1989 సంవత్సరంలో లోకపాేల్‌ బిల్లులో ప్రధానిని చేర్చడానికి అంగీకరించారు. 2009లో స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా ఉన్న ప్రణబ్‌ కూడా ప్రధానిని చేర్చారు. కానీ ఇప్పుడు ప్రధానిని చేర్చడానికి వీలులేదని మన్మోహన్‌ సర్కారు తటపటాయిస్తుంది. అత్యంత నీతి నిజాయితీగా ఉన్న మన్మోహన్‌సింగ్‌ ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదు.

సుప్రీంకోర్టు, తదితర జడ్జీల బంధుప్రీతి, అవినీతి కార్యకలాపాలు అరికట్టడానికి నేషనల్‌ జ్యూడీషియల్‌ కమిటీని ఏర్పాటు చేయలేని చేతగాని ప్రభుత్వంగా ఉంది. న్యాయమూర్తులు కూడా జవాబుదారీ తనం ఉండవలసి ఉంది. పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌లు ఇస్తున్నారు. వీరందరికీ ఎన్నికలలో కోట్లాది రూపాయలు ఎక్కడ నుండి వస్తున్నవనేది నిశితంగా విచారణ చేయడం లేదు. అంతేకాక తప్పుడు సమాచారంతో ఇచ్చిన అఫిడవిట్‌ దారులపై ఎందుకు విచారణ చేయడం లేదు. అఫిడవిట్‌లు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే ఉదాహరణకు:- మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య గారి పేరున ఒక్క కారు కూడా లేదని అఫిడవిట్‌లో యిచ్చారు. కె. రోశయ్యగారు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వివిధ స్థాయిలలో మంత్రి పదవులు చేసి, ముఖ్యమంత్రి చేసిన ఆయనకు కారు కూడా లేదంటే ప్రజలు నమ్మగలరా ఆఫిడవిట్‌లు దాఖలు చేసిన వారి బంధువుల ఆస్తులు, బినామీ ఆస్తులను ఎంక్వైయిరీ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. కనుక లోకపాేల్‌ బిల్లు అత్యంత అవసరం అనేది దేశప్రజల ముందు చర్చ జరుగుతోంది. తప్పని సరిగా లోకపాేల్‌ బిల్లులో ప్రధానిని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులను చేర్చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.

ప్రస్తుత విధానాల వలన అవినీతి పెచ్చుపెరిగి విలయతాండవమాడుతోంది. ప్రజాధనం ఇంత పెద్ద వెూతాదులో లూటీ కావడాన్ని అడ్డుకోవలసి ఉంది. ప్రతిఘటించవలసి యున్నది. సరళీకరణ విధానాలు, ప్రైవేటీకరణ అవకతవకలకు, అవినీతికి అవకాశాలు విపరీతంగా పెంచింది. అవినీతి అరికట్టాలంటే లోకపాేల్‌ బిల్లు వచ్చినంత మాత్రాన పోతుందని కాదు. ప్రైవేటీకరణ, సరళీకకరణ తగ్గించడం ద్వారానో, ప్రభుత్వ రంగ సంస్థలను పటిష్టపర్చడం ద్వారానో ఎన్నికల ఖర్చు, అవినీతి తగ్గాలంటే దామాషా పద్ధతి మీద ఎన్నికలు జరపడమే మేలు. కాబట్టి లోకపాేల్‌ బిల్లు తేవడంలోనూ, అవినీతి, నల్లడబ్బు అరికట్టడంలో, రాజకీయ నాయకులు, బడా కార్పొరేట్‌ సంస్థలు అవకతవకలు, నేరాల మీద పెద్ద ఎత్తున ప్రజానీకం, వివిధ వర్గాల ప్రజలు వివిధ వర్గాల సంస్థలు, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో కదలాలి. నిరంతరం ఉద్యమం చేయాలి. పాలకుల మెడలు వంచి ప్రజాభిప్రాయానికి దిగి వచ్చే విధంగా ప్రజాచైతన్యంతో పోరాడాలి.

