దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులమైన తాము అవసరమైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీలో చేరతామని కాంగ్రెస్ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, ప్రజారాజ్యం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డిలు స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెదేపాలు కలిసి జగన్‌ను ఎదుర్కొనడానికే పనిచేస్తున్నాయని ఆయనను దెబ్బతీసేందుకు టార్గెట్ పెట్టుకున్నారని వారు ఆరోపించారు. జగన్‌ను గానీ, ఆయన కుటుంబాన్ని గానీ ఎవరైన కామెంట్ చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. జగన్ గురించి అనవసరమైన మాటలు మాట్లాడకుండా ప్రజల కోసం మాట్లాడితే మంచిదన్నారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్, 30 సంవత్సరాల చరిత్ర కలిగిన తెదేపా నేతలకు నైతిక విలువలు ఉన్నాయా? అని వారు ప్రశ్నించారు.
వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంత్రులు అధికారదుర్వినియోగానికి పాల్పడ్డారని, టిడిపి ఎంపిటిసిలతో లోపాయకారీ ఒప్పందం కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు. కడపలో జగన్ తరఫున గెలిపొందిన ఎమ్మెల్సీ అభ్యర్థికి వైఎస్సార్ బొమ్మ చూసి ఓటర్లు ఓట్లు వేశారన్నారు. ఇదిలావుండగా, చంద్రబాబు తన హయాంలో చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీలో రోజు ఏదో గొడవ సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు.