13, ఆగస్టు 2012, సోమవారం

వీధిబాలల్లోవెలుగునింపుతున్నపోలీస్‌'క్యాప్‌'

సరైన ఆలనా పాలనా లేక.... కన్నవారి ప్రేమ కరువై... ఆరుబయళ్లలో...
వీధి బాలలలుగా బతుకు వెళ్లదీస్తూ... ఆకలి తీర్చుకునే క్రమంలో పెడమార్గం పడుతూ...
పసివయసులో మసిబారుతున్న వారి జీవితాలకు ఆపన్నహస్తం అందిస్తే...
రేపటి దేశ భవిష్యత్‌ని నిర్ణయించే వారిగా.. చరిత్రని తిరగరాసే మేధావులుగా....
తయారు చేయవచ్చన్న దృఢసంకల్పంతో... ఓ మహాయజ్ఞానికి చుట్టిన శ్రీకారం ఇది....
మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తూ... ఖాకీ దుస్తుల వెనుక
కరడు కట్టిన కాఠిన్యమే కాదు... మంచి మనసుంటుందని నిరూపిస్తూ...
దేశానికే ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు సింహపురి పోలీస్‌ అన్నలు...
సాధారణంగా పోలీస్‌ను చూస్తే పెద్దవాళ్ళే కొంత భయపడతారు. ఇక చిన్నపిల్లలు అయితే పారిపోతారు. అటువంటిది నిరాదరణకు గురైన చిన్నారులు ఎస్పీని పోలీస్‌ అన్నయ్యా...! అని ఆప్యాయంగా చిరునవ్వులతో పలకరిస్తూ ఆయన దగ్గరకు పరుగు తీస్తున్నారంటే ఎస్పీ ఆ చిన్నా రుల పట్ల చూపుతున్న శ్రద్ద ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. దేశంలో ఎక్కడాలేని విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుజిల్లాలో మొట్టమొదటి సారిగా ఛైల్డ్‌ అండ్‌ పోలీస్‌ ప్రాజెక్ట్‌ (క్యాప్‌) స్ధాపించి ఎందరో నిరుపేద చిన్నారులకు జీవితపాఠాలు నేర్పుతూ వారి భవిష్యతు ్తకు బలమైన పునాదులు వేస్తున్నారు. ఇదే క్రమంలో వారికి జీవితలక్ష్యాలను ఎంచుకునేలా విద్యా భోధన, క్రీడల పట్ల మక్కువ కలిగేలా వారికి సకల సౌకర్యాలు కల్పిస్తూ మరోసారి వారు గత ప్రపంచం వైపు వెనక్కు తిరిగి చూడకుండా ఉండేలా వారిపట్ల అభిమానం చూపుతున్నారు.
పనిచేసే తత్వం.. పని పట్ల విశ్వాసం.. విజయానికి మూల కార ణాలు.. విశ్వాసం అదృష్టంకంటే గొప్ప ది.. పట్టుదల మనిషి అదృష్టం కంటే మరింత గొప్పది.అదే పట్టుదలతో మీ భవి ష్యత్తుకు మా భరోసా.. అంటూ నెల్లూరు జిల్లా ఎస్పీ బివి. రమణ కుమార్‌ నిరాదరణకు గురైన చిన్నారు లను ఆదరిస్తూ శభాష్‌.. ఎస్పీ అనిపిం చుకుంటున్నారు. దాతలకు ప్రసిద్థి చెందిన నెల్లూరు జిల్లా లో పెరిగి పోతు న్న మురికి వాడ లు.. అంతకు మించి అక్కడి చిన్నారులు ఎలాంటి చదువు సంధ్యలకు నోచు కోక పోవటం... వెనుక వారి పట్ల సమాజం నిర్లిప్త ధోరణులతో వ్యవవహరించడం వల్ల చిన్నారి బాల్యం చిదిమేయటమే కాకుండా... వారు ఇతర ప్రభావాలకు లోనై... అసాంఘిక శక్తుల చేతిలో కీలుబొమ్మలుగా మారి ఏ ఉగ్రవాదు లుగానో... తీవ్రవాదులుగానో మారక ముందే వారికి అండగా నిలచి, చదువు సంధ్యలు నేర్పిస్తే.. రేపటి సమాజంలో మంచి పౌరులుగా తయా రవుతారన్న భావనతో శ్రీకారం చుట్టిన ప్రోజక్టే క్యాప్‌....