- రాజగోపాల్‌

ఎక్సర్‌సైజే....క్యాన్సర్‌ రోగులకు వరం

కేన్సర్‌తో బాధపడుతూ వైద్య చికిత్సల అనంతరం ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారికి ఒక సూచన. ఆసుపత్రులకు వెళ్లడం కంటే ముం దుగా వారానికి రెండున్నర గంటలు వ్యాయామం చేస్తే చాలంటు న్నారు మెక్‌మిలాన్‌ కేన్సర్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు. ఇదే వారి పాలిట మంచి ఔషధమని సలహా ఇస్తున్నారు.
శస్త్రచికిత్స తరువాత అంతటితో ఆగకుండా ఎక్సర్‌సైజ్‌ చేయడం మంచిదని సంస్థ చెబుతోంది. ఎక్సర్‌సైజ్‌వల్ల ఇబ్బందులు తొలగిపోవ డ మ కాక శస్త్రచికిత్స అనంతరం వచ్చే శారీరకరుగ్మతలను రాకుండా చేస్తుంది. ఆరోగ్యశాఖ కూడా మెక్‌మిలాన్‌ చెప్పిన విధంగా చేయడం మంచిదని చెబుతోంది. ఈ నివేదిక ఆధారంగా లండన్‌లోని 20 లక్షల మంది రోగులను వ్యాయామం చేయించారు. ఈ పద్ధతిని పాటించ డంవల్ల మంచిదేనని ఆరోగ్యశాఖ క్యాన్సర్‌ రోగులకు మార్గదర్శకాల ను సూచించడం జరిగింది. ఈ ఫలితాలను కాలేజి ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ అమెరికన్‌ వారు కూడా ఈ పరిశోధనను బలపరిచారు. చాలా మంది ప్రజలకు ఈ విధానం ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావం పడకుండా కాపాడగలిగింది. క్యాన్సర్‌ ద్వారా వచ్చే ఇతర రోగాలబారీ నుంచి కూడా కాపాడుకోవచ్చు. అంతేగాక ఎక్సర్‌సైజ్‌ చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న 40 శాతం మంది త్వరితగతిన 30 శాతం వ్యాధి బారినుండి బయటపడ్డారు. వారానికి ఆరు గంటల వ్యాయామం చేయడం ద్వారా ఎముకల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులు వ్యాధి తీవ్రత వల్ల చనిపోయే స్థితి నుంచి బయటపడినట్లు తేలింది.
చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ మెక్‌మిలాన్‌ క్యాన్సర్‌ సెంటర్‌ సైరన్‌ డేవనే మాట్లా డుతూ అవసాన దశలో ఉన్న క్యాన్సర్‌ రోగులు త్వరలో ప్రమాదం నుంచి బయటపడినట్లు చెప్పారు. దీంతో క్యాన్సర్‌ రోగులు సంభ్రమా శ్చ్య ర్యాలకు గురైనట్లు చెప్పారు. ఎటువంటి వైద్యసేవలు అవసరం లేకుండా శాశ్వతంగా ఆరోగ్యాన్ని పొందేందుకు ఇటువంటి వ్యాయామం తోడ్పడటంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. ప్రత్యేక మైనటువంటి వ్యాయామమే చేయాలని నిబంధనలేమీ లేవు. తోటపని, నడవడం, ఈత కొట్టడం వంటివి కూడా ఇలాంటి వ్యాయామం కిందకే వస్తాయి. నేను నావద్దకు వచ్చే రోగులకు నీకు రోగం లేదనుకొని ఇంతకుముందు ఎలా ఉన్నావో అలాగే ఉండాలని సూచిస్తానని క్లినికల్‌ ఆంకాలజి మెక్‌మిలాన్‌ సెంటర్‌ మెడికల్‌ అధికారి జానెమహర్‌ తెలిపారు.
అయితే ప్రతి ఒక్కరు ప్రాథమికంగా ఎక్సర్‌సైజ్‌ చేయడమే ఒక మంచి మందుగా క్యాన్సర్‌ రోగులు భావించాలని చెప్పారు. క్యాన్సర్‌ చికిత్స అనంతరం వచ్చే ఇతర రోగాలనుంచి బయటపడాలంటే ఒక మంచి ఆలోచనే ఎక్సర్‌సైజ్‌ అని మార్టిన్‌ లెడ్‌విక్‌ తెలిపారు. కనుక క్యాన్సర్‌ రోగులు నూతన వ్యాయామ పద్ధతులను చేసి చూడండి మరి.

