19, మార్చి 2011, శనివారం

జగన్‌ వర్గం ఎమ్మెల్యేల్లో చీలిక?

శాసనసభ్యుల కోటాలోని 10 ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డిని దెబ్బకొట్టడానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వేసిన పాచిక పారలేదు. సరికదా! తప్పుడు వ్యూహంతో అభాసుపాలయ్యారు. ఫలితంగా సొంత పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటువేసిన ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతుపై పునరాలోచనలో పడ్డారు. ఓటింగ్‌ విషయంలో జగన్‌ సరైన వ్యూహం రచించకపోవటం వల్లే తాము విమర్శలకు గురవుతున్నామని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఆత్మప్రబోధం మేరకు ఎమ్మెల్యేలు ఓటు వేస్తారని జగన్‌తో పాటు ఆ పార్టీ నేతలు కూడా ప్రకటించారు. ఓటింగ్‌ విషయమై తనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల మధ్య విభేదాలు పొడచూపడంతో ఖిన్నుడైన జగన్‌ ఎంఐఎం అభ్యర్థులకు ఓటు విషయంలో అభ్యంతరం చెప్పకుండా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఓటింగ్‌ వ్యవహారంలో విభేదాలు తలెత్తటంతో జగన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో కొందరు ఎమ్మెల్యేలు పునరాలోచనలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో సొంత పార్టీకి దూరమయ్యేందుకు వారు విముఖత చూపుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకే జైకొట్టేందుకు నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల్లో వారు తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.