24, ఫిబ్రవరి 2011, గురువారం

దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ఫిబ్రవరి 24.

కవి కుటుంబంలో జన్మించిన దేవులపల్లి కృష్ణశాస్త్రి తన తండ్రి తమ్మన్న శాస్త్రి నుంచి, పెదనాన్న సుబ్బరాయ శాస్త్రి నుంచి కవిత్వం రాయడంలో మెళుకువలు నేర్చుకున్నారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌తో పరిచయం ఆయన కవితా ధోరణిని మార్చింది. ఆకాశవాణిలో 1946లో చేరాక అలవాటుగా రాసేది. తప్పనిసరిగా ప్రోగ్రాముల నిమిత్తం ఎక్కువగా రాయాల్సి వచ్చేసరికి మరోసారి ధోరణి మారింది. చిన్న చిన్న అందమైన పదాలతో అద్భుతంగా అందంగా అర్థాలు వచ్చేలా రాయడం దేవులపల్లి శైలి అయిపోయింది. భావ కవిత్వంకి ఊపిరి పోయడమే కాదు భావకవి ఎలా వుండాలో కూడా ఆయన వేషధారణ తెలిపేది.

సినిమాల్లోకి రప్పించడానికి బి.ఎన్‌.రెడ్డి చాలసార్లు ప్రయత్నించారు. 'దేవత' చిత్రానికి రాయించాలనుకున్న బి.ఎన్‌.రెడ్డి పదేళ్ళ తర్వాత 'మల్లేశ్వరి' లో పాటలు రాయించగలిగారు. మల్లిdశ్వరి పాటలేకాదు కృష్ణశాస్త్రి రాసిన ప్రతిపాట ఆణిముత్యంగానే నిలిచిపోయాయి. అందుకే ఆంధ్రాషెల్లిdగా అభివర్ణించారు శ్రీశ్రీ. పద్మభూషణ్‌ దేవులపల్లి కృష్ణశాస్త్రి వర్ధంతి ఫిబ్రవరి 24.

మొదటి కొచ్చిన వేణు

కొంతకాలంగా హీరో వేణు కెరీర్‌ మెల్లగా సాగుతోంది. లోగడ ఉన్నంత స్పీడ్‌గా సినిమాలు లేవు. పలు చిత్రాలు తెచ్చిపెట్టిన ఫెయిల్యూర్లే ఇందుకు కారణం. అసలు తనను ఇంతవాణ్ణి చేసింది ఎస్‌.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ. గతంలో ఆ సంస్థ తీసిన 'స్వయంవరం' చిత్రం ద్వారా వేణు హీరోగా పరిచయమయ్యారు. ఇంకా 'చిరునవ్వుతో' వంటి పలు చిత్రాలను ఆ సంస్థ తీసిన విషయం తెలిసిందే.

అయితే చాలాకాలంగా బయటి చిత్రాలు చేస్తూ వస్తున్న వేణుకు ఫెయిల్యూర్లు తలబొప్పి కట్టించాయి. కెరీర్‌ను తిరిగి ఎలాగైనా మలుపు తిప్పుకోవాలని ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నారు. తన మాతృసంస్థ ఎస్‌.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఇప్పుడు ఆయన ఓ చిత్రం చేస్తున్నారు. పబ్లిసిటీ లేకుండానే ఈ చిత్ర నిర్మాణం సాగిపోతోంది. వేణు సరసన కమలనీముఖర్జీ నటిస్తోంది. వీరిద్దరూ 'గోపి గోపిక గోదావరి' చిత్రంలో నటించారు. ఈ తాజా చిత్రానికి 'రామాచారి...వీడు...పెద్ద గూఢచారి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

కల హంస చకిత జయలలిత పుట్టినరోజు ఫిబ్రవరి 24.

తమిళ ప్రజానీకంలోని పలువురు అమ్మగా తలుస్తూ, పురోచ్చి తలైవి (విప్లవ నాయిక) గా ఆరాధిస్తారు జయలలితను. నలుగుసార్లు తమిళనాడు శాసన సభ్యురాలిగా ఎన్నికై రెండుసార్లు ముఖ్యమంత్రిగానూ పాలించి ప్రస్తుతం ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగుతున్న జయలలిత తొలుత తెలుగు, తమిళ చిత్రాల్లో కథానాయికగా తన అందచందాలతో, ముద్దు ముద్దుగా డైలాగ్స్‌ పలుకుతూ అలరించారు. జయలలిత తమిళ పత్రికలకు పలు వ్యాసాలు కూడా రాసారు నటనకు బ్రేక్‌ పెట్టాక. సినీ నటి సంధ్యకుమార్తె అయిన జయలలిత కర్ణాటకలోని మెలుకొటెలో 1948 పుట్టి, బెంగుళూరులో కొంతకాలం చదువుకున్నారు. తల్లితో, తమిళనాడుకు మకాం మార్చడంతో మిగతా చదువు మద్రాసులో సాగింది. తల్లి నటి కావడంతో తల్లి ప్రోత్సాహంతో నాలుగో ఏట నుంచే భరతనాట్యం నేర్చుకొని 1965లో నటననే వారసత్వంగా భావించి 13వ ఏట 'ఎపిస్టిల్‌' అనే ఆంగ్ల చిత్రంతో నటనకు శ్రీకారం చుట్టారు. జయలలిత కన్నడంలో నాయికగా నటించిన తొలిచిత్రం 'చిన్నాడ గొంబె', తెలుగులో అక్కినేని హీరోగా నటించిన 'మనుషులు మమతలు' మంచి విజయం సాధించాయి. మనుషులు మమతలులో అక్కినేనిని ఆటపట్టించే యువతిగా మంచి మార్కులు సంపాదించుకున్నారు.

