14, మార్చి 2011, సోమవారం

జగన్ అక్రమ ఆస్తులపై విచారణకు ప్రధాని సానుకూలం

మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతి సంస్థలోకి అక్రమ ఆస్తులు భారీగా తరలివచ్చాయని వాటిపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలిసి విన్నవించారు.  వారు చేసిన డిమాండ్‌కు ప్రధాని సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది.

అనంతరంఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వరరావు, ఎంపీ మైసూరారెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ డిమాండ్‌పై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు  చెప్పారు. జగన్‌కు చెందిన పార్టీని చూసి భయపడే స్థితిలో లేమని అన్నారు. జగన్ అక్రమ ఆస్తులపై తెలుగుదేశం పార్టీ ఎప్పటినుండో పోరాడుతుందని, జగతి పబ్లికేషన్స్ లో వాటాలు పూర్తిగా అక్రమమైనవని అన్నారు. అందులో ఎవరెవరు ఎంత పెట్టారో వారి వారి వాటాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అక్రమ ఆస్తులపై ఆదాయపన్ను శాఖ ద్వారా విచారణ జరిపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారని అన్నారు.