అభ్యుదయ సాహిత్యాన్ని సృజించి, తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకున్న మహోన్నతుడు ఆయన. 19వ శతాబ్దిలో అప్పటి సామాజిక స్థితిగతులను అవగతం చేసుకుని దార్శినిక దృక్పథంతో రచనలు సాగించిన అతి కొద్దిమందిలో ఆయనది సమున్నత స్థానం. సాహిత్యమనేది సామాజిక అభ్యున్నతికి, సంఘ సంస్కరణకు దోహదపడాలన్న ఉదాత్త ఆశయం ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సామాజిక దురాగతాలపై పోరాటమే సాహిత్యం లక్ష్యమని ప్రగాఢంగా విశ్వసించిన ఆయనే నవయుగ వైతాళికుడు, అభ్యుదయ సాహిత్య సృష్టికర్త గురజాడ వెంకట అప్పారావు.
తెలుగుసాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీవేత్తల్లో గురజాడ అగ్రగణ్యులు. ఆయన హేతువాది. 19వ శతాబ్దిలోనూ, 20వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ సాహితీప్రియుల మన్ననలు పొందుతూనే ఉన్నాయి.
వారాలబ్బాయి నుంచి బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యుని దాకా..
వ్యావహారిక భాషలో రచనలు చేయటం తప్పుగానూ, చేతగాని తనం గానూ భావించే ఆ రోజుల్లో ప్రజలందరికీ అర్థమయ్యే జీవభాషలో రచనలు చేసిన గురజాడ వెంకట అప్పారావు విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో మేనమామ ఇంట 1862 సెప్టెంబరు 21న జన్మించారు. ఆయన కుటంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాల (గురజాడ) నుంచి విశాఖ తరలి వచ్చింది. అప్పారావు తండ్రి వెంకటరామదాసు. తల్లి కౌసల్యమ్మ. ఇద్దరు కుమారుల్ల వెంకట అప్పారావు మొదటి కొడుకు. రెండో కొడుకు శ్యామలరావు. వెంకట రామదాసు విద్యావంతుడు. సంస్కృత భాషా భినివేశం గలవారు. ఆయన విజయనగరం సంస్థానంలో పేష్కారు (రెవెన్యూసూపర్ వైజర్) గా, ఖిలేదార్‌గా పని చేసేవారు.
ఒకరోజు విజయనగరం సమీపంలోని ఊడగెట్ట దాటు తుండగా ప్రమాదవ శాత్తూ మునిగి చనిపోయారు. వెంకట రామదాసు చీపురుపల్లిలో పని చేసే రోజుల్లో వెంకట అప్పారావు ప్రాథమిక విద్యాభ్యాసం అక్కడే జరిగింది. తండ్రి మరణానంతరం విజనగరం వచ్చేసిన ఆయన మిగిలిన విద్యాభ్యాసాన్ని విజయనగరంలోనే పూర్తి చేశారు. ఆయన విద్యాభ్యాసం ఒడిదుడుకుల మధ్యే సాగింది.