ఎం.జి.రామచంద్రన్‌ సరసన నాయికగా 28 చిత్రాల్లో, శివాజీగణశన్‌తో 14 చిత్రాల్లో, జెమినీ గణశన్‌తో, జయశంకర్‌తో నాలుగేసి చిత్రాల్లో, ముత్తురామన్‌, రవిచంద్రన్‌లతో రెండేసి చిత్రాల్లో, ధర్మేంద్రతో 'ఇజ్జత్‌' అనే ఒక హిందీ చిత్రంలో జయలలిత నాయికగా నటించారు. 1969 విడుదలైన అడిమయప్పన్‌ చిత్రంలో కె.వి. మహదేవన్‌ సంగీత దర్శకత్వంలో ఒక పాట పాడటంతో గాయనిగా అవతారం కూడా ఎత్తి, సూరియకాంతి, వైరం, అన్బతెడి తిరు మాంగల్యం, ఉన్నయ్‌ సుత్రమ్‌ ఉలగం' తదితర చిత్రాల్లో పాటలు పాడి చక్కని గాయనిగానూ గుర్తింపు పొందారు.

తెలుగులో అక్కినేని సరసన కథానాయికగా 'మనుషులు మమతలు'తో కెరీర్‌ ప్రారంభించి ఆయనతో అదృష్టవంతులు, ఆస్తిపరులు, భార్యాభర్తలు, భార్యాబిడ్డలు, ఆదర్శకుటుంబం తదితర చిత్రాల్లొ, ఎన్టీఆర్‌తో నిలువుదోపిడి, కథానాయకుడు, కదలడు వదలడు, గోపాలుడు భూపాలుడు, దేవుడు చేసిన మనుషులు, బాగ్దాద్‌ గజదొంగ, కృష్ణతో గూఢచారి 116, శోభన్‌బాబుతో డాక్టర్‌ బాబు, జగ్గయ్యతో ఆమె ఎవరు తదితర చిత్రాల్లో నట్టించారు. స్విమ్‌ సూట్‌లోనే కాదు. చీరకట్టులోనూ, ఆధునిక వస్త్రాల్లోను బొద్దుగా వుండే జయలలిత ఆరోజుల్లో ప్రేక్షకుల కలలరాణి. నదియై తేడి వందా కదల్‌ ఆమె 1980లో నటించిన చివరి చిత్రం.

ఎం.జి.ఆర్‌ని బాగా అభిమానించిన జయలలిత 1981లో ఎ.ఐ.ఎ.డి.ఎం.కె. పార్టీలో జేరి రాజ్యసభ సభ్యురాలుగా నామినేట్‌ అయ్యారు. ఎం.జి.ఆర్‌. మరణానంతరం ఎం.జి.ఆర్‌ భార్య జానకి రామచంద్రన్‌ వారసురాలే అయినా తరువాత వచ్చిన మార్పులతో జయలలితనే వారసురాలిగా నిర్ణయించడంతో తమిళనాడు ముఖ్యమంత్రి కాగలిగారు. రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి నిర్వహించి, కొన్ని వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. కలైమామణి జయలలిత పుట్టినరోజు ఫిబ్రవరి 24.

రంగుల్లో”లక్ష్మీ కటాక్షం’

ఎన్టీరామారావు, కె.ఆర్‌.విజయ ప్రధాన పాత్రలు పోషించిన 'లక్ష్మీ కటాక్షం' చిత్రాన్ని రంగుల్లో అందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 'మాయాబజార్‌' ని రంగుల్లో అందించగా ఘనవిజయం సాధించింది. దేవానంద్‌ నటించిన 'హమ్‌ దోనో'ని కలరింగ్‌ చేసి ఇటీవల విడుదల చేయగా విజయం సాధించింది. ఈ స్ఫూర్తితో గోల్డ్‌ స్టోన్‌ టెక్నాలజీ స్‌ లిమిటెడ్‌ సంస్థ రంగుల చిత్రంగా 'లక్ష్మీ కటాక్షం'ని రూపొందించే ప్రయత్నాలు చేబట్టారు బి. విఠలాచార్య దర్శకత్వంలో పి.ఎస్‌.ఆర్‌. పతాకాన పింజల సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం 8-1-1970న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలో పాటలు కూడా ప్రజాదరణ పొందాయి. ఇది ఎన్టీఆర్‌ నటించిన 175 వ చిత్రం.

రాజశ్రీ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, బాలయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ, హేమలత ముఖ్యపాత్రలు పోషించిన 'లక్ష్మీకటాక్షం'కి పాటలు సి. నారాయణరెడ్డి, కొసరాజు, చిల్లర భావనారాయణ రాయగా సంగీతం ఎస్‌.పి. కోదండపాణి సమకూర్చారు. ఘంటసాల, సుశీల, జానకి, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి పాటలు పాడారు. కె.ఆర్‌.విజయ, రాజశ్రీ, ఎన్టీఆర్‌తో చిత్రీకరించిన పలు శృంగార గీతాలున్నాయి.

'అమ్మమ్మమ్మో తెలిసిందిలే గుట్టు తెలిసిందిలే', 'రా వెన్నెలదొరా కన్నియ్యను చేరా', 'అందాల బొమ్మను నేను', 'కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెెమ్మో', 'నా వయసు సుమగంధం నాదు మనసు మకరందం', 'పొన్నచెట్టు మాటున పొద్దు వాలిపోతుంది', 'స్వాగతం స్వాగతం', 'శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు', 'సకల విద్యామయీ ఘన శరదిందు', 'జయజయ మహాలక్ష్మి జయ మహాలక్ష్మి' వంటి పాటలు, 'ధన్యోస్మి ధన్యోస్మి' అనే శ్లోకం అలరించాయి ప్రేక్షకులను, శ్రోతలను.

రాష్ట్ర విభజన ఎప్పుడు ఎలా?

కొందరు వేర్పాటువాద పార్టీల నాయకులు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం కావాలని బంద్‌లు చేయించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులచే విధ్వంసాలు సృష్టించి ఇప్పుడు సహాయ నిరాకరణ చేసి భూకంపాలు సృష్టిస్తామని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నది.

