9, ఏప్రిల్ 2013, మంగళవారం

ధర్మం వదిలివేసిన వైఎస్

 సిగ్గు, శరం, న్యాయం, ధర్మం వదిలివేసి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కొడుకు జగన్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు, రాష్ట్రాన్ని కొందరు వ్యక్తులకు దోచిపెట్టి, వారి ద్వారా జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారని విమర్శించారు. లక్ష కోట్ల దోపిడీకి పాల్పడిన దొంగలందరూ నేడు చంచల్‌గూడా జైలులో ఉన్నారని తెలిపారు.

ఇంకా కొంతమంది దొంగలు సెక్రటేరియేట్‌లో మిగిలారని చెప్పారు. వారిని ఇంటికి పంపించాల్సిన సమ యం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో గజదొంగలు పడ్డారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో పనికిమాలిన, అవినీతి దద్దమ్మ ప్రభుత్వం ఉందని తెలిపారు. దీన్ని సముద్రంలో కలపాలని ఆయన పిలుపునిచ్చారు. టీడీపీ హయాం కంటే ప్రస్తుతం 300 శాతం పైగా ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటి గురించి ప్రభుత్వాధినేతలకు పట్టడం లేదని విమర్శించారు.

6, ఏప్రిల్ 2013, శనివారం

పెద్దలను తప్పించి, యువకులకు పట్టం

 కాంగ్రెస్ పార్టీని యువరక్తంతో నింపేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ మండల అధ్యక్షులుగావున్న పెద్దలను తప్పించి, యువకులకు పట్టం కట్టేందుకు  నిర్ణయించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు 45 ఏళ్లలోపు వయసున్న వారిని పార్టీ మండలాధ్యక్షులుగా నియమిస్తారు. రెండుసార్లు పదవి చేపట్టిన వారిని ఆ స్థానం నుంచి తప్పించి, నామినేటె డ్ పదవుల్లో భర్తీ చేస్తారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులకు ఆదేశాలందాయి. ఇవి అమలైతే జిల్లాలో 70 శాతం మంది పదవులను కోల్పోతారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి పేర్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అనుబంధ సంస్థల నియామకాలకూ ఇదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు.

ప్రతి పంచాయతీకి ఐదుగురు చొప్పున, మండలానికి 150 మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి జాబితాను రూపొందిస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువకులను, మహిళలను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండడంతో వారిని పార్టీలో చేర్పిస్తున్నారు.

టీచర్లకూ డ్రెస్‌కోడ్

పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలవాలని, ఇం దుకోసం వారి ఆహార్యంలోనూ హుందాతనం ఉట్టిపడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా డ్రెస్‌కోడ్ పాటిం చి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాని ఆదేశాలు జారీ అయ్యా యి. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు లు ఆధునిక దుస్తులకు దూరంగా ఉండాల్సిందే. దీంతోపాటు సెల్‌ఫోన్లు కూడా తరగతి గదుల్లో ఉపయోగించకూడదం టూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉషారాణి ఉత్తర్వులు జారీ చేశారు. మరో 18 రోజుల్లో వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచీ దీన్ని అ మలుచేసేలా జిల్లా అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యా యి. 

ఇకపై జీన్స్‌ప్యాంట్లు, 8,4 జేబుల ప్యాంట్లు, టీ, రౌండ్ నెక్‌షర్ట్‌లు ధరించకూడదు. విద్యార్థులకు పాఠాలు భోదించే సమయంలో ఏకాగ్రత కోల్పోకుండా ఉపాధ్యాయులు సెల్‌ఫోన్ వాడాకాన్ని కూడా నిషేధించారు. విద్యార్థుల జీవితం నాలుగు గోడల మధ్య తీర్చుదిద్దబడుతుందనే కొఠారీ కమిష న్ సూచనల మేరకు ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలిచేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకు న్న నిర్ణయంపై పలు ఉపాధ్యాయ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని సక్రమంగా అమలు చేయాలని ప్ర భుత్వం ఆదేశాలు జారీచేసింది.

ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది...

తెలంగాణ డిమాండ్ న్యాయమైనది కాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. అది సమంజసం కాదని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. దక్షిణాది మీడియా సంబంధిత కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ కట్జూ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై పలు వ్యాఖ్యలు చేశారు. 