నగరం నిద్రపోతున్న వేళ సెన్సార్ బి(క)ట్స్

గురుదేవ క్రియేషన్స్‌ (ప్రై) లిమిటెడ్‌ పతాకాన నంది శ్రీహరి నిర్మించిన చిత్రం 'నగరం నిద్రపోతున్న వేళ'. జగపతిబాబు, చార్మి, చంద్రమోహన్‌, ఆహుతి ప్రసాద్‌, బాబూమోహన్‌, శివారెడ్డి ముఖ్యపాత్రధారులు. లక్ష్మీ నరసింహం ఛాయాగ్రహణాన్ని, యశోకృష్ణ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే దర్శకత్వం ప్రేమ్‌రాజ్‌ సమకూర్చారు.
అయిదుగురు సభ్యులతో కూడిన ఇసి ఈ చిత్రాన్ని చూసి .......... కట్స్‌తో 22-6-11న 'యుఎ' సర్టిఫికెట్‌ జారీ చేసింది.
మూడు నాలుగు రీళ్ళలో :
1) బాటిల్‌ మీద 'బ్రేజర్‌' అని వున్న లేబుల్‌ తొలగించమన్నారు.
2) వ్యభిచరిస్తున్నట్టుగా హిజ్రాలను చూపే దృశ్యాలు. ఆ దృశ్యాల్లో వచ్చిన డైలాగ్స్‌ తొలగించారు.
3) మింట్‌ రెస్టారెంట్లో డ్రగ్స్‌ వాడకం, లిప్‌లాక్‌ (పెదవితో పెదవి కలిపి ముద్దాడు) దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమన్నారు.
4) అయిదు ఆరు రీళ్ళలో ఛానెల్‌ ఎండిని ఉద్దేశించి 'కొజ్జావాడు' అని జగపతిబాబు అన్న మాటని తొలగించారు.
5) ఏడు ఎనిమిది రీళ్ళలో ఎన్నికల్లో గెలుపుకి సంబంధించి బాబూ మోహన్‌, ఎంఎల్‌ఎ, హిజ్రాల మధ్య వచ్చిన సంభాషణ కత్తెర పాలయింది.
ఎనిమిది తొమ్మిది రీళ్ళలో :
6) ఎ. రెడ్‌ డ్రెస్‌లో ఐటమ్‌ డ్యాన్సర్‌ యొక్క క్లీవేజ్‌ ఎక్స్‌పోజర్‌ తొలగించారు.
బి. ఇదే డ్యాన్స్‌లో ఐటమ్‌సాంగ్‌ చేసే డ్యాన్సర్‌ బొడ్డుకు సంబంధించిన దృశ్యం, కెమెరాను పై నుంచి జూమ్‌ చేయడం, డ్యాన్సర్‌ పిరుదలకు దగ్గరగా పురుషుల ముఖాలు ఉంచటం వంటి దృశ్యాలను తొలగించారు.
7) పదకొండు పన్నెండు రీళ్ళలో ప్రజలతో కలసి ఛార్మి ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ని చంపే దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమన్నారు.
8. సినిమాలో ఎక్కడ 'ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌' అని వచ్చినా ''ట్రాన్స్‌పోర్ట్‌ '' పదాన్ని తొలగించమన్నారు.
9. సినిమాలో 'రెడ్డి' అనే పదం ఎక్కడ వచ్చినా అది తొలగింపుకు గురి అయింది.
3800.95 మీటర్ల నిడివిగల 'నగరం నిద్రపోతున్న వేళ' చిత్రం 24-6-11న విడదలైంది.

