15, ఫిబ్రవరి 2011, మంగళవారం

సీతక్క పాదయాత్రకు విద్యార్ధుల అడ్డు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే సీతక్క మంగళవారం వరంగల్ జిల్లాలో చేపట్టిన పాదయాత్రను ములుగు మండలంలో విద్యార్థులు అడ్డుకున్నారు.

టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థులకు మధ్య తోపులాట జరగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆమె రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో అక్కడ ట్రాఫిక్ స్తంభించింది. అనంతరం ఘట్టమ్మ దేవాలయం వద్ద సీతక్క దీక్షకు దిగారు.

ఉపఎన్నికలపై అబ్బాయి, బాబాయి పట్టు

పులివెందులలో వైఎస్ ప్రకాష్‌రెడ్డి నివాసంలో మంగళవారం ఉదయం కడప నియోజకవర్గం మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తమ కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై వారు చర్చలు జరిపినట్లు తెలియవచ్చింది.

మరోవైపు తన అల్లుడికి కడప పార్లమెంటు సీటు ఇవ్వవలసిందిగా కోరేందుకు వ్యవసాయ శాఖామంత్రి వైయస్ వివేకానంద రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లినట్లుగా తెలుస్తోంది. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని కడప జిల్లా పార్లమెంటు అభ్యర్థిగా దింపాలనే యోచనలో వివేకా ఉన్నారు.

భానుకిరణ్‌తో జగన్ అనుచరులకి సంబంధాలు

మాజీ ఎంపీ జగన్ అనుచరులు మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందుతుడి భానుకిరణ్‌తో సంబంధాలు పెట్టుకొని కడప జిల్లాను భ్రష్టు పట్టిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆరోపించారు.మంగళవారం కడప జిల్లాలో రెండో రోజు రైతు కోసంయాత్ర లో ఆయన మాట్లాడారు.

చిరంజీవి తన సొంత సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారని అన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం తీసుకు వస్తానని పార్టీని పెట్టిన చిరంజీవి సామాజిక న్యాయం సాధించాడని, ఇక తన సామాజిక న్యాయం కోసమే అవినీతి కాంగ్రెస్ వైపు వెళ్లారన్నారు. చిరంజీవి సినిమా అయిపోయిందని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయలు సంపాదించారన్నారు. టిడిపి అందరి అవినీతి, అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ప్రజలు అమాయకులు కారని, అందరినీ వారు గమనిస్తున్నారన్నారు.

ఉండేవారెవరో.. వెళ్లేవారెవరో..ముందు తేల్చుకొండి

కాంగ్రెస్‌లో ఉండేవారెవరో, బయటకు వెళ్లేవారెవరో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని..రాష్ట్ర స్తాయి నుంచి మండలస్థాయి వరకూ ఈ స్పష్టత రావాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు.మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ మానిటరింగ్ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పార్టీలో నిజమైన కాంగ్రెసు వాదులు ఎవరో కానివారెవరో గుర్తించాల్సినఅవసరం ఎంతైనా ఉoదని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు.

త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని.. ఇందుకు పార్టీ కార్యకర్తలు అందరూ సర్వసన్నద్ధం కావాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సుస్థిరతకు ఎలాంటి ఢోకా లేదని. ప్రభుత్వం 2014 వరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.

సీరియల్ కిల్లర్ సురేంద్ర కోలీకి మరణశిక్ష ఖరారు

నిఠారీ సీరియల్ కిల్లర్ సురేంద్ర కోలీకి సుప్రీంకోర్టు మంగళవారం మరణశిక్షను ఖరారు చేసింది. రింపా హల్దార్ హత్య కేసులో కోలీకి విధించిన మరణశిక్షను సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే సహ నిందితుడు మనీందర్ సింగ్ పంధేర్‌కు కల్పించిన విముక్తిని సవాల్ చేస్తూ దాఖలు చేసిన అపీల్‌ను సుప్రీంకోర్టు పెండింగులో పెట్టింది.

కోలీ, మనీందర్‌లపై అదే విధమైన రేప్ ‌చేసి హత్యలు చేశారనే ఆరోపణలపై 18 కేసులు పెండింగులో ఉన్నందున మనీందర్ సింగ్ పంధేర్‌ను హల్దార్ హత్య కేసులో నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు పెండింగులో పెట్టింది. సురీందర్ కోలీ నేరం కిరాతకమైందని, భయానకమైందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.