తండ్రి లేడు. ఆదాయం వచ్చే మార్గం లేదు. ఇంట్లో పేదరికం తాండవిస్తోంది. పూటగడవటమే కష్టంగా ఉన్న పరిస్థితుల్లో ఎవరు చదివిస్తారు? అయినా చదువుకోవాలన్న పట్టుదల గురజాడలో ఎక్కు వైంది. ఆ ఇంటా ఈ ఇంటా వారాలు చేసుకుంటూ చదువు కొనసాగిం చారు. అదే సమయంలో ఎం.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ సి.చంద్రశేఖర శాస్త్రి గురజాడను ఆదుకున్నారు. ఉచితంగా వసతి, భోజన సదుపా యాలు కల్పించారు. ఆయన సంరక్షణలోనే గురజాడ 1882లో మెట్రిక్యులేషన్, 1884లో ఎఫ్‌ఎ పూర్తి చేశారు. తరవాత మహారాజా ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. అప్పుడు ఆయన నెల జీతం రూ.25. 1885లో అప్పలనరసమ్మతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 1887లో పెద్ద కూతురు లక్ష్మీనరసమ్మ, 1890లో కొడుకు వెంకటరామదాసు, 1902లో రెండో కూతురు కొండయ్యమ్మ జన్మించారు. ఒకపక్క ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ ఉన్నత విద్యాభ్యాసాన్ని కొనసాగించారు. 1886లో బి.ఎ.పట్టభద్రులయ్యారు. అదే సమయంలో కొద్దిరోజులు డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో హెడ్‌క్లర్క్‌గా పని చేశారు. 1887లో మహారాజా కళాశాలలో రూ.100 జీతంతో అధ్యాపకునిగా చేరారు. అదే సమయంలో విజయనగరం సంస్థానాధీశుడు పూసపాటి ఆనందగజపతిరాజుతో పరిచయమైంది. క్రమేపీ ఇద్దరి నడుమా ఆ పరిచయం విడదీయరాని బంధంగా మారింది. 1891లో గురజాడ మహరాజా సంస్థాన్‌లో ఎపిగ్రఫిస్ట్ (సంస్థాన శాసన పరిశోధకుడు)గానియ
మితులయ్యారు.ఆ మరు సటి సంవత్సరమే మద్రాసు లా కళా శాలలో చదువుతున్న సోదరుడు శ్యామలరావు మృతిచెందాడు. 1897లో మహారాజా ఆనంద గజపతిరాజు స్వల్ప అనారోగ్య కారణంగా మృతి చెందాడు. ఈ రెండు సంఘటనలూ గురజాడను ఒకింత కుంగదీశాయి.
ఆనందగజపతిరాజుకు వారసులు లేకపోవటంతో ఆయన సోదరి అప్పలకొండయ్యమ్మ (రీవారాణి) సంస్థానం వ్యవహారాలు చూస్తుం డేది. ఆమెకు వ్యక్తిగత కార్యదర్శిగా, సలహాదారుగా గురజాడ నియ మితులయ్యారు. 1905లో తల్లి కౌసల్యమ్మ కాలం చేసింది. 1911లో ఆయన మద్రాసు యూనివర్సిటీలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ సభ్యులుగా నియమితులయ్యారు.
సాహితీ కృషీవలుడు
'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' అంటూ సమా జానికి చాటిచెప్పిన గురజాడ సంఘ సంస్కరణ కోసం కలం పట్టారు. స్త్రీ జనోద్ధరణ, మూఢనమ్మకాల ఖండన అనే రెండంచుల కత్తిని ప్రయోగించారు. సమకాలీన సమస్యలపై పోరాటానికి కలాన్ని ఝుళి పంచారు. గురజాడ గొప్ప సంఘసంస్కర్త మాత్రమే కాదు. అంతకు మించిన చదువరి. ఇంగ్లీషు చదువు వల్ల సమకూర్చుకున్న విజ్ఞానాన్ని తన జాతి జనులకు పంచిపెట్టటానికి పూనుకున్నారు.
తన రచనల వల్ల సాధించాలనుకున్న సాంఘిక ప్రయోజనం గురించి అవగాహన ఉన్న కవి కనుకనే తాను ఎవరి కోసం కలం పట్టా రో ఆ ప్రజలు అర్థం చేసుకోవాల్సిన భావాలను వారు మాట్లాడే భాషలోనే చెప్పదలచుకున్నారు. కవి తన భావ ప్రకటన కోసం ఎంచుకోవాల్సిన బాహ్యరూపాన్ని నిర్ణ యిం చుకున్నప్పుడు వర్తమాన కాలం సామాజిక పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. అందుకే గురజాడ భావానికి తగిన భాషతోపాటు రచన స్వరూపం కూడా కొత్తగా ఉండాలని ఆశించారు. తెలుగు భాషలో అప్పటి వరకూ వాడుతున్న ఛందస్సు యతిప్రాసలప్రతిబంధకంలో బిగించబ డి ఉంది. తన భావ ప్రకటన వ్యావహా రిక శైలిలో, మృదుమధురమైన పదాల తో ఉండేలా ముత్యాలసరాలు అనే సరళతరమైన ఛందస్సును గురజాడ రూపొందించుకున్నారు. గణబద్ధమైన ఛందస్సు మీద తిరుగుబాటుగా ప్రౌఢమైన పదాల స్థానంలో సరళమైన వ్యావహారిక పదాలు పేరుస్తూ అత్యంత సులభతరంగా అర్థమయ్యే శైలిలో మాత్రాఛందస్సులో ఆయన రచించిన గేయాలన్నీ నవ్యకవితకు నిదర్శనాలు.
