కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్లపై
ఇప్పటి వరకు వసూలు చేస్తూ వచ్చిన కస్టమ్, ఎక్సైజ్ డ్యూటీని పూర్తిగా
తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఆరు సబ్సీడీ సిలిండర్ల తర్వాత
బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే ఒక్కో సిలిండర్ ధరపై రూ.140 తగ్గనుంది.
ఇది వంటగ్యాస్ వినియోగించే పేద, మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరట కలిగించే
అంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవంగా ఇపుడు కేంద్ర ప్రభుత్వం ఒక్కో వంటగ్యాస్
సిలిండర్‌ను సబ్సిడీ ధర రూ.394కు చొప్పున అందజేస్తోంది. అదే బహిరంగ
మార్కెట్‌లో అయితే ఈ ధర రూ.754గా ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల సబ్సిడీకి ఇచ్చే
వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను యేడాదికి ఆరింటికి కుదిస్తూ కేంద్రం నిర్ణయం
తీసుకుంది. ఆపై సిలిండర్లు కావాలనుకునే వినియోగదారులు బహిరంగ మార్కెట్ ధరకు
కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో
ఏడో సిలిండర్ ధరపై రూ.140 తగ్గనుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి
చిదంబరం శుక్రవారం ప్రకటించారు. అలాగే డీజిల్‌పై బీహార్ ప్రభుత్వం రెండు
శాతం పన్నును తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని మంత్రి స్వాగతించారు.
అదేసమయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సబ్సిడీకి వంట గ్యాస్ సిలిండర్లను సరఫరా
చేయాలని చిదంబరం కోరారు.