క్రోనికేపిటలిజంకు 'నవ'యుగ పడగ

ఆంధ్రప్రదేశ్‌లో క్రోనికేపిటలిజంకు ఉదాహరణగా నవయుగ ఇంజనీరింగ్‌ కంపెనీని పేర్కోవచ్చు. ఈ సంస్థ 1987--88లో 20 లక్షల ఆస్తులను చూపింది. 1999-2000 నాటికి దీని ఆస్తుల విలువ 26.50 కోట్లకు చేరుకున్నాయి. 2004-05 నాటికి 167 కోట్ల విలువైన ఆస్తులు నమోదయ్యాయి. గతేడేళ్ళలో ఇవి 1140 కోట్లకు చేరుకున్నాయి. ఇదికాక రాష్ట్ర తీరంలో అత్యంత కీలకమైన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్ని ఇదే సంస్థ కైవసం చేసుకుంది. ఈ పోర్టుల నిర్మాణం పేరిట 7 వేల ఎకరాల భూముల్ని ప్రభుత్వం నుంచి పొందింది. తాజాగా ఇదే సంస్థకు మచిలీపట్నం పోర్టు అప్పగించి 15 వేల ఎకరాల్ని దఖలుచేయాలంటూ కృష్ణాజిల్లా ప్రజాప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ తీరప్రాంత భూముల విలువ వేలకోట్లలో ఉంటుంది. 2002లో 1.80 కిలోమీటర్ల పొడవైన యానాం.. ఎదుర్లంక వంతెన నిర్మాణాన్ని చేపట్టిన ఈ సంస్థ ఆర్ధిక లేమితో సతమతమైంది. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అడ్వాన్స్‌లిచ్చి ఈ సంస్థను ఆదుకుంది. అలాంటిది తొమ్మిదేళ్ళ వ్యవధిలో కోస్తాతీరంలో దాదాపు సగభూభాగాన్ని ఈ సంస్థ సొంత ఖాతాలో వేసుకోగలిగింది. వేలకోట్లకు పడగలెత్తగలిగింది. కార్పొరేట్‌ వ్యవస్థలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కలసి క్రోనికేపిటలిజంకు పాల్పడితే జరిగే దోపిడీకిదే ప్రతీక.

భాషా ప్రాధాన్యతను పట్టించుకునే నాథుడేడీ?: ఎం.పి. లగడపాటి


ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొన్న విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌ మాట్లాడుతూ, మన రాష్ట్రంలో తెలుగుభాషలో విద్యాభ్యాసం నిర్బంధం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు తల్లి కష్టాలలో ఉందని, కన్నీళ్ళు పెట్టుకుందని, భాషా ప్రాధాన్యతను వర్ధమాన కవులు, రచయితలు గుర్తించి యువతకు మన భాష ఔన్నత్యాన్ని చాటితే తప్ప మధురమైన భాషగా ముందడుగు వేయదని అన్నారు. మాతృభాషను గుండెలో పదిలంగా పెట్టుకోవాలని, తద్వారా తెలుగుతల్లి, తెలుగునేల సమైక్యంగా ఉండాలని ఆయన అభిలషించారు. ఈ సభలో ప్రారంభోపన్యాసం చేసిన మండలి బుద్ధప్రసాద్‌ లగడపాటికి ఒక సూచన చేస్తూ, ఎందరో మహనీయులు మొక్కవోని దీక్షతో కృషి చేయగా తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించిందని, అయితే ఇంతవరకు నిధులు విడుదల కాలేదని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాలలో రాజగోపాల్‌ ఈ అంశాన్ని లేవనెత్తి ఈ నిధులను రాబట్టేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సూచించారు.

