25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఏకాభిప్రాయం వచ్చాకనే తెలంగాణ'తీర్మానం'

తెలంగాణ అంశంపై శాసనసభ్యుల నడుమ ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానాన్ని పెడుతుందని శాసనసభావ్యవహారాల మంత్రి డి.శ్రీధర్ బాబు శుక్రవారం తేల్చి చెప్పారు. ప్రభుత్వం గతంలో సంబంధిత పార్టీలతో సంప్రదింపులు జరపటం ద్వారా తెలంగాణ అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రయత్నించిందని.. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నామని... ప్రతి విషయాన్ని కేంద్ర నాయకత్వందృష్టికి తీసుకెళ్లి తెలంగాణా అంశం త్వరగా తేల్చాలని కోరుతున్నామని ఖచ్చితంగా ఒక పరిష్కారం వస్తుందనే ధీమా వ్యక్తం చేసారు

తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ప్రస్తుత పరిస్థితిలో సభ్యులు నడుమ 'ఏకాభిప్రాయం' రాదని తెలిసి కూడా ఆ అంశంపై తీర్మానం పెట్టడం సరికాదని ఆయన అన్నారు. తెలంగాణ అంశంపై తీర్పు ఇవ్వాల్సింది ప్రజలేనని కేంద్ర నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకుగాను తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య పంథాలో వారి ఆందోళనలను వ్యక్తం చేస్తున్నా.. టిఆర్ఎస్‌ ప్రణాళికతో ముందుకు వెళ్లేచేయాలనే తెలంగాణ జేఏసీ..కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకోని దాడులకు పురిగొలుపుతోందని ఆరోపించారు శ్రీధర్‌బాబు.

ఇక ఎస్సీ, ఎస్టీలకే..అభయహస్తం

వైఎస్సార్ అభయహస్తంలో ప్రభుత్వం చేపట్టిన నిబంధనలు ప్రతి బంధకాలుగా మారాయి. ఈ పథకంలో కేవలం ఎస్సీ, ఎస్టీ గ్రూపు సభ్యులకే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో మిగతా గ్రూపు సభ్యుల మహిళలకు నిరాశ ఎదురవుతుంది. ఇక నుంచి ఎస్సీ, ఎస్టీలు తప్ప వెనుకబడిన వర్గాల కానీ, ఇతర సామాజిక వర్గాలు ఈ పథకంలో చేరే అవకాశం లేదు. దీంతో మహిళల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. ఐకేపీలో చేరిన ప్రతి గ్రూపు మహిళకు అభయ హస్తం పథకం వర్తించేలా వైఎస్సార్ రూపకల్పన చేశారు.

అయితే ప్రస్తుతం కొత్త నిబంధనలతో బీసీలు, ఇతర వర్గాల మహిళలు నమోదు చేసుకునే అవకాశం లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 18 నుంచి 59 ఏళ్ల వరకు వయస్సున్న వారికి నమోదు చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్తగా సభ్యత్వం తీసుకునే వారికి ఈ అవకాశం లేదు. అదే విధంగా ఈ సారి 18 నుంచి 50 ఏళ్ల వయసు కలిగిన వారినే చేర్పించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అభయహస్తం పథకంలో మహిళలు చేరేందుకు మొదట్లో కొంత ఆసక్తి చూపలేదు. కానీ రానురాను ఈ పథకంలో లబ్ధిదారులుగా చేరేందుకు ముందుకు వచ్చారు. మహిళలు పింఛన్లు పొందుతుండటంతో ఎక్కువ మంది ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలకే పరిమితం చేయడంతో వృద్ధ మహిళలకు అవకాశం లేకుండా పోయింది

‘జైబోలో తెలంగాణ’ పైరసీలో పెద్దల హస్తం

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో ఎన్నో వ్యయప్రయాసల కోర్చి ‘జైబోలో తెలంగాణ’ చిత్రాన్ని నిర్మించానని, అయితే విడుదలైన మూడోరోజునే పైరసీ సీడీలు వచ్చాయని చిత్ర దర్శకనిర్మాత శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. జైబోలో తెలంగాణ చిత్రాన్ని పైరసీ చేయడంలో కొంతమంది పెద్ద మను షుల హస్తం ఉండొచ్చని..తనకు అందిన సమాచారం మేరకు పదిజిల్లాల్లో లక్షకుపైగా క్యాసెట్‌లు డంప్ జరిగిందని ఆరోపించారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకే ఇంత పెద్ద ఎత్తున పైరసీ జరిగిందని ఆరోపించారు.