తలుగు సాహిత్యంలో కథానిక ప్రక్రియకు 'దిద్దుబాటు'తో 1910లో శ్రీకారం చుట్టారు. ఈ కథ ద్వారా తెలుగు సాహిత్య వికాసానికి నవ్య బాటలు వేశారు. ఆయన ప్రతి రచనలోనూ సామాజిక ప్రయోజనం పరిపుష్టంగా ఉంటుది. తెలుగు కవితకు కొత్త అందాలు, సొగసులు అద్ది కొత్త ప్రయోజనాలను ఆపాదించటంలో ఆయన వహించిన పాత్ర చిరస్మరణీయం.
సామాజిక దురాచారంపై గొడ్డలిపెట్టు కన్యాశుల్కం
తాంబూలాలిచ్చేశాను.. ఇక తన్నుకు చావండి
డామిట్ ! కథ అడ్డం తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్ 12.5
వాడొట్టి బొట్లేరింగ్లీషు పేల్తాడు
గురజాడ అప్పారావు గురించి విననివారు ఉంటే ఉండవచ్చునేమో కానీ కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన పై వాక్యాలు వినని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు వంటి పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.
వ్యావహారిక భాషావ్యాప్తికి గిడుగు రామ్మూర్తిపం తులుతో కలిసి ఉద్యమించిన గురజాడ ఆధునిక తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు. సమకాలీన సాంఘిక దురాచారాలను నిరసిస్తూ సాహిత్యాన్ని జనబాహు ళ్యంలోకి మరింత విస్తృతంగా తీసు కెళ్లలిగే ప్రక్రియ నాటకమేనని గురజాడ గుర్తించారు.
అద్భుత నాటకం కన్యాశుల్కం.
వాస్తవిక జీవితం నుంచి సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకుని తెలుగు వాడుకభాషలో 1892లో కన్యాశుల్కం నాటకం రాశారు. 1909లో మరిన్ని మార్పులు చేసి ప్రచురించారు. వందలాది ప్రదర్శనలిచ్చిన తెలుగు నాటకం ఇదే. శతాధిక వత్సరాలు దాటినా విశేష జనాదరణ పొందుతున్న ఓ అద్భుత నాటకం కన్యాశుల్కం. జాతీయ భాషల్లోనే కాకుండా ఫ్రెంచ్, రష్యన్, ఇంగ్లీషు భాషల్లో కూడా ఇది అనువదిత మైంది. ఈ నాటక రచనకు ఆనాటి సమాజంలో బాల్యవివాహాలే ప్రేరణ. ముక్కుపచ్చలారని పసిపిల్లలను పెళ్లి పేరిట అమ్ముకోవటాన్ని గురజాడ తీవ్రంగా నిరసించారు. 'ఇంతటి ఘోరమైన పరిస్థితి సమాజానికే సిగ్గుచేటు. ఈ దురాగతాన్ని ఎండగట్టి ఉన్నతమైన నైతిక ప్రమాణాల వ్యాప్తికి మించిన కర్తవ్యం సాహిత్యానికి మరొకటి లేదు.' ఈ మాటలను కన్యాశుల్యం నాటకానికి గురజాడ రాసిన తొలిమాటలో పేర్కొన్నారు.
కన్యాశుల్కం నాటకంలో ప్రతి పాత్రా సజీవమే. తదనం తర కాలంలో అనేక సామాజిక మార్పులకు ఈ నాటకం దోహదపడింది. ఆయన కలం నుంచి జాలువారిన పుత్తడిబొమ్మ పూర్ణమ్మ స్త్రీ సామాజిక దుస్థితిని ఆవిష్కరింపజేసింది. సమాజంలో రావాల్సిన మార్పులను సూచిం చింది. కరుణ రసాత్మకమైన ఈ గేయకావ్యం నాటి దురాచారాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.
సారంగధర, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, కన్యక, సత్యవ్రతీ శతకం, బిల్హణీ యం (అసంపూర్ణం), సుభద్ర, దించు లంగరు, లంగరెత్తుము, లవణరాజు కల, కాసులు, మీ పేరేమిటి?, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము- విమతము వంటివి గురజాడ కలం పేర్చిన 'ముత్యాలసరాలు'. అయాన రచించిన దేశభక్తి గేయాలు నవ ఉత్తేజాన్ని నింపటమేకాకుండా దేశభక్తిని కొత్తకోణంలో చూపిస్తాయి.
ఆయన రచనలు ప్రగతిశీల భావాలు కలిగిన అభ్యుదయ రచయితలకు, వ్యక్తులకు సదా అనుసరణీయం. సామాజిక దురాచారాలను నిరసిస్తూ నైతిక ప్రమాణాల వ్యాప్తి చేయటంమే సాహిత్యం కర్తవ్యమని విశ్వసించిన గురజాడ రచనలు స్ఫూర్తిదా యకం. తెలుగు సాహిత్యంలో నవ్యకాంతులు నింపి వెలుగుజాడగా నిలిచిన గురజాడ సాహితీ జగత్తులో ధృవతార.
నిరాడంబర జీవి
బతికినన్నాళ్లూ గురజాడ నిరాడంబరంగానే బతికారు. తనకంటూ ఏమీ మిగుల్చుకోలేకపోయారు. చివరకు కట్టుకున్న ఇంట్లోకి వెళ్లకుండానే ఆయన అంతిమ శ్వాస విడిచారు. ఆయాచితంగా వచ్చిందేదీ స్వీకరించేవారు కాదని ఆయన మనుమడు (ఆయన పేరు కూడా వెంకట అప్పారావే) ఒక సందర్భంలో ప్రస్తావించారని విజయనగరానికి చెందిన ప్రముఖ పాత్రికేయుడు 72 సంవత్సరాల ఆండ్ర భాస్కర సుబ్బారావు చెప్పారు.
ఆనందగజపతి సంస్థానంలో పని చేస్తున్నప్పుడు ఇప్పుడు విజయనగరంలో జిల్లా సమాచార కేంద్రం నిర్వహిస్తున్న గ్రంథాలయ భవనంలో గురజాడ నివసించేవారు. ఆ ఇంటిని ఉచితంగా ఇప్పిస్తానని ఆనందగజపతి చెప్పినా గురజాడ ససేమిరా అన్నారట. మరీ పట్టుబడితే తనకు ఆయాచితంగా వచ్చేదేదీ అవసరం లేదని చెబుతూ ఆ ఇంటిని రూ.260 ఇచ్చి కొనుక్కున్నారట.
ఈ ఇంటికి పక్కనే 1915 ప్రాంతంలో గురజాడ కుటుంబీకులు సొంత ఇంటిని కట్టుకున్నారు. గృహప్రవేశం కూడా అయింది. కానీ అప్పటికే ఆరోగ్యం పూర్తిగా క్షీణించిన గురజాడ సొంతింట్లోకి వెళ్లలేకపోయారు. ఆయన చివరి ఘడియలు పాత ఇంట్లోనే గడిచాయని గురజాడ మునిమనుమడు (నాలుగో తరం) వేంకటేశ్వరప్రసాద్ చెప్పారు. గురజాడ తాతగారు (ఆయన పేరు కూడా వెంకట అప్పారావే) మెజిస్ట్రేట్‌గా పనిచేసేవారట. ఒకరసారి ఆయనతోపాటు కోర్టుకు వెళ్లిన గురజాడ తాను కూడా బాగా చదువుకుని మెజిస్ట్రేటున వుతానని కోర్టుహాలు గోడమీద రాసినట్లు తమ పెద్దలు చెప్పినట్లు వేంకటేశ్వరప్రసాద్ చెప్పారు.
