12, మే 2011, గురువారం

ఆదర్శ్ కుంభకోణంలో మాజీ సీఎంలకు సమన్లు

కార్గిల్ యుద్ధవీరుల కుటుం బాల కోసం నిర్మించిన ఆదర్శ్ సొసైటీలోని ఫ్లాట్లను అనర్హులు దక్కించుకున్న నేపథ్యంలో వెలుగు చూసిన కుంభకోణం సెగలు రాజకీయ నాయకులను ఇంకా వీడడంలేదు. ఇప్పటికే ఈ కుంభకోణంతో ప్రమేయమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రులు విలాస్‌రావ్ దేశ్‌ముఖ్, అశోక్‌రావ్ చవాన్‌లకు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. కుంభకోణం కేసును దర్యాప్తు జరుపుతున్న విచారణ మండలి వీరిరువురికి సమన్లు జారీ చేసింది. విచారణ మండలి ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఈ మాజీ ముఖ్యమంత్రులిద్దరికీ విచారణ మండలి ముందు హాజరుకావడం అనివార్యంగా మారింది.

సర్వేలతో జనం అయోమయం

తమిళ  నాడు  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, తర్వాత వచ్చిన కొన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు ప్రధాన పార్టీలైనా డీఎంకే, అన్నాడీఎంకే నేతలను ఊహా లోకాల్లో విహరించేలా చేస్తున్నాయి. కొన్ని సర్వేలు అధికార డీఎంకేకు అనుకూలంగా ఉంటే మరికొన్ని అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని వచ్చాయి. వీటి ఆధారంగా గెలుపు తమదంటే తమదేనంటూ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వేలు ఇలా ఉండడం వల్ల ఎవరు అధికారంలోకి వస్తారో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారు. హంగ్ వచ్చే అవకాశాలూ లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


జయప్రదకు ‘లలిత కళా నటనా మయూరి’ బిరుదు

రాజ మండ్రిలో విరిసిన మల్లిక లాంటి సినీ నటి జయప్రద జాతీయ స్థాయికి ఎదిగి రెండుసార్లు ఎంపీ కావడం ఈ ప్రాంతానికే గర్వకారణమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బిరామిరెడ్డి ప్రశంసించారు. జయప్రదకు ‘లలిత కళా నటనా మయూరి’ బిరుదునిచ్చి సత్కరించారు. ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం, ఆలీ, ఊర్వశి శారద, వాణిశ్రీ, కొండవలస లక్ష్మణరావు, కథానాయికలు నికిషా పటేల్, కామ్నా జఠ్మలానీ, సలోనీ, సినీ నటులు హేమ, కవిత పాల్గొన్నారు. హాస్యనటులు తమ చతురోక్తులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.

అంజిత ఐపీఎస్

నిర్మల్ పట్టణంకు చెందిన చెప్యాల అంజిత ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)కు ఎంపికయ్యారు. ఆమె 2007లో సివిల్స్ రాశారు. 1500 మార్కులకు 1217 సాధించారు. ఓబీసీలకు రిజర్వేషన్ శాతం పెంచడంతో ఓసీలకు అన్యాయం జరుగుతోందంటూ 90 మంది అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వారి ర్యాంకును బట్టి సర్వీస్‌లోకి తీసుకోవాలని గతనెల 26న కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు అంజిత ఢిల్లీ-అండమాన్ నికోబార్ క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు.

జూన్ 1 నుంచి ఉద్యమం ఉధృతం

రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జూన్ 1 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు తెలంగాణ ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ స్వామి గౌడ్ తెలిపారు. ఇందులో భాగంగా పది రోజుల పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో బస్సు యాత్రలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. . ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 177 తెలంగాణ ఉద్యోగుల గొంతు నొక్కేదేనని ఆయన అభిప్రాయపడ్డారు. జీవో ఉపసంహరణకు ముఖ్యమంత్రి అంగీకరించి, నెలన్నర కావస్తున్నా.. సంబంధిత ప్రక్రియ పూర్తి కాలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులకు న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కావాల్సిందేనని ఆయన తేల్చిచెప్పారు

గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబు రాజీనామా

గిద్దలూరు ఎమ్మెల్యే(పీఆర్‌పీ) అన్నా రాంబాబు శాసన సభ్యత్వానికి బుధవారం ఉదయం రాజీనామా చేశారు. జలయజ్ఞం ముందుకు సాగటం లేదని, రెండేళ్లుగా తాను చేస్తానన్న పనులు ప్రజలకు చేయలేక పోయాననే ఆవేదనతోనే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారాన్ని ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరి అవలంబించిందని, వెలగలపాయ ప్రాంతం వారికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించే ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని, అందువల్లే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొనట్లు తెలిసింది.