పైరసీని అరికట్టే బాధ్యత పోలీసులదని, వారు శ్రద్ధ పెట్టకపోవడం విచారకరమన్నారు. . పైరసీ చేయడం ద్వారా సినీ పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ఉద్యమం నేపథ్యంలో వచ్చిన తమ చిత్రాన్ని ప్రతిఒక్కరూ థియేటర్‌లోనే చూడాలని శంకర్ కోరారు.

పరిపాలనా వ్యవస్థ .. అనిశ్చిత పరిస్థితి

వచ్చే నెల 5వ తేదీ వరకు సహాయ నిరాకరణ కొనసాగించాలని తెలంగాణ జేఏసీ తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో పరిపాలనా మరికొంత కాలం స్తంభించకతప్పని పరిస్థితి ఏర్పడింది. ఏడు రో జులుగా చేస్తున్న సహాయ నిరాకరణతో ఇప్పటికే కార్యాలయాలకు తాళాలు ప డ్డాయి. ఉద్యోగులు లేక వెలవెలపోతున్నాయి. పరిష్కారం కాక ఫైళ్ళు ఇప్పటికే గుట్టలుగుట్ట్టలుగా పేరుకుపోయా యి. కదిలించేవావారు లేక దుమ్ముకొట్టుకుపోతున్నాయి. తమ న్యాయమైన డి మాండ్ల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వ అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఉద్యోగులు నిరవధికంగా చేస్తు న్న సహాయ నిరాకరణ వల్ల జిల్లా పరిపాలనా వ్యవస్థలో అంతా అనిశ్చిత పరిస్థితి నెలకొన్నది. ఉద్యోగుల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. ర్యాలీలు, రాస్తారోకోలు, ధ ర్నాలతో దద్దరిల్లిపోతోంది. సహాయ ని రాకరణ మరో పది రోజుల వరకు కొనసాగనున్న దృష్ట్యా పరిస్థితి మరింత క్షీ ణించే అవకాశాలున్నాయి.

ఈ నెల జీతం అందేది గగనమే....

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులు చేపడుతున్న సహాయ నిరాకరణోద్యమం ఇప్పుడు ఉన్నతాధికారులకూ కష్టాలు తెచ్చిపెడుతోంది. ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో ఇప్పటికే కోట్లాది రూపాయల ఆదాయం రాక ఖజానా వెక్కిరిస్తోంది. ఉద్యోగుల ఆందోళనతో పాలనా వ్యవస్థ కుంటుపడి పరోక్షంగా ఇక్కట్లకు గురైన జిల్లా ఉన్నతాధికారులకు తాజాగా ఆర్థిక కష్టాలూ తప్పేలాలేవు. నెలనెలా ఒకటో తేదీనే వచ్చే వేతనం ఈ దఫా అలా వచ్చేలా లేదు.

ప్రతి నెలా 25లోగా వేతనాల బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీ కార్యాలయానికి పంపిస్తేనే నిర్ణీత సమయానికి ఉద్యోగులకు వేతనాలొస్తాయి. కానీ, ఈనెల 17 నుంచి అన్ని శాఖల ఉద్యోగులు సహాయ నిరాకరణలో పాల్గొంటుండడంతో ఫైళ్లతో పాటే వేతనాల బిల్లులూ తయారు కాలేదు. ట్రెజరీలో వేతనాల బిల్లుల దాఖలుకు శుక్రవారం తుది గడువు కాగా, ఉద్యోగుల సహాయ నిరాకరణోద్యమాన్ని జేఏసీ నేతలు మార్చి 5 దాకా పొడిగించారు. మరోవైపు ట్రెజరీ శాఖ ఉద్యోగులు సైతం సహాయ నిరాకరణలో పాల్గొంటున్నారు. దీంతో వేతనాల బిల్లులకు అక్కడ కూడా మోక్షం కలిగే అవకాశం ఎలాగూ ఉండదు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఫిబ్రవరి నెల వేతనాల చెల్లింపు లేనట్టే. దీంతో అటెండర్ నుంచి కలెక్టర్ దాకా ప్రతి ఉద్యోగికీ ఈ నెల జీతం అందేది గగనమే.