'ఇది న్యాయమైన డిమాండ్ కాదు. కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయి' అని జస్టిస్ కట్జూ వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాయన్నారు. తాను ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేదని జస్టిస్ కట్జూ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంట్ సభ్యుల్లో మూడో వంతు మంది నేర చరితులేనని, దేశ ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను భారత్‌లో కలపాల్సిందేనన్నారు.

సర్క్యులేషన్‌ను పెంచుకోవడానికి సంచలనాత్మకంగా...

కొన్ని పత్రికలు జర్నలిజం విలువలను పట్టించుకోకుండా సంచలనాత్మకంగా ప్రజలు, మహిళలను అప్రతిష్ఠపాలు చేసేలా వార్తా కథనాలు రాసి సర్క్యులేషన్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు భారతీయ పత్రికలకు చురకలు అంటించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహాల్‌లో జరిగిన ప్రెస్ కౌన్సిల్ రెండో విచారణ కమిటీ సమావేశంలో ఆయన పత్రికలు, చానెళ్లపై దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను విచారించారు. ఆంధ్రవూపదేశ్‌లోని తెలుగు పత్రికలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయని విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికపై వచ్చిన ఫిర్యాదులను చూసి తీవ్రంగా మందలించారు. అవాస్తవాలు రాసే పత్రికల లైసెన్సులను రద్దుపరచాలని ఆర్‌ఎన్‌ఐకి రాస్తామని హెచ్చరించారు. అభ్యంతరకరంగా వ్యవహరిస్తే ప్రకటనలు ఆపివేయాలని డీఏవీపీకి సూచిస్తానన్నారు. సాక్షి, ఈనాడులకు పరిపాటిగా మారిన పరస్పర వ్యతిరేక కథనాలపై కట్జూ విచారం వ్యక్తం చేశారు. ఈనాడు పత్రిక ఎంపీ జగన్‌మోహన్‌డ్డిని ఓఎంసీ కేసులో నిందితుడని వార్తలు రాసిందని సాక్షి ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై ప్రెస్ కౌన్సిల్ విచారణ నిర్వహించింది. 

జగన్‌ను సాక్షిగా పిలిస్తే ఈనాడు ఊహించి ఆయనను నిందితుడిగా రాసిందని పేర్కొన్న ఘటనలో ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు ఇలాంటి వివాదాలతో తమ ముందుకు రావద్దని కట్జూ సూచించారు. జగన్ పూర్తి వివరాలతో కూడిన ఖండనను పంపించాలని సూచించిన కట్జూ దానిని యథాతథంగా ప్రచురించాలని ఈనాడును ఆదేశించారు. అయితే జగన్ జైలులో ఉన్నందున ఖండన రాసే అవకాశంపై న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. జైలు అధికారుల అనుమతితో ఖండనను రాయాలని కట్జూ ఆదేశించారు. అయితే వార్తలు రాయడం పత్రికల సహజ గుణమని, ప్రతిదానికి ఖండనలు రాయడం కష్టమేనని విచారణ కమిటీ సభ్యులు అభివూపాయపడ్డారు. జగన్ అవినీతిపరుడని, వందలకోట్ల కుంభకోణాలని ఏబీఎన్, టీవీ9, ఈనాడు పదే పదే దిగజారుడు కథనాలు ప్రసారం చేశాయని సాక్షి ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై కమిటీ తీవ్రంగా స్పందించింది. ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు పదేపదే తమ గడప తొక్కవద్దన్న కమిటీ జగన్‌ను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలుగా వీటిని పేర్కొన్న సాక్షి ప్రతినిధుల వాదనతో ఏకీభవించింది. తక్షణం మీడియా సంస్థలు తమిళనాడులోని మీడియేషన్ సెంటర్లో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టులకు వెళ్ళాలని సలహా ఇచ్చింది. 

నమస్తే తెలంగాణ నుంచి 

నిర్లక్ష్యం ఖరీదు రూ.36 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం..పాఠశాలలకు శాపం
-గత ఏడాది ఒక్కో పాఠశాలకు రూ.50 వేలు ఇచ్చిన కేంద్రం
-ఖర్చుల మార్గదర్శకాల జారీలో ఆర్‌ఎంఎస్‌ఏ తీవ్ర నిర్లక్ష్యం
- రెండుసార్లు మార్గదర్శకాలతో గందరగోళం..వస్తువుల కొనుగోళ్లలో ఆలస్యం
- మార్చిలోగా కేంద్రానికి చేరని యుటిలైజేషన్ సర్టిఫికెట్లు.. ఈ ఏడాది నిధుల్లో కోత భారీగా కోత
- ఒక్కో పాఠశాలకు రూ.35 వేల కోత.. రూ.15 వేలు విదిలింపు




రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు లేనేలేవు. ప్రయోగాలు చేయడమెలాగో పుస్తకాల్లో చదవడమే తప్ప, మెజార్టీ పాఠశాలల్లో విద్యార్థులకు బ్యూరెట్, పిప్పెట్, కొలజాడీలను ప్రత్యక్షంగా చూసిన అనుభవం లేదు. లైబ్రరీ అనే బోర్డు తప్ప పుస్తకాలను ఎరగరు. అనేక రాష్ట్రాల్లో ఈ దుస్థితిని గుర్తించిన కేంద్రం మూడేళ్ల కిందట ఉన్నత పాఠశాలలకు ఏటా కొన్ని నిధులివ్వడం మొదలుపెట్టింది. ఇచ్చిన నిధులను ఖర్చు చేసి కొనుగోలు చేసిన వస్తువులకు యూసీ(యుటిలైజేషన్ సర్టిఫికెట్)ను పాఠశాలలు సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 10,368 ఉన్నత పాఠశాలల నుంచి యూసీలను సేకరించి ఆర్‌ఎంఎస్‌ఏ రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారులు కేంద్రానికి ఆర్థిక సంవత్సరం చివర్లో కేంద్రానికి సమర్పించాలి. దీని ఆధారంగానే మరుసటి ఏడాదికి నిధులు విడుదలవుతాయి. గత ఏడాది గరిష్టంగా ఒక్కో పాఠశాలకు రూ.50 విడుదలైతే ఖర్చుపెట్టే విషయమై ఆర్నెళ్ల వ్యవధిలో రెండుసార్లు మార్గదర్శకాలను జారీ చేయడంతో వస్తువుల కొనుగోళ్లలో ఆలస్యమైంది. మార్చిలోగా యూసీలు సమర్పించకపోవడంతో 2013-14కు ఒక్కో పాఠశాలకు కేంద్రం కేవలం రూ.15వేలు మాత్రమే విడుదల చేసింది.అంటే ఈ ఏడాది కూడా రూ.50వేల చొప్పున లెక్కేస్తే రూ.36.34 కోట్లు కోతపడింది. పాఠశాలలకు ఎలాగూ నిధులివ్వని రాష్ట్ర సర్కారు, కేంద్రం నిధుల వినియోగంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించింది. అరకొర సౌకర్యాలతో కొనసాగుతున్న పాఠశాలలకు సర్కారు నిర్లక్ష్యం శాపంగా మారింది.

గత ఏడాది రూ.50 వేలకు పెంపు 
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు పాఠశాల అభివృద్ధి నిర్వహణ గ్రాం టు కింద కేంద్రం ఏటా వేలాది రూపాయలను 2010-11 నుంచి మంజూరు చేస్తోంది. రెండేళ్లుగా రాష్ట్రంలోని 10,368 ఉన్నత పాఠశాలలకు ఈ నిధులు మంజూరవుతున్నాయి. 2010-11లో మూడు నెలలకు ఒక్కో ఉన్నత పాఠశాలకు రూ.12, 112, అలాగే 2011-12లో ఒక్కో పాఠశాలకు ఏడాదికి రూ.34,250 ఇచ్చింది. ఈ గ్రాంటు చాలడం లేదని క్షేత్రస్థాయినుంచి ఫిర్యాదులు అందాయి. ఈ మొత్తాన్ని పెంచాలని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. దీంతో 2012-13 నుంచి ఏటా రూ.50 వేలు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు గత ఏడాది రాష్ట్రంలోని ఒక్కో ఉన్నత పాఠశాలలకు రూ.50 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇక ఉన్నత పాఠశాలల నిర్వహణకు ఢోకా లేదని భావిస్తున్న తరుణంలో తాజాగా ఒక్కో పాఠశాలకు కేంద్రం రూ.35,000ల కోత విధించింది. రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారుల నిర్లక్ష్య వైఖరే ఈ పరిస్థితికి కారణం అని తెలుస్తోంది. 