ఆదర్శంగా.... ముందుకు...
నేటి సమాజంలో శాంతి భధ్రతలపైనే పూర్తిస్ధాయిలో పట్టు సాధిం చేందుకు ప్రయత్నిస్తు... విఫలమవుతున్న పోలీసు అధికారుల్లో అందుకు భిన్నంగా నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి తనదైన శైలిలో అరాచకాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్న బివి. రమణ కుమార్‌ శాంతిభధ్రతలను పరిరక్షణలో పూర్తిగా పట్టు సాధించా రనే చెప్పాలి... ఓవైపు రాజీలేని ధోరణిలో పోలీస్‌ ఉద్యోగానికి వన్నె తెస్తున్న ఆయన మరోవైపు నిరాదరణకు గురైన చిన్నారులని ఆదరించ డం మనిషిగా తన బాధ్యతగా చెప్తూ.... వారి జీవితాలకు బంగారుబాట వేస్తు జాతీయ స్ధాయిలో అందరికీ ఆదర్శం గా నిలుస్తు న్నారనటంలో సందేహం లేదెవ్వరికీ...
సమాజంలో నిరాదరణకు గురై తల్లి దండ్రుల ప్రేమానురాగాల ను కూడా పూర్తిస్ధాయిలో పొందలేక వీధుల్లో... శివార్ల లో... స్మశానాల్లో... జులా యిలుగా తిరుగుతూ భవిష్యత్‌ని పాడు చేసుకుంటున్న చిన్నారులని గుర్తించి.. “మీభవిష్యత్‌కి మా భరోసా.. అన్న నినా దంతో... పోలీసులు ఏర్పాటు చేసిన క్యాప్‌ పాఠశా లలో చేరుస్తూ.. వారికి కొత్త ప్రపంచం చూపిస్తున్నా రాయన... తాను ఏ జిల్లాలో పనిచేసినా నిరాదరణకు గురైన చిన్నా రులను ఆదరించి తనవంతు చేయూతను అందిస్తు ముందుకు సాగుతు న్న ఎస్పీ... నెల్లూరు జిల్లాలో కూడా బాధ్యతలు చేపట్టాక 12 మంది అంధులకు కంటి ఆపరేషన్లను చేయించి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ఓరోజు అనుకోకుండా ఆయన నెల్లూరు పట్టణ పరిధిలోని పెన్నా నది ఒడ్డున ఉన్న బోడిగాడితోటకు వెళ్ళారు. అక్కడి స్మశానాల మద్య చింపిరి జుట్టు, చిరిగిపోయిన బట్ట లు,మాసిన శరీరం సాంప్రదాయానికి భిన్నంగా నిరాదరణకు గురై జీవి తమంటే తెలియనిచిన్నారులు గడపడాన్ని చూసి చలించి వారి జీవితా లను మార్చేసి వారిని ఉన్నత మార్గం వైపు నడిపించాలని ఇందుకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా... వెనక్కి తగ్గకూడదని .. వారి జీవితాల్లో వెలుగులు ప్రసరిం ప చేయాలని...నిర్ణయం తీసుకున్నారు.
చేయి...చేయి...కలిపి...
తాను చేసే బృహత్తరకార్యక్రమానికి అధికారికంగాఎలాంటి నిధులు కేటాయించలేమని భావించి... తనకి వచ్చిన ఆలోచనని తోలి సిబ్బంది తో పంచుకున్నారు. ఎస్పీ సార్‌ వినూత్న ఆశయానికి వాస్తవ రూపం కల్పించే క్రమంలో అధికారులు చేయూత ఇచ్చేందుకు సిద్దం కావటం.. పోలీస్‌ సిబ్బంది ఒక్కరోజువేతనం అందించడంతో... దేశం లో ఎక్కడా లేని విధంగా క్యాప్‌ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు క్షణాల్లో జరిగి పోయాయి... పోలీస్‌లని చూస్తే పేదలు భయపడతారని భావించి... స్థానిక వసంతలక్ష్మీ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ సహకారంతో పోలీసులను సివిల్‌ డ్రెస్‌లో బోడిగాడితోటకు పంపి వారితో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి... జులాయిలుగా తిరుగు తున్న చిన్నారులకు మంచి జీవితాన్ని అందిస్తా మని ఓప్పించ గలిగా రు... దశలవారిగా 59 మంది చిన్నారులను గత ఏడాది అక్టోబర్‌ 3వ తేది క్యాప్‌కు తీసుకొచ్చి.. వారికి భరోసా కలిపించే లా సన్నిహితంగా మెలుగుతూ... వారిలో భయాన్ని పోగట్టగలిగారు.