ఈ వేర్పాటువాదం 7 కోట్ల పేద ప్రజల మేలు కోసం కాదు. అంటే 80 శాతం పేదరికాన్ని పక్కన పెట్టేసి అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు కేవలం అధికారం కోసమే రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. రాష్ట్రంలోను 23 జిల్లాలలోని మూడు కోట్ల కుటుంబాలలో 2 కోట్ల 30 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌ కార్డులిచ్చారు. అంటే 80 శాతం పేదరికం 23 జిల్లాలలోను ఉందని ప్రభుత్వ రికార్డులే చెబుతున్నాయి. 80 శాతం పేద ప్రజలపై కుటిల ప్రేమను, కపట ప్రేమను చూపించి రాష్ట్రాన్ని విభజించాలని అంటే కేవలం అధికారం కోసమే విభజించాలని విధ్వంసాలు సృష్టిస్తూ సోనియాగాంధీని కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు.

ఒక్క సిపిఐ(ఎం) పార్టీ తప్పించి అన్ని అధికార ప్రతిపక్ష శాసనసభ్యులు, పార్లమెంట్‌ సభ్యులు రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రప్రభుత్వంపై వత్తిడి తెస్తున్నారు. నల్ల ధనవంతులు వేర్పాటు వాదానికి డబ్బు సరఫరా చేసి అధికారం కోసమే రాష్ట్రాన్ని విభజించాలని రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చారు. రాష్ట్రాన్ని విభజిస్తే 20 శాతం ఉన్న నల్లధనవంతులకే అధికారం వస్తుంది. 80 శాతం పేదరికాన్ని నిర్మూ లించాలనే ధ్యేయంతోనే 20 రాష్ట్రాలలో నక్సలిజం పుట్టిందనేది నగ్నసత్యం. భూమిని జాతీయం చేసి భూములు పంచి, గనులను, వ్యాపారాన్ని, పరిశ్రమలను జాతీయం చేస్తే నక్సలిజమే మాయమైపోతుంది. అసలు 80 శాతం పేద ప్రజలకు రాజుపాలించినా ఒక్కటె, రెడ్డి పాలించిన ఒక్కటె. కాబట్టి భూమిని జాతీయం చేసి స్వంత ఆస్తిహక్కును రద్దు చేసిన తరువాత మాత్రమే రాష్ట్రాలను విభజించాలి.

మద్యాన్ని మైమరిపించే తియ్యదనం!

అల వాటులో పొరపాటు సహజమే కానీ, ఏదైనా అలవాటును పొరపాటున కూడా వదులుకోలేని బలహీనత మనలో చాలా మందిలో ఉంది. ఈ బలహీనతను ఆధారం చేసుకునే కాఫీ,తేయాకు, మద్యం, సిగెరెట్‌, పొగాకు ఉత్పత్తుల విక్రయం దారులు జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. వ్యవసాయ కార్మికులు, ఫ్యాక్టరీలు, పరిశ్రమల్లో పని చేసే కార్మికులు మొదలు పెద్ద ఉద్యోగాలు చేసే మధ్యతరగతి,ఉన్నత స్థాయి వర్గాల వారి వరకూ ఈ అలవాట్లలో కనీసం కొన్ని అయినా లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఉమ్మడి కుటుంబాల్లో ఇంటి పెద్దల పట్ల భయం లేదా,గౌరవంతో చాటుమాటున ఈ వ్యసనాలకు పాల్పడే వారు ఇప్పుడు వ్యష్టి కుటుంబాల్లో బహిరంగంగానే ఇళ్ళలోనే ధూమపానం, మద్యపానం లాగించేస్తున్నారు. వీటి వల్ల ఆ యా వ్య క్తులకే కాక, కుటుంబ సభ్యులకు కూడా కేన్సర్‌, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి వ్యాధులు సంక్రమించడం మనం స్వ యంగా చూస్తున్నాం.

ఈ అలవాట్లన్నింటిలో మహ మ్మారి అనదగిన మద్యపానం గురించి ఎంత చెప్పినా, ఎందరు చెప్పినా, ఎన్ని సందర్భాల్లో చెప్పినా తక్కువే అవుతుంది. మద్యపానం వ్యసనాన్ని మాన్పించేందుకు ఇటు మన దేశంలోనూ, అటు విదేశాల్లోనూ వైద్యులూ, శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రభుత్వాలే మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్న దుస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. రోగాలను నయం చేసే మందుల దుకాణాలు లేకపోయినా, ప్రతి వీధికీ ఒకటి లేదా రెండు మద్యం దుకాణాలు దర్శనమిస్తున్నాయి. మద్యం అమ్మకాలను ప్రభుత్వాలే ప్రోత్సహించడం ఆరు దశాబ్దాల స్వతంత్ర భార త దేశంలో మనం సాధించిన ప్రగతి. ఇంతకీ మందు మాన్పించే “డీ అడిక్షన్‌’ వైద్యం కూడా ఇప్పుడు నగరాలు, పెద్ద పట్టణాల్లో లభిస్తోంది.

మద్యం నియంత్రణ అనేది ఒక సాంఘిక ఉద్యమంగా సాగిన దృష్టాంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. తీపి పదార్ధాలను ఇష్టపడే వారు మద్యం వ్యసనం నుంచి తేలికగా బయటపడగలరని హెల్సింకీలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ వెల్‌ఫేర్‌ సంస్థకి చెందిన పరిశోధకులు జరిపిన పరిశోధనల్లో తేలింది. మద్యం లేనిదే బతకలేని వారిలో స్వీట్లు ఇష్టపడే వారిపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేటతెల్లమైనట్టు ఆ సంస్థ వర్గాలు తెలిపాయి.అలాగే,తియ్యని మాటల ద్వారా కూడా ఈ వ్యసనం బారి నుంచి తప్పించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు.

నాల్ట్రేగ్జిన్‌ అనే మందు సేవిస్తే మద్యం మీద ఆసక్తి క్రమంగా తగ్గుతుందనీ,అంతిమంగా ఆ అలవాటు నుంచి దూరం కావచ్చునని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. హెల్సింకీలోని నేషనల్‌ హెల్త్‌ ఇనిస్టిట్యూట్‌లో డేవిడ్‌ సిన్‌క్లార్‌ అనే పరిశోధకుడు, ఆయన సహచరులు పరిశోధనలు చేసి ఈ మందును కనుగొన్నారు.

