26, ఫిబ్రవరి 2011, శనివారం
మెరుపు సినిమా నిలిచిపోయినట్టే ...
రామ్‌చరణ్ నటిస్తున్న మెరుపు సినిమాకు బ్రేక్ పడిందనేది తాజా వార్త. మెగా సూపర్ గుడ్ ఫిలింస్ నిర్మిస్తున్న చిత్రమిది. తిరుపతికి చెందిన ఎన్.వి.ప్రసాద్ ఇందులో పార్టనర్. ఈయన చిరంజీవికి అత్యంత ఆప్తులు. తిరుపతి నుండి చిరంజీవి పోటీ చేసినపుడు దగ్గరుండి అన్నీ చూసుకున్నారని అంటారు. ఆ అభిమానంతో రామ్‌చరణ్ డేట్స్ పొందారు. ఇంతకు ముందు పవన్‌కల్యాణ్‌తో 'బంగారం' సినిమా తీసిన ధరణి ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ నాయిక. అట్టహాసంగా ప్రారంభించిన ఈ చిత్రం ఇప్పుడు నిలిచిపోయినట్టే అంటున్నారు. ఆ మధ్య ఒక పాటని చెన్నైలో తీశారు. దీనికోసం మూడున్నర కోట్లు అయిందట. ఇంకా కొన్ని సన్నివేశాల చిత్రీకరణకు మరికొన్ని కోట్లు అయ్యాయట. ఇదే పద్దతిన సినిమా తీస్తే దాదాపు 40 కోట్లు ఖర్చవుతుందని నిర్మాత అంచనాకి వచ్చారు. ఇంత ఖర్చు పెడితే వర్కవుట్ కాదని నిర్మాతలు తెలుసుకున్నారు. రామ్‌చరణ్ 'ఆరెంజ్' సినిమా కూడా అధిక బడ్జెట్ వల్ల నష్టపోయిన విషయం మెరుపు నిర్మాతల కళ్లముందు మెదిలింది. రామ్‌చరణ్ మార్కెట్ పరిధిని మంచి ఖర్చు చేయడం కంటే సినిమా నిలిపివేయడమే బెటర్ అనే ఆలోచనతో ఉన్నారట. సినిమా ఆగిపోతే ఇబ్బంది కాబట్టి, ఎలాగైనా సరే కంటిన్యూ చేసేలా చిరంజీవి వర్గీయులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దర్శకుడిని మార్చేయాలని కూడా ఆలోచిస్తున్నారట. ఈ విషయమే చెన్నైలో చర్చలు జరుగుతున్నాయి.