మారిన జీవితాలు....
నవంబర్‌ 14వ తేది బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆ చిన్నా రులను స్కూల్‌లో చేర్పించేసి అందరిలా చేతులు దులుపుకుని సద రు కార్యక్రమాన్ని ఆపేయలే... నిత్యం ఆ చిన్నారులకు అండగా నిలుస్తూ... ఉదయంనిద్రలేచింది మొదలు వారికి కావాల్సిన సకల సౌక ర్యాలు కల్పించారు. క్యాప్‌ ప్రాంగణానికి పూర్తి భధ్రతను కల్పించ డం తో పాటు చిన్నారులకు రుచికరమైన ఆహారాన్ని అందించే ఏర్పాట్లు చేసారు. చదువు పట్ల మరింత శ్రద్ద చూపేలా ఆరుగురు బిఇడి టీచర్స్‌ ను, వ్యాయామ ఉపాధ్యాయులను నియమించారు. అన్ని రకాల క్రీడా పరికరాలను సమకూర్చి...ఎప్పటికప్పుడు వారి తల్లిదండ్రులతో సమావే శాలు ఏర్పా టు చేస్తూ... క్యాప్‌ ప్రాజెక్ట్‌ ద్వారా కొత్త జీవితాన్ని ప్రసా దించేందుకు సహకరించాలని కోరు తున్నారు. నిన్నటి వరకు కనీస సంస్కా రం తెలియనివారు నేడు ఆ ప్రాంగణా నికి ఎవరొచ్చినా... నమస్కారాలతో స్వాగతం పలుకు తున్నారంటే... వారిలో వచ్చిన మార్పుకు చక్కని నిదర్శనం. ఉన్నతమైన ఆశయంతో ముంద డుగు వేస్తూ ఉన్నతాధికారుల మన్ననలు అందు కుంటున్నారు.
సమయం దొరికితే చిన్నారులతోనే...
నిత్యం శాంతిభధ్రతల పరిరక్షణలో బిజీ బిజాగా ఉండే తాను ఏ మాత్రం సమయం చిక్కినా... కాప్‌లోని చిన్నారులతో గడుపుతుంటాన ని లైఫ్‌తో చెప్పారు ఎస్పీ బివి.రమణకుమార్‌. ఇంత చిన్న వయసులో తగిన ప్రేమ అందక పోవటం వల్ల ఆర్థిక భరోసా లేక వారిని తప్పుడు మార్గం వపు అడుగువేయిస్తోంది. వారిని గుర్తించి మార్పు తీసుకువస్తే నేరాలు తగ్గడంతోపాటు వారికి మంచి జీవితాన్ని అందిం చినవారమ వు తామనిఅన్నారు. చిన్నారులని ఆదుకోవాలన్న ఆలోచన రాగానే వారి తల్లిదండ్రులని సంప్రదిస్తే....పోలీసులమన్న భావనతో మొదట వారు సహకరించలేదని ఆ తరువాత సివిల్‌ డ్రెస్‌లో వెళ్ళి వారికి నచ్చచెప్పాక కొంత ఫలితం లభించిందని... ప్రస్తుతం 59 మంది చిన్నారుల్ని అక్కు న చేర్చుకున్నా మని త్వరలోనే జులాయిలుగా తిరిగే మరింత మంది చిన్నారులను గుర్తించి క్యాప్‌ ద్వారా మంచి జీవితాన్ని అందిస్తామ న్నారు. భవిష్య త్తులో ఈ ప్రాజెక్టును మరింత పటిష్టంగా నిర్వహిం చేందుకు ఫౌండేషన్‌ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించాలనే ఆలోచన కూడా ఉందని అందుకు డిజిపి అనుమతి కూడా కోరామన్నారు.రానున్న రోజుల్లోనూ ఈ ఖాకీ బాస్‌ సదాశయానికి అందరి సహ కారం లభించాలని మనమూ ఆశిద్దాం.