వెలుగు చూడని 'అస్తమించని సూర్యుడు'
హైదరాబాద్‌కు చెందిన ప్రియదర్శిని ఆర్స్ట్ వాళ్లు 1981లో గురజాడపై 'అస్తమించని సూర్యుడు' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీ చిత్రీకరించారని, షూటింగ్ మొత్తం విజయనగరం, పరి సర ప్రాంతాల్లో జరిపారని ఎ.బి.సుబ్బా రావు తెలిపారు. ఆ డాక్యుమెంటరీకి బంగా రునంది కూడా లభించిం దని, మరే కారణంచేతో ఆ డాక్యుమెంటరీ వెలుగు చూడలేదని అన్నారు.
కడసారి వీడ్కోలు
సంఘ సంస్కరణోద్యమానికి సాహిత్యాన్ని పదునైన ఆయు ధంగా ప్రయోగించిన మహాకవి గురజాడ అంతిమ ఘడియల్లో కూడా హాస్యరసాన్ని చిందిస్తూనే సాహితీ సరస్వతి ఒడిలో ఒదిగి పోయా రు. 1915 నవంబరు 30న క(పె)న్ను మూశారు. నాటి నికృష్ణ సమాజంపై నిప్పులు చెరిగిన ఆయన కలం అలసి సొలసి ఆగిపోయి ఇప్పటికి 97 సంవత్సరాలైంది. విజయనగరంలోని గురజాడ గ్రంథాలయంలో లభించిన ఆధారాల ప్రకారం.. 1915 ఏప్రిల్ నుంచి ఆయన ఆరోగ్యం అస్తవ్యస్తంగా తయారైంది. అదే నెల 7న విశాఖలోని పి.టి.శ్రీనివాస అయ్యంగార్ ఇంట్లో మకాం చేశారు. గిడుగు రామ్మూర్తిపంతుల్ని పిలిపించుకుని రెండురోజులపాటు ఆయనతో సాహిత్యగోష్టి జరిపారు. అప్పటికే ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్న రామ్మూర్తిపంతులు గురజాడకు వైద్యం చేస్తున్న డాక్టర్ ఎల్లింగ్టన్‌తో ఆయన ఆరోగ్యంపై చర్చించారు. అప్పారావుకు ఉత్తరాలు రాయవద్దని, ఆయనను అనవసరంగా శ్రమకు గురి చేయవద్దని ఎల్లింగ్టన్, రామ్మూర్తి పంతులుకు చెప్పారు. తరువాత గురజాడ విజయనగరం వచ్చేశారు. ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోంది. కుటుంబ వ్యవహారాలు కొన్ని ఆయనను చీకాకు పరిచాయి. నవంబరు నాటికి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. మంచం పట్టారు. 29న కొడుకు రామదాసును పిలిచి గిడుగు రామ్మూర్తిపంతులుకు ఉత్తరం రాయమన్నారు. అదే ఆయన రాయించుకున్న చివరి ఉత్తరం. పరిస్థితి క్షణక్షణానికీ దిగజారుతోంది. మంచం పక్కన కొడుకు రామదాసు, వైద్యుడు మంగయ్యనాయుడు దిగులుగా నిల్చున్నారు. ఇంటిల్లిపాదీ ఆందోళనతో అటూ ఇటూ తిరుగుతున్నారు. కొడుకును పిల్చి 'కొద్దిగా వైను, దంచిన తాంబూలం తెచ్చిపెడతావూ' అని అడిగారు. రామదాసు డాక్టర్ నాయుడువైపు చూశారు. అలాగే తెచ్చి ఇవ్వమంటూ తలూపారు నాయుడు. తాంబూలం చప్పరిస్తూ గురజాడ డాక్టర్ నాయుడు చెయ్యి పట్టుకుని 'వీటిని వేసుకోవచ్చునో.. కూడదో.. నేను బతికుంటే ఆహారశాస్త్రం మీద గ్రంథం రాస్తాను' అంటూ చిరునవ్వు నవ్వారు. అదే ఆయన చివరి మాట. ఆఖరి చిరునవ్వు. 1915 నవంబరు 30 ఉదయం 8.20 గంటలకు ఆ సాహితీమూర్తి కన్నుమూశారు.
-సోమయాజుల సన్యాసిరావు
-ఫొటోలు : పి.కిశోర్‌కుమార్