అమ్మ భాషకు మరింత వెలుగు

 శరవేగంగా అందివస్తున్న టెక్నాలజీని వినియోగించుకుని పొరుగు రాష్ట్రాలు తమ తమ మాతృభాష వికాసానికి ఉరకలు, పరుగులు తీస్తుండగా, ఈ విషయంలో తెలుగుభాష వెనుకపడిపోకూడదని పలువురు సాంకేతిక నిపుణులు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు మూడవ రోజు ముగింపు సభను ఎస్‌విఎస్‌ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ''సాంకేతికంగా తెలుగు భాషాభివృద్ధి'' అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో పలువురు కంప్యూటర్‌ శాస్త్రవేత్తలు 'అంతర్జాలం' (ఇంటర్నెట్‌) తెలుగు భాషా వ్యాప్తికి కూడా అందుబాటులోకి వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ చర్చకు సమన్వయకర్తగా వ్యవహరించిన సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కూచిబొట్ల ఆనంద్‌ మాట్లాడుతూ, తెలుగు భాషను ప్రపంచ భాషగా తీర్చిదిద్దడానికి 'అంతర్జాలం' అందివచ్చిందన్నారు. అంతర్జాలంను శక్తివంతమైన మాధ్యమంగా అభివర్ణిస్తూ, ప్రపంచానికి మాటా మంత్రం నేర్పిన తెలుగుజాతి గొప్ప రచయితలను జాతికందించిందని, ఈ రచనలు దేశందాటి వెళ్ళడానికి ఇంటర్నెట్‌ వినియోగమే ప్రత్యామ్నాయ మన్నారు. ఇప్పటి వరకు మూడు వేల పుస్తకాలను ఇంటర్నెట్‌లో బంధించామని, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ సంస్థలు మనతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ అంతర్జాల వినియోగాన్ని వేగవంతం చేసుకోవాల్సిన బాధ్యత తెలుగు రచయితలపై ఉందన్నారు. వచ్చే సెప్టెంబర్‌ 28, 29, 30 తేదీలలో అమెరికాలోని సిలికానాంధ్రలో అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన ఈ సమావేశాల కార్యనిర్వాహక అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ కంప్యూటర్‌ ఇంజనీర్‌ అంబరీష్‌ రూపొందించిన 'రమణీయ' యూనికోడ్‌ ఫాంటును ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ తెలుగును ఆధునిక భాషగా తీర్చిదిద్దడానికి సాంకేతిక నిపుణుల చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఎ.పి. నాలెడ్జ్‌ నెట్‌వర్క్‌ ప్రముఖుడు ఎ.అమరనాథరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున ఆరు ఫాంట్లను సిద్ధం చేశామన్నారు. కృష్ణా యూనివర్సిటీ ఉప కులపతి మైనేని దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ సైన్స్‌ను తెలుగుపరంగా అభివృద్ధి చేసుకోవాలని, ఈ-రీడర్‌ను ప్రవేశపెట్టి తెలుగు రచనలను తక్కువ ఖర్చుతో ఆకళింపు చేసుకోవడం ద్వారా మాతృభాషను సుసంపన్నం చేసుకోవచ్చని సూచించారు. ఈ-తెలుగు రూపకర్త వీవెన్‌ మాట్లాడుతూ వాక్య నిర్మాణంపై రచయితలు స్పష్టతను ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌ రంగ ప్రముఖులు కె.ఎస్‌.బి.వి.కె.శివరావు, జి.వెంకట్రామయ్య, బి.వెంకట్రామ్‌, కిరణ్‌, కె.వీరభద్రశాస్త్రి, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు వి.హర్షవర్ధన్‌, చావా సురేష్‌, రెహమానుద్దీన్‌ తదితరులు పాల్గొని తెలుగుభాష విశ్వపరివ్యాప్తమవ్వడానికి అంతర్జాలాన్ని వినియోగించు కోవడంపై పలు సూచనలు చేశారు.

కార్పొరేట్ల గుప్పిట్లో పిఎంవో, సిఎంవోలు

లోక్‌పాల్‌ బిల్‌ పరిధిలోకి ప్రధానిని కూడా చేర్చాలంటూ పౌరసమాజ నేత అన్నాహజారే పట్టుబడుతున్నారు. ఇందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులంతా బందరు పోర్టు నిర్మాణానికి సుమారు 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థ నవయుగ కనస్ట్రక్షన్స్‌కు వెంటనే అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం శాసనసభ్యత్వాల్ని వదులుకునేందుక్కూడా వారు వెనుకాడటంలేదు. పరస్పర వైరుధ్యమున్న ఈ రెండు అంశాలు దేశంలో పెరిగిన క్రోని కేపిటలిజంకు అద్దం పడుతున్నాయి. జగన్‌ అవినీతిపై ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు తేల్చిన హైకోర్టు తన తీర్పునిస్తూ దీన్ని క్రోని కేపిటలిజంగా పేర్కొంది. అప్పట్నుంచి క్రోని కేపిటలిజంపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రభుత్వానికి, కార్పొరేట్‌ యజమాన్యాలకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడటం, వీరంతా కార్పొరేట్‌ మాఫియాగా రూపొంది సంయుక్తంగా ప్రభుత్వ సంపదను దోపిడీ చేయడమే క్రోని కేపిటలిజం. ఈ విధానంలో వ్యాపార, పారిశ్రామికవేత్తలకు మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని విక్రయించడం ద్వారా కంటే తమ ప్రయోజనాలకనుగుణంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించడం ద్వారానే ఎక్కువ లాభపడతారు. ఇందులో వ్యాపారం, ఉత్పత్తులు ఉండవు. వీటి పేరిట ప్రభుత్వ ఆస్తులను దోచేస్తారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులపై రాయితీలు పొందుతారు. ప్రభుత్వం నుంచి అదనంగా సాయం అందుకుంటారు. ఇంతవరకు భారత ప్రజలకు రాజకీయనేతల అవినీతి గురించి తెలుసు.. ఉద్యోగుల అవినీతిపైనా అవగాహన ఉంది. ప్రభుత్వం, ప్రభుత్వంలోని మంత్రులు,
ముఖ్యమంత్రులు, ప్రధాని కూడా కాంట్రాక్టులు, కొనుగోళ్ళ వ్యవహారాల్లో ముడుపులు తీసుకుంటారన్నదీ వారికి అవగతమే. కానీ క్రోని కేపిటలిజంపై భారతీయులకింకా పూర్తిస్థాయి అవగాహన రాలేదు. గత దశాబ్దకాలంగా క్రోని కేపిటలిజం విస్తృతమైనప్పటికీ దీనిపై బహిరంగచర్చ జరగడం జగన్‌ వ్యవహారం తర్వాతే మొదలైంది.
90వ దశకంలో భారత రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థల్లో అనూహ్య మార్పులొచ్చాయి. ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. డబ్ల్యుటిఓలో భారత్‌ భాగస్వామైంది. అంతర్జాతీయ మార్కెట్‌లకు భారత్‌ తలుపుల్ని బార్లా తెరిచింది. ప్రపంచీకరణ, అంతర్జాతీయకరణంటూ ఆర్థికాంశాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా గత రెండు దశాబ్దాల్లో సంపద పెరిగింది. ఆదాయ అవకాశాలు మెరుగయ్యాయి. అదే సమయంలో దేశంలో నయా సంపన్నవర్గం పుట్టుకొచ్చింది. కార్పొరేట్‌ వ్యవస్థ బలీయంగా మారింది. అది ప్రభుత్వాల్నే శాసించగల