మర్చిపోలేను ఎన్నటికీ...
అమ్మా, నాన్న చిత్తుకాగితాలు ఏరుకుని జీవితాన్ని వెల్లబుచ్చు తుంటారు. నన్ను పట్టించుకునే తీరిక, చదివించాలన్న ఆలోచన వారికి లేదు. ఆర్ధిక ఇబ్బందుల నడుమ జులాయిగా తిరుగుతు అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఓచేతిని కోల్పో యి వికలాంగుడిగా మారి నన్ను ఎస్పీ బివి. రమణ కుమార్‌ దేవుడిలా ఆదుకున్నారు... చేతిని బాగు చేయి స్తా... నాతో వస్తావా.. అంటూ ఆప్యాయంగా పలకరిం చి క్యాప్‌ ప్రాజెక్టుకు తీసుకువచ్చి, కృత్రిమ అవయవం అమర్చి ఈ పాఠశాలలో చేర్చారు. ఇది నాకు మరుపు రాని సంఘటన. సార్‌ను జీవితంలో మరచిపోలేను.
- మణి
(వికలాంగబాలుడు)


పోలీస్‌ను అవుతా...
బోడిగాడితోట స్మశానంలో అనా ధలుగా తిరుగుతున్న తన లాంటి చిన్నారులను గుర్తించి ఎస్పీ సార్‌. .. మా బాల్యాన్ని చిదిమేస్తున్న జీవితాల నుండి మమ్మల్ని కాపా డటమే కాకుండా మా భవిష్యత్‌పై భరోసా కలిపించేలా క్యాప్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ఓనమాలు కూడా తెలియని తమ చేత ఇంగ్లీష్‌ చదు వులు చదివిస్తున్నారు. ఎస్పీ సార్‌నే ఆదర్శంగా తీసు కుని పోలీస్‌ అధికారిని అవుతా.. అందుకోసం క్యాప్‌నే వేదికగా చేసుకుని ఇప్పటి నుంచే ముందడుగు వేస్తు న్నా.. అందుకు అందరి ప్రోత్సాహం లభిస్తోంది కూడా.
- జ్యోతి
విద్యార్థిని

హాస్యచక్రవర్తి రేలంగి జయంతి

తెలుగునాట సినిమా రంగం పురుడుపోసుకున్న వేళ...వెం డితెరకు నటీమణులను పరిచయం చేసే బాధ్యతను నిర్విఘ్నంగా నిర్వహిస్తూ... మరోవైపు పౌరాణిక, జానపద, సాంఘీక చలన చిత్రాల్లో అద్వితీయమైన నటనతో హస్యాన్ని పండిస్తూ తెలుగు చార్లీచాపీన్‌గా, హాస్యకుటుంబానికి ఆదిపురుషుడుగా పేరుగాంచారు రేలంగి వెంకటరామయ్య. ఇల్లరికంలో ఉన్న మజా అంటూ తెలుగింటి అల్లుళ్లకు కొత్తభాస్యం నేర్పిన ఆయన హాస్యాన్ని పండిస్తూ, ఆనాటి అగ్రకథానాయకుల తో సమానంగా పారి తోషికం తీసుకుంటూ, మనస్సున మనిషిగా అటు పరిశ్రమలోనూ, ఆపద్భాందవుడిగా ఇటు బంధువర్గంలోనూ, హాస్యచక్రవర్తిగా ప్రేక్షకుల్లోనూ పేరుగాంచారు. రేలంగిగా అందరికీ సుపరిచిత మయ్యారు. ఆయ పెంచిన మంచిని అనుసరిస్తూ, నేర్పిన క్రమశిక్షణను పాటిస్తూ నేటికి చిత్రరంగ పరిశ్రమ నుంచి ఆప్యాయతను అందుకుంటున్న రేలంగి ఏకైక కుమారుడు రేలంగి సత్యనారాయణ బాబు తో ఆంధ్రప్రభ లైఫ్‌ ఇంటర్వ్యూ...