ఆస్ట్రేలియాలో పదేళ్ళ వయసు గలవారు,ఇంకా అంతకన్నా చిన్న వారూ మద్యానికి బానిసలు అవుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీరిని మద్యం వ్యసనం కోరలనుంచి తప్పించేందుకు మెల్‌బోర్న్‌,సిడ్నీ తదితర నగరాల్లో యత్నా లు సాగుతున్నాయి. ఇందుకోసం పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే, మత్తు కోసం, అదే విధమైన ఆనందం కోసం పిల్లలు సైతం మద్యానికి బానిసలు అవుతున్నారనీ, ఇంట్లో తల్లితండ్రుల అలవాట్లు, జీవన విధానం,బయట వాతావరణం అన్నీ కూడా వారిని మద్యం వైపు నడిపిస్తున్నాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. మెల్‌బోర్న్‌లో ఒడెస్సీ హౌస్‌ ఈ మధ్య ఒక సర్వేని నిర్వహించింది. 15-24 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లలూ, యువకులూ మద్యం కారణంగా అకాల మరణం పాలవుతున్నారనీ, ఇలా మరణించేవారి సంఖ్య ఏటా 264 వరకూ ఉంటుందని ఈ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జేమ్స్‌ పిట్స్‌ తెలియజేశారు.

కాగా, మద్యం వ్యసనం వల్ల ప్రపంచ వ్యాప్తం గా ఏటా 20 లక్షల మంది పైగా మరణిస్తున్నట్టు ప్ర పంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేస్తున్నది.ఇలా మరణించేవారిలో వేలాది మంది యువకులు తప్పనిసరిగా ఉంటున్నారని ఆ సంస్థ పేర్కొం ది. మద్యం వ్యసనం వల్ల యవ్వనంలోనే వృద్ధాప్యపు లక్షణాలు మనిషిలో కనిపించడం, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరి తిత్తులు చెడిపోవడం సర్వసాధారణమవుతోందనీ, బ్రెస్ట్‌ కేన్సర్‌ వంటి భయంకర మైన వ్యాధుల బారిన పడుతున్నారని అంటు వ్యాధుల నిరోధం, మానసిక ఆరోగ్యం విభాగం అసిస్టెంట్‌ డైరక్టర్‌ జనరల్‌ అలా అల్వాన్‌ తన పరిశోధనా వ్యాసంలో పేర్కొన్నారు. రష్యాలో ప్రతి ఐదుగురిలో ఒకరు మద్యం కారణంగానే మరణిస్తున్నట్టు ప్రపంచ వ్యాప్తంగా అందిన సమాచారాన్ని క్రోడీకరించి విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొన్నారు. బ్రెజిల్‌, కజకస్థాన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, యుక్రేయిన్‌లలోకూడా మద్యం మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. కల్తీ మద్యం కారణంగా మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రం లో ఎంతో మం ది బలి అవుతున్న సంఘటనలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. మద్యాన్ని మాన్పిం చేందుకు వ్యసనపరులకు కౌన్సిలింగ్‌ నిర్వహించే కేంద్రాలు కూడా పెద్దనగరాలు,పట్టణాల్లో ఇప్పటికే వెలిశాయి. అయితే, ఇవి సొమ్ము చేసుకునేందుకు కొందరికి ఉపాధి కేంద్రాలుగా ఉపయోగ పడుతున్నాయి తప్ప ఆచరణలో తగిన ఫలితం కనిపించడం లేదు, మద్యాన్ని మాన్పించేందుకు స్వాతం త్య్రోద్యమంలో “కల్లు మానండోయ్‌’ అనే గీతాల ద్వారా జనాన్ని చైతన్యపర్చేవారు. దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాకు చెందిన రోశమ్మ అనే ఆమె నాయకత్వంలో మహిళలు ఉద్యమించారు. మళ్ళీ అలాంటి ఉద్యమం వస్తేనే మద్యం నియంత్రణ సాధ్యం అవుతుంది.



ఈ వధువుకి వేల కొద్దీ క్యూ

ఎన్టీటీవీ ఇమేజిన్‌లో స్వయంవర్‌ 'రతన్‌ కారిస్టా' ప్రసారం కాబోతుంది. ఈ స్వయం వరానికి 300కాదు 30,000 దరఖాస్తులు వచ్చాయంటే మాటలా. అదీ 'రతన్‌ రాజ్‌ పుట్‌' ను మనువు ఆడటానికి, కేవలం ఒక్క అమ్మాయినే వరించ టానికి ఇంతమంది క్యూ కట్టారు.

లాలీ అని ముద్దుగా పిలువబడే ఈ సుందరాంగికి ఇప్పుడు సెలెక్షన్‌ పెద్ద తలనొప్పే. ఈ ముద్దుగుమ్మ చక్కా గృహిణిలా దర్శనమిచ్చే బుల్లితెర నటి. తల్లి దండ్రులు ఇంకా ముంబై చేరక పోవ డంతో, రతన్‌ రాజ్‌పుట్‌ దరఖాస్తులను, ఒడపోత చేస్తుంది. వరుల సంఖ్య పెరిగే కొద్దీ, ఎన్నిక మరింత కష్టమే. 'మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌' కు ఇంకా ఎన్ని రోజులు ఆగాలో తెలి యటంలేదు. గతంలో రాఖీ సావంత్‌ కల్యాణం తంతులా కాక మేడి పండులను చూసి మురిసి పోకూడదంటుంది. మొత్తానికి ఈ స్వయంవరం ఎంతో ఆసక్తిని రేకె త్తించింది. ఇంతకీ వరించి వచ్చే ఆ మన్మధుడు ఎవరో వేచిచూడాలి.

శనీశ్వరుడు శాంతించాలంటే...

శని పీడితులు ఆయనను తిడుతూ కూర్చోక ఎలా ప్రసన్నుడిని చేసుకోవాలా అని ఆలోచించాలి. శనిని తృప్తి పరచడం అన్నది నిజానికి చాలా కష్టమైన వ్యవహారమే. మనిషి యొక్క జాతకంలో శని ప్రభావం వుంటే ఆ వ్యక్తిని బాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న శనిగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం తప్ప వేరు మార్గం లేదు. ఆయనని గనుక సంతృప్తి పరుస్తే కార్యసిద్ధికి ఉన్న ఆటంకాలన్నింటినీ దాటి బ్రతుకును బంగారుమయం చేసుకోవచ్చు నంటారు. శనివారం నాడు తల్లవారుజామున తలస్నానం చేసి, తిలల నూనె తో దీపం పెట్టి శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించి ఒంటి పూట భోజనం చేయడం వల్ల శని దోషం చాలా వరకు తగ్గుతుంది. ఆ రోజు ఉదయంపూట హనుమాన్‌ చాలీసా పారాయణం చెయ్యాలి. శని వాహనమైన కాకికి ఆహారం పెట్టడం వల్ల కూడా శని దోషం తగ్గుతుంది.

భైరవుని ఆరాధన చేసి, నల్లనువ్వులు, ఇనుము దానం ఇవ్వాలి. పుష్యమి-అనూరాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. పుష్యమి కర్కాటక రాశికి సంబంధించింది. అనూరాధ వృశ్చికరాశికి సంబంధిం చింది. ఉత్తరాభాద్ర మినరాశికి సంబంధించింది. కంటి చూపు తగ్గటం, ఉబ్బసం, దగ్గు, కఫం వంటి వ్యాధులు శనిగ్రహా ప్రతీకూలత వల్ల వస్తాయంటారు. ఇళ్ళు కూలిపోవడం, అగ్నిప్రమాదాలు జరగడం కనుబొమ్మల రెప్పలు కాలిపోవడం శనిప్రభావమే! సాధువులకూ, దీనులకూ వంట పాత్రలు దానం చెయ్యాలి. శని ప్రతిమను లోహంతో చేయించి పూజించి నల్లనువ్వులూ నూనెపాత్రతో సహా బ్రాహ్మనిడికి

''య:పునర్భ్రష్ట రాజ్యాయ సలాయ పరితోషిత: స్వప్నేదదౌనిజం రాజ్యం సమేసౌరి||.''

అంటూ దానం చెయ్యాలి.

నలుడు రాజ్యం కోల్పోయి నానా కష్టాలు పడ్డాక ఈ మంత్రాలతో తిరిగి విజయం సాధించాడు. విజయం సాధించడానికి వేరే మంత్రాలూ వాటి మాత్రిక లక్షణాలూ ఏమీ లేవు కృషి తప్ప! ఈశ్వర శక్తిని గమనించి మనం ఎంతో నేర్చుకోవలసింది వుంది. బాధలకు కృంగి పోయి శనిని తిట్టుకుంటూ కూర్చోడం కంటే కష్టాన్ని ఎదురీదాలనే తపస్సే మంత్రం దాన్ని ఆచరించడమే పరిహారం!

ఏకాదశులలో 'షటతిలైకాదశి' అని వస్తుంది. ఆరోజున నీళ్ళల్లో నువ్వులు వేసుకొని స్నానం చెయ్యాలి. నువ్వులు ముద్దగా నూరి ఒంటికి రాసుకోవాలి. ఆరు నువ్వు గింజలు తినాలి. త్రాగే నీటిలో నువ్వులు వేసుకు తాగాలి. కాసిని నువ్వులు దానం ఇవ్వాలి. వాటితో తర్పణం వదలాలి. ఇలా చేస్తే విష్ణువుకు ప్రీతి కలుగుతుందీ. శనికి మన బంధన వదులుతుంది.

మార్చి 1తర్వాత తాడోపేడో ...

తెలంగాణపై మార్చి 1వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటామని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. గురువారం లోకసభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. నిన్న తెలంగాణపై గళమెత్తిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల నోళ్లకు ఈ రోజు ఎందుకు తాళాలు పడ్డాయో వారే చెప్పాలని డిమాండు చేసారు. రేపటి రైల్వే బడ్జెట్‌ను, ప్రధాని ప్రసంగాన్ని తాము బహిష్కరిస్తామని ఆయన అన్నారు.

మొదటి రోజు జెపిసి కోసం సహకరించాలని ప్రతిపక్షాలు అడిగాయని,దాంతో మొదటి రోజు తాము తెలంగాణపై పట్టుబట్టలేదని, బడ్జెట్ ప్రతిపాదన ముగిసే వరకు ఆగాలని తమను ఎన్‌డిఎ కోరిందని, దాంతో తాము ఆ తర్వాతే తెలంగాణ బిల్లు కోసం పట్టుబట్టాలని.. తెలంగాణపై పార్లమెంటును స్తంభింపజేద్దామని ప్రతిపక్షాలు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తమకు ప్రతిపక్షాలన్నీ సహకరించాయని, అందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని.. ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌కు తాము ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

'రామ్ ఢమాల్ వర్మ'పై క్రిమియల్ యాక్షన్

తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం..అప్పలరాజు డిజాస్టర్ టాక్ తెచ్చుకోవటంతో 'రామ్ ఢమాల్ వర్మ' పోగ్రాం పెట్టి సినీ విమర్శకులు కూర్చోబెట్టి ఏకి పారేసిన టీవీ9 పై విరుచుకుపడుతున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన మీడియాకు ఓ ప్రెస్ నోట్ ని పంపారు. అందులో...ప్రేక్షకులు వెర్రి వెధలవలు తేల్చి పారేసారు. సినిమాని బతికిస్తున్న ప్రేక్షకుల్ని కించపరిచారు. అందుకే నేను ఆ ఛానెల్ పై క్రిమియల్ గా యాక్షన్ తీసుకోదలిచాను అని వర్మ ఈ నిర్ణయం టీవీ9 ఎన్నో నా మీద ఫాల్స్ కోట్స్ ని నా మీద ఆపాదించారంటూ టివి9పై విరుచుకు పడ్డారు

వెరైటీ పాత్రల హీరో సత్యరాజ్‌

వెరైటీ పాత్రలు పోషించే హీరోగా సత్యరాజ్‌కి తమిళనాట మంచి ఆదరణ వుంది. ఇప్పుడు ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌ దర్శకత్వంలో 'సత్తపది కుట్రమ్‌' చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. గతంలో ఎస్‌.ఎ. చంద్రశేఖర్‌ దర్శకత్వంలో రూపొంది విజయం సాధించిన 'సట్రం ఒరు ఇరుట్టరయ్‌' చిత్రాన్ని పునర్నిర్మిస్తున్నారు. అప్పట్లో ఇతివృత్తపరంగా కూడా సంచలనం సృష్టించిందా చిత్రం.

