21, జనవరి 2011, శుక్రవారం

రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవైనా దక్కేనా?

కేంద్ర మంత్రి పదవిని ఆశించి భంగపడిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కనీసం టీటీడీ చైర్మన్ పదవైనా దకుతుందేమోనని ఆయన అనుచర వర్గం ఆశిస్తున్నది. తొలుత టీటీడీ చైర్మన్ పదవిపై రాయపాటి ఆసక్తి కనపరిచినప్పటికీ ఆ తర్వాత కేంద్ర మంత్రి పదవిపైనే ఆశలు పెట్టుకున్నారు.

కాంగ్రెస్‌లో రెడ్డి సామాజికవర్గానికి లభించినంత ప్రాధాన్యం మరే సామాజిక వర్గానికి లభించడం లేదని ఆగ్రహం తో ఉన్న రాయపాటికి టీటీడీ చైర్మన్ పదవైనా దక్కుతుందో , లేక కేంద్ర మంత్రి లానే దానిని కూడా ఎవరైనా ఎగరేసుకుపోతారో వేచి చూడాల్సిందే.

కాంగ్రెస్ కి పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి గుడ్‌బై

చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి ఎన్.రంగసామి ఎట్టకేలకు పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన కొత్త పార్టీ పెట్టే యోచనలో ఉన్నారని పలువురు భావిస్తున్నారు. పుదుచ్చేరి రీజియన్‌లో రంగసామికి మంచి పట్టు ఉండడంతో త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.

ప్రేతాత్మ హైకోర్టుకు.వెళ్లింది.

ప్రేతాత్మ కోర్టుకు వెళ్లింది. అదీ రాష్ట హైకోర్టుకు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. అయితే ఇది అక్షరాల నిజం. 2004 సంవత్సరంలో చనిపోయిన మహిళ పేరుతో రాష్ట్ర హైకోర్టు నుంచి అధికారులకు నోటీసులు వచ్చాయి. ఇది చూసి ఆశ్చర్య పోవడం అధికారుల వంతయింది. అంతేకాదు మరికొందరి పేర్ల మీద కూడా వారికి తెలియకుండానే అధికా రులకు నోటీసులు అందాయి. ఆ సంఘటన కలకలం సృష్టిస్తోంది.

తొట్టంబేడు మండలం కాసరం దళితవాడకు చెందిన చింతగింజల గున్నయ్య భార్య చింతగింజల లక్ష్మమ్మ పేరున పదేళ్ల కిందట కాసరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 388-1లో 1.50 ఎకరాలు పట్టా ఇచ్చారు. ఈమె 2004 మార్చి నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. లక్ష్మమ్మ భర్త గున్నయ్య ఈ భూమిని ఓ స్థానికేతర భూస్వామికి లీజుకిచ్చాడు. చింతగింజల లక్ష్మమ్మతోపాటు ఇదే గ్రామానికి చెందిన గుండ్ల పుట్టమ్మ, గుండ్ల ఎర్రయ్య, నెలబల్లి వెంకటస్వామి, మగ్గం పెంచలయ్య, వెలంపాటి రత్నయ్య అనే వారికి కూడా పట్టాలు ఇచ్చారు. వీరు కూడా సదరు భూస్వామికి భూమిని లీజుకిచ్చారు. కాలగమనంలో ఆ భూమి చేతులు మారింది. దీంతో రెవెన్యూ అధికారులు అసలైన పట్టాదారులకు నోటీసులు పంపి సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వారి నుండి ఎలాంటి సమాధా నం రాలేదు.

ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ భూమిని తొట్టంబేడు రెవెన్యూ అధికారులు గత ఏడాది ఆగస్టు 18న స్వాధీనం చేసుకున్నారు. స్థానిక దళితుల నుండి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తి 43.48 ఎకరాలు తీసుకుని తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ భూమి మొత్తాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డుల ను నాటారు. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దళితులకు పంపిణీ చేసిన భూమిని రెవెన్యూ అధికారులు మళ్లీ స్వాధీనం చేసుకోవడంపై పట్టాదారుల పేరుతో కొంతమంది కోర్టును (రిట్ పిటిషన్ నెంబరు 30961/ 2010) ఆశ్రయించారు. అయితే కోర్టుకు వెళ్లిన విషయం తమకు తెలియదని అసలైన పట్టాదారులు అంటున్నారు.

కాసరం దళితవాడకు చెందిన చింతగింజల లక్ష్మమ్మ పేరు కూడా కోర్టుకు వెళ్లిన వారి జాబితాలో ఉంది. అయితే వాస్తవానికి లక్ష్మమ్మ మృతి చెందింది. చనిపోయిన లక్ష్మమ్మ కోర్టుకు ఎలా వెళ్లిందో తెలియక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సైతం నివ్వెరపోతున్నారు. తమకు తెలియకుండానే తమ పేరున ఎవరు కోర్టుకు వెళ్లారంటూ తలలు పట్టుకుంటున్నారు.

సిండికేట్‌గా ఏర్పడి మరీ దోచుకుంటున్నారు....

ఇదివరకు ఎవరికి వారుగా ఉండే మద్యం బడా వ్యాపారులు ప్రస్తుతం ఒక్కటయ్యారు. ప్రాంతాలవారీగా సిండికేట్‌గా ఏర్పడి మరీ దోచుకుంటున్నారు. ప్రభుత్వ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. మద్యం ప్రియుల అవసరాల్ని సొమ్ము చేసుకుంటున్నారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒక్కో బాటిల్‌పై బ్రాండును బట్టి రూ.20నుంచి 30 దాకా అదనంగా ఒక్కోఫుల్ బాటిల్‌పై 70నుంచి రూ.100వరకు అదనంగా గుంజుతున్నారు. ఇంత జరుగు తున్నా ఎక్సైజ్ అధికారులు మాత్రం నిద్ర మత్తులో జోగుతున్నారు.

ఎవరెంత రేటు కు అమ్ముకున్నా... తమకు రావాల్సిన వాటా వస్తే చాలన్న ఆలోచన ఎ క్సైజ్‌శాఖ అధికారులదని.. ప్రతినెలా కోట్లలోనే అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు సమాచారం. ఒక్కో షాపుపరిధిలో 7నుంచి10 బెల్టు షాపుల వరకు కిరాణా కొట్టు, కూల్‌డ్రింక్ షాపు ఇలా ఒకటేమిటి? వాడ వాడలా బెల్టుషాపులు దర్శనమిస్తాయి.


మద్యం ప్రియులను వ్యాపారులు దోచుకుంటుంటే వ్యాపారులను అధికారులు దోచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. లైసెన్స్‌డ్ షాపులనుంచి ఎక్సైజ్ కాని స్టేబుల్‌స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు నెలవారీ మా మూళ్లు ముడుతున్నట్టు ఆరోపణలున్నాయి.