రేలంగి! తెలుగు సినిమాకు నవ్వులద్దిన హాస్య నటుడు. ఆయన నడిచినా, నవ్వినా, నటించినా, నాట్యం చేసినా...ప్రేక్షకులకు నవ్వులే నవ్వులు! మాయా బజార్‌లో ఉత్తరకుమారుడిగా 'సుందరి నీవంటి దివ్య స్వరూపం .... 'అంటూ సావిత్రికి సరిజోడుగా ఆయన పం డించిన హావభావాలు ఎవరు మర్చిపోగలరు. అలాగే తండ్రి, మామ, అల్లుడు...లాంటి పాత్రల్లో అందరికీ ఆప్తుడైన ఒక భోళా మనిషి.
హాస్యరంగంలో పద్మశ్రీ తీసుకున్న మొదటి నటుడు ఆయన. హరికథా భాగవతార్‌ , హార్మోనియం షాపు నిర్వహించే రేలంగి రామస్వామి కుమారుడిగా ఆగష్టు13, 1910లో తూర్పు గోదావరి జిల్లా, రావులపాడులో జ న్మించారు. నాలుగుదశాబ్దాల పాటు తెలుగుచిత్రసీమలో హాస్యనటుడిగా ప్రేక్షకులను తన హావభావాలతోనే క డుపుబ్బ నవ్వించిన ఆయన సెప్టెంబర్‌27, 1975లో మరణించారు. హాస్యకుటుంబానికి మార్గదర్శిగా అందరి హృదయాలలో నిలిచారు. మూడు దశా బ్దాల క్రితం ఆయన భౌతికంగా ఈ లోకం నుంచి దూరమైనా, శ్రీకృష్ణతులాభారంలో వసంతుడిగా, ఇల్లరికం అల్లుడిగా ఎన్నో హాస్యపాత్రల ద్వారా ఆయన పంచిన ఆనందాన్ని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికీ ఆస్వాదిస్తున్నారు. నేటికీ తెలుగువారికి హాస్యమంటే ముందు గుర్తొచ్చేది రేలంగి పేరే.
మీ చిన్నతనం గురించి చెప్పండి?
చిన్నతనంలోనే నాన్నగారి కుటుంబం కాకినాడకు వచ్చి అక్కడే స్థిరపడ్డాం. ఆయన విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. నాన్నగారు సినిమాల్లో నటించడం మొదలుపెట్టిన తరువాత చాలా రోజుల వరకు మేమంతా కాకినాడలోనే ఉండేవాళ్లం. కొద్దిగా సినిమాల్లో పేరు రావడంతో మా మకాం మద్రాస్‌కు మారింది.
అప్పుడప్పుడు నాన్నతో పాటు నేను, అమ్మ పుల్లయ్యగారి ఇంటికి వెళ్లేవాళ్లం. ఎంతో ఆప్యాయంగా చూసేవారు. కొత్త కథానాయికగా సినీరంగానికి ఎవ్వరినైనా పరిచయం చేయాలంటే పుల్లయ్య తరపున నాన్నగారు ఆ అమ్మా యి ఇంటికి వెళ్లి వారిని ఒప్పించి నటించడానికి అంగీ కరింపచేసేవారు. అలా నా చిన్నతనంలో అంజలి అత్త మా ఇంటి కి తరుచు వచ్చేవారు. కొద్దిరోజులు మాతోనే కలిసి ఉన్నారు. నాన్నగారు సభ్యుడిగా ఉన్న కాకినాడ యంగ్‌మెన్స్‌ హ్యాపీ క్లబ్‌ నుంచి వచ్చిన వారే దాదాపు25మంది సినిమారంగంలో మంచిస్థాయికి ఎదిగారు. ఆయనకు నేను ఒక్కడినే కుమారుడిని అయినా, మా ఇంట్లో మాత్రం ప్రతిరోజూ కనీసం ముఫ్పై నుంచి నలభై మంది భోజనం చేసేవారు. బంధువుల పిల్లలందరూ మా ఇం ట్లోనే ఉండేవారు. వారికి విద్యాబుద్ధులు చెప్పించడంతో పాటు వివాహాలు కూడా మా అమ్మనాన్న చేతుల మీదుగానే జరిగాయి.
మీరు ఎంతవరకు చదువుకున్నారు? సినిమాల్లో నటిం చే ప్రయత్నం చేశారా?
