ఈశ్వర: స్వరూపము సమస్తము అని ఈశ్వరుడు స్వయంగా ''ఈశ్వర సర్వభూతానాం'' అన్నాడు. సర్వవ్యాపకుడైన ఈశ్వరుని స్వరూపముగా విరాజిల్లుతున్న ఈ సృష్టిలోని ప్రత్యణువులో చరాచరములైన అన్నింటిలోనూ ఆత్మస్వరూపుడై ఆ శివుడే నిండి వున్నాడు. ''ఓం నమ: శివాయ:'' అనే శివ పంచాక్షరి మంత్రం పంచ భూతాత్మకమైన సర్వవ్యాపకతత్వం.
ఓం ్స పరమేశ్వరుడు; 'న' నభ అనగా ఆకాశము;
'మ:' ్స మరత్తు అనగాలి; 'శి' ్స శిఖ అనగా అగ్ని;
'వ' వారిజ అనగా నీరు; 'య' పృధ్వివి అనగానేల.
సర్వము హరిహర స్వరూపము, అద్వైత సిద్ధి సాధకము అనే తత్త్వానికి మూలం 'శివాయ విష్ణురూపాయ, శివరూపాయ విష్ణవే'' అనే అద్వైత భావన. శివకేశవుల అభిదత్వ ప్రతిపాదన. శివుని హృదయంలో విష్ణువు, విష్ణువు హృదయంలో శివుడు, ''ఈశ్వర: సర్వభూతానాం అనే పంచభూ తాత్మకమైన సృష్టి శిమయం. అదే శివతత్త్వం. కాలం ఈశ్వరాధీనం, ఆ కాల జ్ఞానమే శివతత్త్వము. కాల స్వరూపుడైన సర్వేశ్వరుడు కాలనిర్ణయం చేస్తాడు. ఈశ్వర ఆజ్ఞానుసారమే కాలచక్రం నిర్ణయించబడి నడుస్తున్నది. ఇదే కాల జ్ఞాన తత్త్వం.
''శివరాత్రి మహారాత్రం నిరాహారో జితేంద్రియ:
అర్చయేద్వా యథాన్యాయం యథాబల మవంచక:
యత్ఫలం లభతే సద్య: శివరాత్రౌ మదర్చనాత్''
మహాశివరాత్రినాడు పగలు రాత్రి ఉపవాసముండి, ఇంద్రియ నిగ్రహం పాటించి, భక్తి శ్రద్ధలతో, విధివిధానంగా శివలింగాన్ని పూజించే వారు, ఒక సంవత్సరకాలం శివుని పూజిస్తే లభించే ఉత్తమ ఫలాన్ని ఈ ఒక్కరోజే పొందగలరు. ఈ మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రియమైనది కనుక ఈనాడు శివనామ స్మరణ చేసినవారు కూడా శివసన్నిధి చేరుకుంటారు.
'లీయతి గమ్యతే ఇతి లింగ:
'లిం' అనగా లీయతి. 'గం' అనగా గమయతి. ఈ జగత్తు దేనితో సంచరించి దేనిలో లయం చెందుతుందో అదే 'లింగం'. ఆద్యంతములు లేని జ్యోతిర్లింగం జగత్తుకి ఉనికి పట్టయిన బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం యొక్క ఉపాధియే పరబ్రహ్మం. ఆపరబ్రహ్మమే మహాశివుడు. నిరాకరుడయిన శివుడి సాకారరూపమే లింగం. పరమశివుని ఆరాధ్య చిహ్నం లింగం. 'అ'కార 'ఉ'కార, 'మ' కారముల సమ్మేళణమైన 'ఓం' కారమే లింగం. అదే త్రిమూర్తుల ఏకరూపం, పరంబ్రహ్మరూపం. బ్రహ్మాండం నుండి మహాలింమై, మహాలింగం నుండి తేజోలింగంగా, జ్వాలాస్తంభంగా ఆవిర్భవించాడు మహా శివుడు, తనని పూజించి అర్చించుకోవడానికి అనువైన శివలింగంగా అవతరించాడు ఆ సర్వేశ్వరుడు.
అత్యంత రహితమైన లింగతత్త్వమే ఆత్మ. ప్రతి దేహంలోనూ ఆత్మ అనే లింగం ఉంటుంది. ఆ లింగ స్వరూపుడే శివుడు, జీవుడు. అందువల్ల శరీరంనుడి ఆత్మ లేక జీవుడు, శివుడు వేరుకాగానే, వెళ్ళి పోగానే శుభప్రదమైన దేహం 'శివము' నుండి అమంగళకరమైన 'శవము'గా మారిపోతుంది. అనంత నిరాకర పరబ్రహ్మ చిహ్నం లింగం.
''శృతి స్మృతి పురాణా నామాలయం కరుణాలయం
నిమామి భగవత్పాదం శంకరం లోక శంకరమ్''
శృతులలో, స్మృతులలో, పురాణాలలో మూలస్వరూపుడుగా కీర్తింపబడిన, శుభాల నొసగేవాడు, ఆదిగురువువైన శంకర భగవానుని దివ్యపాదార విందాలకు నమస్కరిస్తున్నాను.