ఎం.జి.ఆర్‌కి 'నాడోడి మన్నన్‌' రజనీకాంత్‌కి 'బాద్‌షా' తెచ్చినంత పేరు 'సత్తపది కుట్రమ్‌' చిత్రం ద్వారా తనకి లభిస్తుందని విశ్వసిస్తున్నారు సత్యరాజ్‌. ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయే పాత్రగా దర్శకుడు చంద్రశేఖర్‌ రూపొందించడంతో అలా నిలబడటానికి వీలుగా చాలా కసరత్తు చేస్తున్నారు. తన జుత్తు బాగా పెంచారు కూడా. పెరిగిన జుత్తు, నెత్తిమీద క్యాప్‌తో హావభావాల ప్రదర్శనలో కొత్త మేనరిజాలు చూపడానికి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన. సత్యరాజ్‌ సరసన సీమన్‌ అడ్వకేట్‌గా నటిస్తోంది. విక్రాంత్‌, బానుకూడా కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చంద్రశేఖర్‌కుమారుడు హీరో విజయ్‌ కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించవచ్చు.

ఆయిరం విలక్కు, నన్బాన్‌ (3ఇడియట్స్‌) చిత్రాల్లో కూడా సత్యరాజ్‌కి విలక్షణమైన పాత్రలే లభించాయి.

జై బోలో తెలంగాణ సెన్సార్ కట్స్

జై బోలో తెలంగాణ చిత్రాన్ని మహలక్ష్మి ఆర్ట్‌ ్స పతాకాన ఎన్‌. శంకర్‌ నిర్మించారు. సందీప్‌ మీరానందన్‌, జగపతిబాబు, స్మృతి ఇరాని, నాగినీడు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం చక్రి, సినిమాటోగ్రఫీ సురేందర్‌రెడ్డి నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్‌. శంకర్‌.

ఈ చిత్రాన్ని 9 మంది సభ్యులతో కూడిన రివైజింగ్‌ కమిటీ 11 కట్స్‌తో 67.08 అడుగుల ఫిలిం కత్తిరించి, 31-01-2011న 'ఎ' సర్టిఫికెట్‌ జారీచేసింది.

1. వాయిస్‌ ఓవర్‌తో పాటు 'చారిత్రక, భూమిక ఆధారంగా కొన్ని వాస్తవ సంఘటనలను కొన్ని కల్పిత సన్నివేశాలను, సంస్థలను జోడించి తీసిన చిత్రం. ప్రేక్షకులు గమనించగలరు, అనే అంశాన్ని చూపాలని కోరితే ఆ విధంగా వాయిస్‌ ఓవర్‌తో చూపించారు.

2. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన 'తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్న రాజకీయ నాయకులను, మన గ్రామం రాకుండా అడ్డుపడదాం' అనే డైలాగ్‌ని సౌండ్‌తో సహా తొలగించారు.

3. మొదటి రెండు రీళ్ళలో చిత్రీకరించిన ఇంటర్వ్యూలో రిఫరెన్స్‌గా పేర్కొన్న కులాలు, శ టు ష తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

4. మూడు నాలుగు రీళ్ళలో 'నీకు అవేమన్నా రెండు ఉన్నాయా' అనే డైలాగ్‌ తొలగించి శబ్దం వినరాకూడదన్నారు.

5. ఏడవ రీలులో విద్యార్థి ఆహుతి అయ్యే దృశ్యాలను 50 శాతం తగ్గించమని, అంబేద్కర్‌తో చారి డైలాగ్‌ని ట్రాన్స్‌లోగాని ఊహలోగాని ఉన్నట్టు మార్చాలని కోరడం ద్వారా 40 అడుగుల నిడివిగల ఫిలిం కత్తెరపాలయింది.

6. తొమ్మిది పది రీళ్ళలో

ఎ) తెలంగాణ రాకుండా చాలా సూట్‌కేసులు అడ్డు పడుతున్నాయి

బి) ఇదా చిదంబర రహస్యం

అని ఉన్న డైలాగ్స్‌ని సౌండ్‌తో సహా తొలగించారు.

7. పదకొండు పన్నెండు రీళ్ళలో చిత్రీకరించిన సన్నివేశంలోగల 'అయితే చంపుతాం... చంపుతాం... తెలంగాణకు అడ్డు వచ్చిన వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరుకుదాం నరుకుదాం... తెలంగాణకి అడ్డువచ్చిన వాళ్ళను తరిమి తరిమి తరిమి కొడదాం' అనే డైలాగ్‌ సౌండ్‌తో సహా తొలగింపుకు గురి అయింది.

8. పదకొండు పన్నెండు రీళ్ళలో గల 'డిసెంబరు 9న చిదంబరంగారు ఏమి మాటిచ్చారు' డిసెంబరు 23న ఏ మాటిచ్చారు డైలాగ్‌ని తొలగించి శబ్దం రాకూడదన్నారు.

9. పదకొండు పన్నెండు రీళ్ళలో విద్యార్థులను పోలీసులు హింసించే దృశ్యాలను ఫ్లాష్‌లా చూపమనడం ద్వారా 27.08 అడుగుల నిడివిగల ఫిలిం కత్తిరింపుకు గురి అయింది.

10. పదమూడు పద్నాలుగు రీళ్ళలో చిత్రీకరించిన 'తెలంగాణ జాతరొచ్చెరా' పాటలో గల 'పన్నులు కట్టొద్దుర' అనే పదాల్ని తొలగించి శబ్దం వినబడకూడదన్నారు.

14 రీళ్ళ నిడివిగల 'జై బోలో తెలంగాణ' చిత్రం 4-2-2011న విడుదల అయింది.