నాకు పెద్దగా చదువు అబ్బలేదు. పదవ తరగతి వరకు మాత్రమే చదివాను. చిన్నతనంలోనే కె.ఎస్‌ ప్రకాష్‌రావు (రాఘవేంద్రరావు తండ్రి)డైరెక్షన్‌లో బాలానందం (1950)పిల్లల సినిమాలో హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేశాను. కాని ఆ సినిమా విజయవంతం కాలేదు. హీరో పాత్రలో నేను సరైన నటనను చేయలేకపోయాను అన్న ఫీలింగ్‌తో ఆ తరువాత సిని మా రంగం వైపు వెళ్లలేదు.
కాలేజీ చదువులకు ఎందుకు స్వస్తి పలికారు?
సినీరంగంలో ఏర్పడే చెడుస్నేహాల వల్ల ఎక్కడ చేతికి అందకుండా పోతానో అన్న భయంతో నాన్నగారు నాకు చిన్నతనంలోనే వి వాహం చేశారు. మాది మేనరికం. నాన్నగారి మంచితనానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. మా మామగారు బాగా బతికిన మనిషి. మా ఆర్థికపరిస్థితి అంతంత మాత్రమే ఉన్నరోజుల్లో మేము కాకినాడలో ఉన్నప్పుడే ఆయన తన కూతురిని నేను చేసుకోవాలని నాన్నగారితో మాట తీసు కున్నారట. కాని నాన్నగారు సినిమాల్లో సక్సెస్స్‌ కావడంతో మా స్థితి పెరిగింది. విధివశాత్తు మా మామగారు ఆర్థికంగా చితి కిపోయారు. కాని నాన్నగారు అవి ఏమి పట్టించుకోలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి మేనరికమే చేశారు. ఆయన దృష్టిలో డబ్బు కన్నా మాట విలువైనది. ఎస్‌ఎస్సీ కాగానే నాకు పెళ్లి చేసి, నన్ను ఇంటికే పరిమితం చేశారు. నేనే ఏకైక సంతానం కావడంతో, కనీసం నాకు అయినా ఎక్కువ మంది సంతానం ఉండాలని అనేవారు. అలా ఆరుగురు పిల్లలకు తండ్రిని అయ్యాను. ఇద్దరు అబ్బాయిలు, నలుగురు అమ్మాయిలు. అందరూ జీవితంలో స్థిరపడ్డారు.
మీ పిల్లలు సినిమా రంగంలోకి వచ్చారా?
నేను సినిమారంగంలో ఇమిడలేను అని నాన్నగారు గ్రహించారు. నమ్మకం లేని వ్యాపారం సినిమా అని తరచుగా అంటుండే వారు. ఆయన ప్రభావం వల్లనేమో నాకు సినిమాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఇక మా పెద్దాబ్బాయి తిరుమలబాబు కొన్ని సినిమాల్లో నటించాడు. చిన్నబ్బాయి హేమంత్‌బాబు కనకాల ఫిలిమ్‌ ఇనిస్టి ట్యూట్‌లో మూడు సంవత్సరాలు శిక్షణ తీసుకున్నా ఫలితం లేదు. కొన్ని పాత్రలు వేసాడు కాని పెద్దగా పేరు రాలేదు.
మీ నాన్నగారు మీతో ఎలా ఉండేవారు?
