ప్రేతాత్మ కోర్టుకు వెళ్లింది. అదీ రాష్ట హైకోర్టుకు. వినడానికి విచిత్రంగా ఉంది కదూ. అయితే ఇది అక్షరాల నిజం. 2004 సంవత్సరంలో చనిపోయిన మహిళ పేరుతో రాష్ట్ర హైకోర్టు నుంచి అధికారులకు నోటీసులు వచ్చాయి. ఇది చూసి ఆశ్చర్య పోవడం అధికారుల వంతయింది. అంతేకాదు మరికొందరి పేర్ల మీద కూడా వారికి తెలియకుండానే అధికా రులకు నోటీసులు అందాయి. ఆ సంఘటన కలకలం సృష్టిస్తోంది.
తొట్టంబేడు మండలం కాసరం దళితవాడకు చెందిన చింతగింజల గున్నయ్య భార్య చింతగింజల లక్ష్మమ్మ పేరున పదేళ్ల కిందట కాసరం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబరు 388-1లో 1.50 ఎకరాలు పట్టా ఇచ్చారు. ఈమె 2004 మార్చి నెలలో అనారోగ్యంతో మృతి చెందింది. లక్ష్మమ్మ భర్త గున్నయ్య ఈ భూమిని ఓ స్థానికేతర భూస్వామికి లీజుకిచ్చాడు. చింతగింజల లక్ష్మమ్మతోపాటు ఇదే గ్రామానికి చెందిన గుండ్ల పుట్టమ్మ, గుండ్ల ఎర్రయ్య, నెలబల్లి వెంకటస్వామి, మగ్గం పెంచలయ్య, వెలంపాటి రత్నయ్య అనే వారికి కూడా పట్టాలు ఇచ్చారు. వీరు కూడా సదరు భూస్వామికి భూమిని లీజుకిచ్చారు. కాలగమనంలో ఆ భూమి చేతులు మారింది. దీంతో రెవెన్యూ అధికారులు అసలైన పట్టాదారులకు నోటీసులు పంపి సమాధానం ఇవ్వాలని కోరారు. అయితే వారి నుండి ఎలాంటి సమాధా నం రాలేదు.
ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వ భూమిని తొట్టంబేడు రెవెన్యూ అధికారులు గత ఏడాది ఆగస్టు 18న స్వాధీనం చేసుకున్నారు. స్థానిక దళితుల నుండి నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన ఓ వ్యక్తి 43.48 ఎకరాలు తీసుకుని తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ భూమి మొత్తాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని బోర్డుల ను నాటారు. ప్రస్తుతం ఆ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దళితులకు పంపిణీ చేసిన భూమిని రెవెన్యూ అధికారులు మళ్లీ స్వాధీనం చేసుకోవడంపై పట్టాదారుల పేరుతో కొంతమంది కోర్టును (రిట్ పిటిషన్ నెంబరు 30961/ 2010) ఆశ్రయించారు. అయితే కోర్టుకు వెళ్లిన విషయం తమకు తెలియదని అసలైన పట్టాదారులు అంటున్నారు.
కాసరం దళితవాడకు చెందిన చింతగింజల లక్ష్మమ్మ పేరు కూడా కోర్టుకు వెళ్లిన వారి జాబితాలో ఉంది. అయితే వాస్తవానికి లక్ష్మమ్మ మృతి చెందింది. చనిపోయిన లక్ష్మమ్మ కోర్టుకు ఎలా వెళ్లిందో తెలియక అధికారులు తలలు పట్టుకుం టున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు సైతం నివ్వెరపోతున్నారు. తమకు తెలియకుండానే తమ పేరున ఎవరు కోర్టుకు వెళ్లారంటూ తలలు పట్టుకుంటున్నారు.