ఈ విషయం సహాయ నిరాకరణలో పాల్గొంటున్న ఉద్యోగులు పెద్దగా పట్టించుకోకపోయినా, జిల్లాస్థాయి అధికారులు మాత్రం ఇబ్బందికరంగానే భావిస్తున్నారు. తాము విధులకు సరిగానే హాజరైనా, జీతాలకు వచ్చేసరికి చిక్కులేమిటని వారు అసంతృప్తికి గురవుతున్నారు. కొందరు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారులు మాత్రం వేతనాలు నిలిచిపోవడాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. తెలంగాణ కోసం ఒక్క నెల జీతం ఆలస్యమైతే వచ్చిన ముప్పేమిలేదని చెబుతున్నారు

ఈల పాటతో మురిపించిన రఘురామయ్య

స్త్రీ, పురుష పాత్రలను రంగస్థలంపై ప్రదర్శించడంతో బాటు గాయకుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు ఈలపాట రఘురామయ్య. ఏ నాటకంలో నటించినా ప్రేక్షకుల కోరికపై ఈలపాట పాడక తప్పేదికాదు ఆయనకి. రాముడు, కృష్ణుడుగా రంగస్థలంపై మంచి పేరు తెచ్చుకున్నారు. 'కుచేల' చిత్రంలో కృష్ణుడుగా నటించారు తొలిసారి. 1935 లో విడుదలయిందీ చిత్రం. 1961లో రూపొందిన 'కృష్ణ కుచేల' చిత్రంలోనూ కృష్ణుడుగా నటించారు. కళ్యాణం వెంకటసుబ్బయ్య ఈయన అసలుపేరు. 8వ ఏట నటించిన తొలి నాటకం భక్తరామదాసులో రఘురాముడుగా నటించారు. పెద్దయ్యాక 'భక్త రామదాసు' నాటకంలో 'రఘురాముడు'గా నటించడం చూసాక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు 'రఘురామయ్యగా కొనసాగమని 1916లో ఆశీర్వదించడంతో రఘురామయ్య అయి, ఈలపాట రఘురామయ్య అయ్యారు క్రమక్రమంగా.

రంగస్థల నటన కొనసాగిస్తూ 'పృధ్వీపుత్ర' సినిమాతో సినిమానటుడుగా 1933లో కెరీర్‌ ప్రారంభించి 1975 వరకు మదాలస, గొల్లభామ, శ్రీకృష్ణ తులాభారం ఇలా సుమారు 100 చిత్రాల్లో నటించారు. గుంటూరుజిల్లా సుద్దపల్లిలో 5-3-1900న జన్మించారు. చిన్నతనం నుంచీ సంగీతం తెలియక పోయినా రాగాలాపన పైనే దృష్టి పెట్టి యడవల్లి సూర్యనారాయణ శిక్షణలో గాయకుడు, నటుడు అయ్యారు. 1975లో పరమపదించారు ఈలపాట రఘురామయ్య వర్థంతి ఫిబ్రవరి 24.

కేసులు తేలినంత వరకూ ఈస్టుకోస్టు ఆపాల్సిందే..

సంతబొమ్మాళి మండలంలోని కాకరాపల్లిలో నిర్మించ తలపెట్టిన ఈస్టుకోస్టు థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులు తేలినంతవరకూ నిర్మాణాలు ఆపాల్సిందేనని, లేని పక్షంలో ప్రజలు గాంధేయమార్గంలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తారని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకులు తమ్మినేని సీతారామ్‌ స్పష్టం చేశారు. ప్రజలు ప్రాణాలను, ఆరోగ్యాన్ని కాపాడాలని, పచ్చని పంటభూములు ధ్వంసం కాకూడదని, జల, వాయు కాలుష్యం జరగకుండా చూడాలని కోరుతుంటే, కాకరాపల్లిప్రాజెక్టు విషయంలో శాంతిభద్రతల కోణంలోనే పోలీసులు చూడటం శోచనీయమన్నారు. ప్రజల కోరిక మేరకు ఈ సమస్యను మానవీయకోణంలో పోలీసులు ఎందుకు పరిశీలించడంలేదని ఆయన ప్రశ్నించారు.