ఎంతో క్రమశిక్షణతో ఉండే ఆయన సంతోషాన్ని, కోపాన్ని తట్టుకునేవారు కాదు. తెలియక ఎంత పెద్ద పొర పాటు చేసినా క్షమించే వారు కాని తెలిసి చిన్న తప్పు చేసినా సహించేవారు కాదు. చాలా కోపిష్టి. కోపం వచ్చిందంటే చాలు చేతిలో ఏది ఉంటే అది విసిరేసేవారు. బండబూతులు అలవోకగా వచ్చేవి. అయితే ఆయన కోపం పాల నుర గలాంటింది. ఆ ఉగ్రరూపం కొద్ది నిమిషాలే. ఆ తరువాత శాం తమూర్తిగా మారిపోయేవారు. భోళామనిషి. అబద్ధం తెలియని మనిషి. ఆయన కోపం గురించి చెప్పాలంటే ఒక సంఘటన చెప్పాలి. మా భవిష్యత్‌ ఆలోచించి ఆయన తాడేపల్లి గూడెంలో ఏక్లాస్‌ థియేటర్‌ కట్టించేందుకు సమాయత్తం అయ్యారు. థియేటర్‌ పక్కన, ఓ మూల చిన్నగా షెడ్‌ కట్టించమని చెప్పి ఆయన మద్రాస్‌ వెళ్లిపోయారు. షెడ్‌ ఎందుకు అంటూ థియేటర్‌ కట్టాక మిగిలిన మెటీరియల్‌తో నేను చిన్న ఇల్లు కట్టిం చాను. అంతా పూర్తి అయిన తరువాత వచ్చిన నాన్నగారు ఆ ఇంటిని చూసి తిట్లభారతం మొదలుపెట్టారు. మేనేజర్‌, ఇతర పనివాళ్లముందు. చాలా బాధకలిగింది. అది కొద్ది నిమిషాలే. రైలు ఎక్కేముందు భోరున ఏడుస్తూ... 'ఎందుకు రా చెప్పిన పనిచేయకుండా నాతో అందరి ముందు తిట్లు తింటావు ' అంటూ బాధపడ్డారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం. కోపం, బాధ, సంతోషం ఏది మనస్సులో దాచుకునే వ్యక్తికాదు.
మీతో ఎలా ఉండేవారు?
నేను, నాన్నగారు స్నేహితుల్లా ఉండేవాళ్లం. ఆయన చేసిన మంచిపనులు చెప్పేవారు కాదు, కాని తప్పులు మాత్రం చెప్పేవారు. ఎందుకు నాన్న ఎప్పుడో జరిగినవి చెబుతారు అంటే అదికాదురా... నీవు తప్పులు చేయకు...తప్పులు చెెస్తే వాటి ఫలితం చాలా బాధకరంగా ఉంటుంది. అందుకే నీవు తప్పులు చేయకు అంటూ మందలించేవారు. స్నేహితుల ప్రభావంతో డ్రింక్‌ చేసేవాడిని. మానేయమని నాన్న ఎంతో నచ్చచెప్పారు. నాకు బాగా గుర్తు ఆయనకు ఆరోగ్యం దెబ్బతిన్న తరువాత ఒక రోజు ఏడుస్తూ 'తాగుడు మానేయిరా... నీ పిల్లలంతా వీధిన పడ్డతారని నాకు భయంగా ఉందిరా ' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చనిపోయిన తరువాత పదేపదే ఆయన పడిన ఆవేదన గుర్తుకు వచ్చి, నేను ఆ వ్యసనం నుంచి బయటపడ్డాను.
అగ్రహీరోలతో సమానంగా మీ నాన్నగారి పారితోషికం ఉండేద ట? మరి ప్రస్తుతం మీ ఆర్థిక పరిస్థితిని చూస్తుంటే వారితో సమానంగా ఉన్నట్లు లేదే?
నిజమే...ఆ రోజుల్లోఎన్టీఆర్‌, ఎఎన్‌ఆర్‌తో సమానంగా నాన్నగారికి పారితోషకం ఉండేది. వీరి ముగ్గురి పారితోషికాలు 40, 39,38వేలరూపాయలుగా ఉండేవి. కాని నాన్నగారు ఎప్పుడు 38వేలే తనకు ఇవ్వమని చెప్పేవారు. అలా ఎందుకు అని ఎప్పుడైనా అడిగితే 'మనదేశం హీరోకు ప్రాధాన్యత ఇచ్చే దేశం' అనే వారు. ఆయనకు అసలు అహంకారం అనేది ఉండేది కాదు. అయితే ఎప్పుుడు ఒక మాట అనేవారు. 'రాళ్లు తిని కరిగించుకునే వయస్సులో తిందామంటే రాళ్ళు కూడా దొరకలేదు. ఇప్పుడు రత్నాలు ఉన్నా తి నే శక్తి లేదు.'