'శం' అంటే చిదానందం 'కర' అంటే ప్రసాదించేవాడు అంటే చిదానందాన్ని ఇచ్చేవాడు 'శం కరోతి శంకర:' శంకరుడు, శుభకరుడు అని భావం. శంకరుడు అంటే శివుడు. ఎవరికి చిదానందం లభిస్తుందో వారికి అన్ని శుభాలు చేకూరినట్లే. 'శంభో శంకర హరహర మహదేవ' అంటూ భక్తి ప్రపత్తులతో తనని స్మరించే ప్రతి జీవికి ఇహ పరసుఖములతోబాటు ముక్తిని ప్రసాదించి పరబ్రహ్మమే శివుడు. త్రేతా యుగంలో శ్రీరాముడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు పరమశివుని పూజించి తమ కోరికల్ని సిద్ధించు కున్నారు.
తత్పురుషాయ విద్మహే...
మహాదేవాయ ధీమహి....
తన్నో రుద్ర: ప్రచోదయాత్...'' అనే రుద్ర గాయత్రి పఠనం అశరీరవాణి చేస్తుంటే, త్రిమూర్తులలో తానే అధికుడననే సత్య నిరూపణ కోసం అరుణాచలంలో మాఘ బహుళ చతుర్దశినాడు జ్వాలాస్తంభంలో తేజోలింగంగా మహాశివుడు ఆవిర్భవించిన కారణంగా ఈ దినం మహాశివరాత్రిగా లోక ప్రసిద్ధమైనది.
క్షీర సాగర మధనం జరిగినప్పుడు ఉద్భవించిన కాలకూట విషాన్ని అవలీలగా ఔపోసనపట్టి, తన కంఠంలోనే దాచిపెట్టిన అమృతమూర్తి శివుడు నీలకంఠుడు. ఎలాంటి విషభావననైనా మనసులోపలికి పోనీయరాదనే అద్భుత సందేశానికి అది ప్రతీక. చెడుమాటల్ని కంఠంలో నిలిపి ఉంచేయాలనే దానికి ఇది సూచిక. ఆ నీలకంఠం చుట్టు ఉండే విషనాగులు కాలసర్పాలు. సర్పం మనలో దాగిన అజ్ఞాత కుండలిని శక్తికి చిహ్నం. ఆ శక్తిని నియంత్రించే అధిదేవత ఆ సర్పభూషణుడు.
శివుడు ధరించే త్రిశూలం సృష్టి స్థితి, లయలకు కారకుడు అతడే అనడానికి సంకేతం. ఢమరుకం అంటే శబ్దం. ఈ విశ్వమంతా శబ్దజనితం. శబ్దం వల్లె అర్థం వస్తుంది. శబ్ధార్థాలు రెంటినీ స్ఫురింపజేసే ఢమరుకాన్ని చేత ధరించే ఆ అర్థనారీశ్వరుడే జగత్తుకి తల్లిd తండ్రీ అని సూచించే శబ్ధార్థమే ఢమరుకం.
మహాకవి కాళిదాసు తన 'రఘువంశం' కావ్య అవతారికలో జగన్మాత పితరులైన పార్వతీ పరమేశ్వరులలా తన కావ్యంలో శబ్దార్థాలు కలసి ఉంటాయని ఆ ఆదిదంపతులను ఇలాస్తుతించాడు.
''వాగార్థావ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తయే
జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ''.
మనిషిలోని మృగాన్ని అణిచి ఉంచాలనేది శివుడి చర్మధారణలోని సందేశం. శివుడి మూడో నేత్రం జ్ఞానానికి సంకేతం, కోపానికి కాదు. ఆ నేత్రం తెరిచి చూసినప్పుడు, మనలోని జ్ఞాన నేత్రం తెరుచు కున్నప్పుడు మనస్సులోని మాలిన్యాలు, అరిషడ్వర్గాలు మాడిమసి అయి బూడిద అవుతాయి. దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా, చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అణువణువునా ఒంటపట్టించు కోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది. పరమేశ్వరుని శరీరం మీద బూడిద, త్రిపుండ్రం. అంతిమయాత్రలో మనకి తోడెవ్వరూ ఉండరు. తాను మనతో ఉన్నాననే భరోసా ఇవ్వడానికే శివుడు శ్మశానాలలో సంచరి స్తూండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాసభూములనిపేరు. శివుడు లయకారకుడే కాదు ముక్తి ప్రదాత కూడా. ధ్యాన యోగమే ముక్తికి రాచమార్గమని ముల్లోకాలకు చాటడానికే తాను నిరంతర ధ్యాయోగాన్ని ఆచరిస్తూ దాన్ని పరోక్షంగా భోదిస్తున్న పరమగురువు, మహాశివుడు, అందువలన ఆయన మహాదేవుడు. శివుని అనుగ్రహంతో వ్యాస మహర్షి రచించిన అష్టాదశ పురాణాలలో అతి శ్రేష్ఠమైనది 'శివపురాణం'.
పఠనాచ్ఛ శ్రవణాదస్య భక్తి మాన్నర సత్తమ:
సద్య శివపద ప్రాప్తిం లభ్యతే సర్వసాధనాత్||
భక్తితో శివపురాన్ని పఠించేవారు, ఆ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో ఆలకించే వారు, శివుని భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారు మానవుల్లో ఉత్తములై ఇహలోకంలో అన్ని సుఖాలు పొంది, ఆ జన్మాంతంలోని మోక్షాన్ని పొంది శివపదాన్ని చేరుకుంటారు. వేదమే జ్ఞానం. జ్ఞానమే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మం మహాశివుడు. శివుడు సర్వస్వమని ఆరాధించడమే జ్ఞానం. శివుడు స్వయంగా చెప్పిన శివ పురాణం లోని కథలు, శివలీలలన్నీ ఈ విషయాన్నే చెబుతున్నాయి.