6, ఏప్రిల్ 2013, శనివారం

సర్క్యులేషన్‌ను పెంచుకోవడానికి సంచలనాత్మకంగా...

కొన్ని పత్రికలు జర్నలిజం విలువలను పట్టించుకోకుండా సంచలనాత్మకంగా ప్రజలు, మహిళలను అప్రతిష్ఠపాలు చేసేలా వార్తా కథనాలు రాసి సర్క్యులేషన్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పలు భారతీయ పత్రికలకు చురకలు అంటించారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహాల్‌లో జరిగిన ప్రెస్ కౌన్సిల్ రెండో విచారణ కమిటీ సమావేశంలో ఆయన పత్రికలు, చానెళ్లపై దేశవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులను విచారించారు. ఆంధ్రవూపదేశ్‌లోని తెలుగు పత్రికలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తి పోసుకుంటున్నాయని విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రికపై వచ్చిన ఫిర్యాదులను చూసి తీవ్రంగా మందలించారు. అవాస్తవాలు రాసే పత్రికల లైసెన్సులను రద్దుపరచాలని ఆర్‌ఎన్‌ఐకి రాస్తామని హెచ్చరించారు. అభ్యంతరకరంగా వ్యవహరిస్తే ప్రకటనలు ఆపివేయాలని డీఏవీపీకి సూచిస్తానన్నారు. సాక్షి, ఈనాడులకు పరిపాటిగా మారిన పరస్పర వ్యతిరేక కథనాలపై కట్జూ విచారం వ్యక్తం చేశారు. ఈనాడు పత్రిక ఎంపీ జగన్‌మోహన్‌డ్డిని ఓఎంసీ కేసులో నిందితుడని వార్తలు రాసిందని సాక్షి ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై ప్రెస్ కౌన్సిల్ విచారణ నిర్వహించింది. 

జగన్‌ను సాక్షిగా పిలిస్తే ఈనాడు ఊహించి ఆయనను నిందితుడిగా రాసిందని పేర్కొన్న ఘటనలో ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు ఇలాంటి వివాదాలతో తమ ముందుకు రావద్దని కట్జూ సూచించారు. జగన్ పూర్తి వివరాలతో కూడిన ఖండనను పంపించాలని సూచించిన కట్జూ దానిని యథాతథంగా ప్రచురించాలని ఈనాడును ఆదేశించారు. అయితే జగన్ జైలులో ఉన్నందున ఖండన రాసే అవకాశంపై న్యాయవాదులు అనుమానాలు వ్యక్తం చేశారు. జైలు అధికారుల అనుమతితో ఖండనను రాయాలని కట్జూ ఆదేశించారు. అయితే వార్తలు రాయడం పత్రికల సహజ గుణమని, ప్రతిదానికి ఖండనలు రాయడం కష్టమేనని విచారణ కమిటీ సభ్యులు అభివూపాయపడ్డారు. జగన్ అవినీతిపరుడని, వందలకోట్ల కుంభకోణాలని ఏబీఎన్, టీవీ9, ఈనాడు పదే పదే దిగజారుడు కథనాలు ప్రసారం చేశాయని సాక్షి ప్రతినిధులు చేసిన ఫిర్యాదుపై కమిటీ తీవ్రంగా స్పందించింది. ప్రతిష్ఠాత్మక మీడియా సంస్థలు పదేపదే తమ గడప తొక్కవద్దన్న కమిటీ జగన్‌ను రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలుగా వీటిని పేర్కొన్న సాక్షి ప్రతినిధుల వాదనతో ఏకీభవించింది. తక్షణం మీడియా సంస్థలు తమిళనాడులోని మీడియేషన్ సెంటర్లో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. అక్కడ పరిష్కారం కాకపోతే కోర్టులకు వెళ్ళాలని సలహా ఇచ్చింది. 

నమస్తే తెలంగాణ నుంచి