సహాయం కోరి ఇంటికి వచ్చిన ప్రతిఒక్కరికీ ఎదో ఒక సహాయం చేసేవారు. డబ్బుకన్నా స్నేహానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. మా బంధువుల కుటుంబాలలోనే కాకుండా తెలిసినవారి కుటుంబాల్లో దాదాపు రెండువందల జంటలకు పెళ్లిళ్లు చేశారు. ఇక మా అమ్మగారు ఆయనకు తగ్గ ఇల్లాలు. ఎవరింట్లో శుభకార్యం ఉన్నా ఆవిడ హాజరు కావల్సిందే. ఇలా ఇద్దరూ కలిసి ధనం కన్నా మర్యాద, మంచితనం గొప్పవి అని భావించేవారు. అందుకే ఆయన సంపాదన అధికంగానే ఉన్నా చాలా వరకు ఇతరులకు సహాయపడడానికే ఖర్చు అయ్యింది. మరో కారణం... నేను స్వతహాగా ఏ వ్యాపారం చేయకపోవడంతో తాడేపల్లిగూడెంలో థియేటర్‌ చూసుకుంటూ ఉండేవాడిని. చిన్న పట్టణమైన ఆ ఊరిలో ఏ క్లాస్‌ థియేటర్‌ కట్టడం వల్ల నష్టాలు చవిచూశాం. అయితే వారిలా మేం లేమే అన్న బాధ మాకు లేదు.
మీకు ప్రస్తుతం సినీరంగంలో ఎలాంటి ఆదరణ ఉంది?
మా నాన్నగారు చనిపోయి 37సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ అంతా మమ్ముల్ని ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు.
మా పిల్లల అందరి పెళ్ళిళ్లకు సినీప్రముఖులంతా వచ్చారు. ఆఖరి అమ్మాయి పెళ్లికి అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విచ్చేసి, ఆశీస్సులు అందించారు. అక్కినేని గారు, అంజలి గారు ఇప్పటికీ ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు. మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల వారు ఈ లోకంలో లేకపోయినా, వారి మంచితనంతో అంతా సంతోషంగా ఉన్నాం.
మీకు సంబంధించిన విజయగార్డెన్స్‌ వ్యవహారం కోర్టులో ఉంది కదా? ఎంతవరకు వచ్చింది?
మా నాన్నగారు వాణీ స్టూడియో ఎదురుగా ఉన్న విజయగార్డెన్స్‌లో కొబ్బరి, మామిడి తోట ఉన్న పదిఎకరాల స్థలం కొన్నారు. వందల ఎకరాల విజయగార్డెన్స్‌ లో మాది పదిఎకరాల స్థలం. ఆ తరువాత నాగిరెడ్డి గారు మిగతా స్థలం కొన్నారు. మా స్థలం అమ్మమని అడిగితే నాన్నగారు కాదు కుదరదు అన్నారు. నాగిరెడ్డిగారి అబ్బాయి నేను స్నేహితులం. అలా నేను నాన్నగారిపై ఒత్తిడి తీసుకువచ్చాను. మేం కొన్నస్థలం మధ్యలో ఉన్నందున వారు మాపై ఒత్తిడి తీసుకువచ్చారు. చివరికి నాన్నగారు లీజుకు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే లీజు గడువు ముగిసినా మా స్థలం మాకు ఇవ్వనందున మా పిల్లలు కోర్టుకు వెళ్లారు. ఇప్పుడు కోర్టులో ఉంది. న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి మాకు అనుకూలంగా కొద్ది రోజుల్లో తీర్పు వస్తుందన్న ఆశ ఉంది.
రేలంగి కొడుకుగా మీ తండ్రిపేరు నిలిచేలా ఏదైనా చేయాలనుకుంటున్నారా?
ప్రతి ఒక్కరిలో నటించే సత్తా ఉంటుంది. కాని వారిని కెమెరా ముందు ఎలా ప్రజెంట్‌ చేస్తున్నాం అనేది ముఖ్యం. 40సంవత్సరాల నుంచి థియేటర్‌ నిర్వహిస్తున్నాను. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో తెలుసు. మా చిన్నాబ్బాయి హీరోగా, మా నాన్నగారి పేరు నిలిచేలా, జనం మెచ్చేలా ఒక్క చిత్రం తీస్తాను. కోర్టు వ్యవహారం తేలిన తరువాత నాన్నగారి పేరుపై ఒక్క స్వచ్ఛంద సంస్థను స్థాపించాలన్న ఆలోచన ఉందంటూ తండ్రితో తన అనుబంధాన్ని, ఆయన పేరు నిలిచేలా చేయాలనుకుంటున్న కార్యక్రమాలను వివరించారు.