స్థాయికెదిగింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల కాలంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేసేవారు. అంతర్జాతీయ పరిణామాలకనుగుణంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించినప్పటికీ అది ప్రభుత్వ అజమాయిషీలోనే కొనసాగేది. కీలక రంగాలన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. కంట్రోలింగ్‌ వ్యవస్థ పకడ్బందీగా అమలయ్యేది. రాజీవ్‌ కాలం నుంచి ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య సత్సంబంధాలు పెరిగాయి. పివి కాలంలో ఇవి మరింత ఊడలేసాయి. ఇదే క్రోని కేపిటలిజానికి దారితీసింది. గత రెండు దశాబ్దాల్లో పుట్టుకొచ్చిన కొత్తతరం కార్పొరేట్‌ వ్యవస్థ ఉత్పత్తి, వ్యాపార రంగాలకంటే రాజకీయ పార్టీలు, నేతలతో సాన్నిహిత్యానికే ప్రాధాన్యతనిచ్చింది. ఎవరు అధికారంలో ఉంటే వారి ద్వారా తమ ప్రయోజనాల్ని నెరవేర్చుకుంటోంది. క్రోని కేపిటలిజం గతంలో నియంతల పాలనలో ఉన్న దేశాల్లోనే ఎక్కువగా కనిపించేది. రెండో ప్రపంచ యుద్దానంతరం జపాన్‌లో క్రోని కేపిటలిజం మొదలైంది. సౌత్‌ కొరియాలో ఇది విస్తరించింది. లాటిన్‌ అమెరికాలో కొన్ని కుటుంబాలు ప్రభుత్వాన్ని గుప్పెటపట్టి దేశంపై అజమాయిషీ వహించేవి. ఇండోనేషియా, అర్జెంటీనా, బ్రెజిల్‌, మలేషియాల్లో కూడా క్రోని కేపిటలిజం విస్తృత స్థాయిలోనే ఉంది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా, సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్ట్‌ నియంతృత్వ ప్రభుత్వాలు కొంత మంది కార్పొరేట్లను చేరదీసేవారు. వారి పోటీదార్లను ప్రభుత్వమే అణగదొక్కడం ద్వారా సొంతవర్గానికి మేలు చేకూర్చేవారు. ప్రభుత్వ నిర్మాణాల కాంట్రాక్టులన్నీ వారికే దక్కేవి. పాలకులు, అధికారులు, కార్పొరేట్లు కలసి ప్రజాధనాన్ని దోచుకునేవారు. హంగేరి, రుమేనియా, అల్బేనియా, పోలెండ్‌, బల్గేరియాల్లో కూడా ఇది విస్తృత స్థాయిలోనే సాగింది. తూర్పు జర్మనీ ఉన్న సమయంలో అక్కడి ప్రభుత్వం కార్పొరేట్ల గుప్పెట్లోనే ఉండేది.
క్రోని కేపిటలిజం కారణంగా ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలాయి. అగ్రరాజ్యం అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యానికి క్రోని కేపిటలిజం కూడా ఓ కారణం. మార్పుతెస్తానంటూ ఎన్నికల బరిలో దిగిన ఒబామా అధికారం చేపట్టగానే జెపి మోర్గాన్‌, లాయిడ్‌బ్లాంక్‌ ఫియన్‌ పరిశ్రమలకు భారీగా రాయితీలిచ్చారు. ఈ సంస్థలు అమెరికాలో పెద్దసంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించగలవన్న ఆశాభావంతో ఆయన వారడిగిన అన్ని ప్రయోజనాలు చేకూర్చిపెట్టారు. జనరల్‌ మోటార్స్‌, క్రిస్‌లర్‌లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిలియన్ల డాలర్లను మాఫీ చేసేశారు. ప్రస్తుతం హెల్త్‌కేర్‌ పరిశ్రమపై ఒబామా