8, ఏప్రిల్ 2011, శుక్రవారం

టీటీడీ చైర్మన్‌గా రాయపాటి

సుదీర్ఘకాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ పదవి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావుకు తిరుమల వెంకన్న ఆశీస్సులు లభించాయి. టీటీడీ చైర్మన్‌గా రాయపాటి నియామకాన్ని 10 జన్‌పథ్‌కు నివేదించటంతో మార్గం సుగమమైనట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది.

అంతకుముందు ఆయన బోర్డు సభ్యుడిగా పనిచే సిన రాయపాటి 2004లో మంత్రి పదవి ఆశించి భంగపడి, టీటీడీ చైర్మన్ పదవి ఆశించారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేయాలన్నది తన చిరకాల వాంఛ అని అనేకమార్లు ముఖ్యుల వద్ద ప్రస్తావించిన ఆయన ఎట్టకేలకు సఫలీకృతులయ్యారు. ఉగాది రోజున బోర్డును ప్రకటించాల్సి ఉన్నా వాయిదా పడింది.

హాజారే దీక్ష వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం

హాజారే దీక్ష వెనక ఆర్‌ఎస్‌ఎస్ హస్తముందని, తెరవెనుక నుంచి కథ వారే నడుపుతున్నారని ఎన్సీపీ మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌ ఆరోపించారు. ఒకప్పుడు హజారే చేపట్టిన ఆందోళన కారణంగా జైన్ లాగే మాలిక్‌ కూడా మంత్రి పదవి కోల్పోయిన విషయం తెలిసిందే

అన్నాహజారే ఓ ‘ఫ్రాడ్’

ఒకవైపు అన్నాహజారే ఢిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతు ఇస్తున్నట్లు స్వయంగా శివసేన అధినేత బాల్‌ఠాక్రే ప్రకటించగా మరోవైపు శివసేన ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్‌దాదా జైన్ మాత్రం ప్రముఖ సంఘసంస్కర్త, గాంధేయవాదిగా వెలుగొందుతున్న అన్నాహజారే ‘ఫ్రాడ్’ అని, ఆయన కార్యకర్తలు నేరస్తులు, బ్లాక్ మెయిలర్లని, అనవసరంగా ఆయన్ని మహాత్మాగాంధీని చేయవద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సర్వత్రా ఆశ్చర్య పోయేలా చేసారు.

గతంలో జైన్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయనతోపాటు మరో నలుగురు మంత్రులకు వ్యతిరేకంగా అన్నాహజారే ఆందోళన చేపట్టారు. అప్పటినుంచి అన్నాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తునే .. ఇందులోభాగంగానే అన్నాకు దీటుగా జైన్ కూడా నిరాహార దీక్ష చేప ట్టిన విషయం తెలిసిందే. సావంత్ కమిషన్ విచారణలో హజారే అవినీతి బయటపడిందని, అనవసరంగా ఆయనను గాంధీతో పోల్చవద్దంటూ వ్యాఖ్యానించారు

నటి సుజాతకి చిత్ర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు

ప్రేయసిగా, అందమైన అక్కగా, మంచి అమ్మగా ఇలా ఎన్నో పాత్రలకు జీవంపోసిన నటి సుజాత. ఆమె బుధవారం మృతిచెందిన విషయం తెలి సిందే. ఈమె అంత్యక్రియలు కీల్‌పాక్ క్రిస్టియన్ శ్మశానవాటికలో జరిగాయి. ఈ సందర్భంగా సుజాత భౌతికకాయానికి పలువురు చిత్ర ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. అంతకుముందు సుజాత భౌతిక కాయానికి ఆమె నివాసంలో పలువురు చిత్ర ప్రముఖులు నివాళులర్పించారు.

భక్తులను తికమకపెడుతున్న బులెటిన్‌లు

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి డెరైక్టర్ సఫాయా విడుదల చేస్తున్న బులెటిన్‌లు భక్తులను తికమకపెడుతున్నాయి. ఐసీయూలోనికి ఇతరులను అనుమతించక పోయినా, కనీసం అద్దాల బయటి నుంచి అయినా కొందరికైనా బాబాను చూపించవచ్చు కదా? భక్తుల కోరిక మేరకు అద్దాల బయటి నుంచి వీడియో చిత్రీకరించి చూపడానికి అభ్యంతరం ఏమిటి? అనేవి కోట్లాది మంది మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలు. బాబాకు అత్యంత రహస్యంగా వైద్యం చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బి జే పీతోనే సుపరిపాలన : హేమమాలిని

బి జే పీతోనే సుపరిపాలన సాధ్యమవుతుందని ప్రముఖ నటి హేమమాలిని పేర్కొన్నారు. గత 50 సంవత్సరాలుగా అధికార పీఠాన్ని అంటిపెట్టుకున్న కాంగ్రెస్ వల్ల చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగకపోవడం శోచనీయమన్నారు. భారతదేశంలో అవినీతి పెల్లుబుకుతోందని, ఐదేళ్లు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో పలు అభివృద్ధి పథకాలు అమలుచేసి దేశాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువెలామ్ని, వాజ్‌పాయి, అద్వానీ వంటి నాయకులు ప్రజలు మెచ్చిన పాలనను అందించి, చరిత్రలో నిలిచిపోయారన్నారు.

రేపటి నుంచి నారాయణ 48 గంటల దీక్ష

హజారే కి మద్దతుగా నేడు ర్యాలీలు

ప్రజలు ఇచ్చే అధికారమే కావాలి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి ఉప ఎన్నికల కష్టాలు ఒక్కొక్కటిగా వచ్చి పడుతున్నాయి. కడప లోక్‌సభ అభ్యర్థిత్వం కొలిక్కి వచ్చిందని భావిస్తున్న సమయంలో, పులివెందుల సమస్యగా మారబోతోంది. మంత్రి పదవికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని వైఎస్ వివేకానందరెడ్డి పట్టుబడుతున్నారు. ప్రజలు ఇచ్చే అధికారమే తనకు కావాలని.. నామినేటెడ్ పదవులు వద్దని ఎన్నికల ప్రచార సభలో స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసినందున మంత్రి పదవి కూడా నామినేటెడ్ వంటిదేనని ఆయన అభిప్రాయపడుతున్నారు.

ఇదో 'నిప్పు' సత్యాగ్రహం...

ఓ వృద్ధుడు.. ఏడు పదుల వయసు మీద పడుతున్న యోధుడు! ఆయన ఒంటిపై తెల్లని దుస్తులు... స్వచ్ఛమైన ఆయన వ్యక్తిత్వంలానే! ఒక్కడే వచ్చాడు.. ఆర్భాటాల్లేవు... ఆడంబరాల్లేవు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కూర్చున్నాడు. దేశ జవసత్వాలను పీల్చి పిప్పి చేస్తున్న అవినీతి భూతంపై బిల్లు ఎక్కు పెట్టాడు! చినుకు చినుకు కలిసి.. తుదకు వరదైనట్లు.. ఒక్కొక్కరు చేతులు కలిపారు. ఉత్తుంగ తరంగాలయ్యారు! అక్రమార్జనలపై ఉప్పెనయ్యారు. అందుకు స్ఫూర్తిగా నిలిచాడు సత్యాగ్రహాల గాంధేయవాది.. అన్నా హజారే!

ఆయన పిలుపందుకుని.. హిమాచలం మొదలు కన్యాకుమారి దాకా జన ప్రభంజనం పోటెత్తింది. ప్రభువుల అవినీతి ఇంకానా ఇకపై సాగదంటూ నినదించింది! రాజకీయ జెండాల్లేవు. ఊకదంపుడు ఉపన్యాసాల్లేవు. మాటల తూటాలే! ఒకటే లక్ష్యం... అవినీతి రహిత భారతం! ఆగని పయనం.. లంచగొండితనాన్ని తుదముట్టించేంత వరకూ! మరణించేదాకా పోరు.. భారతమ్మను పాప పంకిలం నుంచి బయటపడేసేందుకు! అవినీతిపై పోరాటానికి ఇప్పటిదాకా కోటలు దాటని మాటలే. ఇప్పుడు చేతలు ఉద్యమాలయ్యాయి.

ఇదో 'నిప్పు' సత్యాగ్రహం... అవినీతి నేతలపై.. సొంత జలగలపై! దేశం నలు దిక్కులా అగ్గి రగిలించింది... హస్తినలో సెగలు పుట్టించింది! విపత్తు వచ్చినంతగా ఢిల్లీ పీఠం కలవరపడింది! భీష్మించుకున్న సర్కారు కాస్తంత మెడలు వంచింది! అవినీతిపై పవిత్ర యుద్ధానికి సమర భేరీ మోగించిన హజారే డిమాండ్ల పరిశీలనకు అయిష్టంగానే అయినా తలూపింది. అవినీతిపై పాశుపతాస్త్రంగా ఉండాలని ఆశిస్తున్న లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనకు పౌర సమాజానికి సగ భాగం కట్టబెట్టింది!