నటిస్తూ మరణం ఆహ్వనించిన ముక్కామల

దుర్యోధనుడుగా మాయాబజార్‌, శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రాల్లో, విశ్వామిత్రుడుగా సత్యహరిశ్చంద్ర, సీతా కళ్యాణం చిత్రాలలో, గురువుగా గురువుని మించిన శిష్యుడు, విరాటురాజుగా నర్తనశాలలో, 'ముత్యాలముగ్గు'లో విలన్‌గా ముక్కామల ప్రత్యేకమైన పొడవైన పెర్సనాల్టిd, ప్రత్యేక తరహాలో డైలాగ్‌ డెలివరీతో ఆకట్టుకున్నారు. విలన్‌గా పలు చిత్రాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. విలన్‌గా ఎంటరై హీరోగా నటించి మళ్ళీ విలన్‌ తరహా పాత్రలకు ఆ తరువాత కేరక్టర్‌ రోల్స్‌కి పరిమితమైన ముక్కామల రెండు చిత్రాలకు దర్శకత్వం కూడా సమకూర్చారు.

కోపాన్ని, కాఠిన్యాన్ని మాటల్లో, భావాల్లో పలికిస్తూ, పళ్లు నూరినట్టుగా కూడా కనిపించి తన ఆగ్రహాన్ని ప్రదర్శన చేయడంలోనూ, పట్టరాని కోపం వున్నా సందర్భం లేనపుడు అదిమిపట్టి, దాన్ని వ్యంగ్యంగా ప్రదర్శించడం లోనూ ముక్కామల అభినయానికి మంచి మార్కులు పడేవి.

1920లో గుంటూరులో జన్మించిన ముక్కామల ఎ.సి.కాలేజీలో డిగ్రీ కోర్సు చేస్తూ రంగస్థల నటుడుగానూ, టెన్నిస్‌ ఆటగాడుగాను గుర్తింపు పొందారు. తొలుత షేక్‌స్పియర్‌ రచించిన నాటకాలను ఆంగ్లంలో ప్రదర్శిస్తుంటే వాటిలో నటించేవారు ముక్కామల కృష్ణమూర్తి. కె.వి.ఎస్‌.శర్మ ఎన్టీఆర్‌, జగ్గయ్య ఒక సంస్థద్వారా తెలుగు నాటకాలు ప్రదర్శిస్తూవుంటే, తనూ ఆ నాటకాల్లో కీలకపాత్రలు పోషించేవారు. తను స్వయంగా భక్త కబీర్‌, నాటకం రాసి ప్రదర్శించి ప్రశంసలూ పొందారు.

డిగ్రీ పూర్తయ్యాక లా చదువుదామని మద్రాసు చేరుకుని, సినీ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. రంగస్థల నటుడుగా సి. పుల్లయ్యకు పరిచయమయ్యాక హీరో కావాలనే ఉద్దేశ్యంతో ఆ పరిచయం పెంచుకున్నారో, మరో రకంగా పెంచుకున్నారో గాని, పి. పుల్లయ్య వద్ద అసిస్టెంట్‌ డైరక్టర్‌గా చేరి, అది చేస్తూనే 'మాయా మచ్ఛీంద్ర' చిత్రంలో గోరఖ్‌నాథ్‌గా కీలకమైన పాత్ర పోషించి సినీ నటన ప్రారంభించారు. 1945లో విడుదలైన ఆ సినిమా అంతగా ఆడక, ముక్కామలకు గుర్తింపు రాలేదు గాని, సహాయ దర్శకుడుగా కొనసాగారు పుల్లయ్య వద్ద కొన్ని చిత్రాలకు. ఆ తరువాత రామకృష్ణ దర్శకత్వంలో భరణి పతాకాన రూపొందిన 'లైలా మజ్ను'లో లైలా పాత్ర పోషించిన భానుమతి తండ్రిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నటుడుగా.

మాంత్రికుడిగా స్వప్నసుందరి, విలన్‌గా నిరపరాధి తదితర చిత్రాల్లో చేసాక, హెచ్‌.ఎం.రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'నిర్దోషి' చిత్రంతో హీరో అయ్యారు. అలా ఆయన కోరిక హెచ్‌.ఎం.రెడ్డి ద్వారా తీరిందిగాని, అప్పట్లో హీరోలు అందంగానే వుండాలనే తలచే దర్శక నిర్మాతల కారణంగా మళ్ళీ విలన్‌ పాత్రలవేపే మళ్ళారు. అయినా సహాయ దర్శకుడుగా లభించిన అనుభవంతో 'మరదలు పెళ్ళి' చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి, అందులో హీరోగా నటించారు సినిమా సరిగా ఆడలేదు. అయితే 'పరోపకారం' చిత్రంలో మళ్ళీ హీరోగా నటించే అవకాశం వచ్చింది. సినిమా పరాజయంతో హీరో ఛాన్స్‌లు కొండెక్కాయి. 1951లో 'నిర్దోషి'లో. 1952లో మరదలి పెళ్ళి, 1983లో పరోపకారం ఈ మూడు చిత్రాల్లోనూ హీరో. నిర్దోషి ఆడినా, మిగతా రెండూ పరాజయం చెందాయి. తన విధివ్రాత విలన్‌, విలన్‌ తరహా పాత్రలకే అనే నిర్ణయానికి వచ్చి ఆ పాత్ర పోషణలో ఒక శైలిని ఏర్పరుచుకుని చిత్ర చిత్రానికీ పేరు పెంపొందించుకున్నారు. తమిళ, కన్నడ, చిత్రాల్లోను పలు పాత్రలు పోషించారు. 'ఋష్యశృంగ' చిత్రాన్ని డైరెక్ట్‌ చేసారు. ఆ చిత్రం కూడా సక్సెస్‌ కాక మళ్ళీ డైరక్షన్‌ జోలికి వెళ్ళలేదు.

కథలు రాయడం, ఫొటోలు తీయడం, పెయింటింగ్‌ వేయడం ముక్కామల హాబీలు. నటుడయ్యాక ఎక్కడ టెన్నిస్‌ పోటీలు జరిగినా చూడటమే గాని, ఆడడం తగ్గించేసాననేవారు. పలు చిత్రాల్లో నటించినా, ఆర్థికంగా అంతంత మాత్రంగానే ఉండేది తర్వాత తర్వాత. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటిస్తూనే 1987లో మృతిచెందారు. ముక్కామల జయంతి 28.

బడ్జెట్‌ సవరించక పోతే మళ్లీ ఉద్యమిస్తా...