కాకరాపల్లి థర్మల్‌ ప్రాజెక్టు వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పువాటిల్లుతోందని, శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చిత్తడి నేలల్లో పరిశ్రమలు నెలకొల్పరాదని, చట్టాలు పేర్కొంటున్నా, సాక్షాత్తూ కేంద్ర పర్యావరణశాఖ మంత్రి జైరాంరమేష్‌ స్పష్టం చేసినా కూడా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకుండా, యాజమాన్యానికి దన్నుకాసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రైల్వే బడ్జెట్ ప్రశంసాత్మకం

రైల్వే మంత్రి మమతాబెనర్జీ ప్రశంసాత్మకంగా రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. రవాణా రేట్లను గాని ప్రయాణికుల చార్జీలు కాని పెంచలేదన్నారు. ఇందువల్ల ద్రవ్యోల్బణం తగ్గుతుందన్నారు. కీలకమైన మౌలికసదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఇది దేశ ఆర్ధికాభివృద్ధికి ఊపునిస్తుందన్నారు. రైల్వే మంత్రి ప్రశంసార్హమైన పనిచేశారని కొనియాడారు.

మార్చిలో'తెలంగాణా' వచ్చేస్తోంది....

రాష్ట్ర మంత్రి సంచలన వాఖ్యల శంకరరావు మార్చి నెలలోనే తెలంగాణా ఏర్పడబోతోందంటూ మరో సంచలన ప్రకటన చేసారు. శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని..ఈ మేరకు మార్చి నెలలో శుభవార్త రాబోతోందని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం, తెరాస నాయకులను కూడా సంప్రదించిందని... త్వరలోనే మరోమారు అఖిలపక్షంతో సమావేశమయ్యాకనే నిర్ణయం వచ్చే నెలలోనే వెలువడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలంగాణా ప్రజల ఆకాంక్ష వాస్తవం కాబోతోందని ఆయన అన్నారు.

మే 20న 6వ విడత కల్యాణమస్తు

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మే నెల 20వ తేదీన ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు టీటీడీ కార్యనిర్వహణాధికారి ఐవైఆర్‌ కృష్ణారావు ప్రకటించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2007 నుంచి గత ఏడాది వరకు నిర్వహించిన ఐదు విడతల కల్యాణమస్తు కార్యక్రమాల్లో 34 వేల నిరుపేద జంటలు తిరుమలేశుని ఆశీస్సులతో కల్యాణాలు చేసుకున్నారని తెలిపారు.

ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమ నిర్వహణపై పండితులు ప్రభాకర్‌ పూర్ణయ్య సిద్ధాంతి, వేదాంతం విష్ణు భట్టాచార్యులు, సుందర వదనాచార్యులు , వేద పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య రామమూర్తి కలిసి పంచాంగాన్ని పరిశీలిం చి ముహుర్త నిర్ణయం చేశారన్నారు. ఆ ముహుర్తం ప్రకారం ఈ ఏడాది మే నెల 20వ తేదీ ఉదయం 9.50 గంటల నుంచి 10.04 గంటల మధ్య ఆరవ విడత కల్యాణమస్తు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్టు కృష్ణారావు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపి, వారి అనుమతితో అన్ని జిల్లాల కలెక్టర్లతో చర్చించి జంటల రిజిస్ట్రేషన్‌ కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలో త్వరలో ప్రకటిస్తామన్నారు.

ఐదవ విడత కార్యక్రమం తరహాలోనే ఆరవ విడత కల్యాణమస్తు కూడా అన్ని శాసన సభా నియోజక వర్గ కేంద్రాల్లో ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగం సహాయ సహకారాలతోనే నిర్వహిస్తామని అర్హుల ఎంపిక నుంచి పెళ్లికి అనుమతించే వరకు గత కల్యాణమస్తు నిబంధనలన్నీ యథావిధిగా అమలులో ఉంటాయని ఆరవ విడత క ల్యాణమస్తు రాష్ట్రానికి మాత్రమే పరిమితమవుతుందని, ఇతర రాష్ట్రాలలో ఉండదని కృష్ణారావు స్పష్టం చేశారు.

'వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాదే'

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తాను స్థాపించానని, ఆ పార్టీకి తాను అధ్యక్షుడినంటూ కడపకు చెందిన మహబూబ్‌బాషా చెప్పారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తనదేనంటూ చెప్పుకుంటున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ అధ్యక్షుడు కె.శివకుమార్‌ అనేవ్యక్తిపై కడప రెండవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసినట్లు తెలిపారు. బ్లాక్‌మెయిలింగ్‌, కోర్టు ధిక్కార నేరం కింద కేసు నమోదుచేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. తనను శివకుమార్‌ బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదుచేశారు.