ఆరు నెలల తర్వాత మార్గదర్శిక సూత్రాల జారీ
కేంద్ర నిధులు మంజూరైన వెంటనే వాటిని ఎలా వినియోగించాలో సూచిస్తూ మార్గదర్శక సూత్రాలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ మన రాష్ట్ర అధికారులు దీనికి భిన్నంగా వ్యవహారించారు. 2012-13కు సంబంధించి ఒక్కో పాఠశాలకు రూ.50 వేలను గత ఏడాది మార్చిలో కేంద్రం విడుదలచేసింది. వీటి వినియోగానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను రాష్ట్ర మాధ్యమిక శిక్ష అభియాన్ అధికారులు ఆగస్టులో జారీచేశారు. నిధులు మంజూరైన తర్వాత ఆర్నెళ్ల సమయం తీసుకున్నారు. ఈ నిధుల్లో ప్రయోగశాల పరికరాలకు రూ.25వేలు, లైబ్రరీ పుస్తకాలకు రూ.10 వేలు, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఇంటర్‌నెట్, టెలిఫోన్‌చార్జీలకు రూ.15 వినియోగించాలని సూచించారు. ఆలస్యంగానైనా మార్గదర్శక సూత్రాలు విడుదలవడంతో వస్తువులు కొనుగోలుకు సిద్ధమవుతుండగానే కొత్త ఆదేశాలు వస్తాయంటూ ఉన్నతాధికారులు చెప్పారు. దీంతో గ్రాంటు పాఠశాల ఖాతాల్లోనే ఉండిపోయింది. ఈ ఏడాది జనవరిలో ల్యాబ్ పరికరాలకు రూ.15వేలు, రూ.10వేలు ఆటలు, సాంఘికశాస్త్రం వస్తువులు, రూ.10వేలు లైబ్రరీ, రూ.15 నీరు, విద్యుత్తు, ఇంటర్‌నెట్, టెలిఫోన్ బిల్లులకు వినియోగించాలని ఆదేశాలు జారీ ఆయ్యాయి. తక్షణమే వస్తువులు కొనుగోలుచేసి యూసీలు సమర్పించాలంటూ ఆదేశించారు. దీంతో తక్కువ సమయంలో రూ.50వేలు వినియోగించలేని పరిస్థితి ఏర్పడింది. మెజార్టీ పాఠశాలలు కొనుగోలు చేసినా, యూసీలను మండల అధికారులకు సమర్పించలేకపోయారు. యూసీలు జిల్లాకు రాకపోవడం, అక్కడి నుంచి రాష్ట్ర ఆర్‌ఎంఎస్‌ఏకు చేరలేదు. ఫలితంగా మార్చిలోగా కేంద్రానికి యూసీలు సమర్పించలేకపోయారు. 

ప్రతి పాఠశాలకు రూ.35వేల కోత 
నిబంధనల ప్రకారం మార్చి-2013లోపే యూసీలు కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. ఒక ఏడాది యూసీలు మార్చిలోగా సమర్పిస్తే తదుపరి ఏడాదికి ఈ ఖర్చును పరిగణలోకి తీసుకుని నిధుల పెంపు, తగ్గింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో 2012-13 యూసీలు కేంద్రానికి చేరకపోవడంతో 2013-14 ఏడాదికి కనీస మొత్తంగా రాష్ట్రంలోని 10,368 ఉన్నత పాఠశాలల్లో ఒక్కో పాఠశాలకు రూ. 15వేలు మాత్రమే తాజాగా కేంద్రం విడుదలచేసింది. గత ఏడాదితో పొల్చితే ఒక్కో పాఠశాలకు రూ.35వేలు కోత పడింది. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా రూ.36.34 కోట్ల మేర నష్టం వాటిల్లింది. చేతులు కాలాక అకులు పట్టుకున్నట్లు..కోట్లకు కోట్లకు కోతలు పడ్డాక ఆర్‌ఎంఎస్‌ఏ అధికారులు ఈసారి తేరుకున్నారు. గత అనుభవం దృష్ట్యా వెంటనే మార్గదర్శక సూత్రాలు జారీచేశారు. రూ.15వేలల్లో రూ.5 వేలు లైబ్రరీ, రూ.10వేలను నీరు, విద్యుత్తు, ఇంటర్‌నెట్, టెలిఫోన్‌చార్జీలకు వినియోగించాలని (పొసీడింగ్‌నంబర్ 71/ ఆర్‌ఎంఎస్‌ఏ/ 2013 తేదీ 25-3-2013)ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్‌ఎంఎస్‌ఏ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఏడాది ఉన్నత పాఠశాలలు కనీస సౌకర్యాలు సమకూర్చుకోలేని దుస్థితి ఏర్పడింది.

(నమస్తే తెలంగాణ నుంచి )