ప్రతి పేదవాడు బాగా చదవాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఓ వ్యక్తి అయినా ఉన్నత చదువులు చదవాలని, తద్వారా ఆ కుటుంబం బాగుపడాలని తాను ఈ దీక్ష చేశానని.. బడ్జెట్‌ను సవరించి విద్యార్థులకు సరిపడా కేటాయింపులు జరపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ హెచ్చరించారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ సమస్యపై ఏడు రోజుల పాటు సాగించిన దీక్షను విరమించిన తర్వాత ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు. ఒక్క దూత కూడా తన వద్దకు రాలేదని తాను బాధపడలేదని, 25 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బ తీసిందని, పేద విద్యార్థులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని కొనసాగినిస్తే తప్పు చేసినవారమవుతామని.. పేద ప్రజల కోపాగ్నిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని ఆయన అన్నారు.

ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఒక్క రోజు దీక్ష చాలదని, ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలంటే బడ్జెట్ పెట్టే సమయంలో ఒత్తిడి పెరగాలంటే తాను వారం రోజుల పాటు దీక్ష చేయాలని భావించానని..3,450 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, మళ్లీ అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కేవలం 3 వేల కోట్లు మాత్రమే కేటాయించి, చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. నామమాత్రంగా కేటాయింపులు జరిపి విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారని.. తాను రామరాజ్యాన్ని చూడలేదు గానీ వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణ రాజ్యం చూశానని..మళ్లీ ఆ రాజ్యాన్ని తీసుకు రావాల్సిన సమయం ఆసన్నమైందని.. ఇందుకు అంతా కారోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు జగన్‌.

ఈజిప్ట్ తరహా ఉద్యమం : రాములమ్మ హెచ్చరికలు

తెలంగాణ అంశంపై కేంద్రానికి చిత్తశుద్ధి లేదని.. పార్లమెంట్‌లో ఎంత వత్తిడి తెచ్చినా... నిరసన తెలియజేసినా తెలంగాణపై ప్రభుత్వం స్పందించలేదని టీఆర్ఎస్ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు.

గురువారం ఆమె న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ .. టీఆర్ఎస్‌కు మద్దతుగా ఎన్డీయే, సీపీఐ మద్దతు తెలిపాయని, తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని భయంతో.. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మాత్రం మొక్కుబడిగా మాట్లాడారు తప్పితే పూర్తి ఆసక్తి కనబర్చలేదని రాములమ్మ మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావటం తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు ఇష్టం లేనట్లుగా ఉందని..టీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం అంటూ బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు.

ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని...లేకుంటే..తెలంగాణ ప్రజలు రోడ్లమీదకి వస్తే ఈజిప్ట్ తరహా ఉద్యమం వస్తుందని హెచ్చరించారు. ఏదీ ఏమైనా తెలంగాణ ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుందని ఆమె స్పష్టం చేస్తునే ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం సమయమొచ్చినప్పుడని ముక్త సరిగా సమాధానమిచ్చారు.

తెలంగాణ ద్రోహిని బర్తరఫ్ చేయాలి :టీఆర్‌ఎస్

రాష్ర్ట కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలంగాణ ద్రోహి అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్‌లో తెలంగాణబిల్లు ప్రవేశపెట్టాలంటూ లోక్‌సభలో నిన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన చర్య సహేతుకం కాదని మొయిలీ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. మొయిలీ న్యాయశాఖ మంత్రిగా తగరన్నారు. మొయిలీని ప్రధానమంత్రి వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలన్నారు. ఎంపీలు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజ్‌గోపాల్‌లు ఉన్మాదంతో వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగంపై అవగాహన లేని మొయిలీమాటల వెనక అజ్ఞానం కనిపిస్తోందన్నారు. సీమాంధ్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా వ్యవ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

మాటల తూటాల ముళ్లపూడి మరి ఇక లేరు

కొద్దికాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న సుప్రసిద్ధ రచయిత ముళ్లపూడి వెంకటరమణ (80) గురువారం తెల్లవారుజామున మరణించారు. ముళ్లపూడి వెంకటరమణ, సినీ దర్శకుడు బాపు స్నేహానికి మారుపేరు. ఆనాటి సాక్షి చిత్రం మొదలు, నిన్న మొన్నటి రాధాగోపాలం చిత్రం వరకు బాపు నిర్మించిన ప్రతి చిత్రానికి ముళ్లపూడే రచయితగా పనిచేశారు.

తొలుత ఆంధ్ర పత్రికలో ఉప సంపాదకుడిగా జీవితం ప్రారంభించిన ముళ్లపూడి వెంకటరమణ బాపుతో కలిసి సాక్షి చిత్రంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అనేక చిత్రాలకు సృజనాత్మకత తెలుగు సినిమా రంగానికే కొత్త అందాలు తెచ్చిన ముళ్లపూడి సినీ రచయితగా అనేక చిత్రాలకు నంది అవార్డులు కూడా లభించాయి.ముళ్లపూడి రాసిన బుడుగు తెలుగు సాహిత్యంలో అత్యంత ముఖ్యమైనది. ముళ్లపూడి మృతి పట్ల సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందారు. ఈయన కుమారుడు యువ దర్శకుడు ముళ్లపూడి వర.

దీక్ష విరమించిన జగన్

విద్యార్థుల ఫీజుల సాధన కోసం ఏడు రోజుల పాటు కఠోర నిరాహార దీక్ష చేసిన మాజీ ఎంపీ వైఎస్ జగన్ అశేష ప్రజానీకంగా సాక్షిగా ఇందిరాపార్క్ సమీపంలోని వరలక్ష్మి దీక్షా ప్రాంగణంలో ఫీజుపోరు విరమించారు. గురువారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో వరలక్ష్మి తల్లి లక్ష్మమ్మ జగన్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. జననేత జగన్‌కు మద్దతుగా నేతలు, ప్రజలు, విద్యార్థులు భారీ ఎత్తున తరలివచ్చారు. యువనేతకు సంఘీభావంగా వచ్చిన జనంతో ధర్నాచౌక్ పోటెత్తింది.