శివకుమార్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదన్నారు. తాను గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ పార్టీకి ఎంతో సేవచేశానని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మృతిచెందిన తర్వాత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనే రాజకీయ పార్టీ స్థాపించి రిజిస్ట్రేషన్‌కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నట్లు బాషా తెలిపారు. ఇందుకోసం తగిన ప్రతిపాదనలు కూడా పంపామన్నారు.

ఎట్టకేలకు విద్యాహక్కు చట్టం అమలు ఉత్తర్వులు జారీ

స్వాతంత్య్రం సిద్దించి 60 సంవత్సరాల అనంతరం ప్రభుత్వం విద్యా ఆవశ్యకతను గుర్తించింది. దేశం అభివృద్ది చెందాలంటే గ్రామీణా ప్రాంతాల్లో ప్రాధమిక స్ధాయి నుండి విద్య పెంపొందితే దేశం అభివృద్ది పధంలో నడుస్తుందని, ఎట్టకేలకు ప్రభుత్వం ఆలస్యంగా గుర్తించింది. ఇందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి. ఒక దశలో డిటెన్షన్‌ సిస్టమ్‌ అమలు పరచాలని ప్రభుత్వం యోచించింది. అయితే ఇది గ్రామీణ ప్రాంతాల్లో అమలకు సాధ్యం కాదని ఆ ప్రతిపాదనను విరమించుకుంది. అయితే సంవత్సరం కిందట కేంద్ర ప్రభుత్వం గ్రామీణ స్ధాయి నుండి విద్యా హక్కు చట్టాన్ని అమలు పరచడం ద్వారా ప్రజలను చైతన్యం చేయవచ్చునని ఇది బాల్య దశ నుండే అమలుపరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చనని భావించి ఈ చట్టానికి రూపకల్పన చేసింది.
విద్యాహక్కు చట్టం అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 6 నుండి 14 సంవత్సరాల వయస్సు కలిగిన పిల్లలకు తప్పనిసరిగా విద్యనందించాలనేది ఈ చట్టంలోని ప్రధాన ఉద్దేశ్యం. జిల్లాలో రాజీవ్‌ విద్యామిషన్‌ పర్యవేక్షణలో ఈ పథకం అమలు జరుగుతుందని ఏడాది కిందట కేంద్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చినప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్టం తెచ్చినప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అమలులో జాప్యం చేసింది కాగా ఇటీవల ఇందుకు సంబంధించిన విధి విధానాలను సూచిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జీవో జారీ చేశారు. దీంతో ప్రాధమిక విద్యా హక్కు చట్టం అమలుకు రంగం సిద్దమైంది.

ఒయు ఐకాస నేతల మధ్య చిచ్చు

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థి సంఘాల (ఐకాస) మధ్య చిచ్చు రగిలింది. తెరవెనుక రాజకీయ నేతలు విద్యార్థుల మధ్య ఆధిపత్య పోరాటానికి బీజం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే విద్యార్థులు మాత్రం అనేక వర్గాలుగా విడిపోయి పరస్పర నిందారోపణలతో, దాడులకు సర్వసన్నద్దమవుతున్న తీరు తెలంగాణ వాదులను కలవర పరుస్తోంది. ఈ ఉద్యమానికి వెన్ను దన్నుగా నిలవాల్సిన విద్యార్థులు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారే పరిస్థితి తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత రెండు రోజులుగా వర్సిటీ క్యాంపస్‌లో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని విద్యార్థి లోకం భావిస్తోంది.
ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టగొడుగుల్లా ఏర్పడిన జాక్‌ నాయకులపై కామన్‌ స్టూడెంట్స్‌ మరోసారి దాడులకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ఉద్యమం పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా వసూలు చేసి ఉద్యమాన్ని పక్కదారి పట్టిస్తున్నారని సాధారణ విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు యూనివర్సిటీలో ఐదు జాక్‌లు ఏర్పడి, దేనికవే సొంత ఎజెండాలతో అక్రమ వసూళ్లకు పాల్పడడమే గాక అసలైన తెలంగాణ ఎజెండాను పక్కన బెడుతున్నాయని వీరి ప్రధాన ఆరోపణ. ప్రధాన జాక్‌ నేతలు టిఆర్‌ఎస్‌కు, మరో జాక్‌ లెఫ్ట్‌ భావజాలం, స్వతంత్ర జాక్‌ నేతలు టిడిపి, ఓ కుల సంఘానికి అనుబంధంగా, ఇక మిగతా రెండు జాక్‌లు ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనకుండా వసూళ్లకోసమే దుకాణాలు తెరిచి, ఇలా ఎవరికి వారే జాక్‌ నాయకులమని చెలామని అవుతున్నారని కామన్‌ విద్యార్థులు మండిపడుతున్నారు.

