19, మార్చి 2011, శనివారం

కావాల్సిన చీఫ్ బట్టి రేటు ఫిక్స్...

అవినీతికి అలవాటు పడిన విద్యాశాఖ అధికారులకు పదో తరగతి పరీక్షలు కాసులు కురిపిస్తున్నాయి. ఆయా పరీక్ష కేంద్రాలకు చీఫ్ లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు (డీఓ), అసిస్టెంట్ డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ల(ఏడీఓ)ను నియమించే విషయంలో బేరసారాలు పెట్టారు. కాపీలు కొట్టించి, అధిక సంఖ్యలో విద్యార్థులను పాస్ అయ్యేలా చేసి ఉతీర్ణత పెంచుకునేందుకు కొన్ని పాఠశాలల యజమానులు సంబంధిత అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి కోరుకున్న అధికారులను చీఫ్‌లుగాను, డీఓ, ఏడీఓలుగా నియమించుకుంటున్నారని సమాచారం. పరీక్ష కేంద్రాలకు చీఫ్‌లు, డీఓలు, ఏడీఓల నియామకంలో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలే ఆరోపిస్తున్నాయి. సెంటర్ల కేటాయింపు మొదలుకుని ప్రతి పనినీ తప్పు పడుతున్నారని, తీరా మామూళ్లు ముట్టజెపితే నియమ, నిబంధనలను పట్టించుకోవడం లేదని చెబుతున్నాయి. ముడుపులు దండుకుని సౌకర్యాలున్న ప్రభుత్వ పాఠశాలలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను తగ్గించి, అరకొర సౌకర్యాలున్న ప్రైవేటు పాఠశాలలకు అధిక సంఖ్యలో విద్యార్థులను కేటాయించినట్లు తెల్సింది. ఏ పాఠశాలలో ఎంత మంది పరీక్షలు రాయాలో అధికారులు సంఖ్యను వేసి సెకెండరీ ఎడ్యుకేషన్ బోర్డుకు పంపుతారు. ముడుపులు దండుకున్న అధికారులు ఆ సమయంలోనే సంఖ్యను కోరుకున్న విధంగా వేసి పంపినట్లు సమాచారం. కోరుకున్న, కావాల్సిన చీఫ్ కావాలంటే పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి రేటు ఫిక్స్ చేశారని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే రూ. 1,500 నుంచి సంఖ్య ఎక్కువ ఉన్న పాఠశాలల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేస్తున్నారని తెల్సింది.