దృష్టి పెట్టారు. దీంతో ఈ పరిశ్రమ లాబీయిస్టుల్తో వైట్‌హౌస్‌ నిండిపోతోంది. పవర్‌ సెక్టార్‌కు కూడా భారీ రాయితీలు ప్రకటిస్తున్నారు. తనకనుకూలంగా ఉన్న ఈ పరిశ్రమలకు ప్రభుత్వ నిధుల్ని అందజేస్తున్నారు. వీటివల్ల అదనంగా ఉద్యోగావకాశాలు సమకూరకపోగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తిరిగి రెండో ప్రపంచ యుద్దకాలానంతర పరిస్థితుల్ని అమెరికా ఎదుర్కొంటోంది. రష్యా ఆర్థికంగా పుంజుకుంటున్న తరుణంలో ఆ దేశాన్ని కూడా క్రోని కేపిటలిజం ముంచెత్తింది. టెలి కమ్యూనికేషన్స్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికీ క్రోని కేపిటలిజమే కారణం. భారత్‌లో కూడా ఇదిప్పుడు ఊడలేస్తోంది. క్రిందిస్థాయి కంటే పైస్థాయిలోనే అవినీతి జాఢ్యం పెరిగింది. పెద్ద కార్పొరేట్‌ వ్యవస్థలేవీ ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు, మంత్రుల్తో వ్యాపార సంబంధాలు నెరపడంలేదు. ముఖ్యమంత్రులు, ప్రధానుల్నే అవి తమ గుప్పెట పట్టాయి.
తమ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలకు, నాయకులకు విస్తృతంగా విరాళాలిస్తున్నాయి. దీంతో కార్పొరేట్లు ఆడమన్నట్లల్లా రాజకీయ నేతలు ఆడుతున్నారు. వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం, లాభాల కోసం, వారి ఆస్తులు వందలు, వేల రెట్లు పెంచడం కోసం వారికనుకూలంగా ఉత్తర్వులిమ్మంటూ ప్రభుత్వాలపై ఒత్తిళ్ళు తెస్తున్నారు. పౌరసమాజం ఈ విషయాన్ని గుర్తించే లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధానిని తేవాలంటూ డిమాండ్‌ చేస్తోంది. భవిష్యత్‌ పరిణామాల్ని ఊహించిన కాంగ్రెస్‌ ఇందుకు అభ్యంతరం చెబుతోంది. హజారే బృందం ఆలోచనలో ప్రధానంటే మన్మోహన్‌సింగ్‌ కాదు. ఆ పీఠంపై ఎవరుంటేవారే పౌరసమాజానికి లక్ష్యం. ప్రధాని స్థాయిలో వేలు, లక్షల కోట్ల అవినీతి సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రస్తుతం మంత్రుల్ని బాధ్యులుగా చేస్తున్నారు. 2జి స్పెక్ట్రమ్‌లో జరిగిందదే. రాజా, కనిమొళి లాంటివారిని బలేసి ప్రభుత్వ పెద్ద తనకు సంబంధంలేదంటూ తప్పించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ సమష్టిగానే జరుగుతాయి. ఇందుకు ప్రధానే బాధ్యత వహిస్తారు. ఆయన సూచించిన ఎమ్‌పిలకే మంత్రి పదవులు లభిస్తాయి. తనకనుకూలమైన వ్యక్తుల్ని ప్రధాని కేబినెట్‌ సహచరులుగా ఎన్నుకుంటారు. తీరా భారీ అవినీతి విషయాలొచ్చేసరికి ఈ విషయాలన్నింటినీ పక్కనబెడుతున్నారు. ఒకరిద్దర్ని బలేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానిని లోక్‌పాల్‌ బిల్‌ పరిధిలోకి తీసుకురాగలిగితే దేశంలో క్రోని కేపిటలిజం తగ్గుతుంది. అలాగే రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రుల్ని ఈ బిల్‌ పరిధిలోకి తెస్తే భారీ అవినీతికి అడ్డుకట్టవేయగలిగే అవకాశాలుంటాయి.