'మార్చి' పరీక్షలకు మంగళం?

ఒక వైపు సహాయ నిరాకరణ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతూ మార్చి 5 వ తేది వరకు ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఉధ్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. మార్చి 5 అనంతరం కూడా ప్రత్యేక తెలంగాణా బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టని పక్షంలో మార్చి 6 నుంచి నిరవదిక సమ్మెకు ఉద్యోగులు నోటీసు ఇచ్చేందుకు సంసిధ్దులవుతున్నారు. ఈ నేపద్యంలో విద్యార్ధులు కూడా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు . దీనిలో భాగంగా మార్చి మాసంలో పదవతరగతి, ఇంటర్‌, డిగ్రీ విద్యార్ధులకు వార్షిక పరీక్షలు జరగనుండగా విద్యార్దులు పరీక్షలను బహిష్కరించేందుకు సిద్దపడుతున్నారు. కాగా ఉపాధ్యాయులు, లెక్చరర్లు పరీక్షల విధులను కూడా బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెపుతున్నారు. గురువారం జరగవలసిన డిగ్రీ ప్రీ ఫైనల్‌ పరీక్షను విద్యార్ధులు బహిష్కరించారు. డిగ్రికి మార్చి 24 నుండి, ఇంటర్‌ కు మార్చి 7 నుంచి థియరీ, పదవతరగతికి మార్చి 24 నుంచి పరీక్షలు ఆరంభం కావలసి ఉంది. అయితే విద్యార్ధులు పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెడితేనే పరీక్షలు రాస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు తాము ఎన్నోరకాలుగా నష్టపోయామని, ప్రస్తుతం జరగనున్న పరీక్షలు రాయకపోతే జరగనున్న నష్టాన్ని కూడా భరించి ప్రత్యేక రాష్ట్ర ఆవిర్బావానంతరం స్వరాష్ట్రంలో పరీక్షలు రాస్తామని ప్రకటిస్తున్నారు. కాగా ఖైరతాబాద్‌ డిగ్రి కళాశాలలో విద్యార్ధులు శుక్రవారం నుండి రిలే నిరాహార దీక్షలకు సిద్దమయ్యారు.
వార్షిక పరీక్షలను బహిష్కరిస్తే తిరిగి పరీక్షలు నిర్వహిస్తుందా? లేక హాజరు కాని విద్యార్ధులను ఫెయిల్‌ లిస్టులో ఉంచుతారా అన్న విషయమై తీవ్ర చర్చ జరుగుతుంది. పరీక్షల బహిష్కరణ మూలంగా ఇంటర్‌, పదవ తరగతి విద్యార్ధుల పై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్‌ విద్యార్ధులు ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ లాంటి కోర్సులలో చేరేందుకు వీలులేకుండా పోయే అవకాశం ఉంది. అలాగే పదవతరగతి విద్యార్ధుల భవిష్యత్‌ కూడా అంధకారంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

కొత్త రైల్లు, కొత్త రైల్వే లైన్లుతో ఆంధ్రప్రదేశ్‌పై 'మమత' చూపారు

వచ్చేనెల 5 వరకు సహాయ నిరాకరణ

:సహాయ నిరాకరణతో ఇప్పటికే ప్రభుత్వ పాలన జిల్లాలో పడకేసింది...ఎక్కడి ఫైళ్ళక్కడేఆగి పోయి ఉన్నాయి...కాగా ఇదే స్థితి మార్చి 5 వరకు కొనసాగిస్తామని ఉద్యోగుల జెఏసి ప్రకటించింది... అప్పటికీ కేంద్ర సర్కారు దిగి రాకుంటే ఏకంగా నిరవధిక సమ్మెకు దిగాలని ఉద్యోగుల సంఘం నిర్ణయిం చింది...ఈ తాజా నిర్ణయం ప్రభత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేదిగా పరిణమించింది...ఒక వేళ నివరధిక సమ్మెకు దిగితే పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉంది...

ఇప్పటికే అనేక మంది లబ్ది దారులకు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సేవలు అందడంలేదు...ఇక సమ్మెకుదిగితే ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించాల్సిన పరిస్థితి ఏర్పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి...