19, డిసెంబర్ 2013, గురువారం

ఎవరీ సోనియా? 4

ఆమె దేశ ప్రధానమంత్రికి కోడలు! కానీ... చేతిలో డబ్బులుండేవి కావు! కేవలం నెలకు నాలుగైదువేలు వస్తాయని చెప్పగానే... ఆమె ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్ అయ్యారు. ఆ తర్వాత సోనియాపై ఇంకా ఎలాంటి ఆరోపణలు వచ్చాయి? ఖత్రోకీ కుటుంబంతో ఆమెకు పరిచయం ఎలా కలిగింది? తెలుగువాడైన పీవీ నరసింహారావు ప్రధాని ఎలా అయ్యారు? పీవీ అంటే సోనియాకు ఎందుకంత కోపం? చదవండి...
ఇండియాలో 1968 ఫిబ్రవరి నుంచి నివసిస్తున్నా 1983 వరకు సోనియా భారత పౌరసత్వం తీసుకోలేదు. ఆమె ఇటాలియన్ పాస్‌పోర్ట్ ఆధారంగానే ఇక్కడ ఉండేవారు. సంబంధిత పత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవడానికి (రెన్యువల్) ఇటలీ ఎంబసీకి వెళ్లేవారు. ఒకసారి ఎంబసీలో సోనియాకు మేరియా ఖత్రోకీ తటస్థపడ్డారు. ఆమె సోనియాను గుర్తుపట్టి తననుతాను పరిచయం చేసుకున్నారు. తన భర్త ఒట్టావియో ఖత్రోకీని మెలినారీ అనే మిత్రుడు రాజీవ్‌గాంధీకి పరిచయం చేశారని మేరియా చెప్పారు. ఎంబసీలో సోనియా పని పూర్తయ్యాక కూడా వాళ్లిద్దరూ చాలాసేపు కబుర్లు చెప్పుకొన్నారు. సోనియా వివాహమైన తరువాత ఇందిరాగాంధీ ఒక హెచ్చరిక చేశారు. తమ ఇంట్లో విదేశీయులు బస చేయడం తనకేమాత్రం అంగీకారం కాదని, సోనియా బంధువులు వచ్చినా ఏదైనా అతిథిగృహంలో ఉంచాల్సిందే తప్ప తమ అధికారిక నివాసంలో ఉండడం కుదరదని చెప్పారు. తల్లి చెప్పిన మాటలను రాజీవ్ «ద్రువీకరించారు.
సోనియా తల్లితండ్రులు, అక్క అనుష్క, బావ తదితరులు వస్తే ఖత్రోకీ ఇంట్లోనే ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ 1980లో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత ఖత్రోకీ కార్యకలాపాలు తారస్థాయికి చేరుకున్నాయి. స్నామ్ ప్రొగెట్టీ అనే కంపెనీకి ఖత్రోకీ భారతదేశంలో ప్రతినిధి. భారత్‌లో ఎవరు రిఫైనరీ పెట్టాలన్నా, ఎరువుల ఫ్యాక్టరీ కట్టాలన్నా ఆ కాంట్రాక్టు ఈ ఇటలీ కంపెనీకి ఇచ్చి తీరాల్సిందే. ఆ విధంగా 1985 వరకు దాదాపు 60 కంపెనీల నిర్మాణ కాంట్రాక్టులు ఈ కంపెనీకి దక్కాయి. వాళ్లకు ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? అని ప్రశ్నించవచ్చు. నావల్ కిశోర్‌శర్మ మంత్రిగా ఉన్నప్పుడు హజీరా, బీజపూర్, జగదీశ్‌పూర్ ఆయిల్ పైపులైను నిర్మాణ కాంట్రాక్టును, రూ.300 కోట్లు తక్కువ టెండరు వేసిన ఫ్రెంచ్ కంపెనీకి ఇచ్చారు. వెంటనే నావల్ కిశోర్ శర్మ మంత్రి పదవి పోయింది. కేబినెట్ సెక్రటరీ పి.కె.కౌల్‌ను అమెరికా రాయబారిగా పంపించారు. గెయిల్ చైర్మన్‌గా ఉన్న హెచ్.ఎస్.భీమాను తొలగించారు. ఆ తర్వాత ఖత్రోకీ ఏమైనా చెబితే రాజీవ్ చెప్పినట్టేనని ఉన్నతాధికారులందరూ భావించేవారు. బోఫోర్స్ కుంభకోణంలో ఖత్రోకీ పేరు ప్రముఖంగా వినిపించింది. స్వీడన్ కంపెనీ అయిన బోఫోర్స్‌కు ఇటలీతో సంబంధంలేదు. కానీ, ఆ కంపెనీ ప్రతినిధి విన్‌ఛద్దా.. బోఫోర్స్ ఫిరంగులను ఖత్రోకీ ద్వారా కొనిపించి, ఖత్రోకీ ఖాతాల్లోకి నలభైకోట్ల రూపాయలు బదిలీ చేశారు.
బోఫోర్స్ కుంభకోణం బయటపడగానే... రక్షణ శాఖ సహాయమంత్రి అరుణ్‌సింగ్ ఎంపీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి ఎక్కడికో దూరంగా వెళ్లి ప్రశాంత జీవనం గడపసాగారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన శేఖర్‌గుప్తాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చాలా ఆసక్తికర విషయాలు చెప్పారు. "నేను బోఫోర్స్ లావాదేవీలో నయాపైసా తీసుకోలేదు. రాజీవ్ కూడా తీసుకోలేదని నాకు తెలుసు. కానీ, బోఫోర్స్ నలభైకోట్లు చెల్లించిన విషయం రుజువైంది. ఆ డబ్బు ఎక్కడికి చేరిందో పూర్తిస్థాయి విచారణ జరిపి, దోషులను పట్టుకొని, ఈ పాపంలో మనకు భాగస్వామ్యం లేదని నిరూపించుకొందాం అని నేనెంత వేడుకొన్నా రాజీవ్ వినలేదు. ఈ డబ్బు ఎక్కడకు చేరిందో రాజీవ్‌కు తెలుసని నాకు అర్థమైంది'' అని తెలిపారు.
ఇటలీలో ఇండియా షాప్
సోనియా తండ్రి స్టెఫినోమైనో 1983లో చనిపోయారు. అక్కడ వారి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సోనియా తన అక్క అనుష్కతో రెండుచోట్ల రెండు షాపులు పెట్టించారు. రివొల్టాలో ఉన్న షాప్ పేరు ఏంటికా. అర్‌బస్సాలో పెట్టిన షాప్ పేరు 'గణపతి.' ఫ్రంట్‌లైన్ పత్రిక విలేకరి నారవానే అక్కడకు వెళ్లి వివరాలు తెలుసుకోబోతే... ఆయనతో మాట్లాడేందుకు అనుష్క తిరస్కరించారు. ఒక్కొక్కటి లక్ష రూపాయలకుపైగా ఖరీదైన కశ్మీరీ శాలువాలు, ఇండియా నుంచి వచ్చిన బొమ్మలు, గాజులు, గొలుసులు విపరీతమైన ధరలకు అక్కడ అమ్ముడుపోవడాన్ని ఆ విలేకరి గమనించారు. సోనియా చొరవతోనే ఈ వస్తువులన్నీ ఇటలీకి ఎగుమతి అవుతున్నట్లు ఆ విలేకరి పేర్కొన్నారు.
ఎంతోకాలం రాజీవ్, సోనియాలను అతి సన్నిహితంగా పరిశీలించిన పాత్రికేయురాలు తవ్లీన్‌సింగ్ తన పుస్తకం 'దర్బార్'లో... రాజీవ్ ప్రధాని అయిన తరువాత ఆయన చుట్టూ ఉన్నవారు అతి కొద్దికాలంలో కోట్లు సంపాదించారని, దీనికి ఒక్కొక్కరూ ఒక్కో మార్గాన్ని ఎంచుకొన్నట్లు చెప్పేవారని తెలిపారు. కానీ... తమ పలుకుబడి ఉపయోగించి ప్రభుత్వం దగ్గర పనులు ఇప్పించి, లబ్ధి పొందుతున్నట్లు తేలిగ్గా అర్థమవుతోందని తవ్లీన్‌సింగ్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందిర హత్య తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 414 సీట్లు వచ్చాయి. ఆ ప్రభుత్వాన్ని దేశంలో ప్రతిఒక్కరూ సద్భావంతో చూడడం, మీడియా పెద్దగా విమర్శించకపోవడంతో అప్పుడు జరిగిన అవినీతి కార్యకలాపాలు అంతగా వెలుగు చూడలేదు. రాజీవ్ అధికారంలో ఉన్నప్పుడు, సోనియా ప్రాభవం ఎంతగా సాగేదంటే... ఖత్రోకీ దంపతులను ఎలాంటి తనిఖీలు లేకుండా లోపలికి అనుమతించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఖత్రోకీ... ప్రధాని నివాసానికే ఉన్నతాధికారులను పిలిపించి మాట్లాడేవారు. ఇదంతా సన్నిహితంగా చూసిన ఒక ఉన్నతాధికారి "ప్రధాని పదవి ఇంతగా దిగజారిన సందర్భం మరొకటి లేదు. అయినా సోనియాగాంధీకి చెప్పగలిగేదెవరు? చెబితే అర్థం చేసుకుంటారా?'' అని వ్యాఖ్యానించారు. తాను అందరికంటే గొప్పదాన్నని విశ్వసించే సోనియాగాంధీకి ప్రతిక్షణం తన నమ్మకాన్ని నిర్ధారించుకొనే, తన ఆధిపత్యాన్ని ప్రకటించుకొనే అవకాశం లభించింది.
మరో దశ...
బోఫోర్స్ కుంభకోణానికి మూలకారకురాలు సోనియానే అని, ఆమెపై రాజీవ్‌గాంధీ విరుచుకుపడ్డారని 1989 ఎన్నికల సమయంలో వార్తలు వచ్చాయి. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని సగానికిపైగా కోల్పోయి 197 సీట్లకు పరిమితమైంది. అధికారాన్ని కోల్పోయి ఒంటరిగా మిగిలింది. కానీ... అధికారంలోకి వచ్చిన పార్టీలు ఏకతాటిపై, ఏకోన్ముఖంగా నడిచేవి కావు. గత నిర్ణయాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి కాంగ్రెస్ అగ్ర నాయకత్వాన్ని ఇబ్బందిపెడదామనే ఆలోచనే వారికి లేదు. ఈ పార్టీల మధ్య చెలరేగిన విభేదాల వలన ప్రభుత్వం కుప్పకూలి 1991లో తిరిగి లోక్‌సభ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల ప్రచారంలో ఉండగానే రాజీవ్‌గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ ఇక లేరన్న వాస్తవాన్ని సోనియాగాంధీ తట్టుకోలేరని, ఈ విషాదాన్ని పంచుకోవడానికి ఆత్మీయ మిత్రులెవరూ లేరని, ప్రతి ఒక్కరినీ ఆమె చేజేతులా దూరం చేసుకున్నారని అంతా భావించారు. "నేను వద్దని వేడుకొంటున్నా పరిస్థితుల ప్రాబల్యం వలన రాజీవ్ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. ఇటువంటి ఘోరం జరిగే ప్రమాదం ఉందని నేను పది సంవత్సరాలుగా భయపడుతూనే ఉన్నాను. చివరకు నా భయమే నిజమైంది'' అని సోనియా ఒక ఇటాలియన్ పత్రికా విలేకరితో చెప్పారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 224 సీట్లు వచ్చాయి. సోనియాను ప్రధాని పదవి చేపట్టవలసిందిగా కాంగ్రెస్ నాయకులంతా అభ్యర్థించారు. ఆమె అందుకు తిరస్కరించి... పీఎన్ హక్సర్, ఎంఎల్ ఫోతేదార్, అరుణా అసఫాలీని ఉప రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ దగ్గరకు పంపారు. 'మీరు ప్రధాని పదవి స్వీకరించండి' అని ఆయన్ను కోరారు. తనకు వయస్సు పైబడిందని, తానంత శ్రమపడడానికి సిద్ధంగా లేనని ఆయన సున్నితంగా తిరస్కరించారు. అప్పుడు సోనియాగాంధీ తగిన ప్రధాని అభ్యర్థి ఎవరని హక్సర్‌ను ప్రశ్నించారు. ఆయన తడుముకోకుండా పీవీ నరసింహారావు పేరు చెప్పారు.
పీవీ తాను ప్రధాని అయిన వెంటనే రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అనే సేవా సంస్థను నెలకొల్పారు. దానికి సోనియాను చైర్మన్‌గా, ఇద్దరు పిల్లల్ని డైరెక్టర్లుగా ఎంపిక చేశారు. ఢిల్లీ నడిబొడ్డున కోట్ల విలువజేసే ప్రభుత్వ భవంతిని ఆ ట్రస్టుకు ఇచ్చారు. వంద కోట్ల రూపాయలను ప్రభుత్వ గ్రాంటుగా ఇచ్చారు. సోనియాకు రాజకీయాల పట్ల చెప్పలేనంత ఏవగింపు ఉంది గనుక, కనీసం ఆమె ఈ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంపొందించుకోవచ్చని ఆశించారు. ట్రస్టు కార్యక్రమాలు నిర్వహించడానికి, అనుభవజ్ఞులైన అధికారులను నియమించారు. సోనియా మొదటి సంవత్సరం ఆ సేవా కార్యక్రమాలపట్ల కొంత ఆసక్తి ప్రదర్శించారు. ఆ తరువాత వాటిని పట్టించుకోవడం పూర్తిగా మానివేసి, కేవలం తాను సంతకాలు పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే వివరాలు అడిగి తెలుసుకునేవారు.
ఆలోచనలతో కొత్త మలుపు
మొదట్లో... తనలో అసాధారణ శక్తులున్నాయన్న విశ్వాసం ఒకవైపు, తనలోని లోపాలు, బలహీనతలు బయటపడితే నిరాదరణకు లోనవుతాననే భయం మరోవైపు సోనియా మదిలో తిష్టవేసుకుని ఉండేవి. ఇందిరాగాంధీ చనిపోయిన తరువాత తనలో లోపాలున్నాయని మథనపడడం మాని అందరిపైనా తన ఆధిపత్యాన్ని నిర్ధారించుకోవడం, తన గొప్పదనాన్ని అందరూ అంగీకరించేలా చేయడం ప్రారంభమైంది. రాజీవ్‌గాంధీ చనిపోయిన తరువాత ఆమెలో బలీయమైన అహంభావం చోటుచేసుకొంది. "నేను కోరింది సాధించగలను. నేను ఏం చెబితే అది జరుగుతుంది' అనే భావన మరీ బలపడింది. విపరీతమైన అహంభావం ఆవహించినప్పుడు చుట్టూ ఉన్న సమాజంలో తమ పాత్ర ఏమిటని కాకుండా, తమ మనసులో ఈ సమాజానికి ఎటువంటి స్థానం ఇవ్వవచ్చన్న ఆలోచనలు మొదలవుతాయి. ఇందిర కుటుంబానికి పీవీ అత్యంత విశ్వాసపాత్రుడు. ఏ అంశంపైన అయినా తడుముకోకుండా మాట్లాడగలిగే మేధావి. ఏ పదవినైనా అత్యంత సమర్ధంగా నిర్వహించగలరని, ఆయన నిజాయతీని శత్రువులు కూడా శంకించరని పేరు ఉంది. రాజీవ్‌గాంధీ ఉన్నప్పుడు సోనియాతో ఆయన ఎప్పుడూ వివరంగా మాట్లాడిన సందర్భం లేదు. ప్రధాని అయిన తరువాత ఆయన కొన్ని కీలక అంశాల గురించి అయిదారుసార్లు వివరంగా చర్చించబోయేవారు. కానీ, ప్రతిసారి ఆయన నిర్ఘాంతపోయి, నిశ్చేష్టులై బయటకు వచ్చేవారు. సోనియా ఎవరు చెప్పినా వినడమే తప్ప తిరిగి మాట్లాడరు. కానీ, ఆమె అభిప్రాయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో పీవీ ఒకటికి రెండుసార్లు అడగడం ఇద్దరికీ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించింది. తరువాత తన 'ఇన్‌సైడర్' నవలలో కథానాయకుడు ఆనంద్ ఒక ప్రముఖ రాజకీయవేత్తను అభివర్ణిస్తూ... "చాలా గొప్పవాడినని అతను భావిస్తాడు. తనకన్నీ తెలుసుననుకొంటాడు. అతను నోరువిప్పితే చాలు అతని అజ్ఞానం దుర్గంధంలా వ్యాపిస్తుంది'' అని పేర్కొంటారు. సోనియాకు అసలు ఏ అంశంపైనా కనీస పరిజ్ఞానం లేదని, అతి సామాన్య విషయాన్ని కూడా అవగతం చేసుకోలేదని, భారతదేశం గురించి, ఈ దేశ చరిత్ర, ప్రజల జీవన విధానం గురించి ఆమెకు లేశమాత్రమైనా అవగాహన లేదని కచ్చితంగా గుర్తించిన తరువాత... తప్పనిసరి సందర్భాలలో మాత్రమే సోనియాను పీవీ కలిసేవారు.
తప్పదంటూ తనే..
1997లో సోనియా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకొన్నారు. 1998 మార్చి 14న సీతారాం కేసరిని చాలా అవమానకరమైన రీతిలో తప్పించి, సోనియాగాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎంపిక చేశారు. పేదలకు న్యాయం చేయగల శక్తి తమకు మాత్రమే ఉందని, ఇతర పార్టీలు పేదలను పట్టించుకోవని తానొక నిర్ణయానికి వచ్చానని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని దేశాన్ని ఒక దారిలో పెట్టాలని తన పిల్లలిద్దరూ కోరారని, అందుకే అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నానని సోనియా చెప్పారు. 1999 ఎన్నికల్లో సోనియా దేశమంతటా విస్తృతంగా పర్యటించి కాంగ్రెస్ కు ప్రచారం చేశారు. అయినా, కాంగ్రెస్‌కు చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా అతి తక్కువగా 114 లోక్‌సభ సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికలలో తాను కూడా గెలుస్తానో లేదోనన్న అనుమానంతో సోనియా అమేథీ నుంచి, బళ్లారి నుంచి కూడా పోటీ చేశారు. 2004లో, 2009లో మిత్రపక్షాల మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనతో సోనియాకు తీవ్ర విభేదాలు తలెత్తాయి. కానీ, మన్మోహన్‌తో చాలా సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మన్మోహన్ తన చదువు పూర్తయ్యాక పాతిక సంవత్సరాలపాటు రకరకాల ఉద్యోగాలు చేశారు. తర్వాత పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా, ఇప్పుడు ప్రధానిగా ఉన్నా... పదవిని ఆయన ఒక ఉద్యోగంలాగానే పరిగణిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం అయిదుగంటలకల్లా ఒక ఉద్యోగిలాగా ఇంటికి వెళ్లిపోతారు. తనకీ ఉద్యోగం ఇచ్చిన వారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయాలనుకుంటారు. పైగా రాజకీయాలను ఈసడించుకొనే సోనియా... మన్మోహన్ వృత్తిరీత్యా రాజకీయవాది కాకపోవడమే ఆయనకు సరైన అర్హతగా పరిగణించి ఉంటారు.
పీవీతో పెరిగిన అంతరం
మన్మోహన్ సింగ్‌ను పీవీ ఆర్థికమంత్రిగా నియమించి, ఆర్థిక నియంత్రణలను సడలించగానే ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపిరి పోసుకుంది. పత్రికలన్నీ పీవీ పాలనను, నిర్ణయాలను ప్రస్తుతించసాగాయి. రాజకీయాల్లో పీవీకి 40 సంవత్సరాల ప్రత్యక్ష అనుభవం ఉంది. అలాగే, ఢిల్లీలో నాయకులకు భజన చేస్తూ పదవులు పొంది, పైరవీలు చేసే నాయకులెవరో ఆయనకు తెలుసు. రాష్ట్రాలలో ఆయా నాయకులకున్న బలమేమిటో తెలుసు. పీవీ దగ్గర తమ పప్పులుడకవని తెలిసిన ఆ నాయకులంతా సోనియాను కలవడం మొదలుపెట్టారు. ఆమె మొదట్లో వీరినెవరినీ ఆదరించే వారుకారు. కానీ, పీవీ తనను తరచుగా కలవకపోవడం, ప్రభుత్వంలో తీసుకొంటున్న నిర్ణయాలను వివరించకపోవడం... ఒక్కమాటలో చెప్పాలంటే తననసలు పట్టించుకోకపోవడం సోనియాను కలచివేసింది.
సోనియా గురించి పీవీ తన సన్నిహితుల దగ్గర 'దట్ పూర్ లేడీ' అంటూ చులకనగా మాట్లాడుతున్నారని, ఆమె వ్యక్తిగత వివరాలు అందరికీ చెబుతున్నారని, రాజీవ్ పాలనలో తీసుకొన్న నిర్ణయాలను పత్రికల వారికి అందించి, సోనియాను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమెకు నేతలు చెప్పేవారు. అయితే, పీవీపై తనకున్న కోపాన్ని ఉపయోగించుకుని తన అనుగ్రహం పొందడానికి వీరంతా ప్రయత్నిస్తున్నారని ఆమె గుర్తించి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయేవారు. తాము చెప్పేవి ఓపికగా వింటున్నారు గనుక ఆమె ఏకీభావం ప్రకటిస్తున్నట్లేనని ఆ నాయకులు భావించేవారు. "మీకు విధేయులుగా ఉండడం వలన పీవీ మాపై కక్ష సాధిస్తున్నారు. మా అనుచరులెవరికీ పదవులు లభించడంలేదు. మాకు సొంతపార్టీ పెట్టుకోక తప్పని పరిస్థితులేర్పడ్డాయి' అంటూ ఎన్డీ తివారీ ప్రభృతులు సోనియాతో మొరపెట్టుకొన్నారు. పార్టీ పెట్టవద్దని ఆమె వారిని వారించలేదు. 1994లో తివారీ మరో పార్టీ పెట్టారు. అర్జున్‌సింగ్ వంటి పెద్ద నాయకులు కూడా అందులో చేరారు. ప్రత్యేకమైన పార్టీ పెట్టుకున్నాక కూడా ఆ నాయకులు తరచూ సోనియాను కలుస్తున్నట్లు పీవీకి ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చేవి.
- See more at: http://www.andhrajyothy.com/node/35714#sthash.dfALcNf3.dpuf