6, అక్టోబర్ 2012, శనివారం

ప్రపంచ ఉత్తమ లిపుల్లో తెలుగు ఒకటి

ప్రపంచ ఉత్తమ లిపుల్లో తెలుగు ఒకటని, ప్రపంచంలోని అనేక ధ్వనుల్ని ఈ లిపిలో రాయవచ్చని, ప్రపంచంలోని అనేక భాషలకు లేని ఈ సదుపాయం తెలుగుభాషకు మాత్రమే వుందని మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన బ్యాంకాక్‌లోని 'ది ఇంటర్నేషనల్ ఆల్ఫబేట్ అసోసియేషన్' నిర్వహించిన రెండో ప్రపంచ లిపుల సదస్సులో పాల్గొని తెలుగు లిపిపై సమగ్రమైన పత్రాన్ని సమర్పించారు. కొరియాకు చెందిన 'ది ఇంటర్నేషనల్ ఆల్ఫబేట్ అసోసియేషన్' థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ సదస్సును నిర్వహించింది. 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన ఈ సదస్సులో 33 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి తెలుగు, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతి, ఉర్దూ, పంజాబీ తదితర భాషలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా, డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ తెలుగు లిపిపై పత్ర సమర్పణ చేశారు.

తెలుగు లిపి బ్రాహ్మీలిపి నుంచి పరిణామం పొందిందని, క్రీ.పూ.400 సంవత్సరాల నుంచి తెలుగు లిపి ఉనికి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలో క్రీ.పూ.3500 సంవత్సరాల నుంచి బ్రాహ్మీలిపి వుందని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మీలిపి నుంచే భారతీయ భాషలన్నీ తమ లిపిని రూపొందించుకున్నాయన్నారు. బ్రాహ్మీ, దక్షిణ బ్రాహ్మీ, శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, వేంగీ, చాళుక్య, కాకతీయ తదితర పేర్లతో తెలుగు లిపి ఆయా కాలాల్లో రూపాంతరం చెందుతూ వచ్చి తెలుగు లిపిగా స్థిరపడినట్లు ఆయన తెలుగు లిపి పరిణామాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రత్యేకతలను సభకు తెలియజేశారు. తెలుగు లిపి అందంగా వుండడమే కాకుండా, అనేక భాషల కన్నా ఎక్కువ ధ్వనులను రాయగలిగిన సామర్థ్యం వుందన్నారు. ఉచ్ఛారణా విధేయమైన లిపి కలిగిన భాషని ఆయన సోపపత్తికంగా నిరూపించారు.

తెలుగు భాషా పదాలు ఎక్కువ భాగం అచ్చులతో అంతమవ్వడం వల్ల భాషకు అందం వచ్చిందన్నారు. అచ్చు, హల్లు ఒకదానితో ఒకటి కలిసి ఒకే లిపి ద్వారా సూచితం కావడం వల్ల రాతలో వర్ణాల సంఖ్య తక్కువగా వుంటుందన్నారు. తెలుగు లిపి సాధారణంగా ఎడమవైపు నుంచి ప్రారంభమవుతుం దన్నారు. తెలుగు లిపిలో వర్ణాలు ఎక్కువగా కనిపించినప్పటికీ, ఒకే మాదిరిగా వున్న వర్ణాలు ఎక్కువగా వున్నందువల్ల నేర్చుకోవడం కష్టం కాదని, అదే సమయంలో ఉచ్చరించినట్లే రాసే అవకాశం వున్నందువల్ల సులభంగా నేర్చుకోవచ్చని అన్నారు. కాగా ఈ సదస్సులో సంపత్‌కుమార్ సమర్పించిన పత్రాన్ని ఉత్తమ పత్రంగా తొమ్మిదిమంది న్యాయనిర్ణేతలు, యాభైమంది పరిశీలకులు «ద్రువీకరించారు. కొరియా లిపికి మొదటి స్థానం లభించగా, తెలుగు లిపికి రెండవ స్థానం లభించడం విశేషం. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ... ఎన్నో భాషా మేధావులు సమర్పించిన పత్రాల్లో తెలుగుకు ద్వితీయ స్థానం రావడం సంతోషంగా వుందన్నారు.