4, నవంబర్ 2021, గురువారం

 నవరత్నాలసాకుతో అన్నీ పాత పథకాలను మూసేసినట్టే.. దివ్యాంగుల సంక్షేమానికీ పాతరేశారు. మెగా నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీచేసిన వలంటీర్ల పోస్టుల్లో దివ్యాంగులకు మొండిచేయి చూపారు. వారికి వర్తింపజేయాల్సిన  నాలుగు శాతం రిజర్వేషన్‌ను ఎందుకనో జగన్‌ ప్రభుత్వం అప్పట్లో అమలు చేయలేదు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన మోటారు వాహనాలకూ అధికారంలోకి వచ్చిరాగానే బ్రేకులు వేసింది. ఇన్నాళ్లయినా బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో తమను నియమించడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని దిగ్యాంగులు వాపోతున్నారు. ఏర్పాటుచేయడమేగానీ ఏనాడూ తనిఖీ చేసి ఎరుగని వసతిగృహాల పరిస్థితి వారిని మరింత క్షోభకు గురిచేస్తోంది. రాష్ట్రంలో 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరికోసం గత ప్రభుత్వం ఎంతగానో ఆలోచించి ఎన్నెన్నో కార్యక్రమాలు అమలుచేసింది. అందులో ఒకటి మూడు చక్రాల మోటారు వాహనాల పంపిణీ. యాక్టివ్‌ 5జీ  కంపెనీకి చెందిన అధునాతనమైన వాహనాలను ఉచితంగా చంద్రబాబు ప్రభుత్వం సుమారు 1500 మందికి పంపిణీ చేసింది. కేంద్రప్రభుత్వమిచ్చే సబ్సిడీ పెట్రోల్‌తో దివ్యాంగులు ఈ వాహనాలు నడుపుకొనే వెసులుబాటు కల్పించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకానికి స్వస్తి పలికింది.  తిరిగి త్రిచక్ర సైకిల్‌ వాహనాలు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బధిరులు, చెవిటి, మూగవారికి ఉపకరణాల పంపిణీ మందగించింది. వయోవృద్ధులకు కల్పించాల్సిన ఉపకరణాలు, కనీసం సౌకర్యాలూ కరువయ్యాయి. 



దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వారికి పెళ్లికానుకగా రూ.1 లక్ష చంద్రబాబు హయాంలో అందించారు. ‘కానుక’ను రూ.1.50 లక్షలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దివ్యాంగులను సంబరానికి గురిచేసిన ఈ నిర్ణయం ఇప్పటికీ అమలుకాలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో పథకం అమలు నిలిచిపోయింది. అలాగే, మిగతా కులాలకు అందుతున్న కానుకలనూ ఆపేశారు. దివ్యాంగులకు గత ప్రభుత్వం అమలుచేసిన స్వయం ఉపాధి పథకాలు ఇప్పుడు దాదాపుగా ఉనికిలో లేవు. చిన్న వ్యాపారాలు చేసుకునే దివ్యాంగులకు ఊతమిస్తూ ఒక్కోక్కరికి రూ.1 లక్ష సబ్సిడీ రూపంలో అప్పట్లో అందింది. బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించారు. వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు బడ్జెట్‌లో నిధులు పెట్టలేదు. నవరత్నాలిస్తున్నామని, మిగతా పథకాలు అవసరం లేదన్న వైఖరే దివ్యాంగుల విషయంలోనూ అమలైంది. 

దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం చట్టం చేసింది. ఈ చట్టాన్ని అన్నీ శాఖలు విధిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలిచ్చింది. అయితే కేంద్రం ఆదేశాలూ, కోర్టు ఉత్తర్వులూ జగన్‌ ప్రభుత్వం బేఖాతరు చేసింది. అప్పట్లో చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ల నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లను అమలుచేయలేదు. దీనివల్ల తాము సుమారు 10వేల పోస్టులు కోల్పోయినట్టు బాధితులు వాపోతున్నారు. 

 2030 నాటికి  నీట మునగనున్న ఆ మహానగరం .. 

ఓ అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..

తీవ్ర భూతాపంతో సముద్ర మట్టాలు పెరిగి రాబోయే రోజుల్లో తీర ప్రాంత నగరాలకు భారీ ముప్పు పొచ్చి ఉందని ఇటీవల పలు అధ్యయనాలు చెబుతున్నాయి. పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు కూడా ఈ విషయంపై ప్రపంచ దేశాలను అప్రమత్తం చేస్తున్నారు. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా 2050 కల్లా ముంబై, కలకత్తా లాంటి మహానగరాలు మునిగిపోతాయని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్లే కొన్ని నెలల క్రితం మన దేశ ఆర్థిక రాజధానిని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై క్లైమెట్‌ సెంట్రల్‌ అనే వెబ్‌సైట్‌ మరికొన్ని షాకింగ్‌ విషయాలు బయటపెట్టింది. తీవ్ర భూతాపం కారణంగా 2030 నాటికి కలకత్తాతో పాటు ప్రపంచంలోని 9 తొమ్మిది నగరాలు నీట మునిగిపోయే ప్రమాదముందుని ఈ వెబ్‌సైట్‌ తెలిపింది. ఇందులో భాగంగా ఐపీసీసీ (Intergovernmental panel on climate change) నుంచి సేకరించిన డేటా ఆధారంగా ముంపునకు గురయ్యే నగరాల వివరాలను తెలిపే ఒక మ్యాప్‌ను రూపొందించింది.

జాగ్రత్త పడకపోతే ముప్పు తప్పదు..

ఏటేటా పెరుగుతున్న భూతాపంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని దీని ప్రభావం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలపై ఉంటుందని క్లైమేట్‌ సెంట్రల్‌ అధ్యయనంలో తేలింది. వాతావరణ మార్పులను అవగాహన చేసుకుని ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలని సూచించింది. ఈ సందర్భంగా 2030 నాటికి నీటి అడుగున ఉండే 9 దేశాల వివరాలను బయటపెట్టింది. అవేంటంటే..

1. కలకత్తా

2. అమెస్టర్‌ డ్యామ్‌ (నెదర్లాండ్స్‌)

3. బస్రా (ఇరాక్‌)

4. న్యూ ఓర్లియన్స్‌( అమెరికా)

5. వెనిస్ (ఇటలీ)

6. హోచి మిన్‌ సిటీ (వియత్నాం)

7. బ్యాంకాక్‌ (థాయ్‌లాండ్‌)

8. జార్జ్‌టౌన్‌ (గయానా)

9. సవన్నా (అమెరికా)









 నాలుగవ రోజుకు రాజధాని రైతుల మహా పాదయాత్ర

అమరావతి: ‘అమరావతి’ రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగవ రోజుకు చేరుకుంది. న్యాయస్దానం నుంచి దేవస్దానం పేరుతో మహా పాదయాత్ర చేపట్టారు. పుల్లడిగుంట నుంచి నాలుగవ రోజు పాదయాత్ర ప్రారంభంకానుంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో నాల్గవ రోజు పాదయాత్ర సాగనుంది. మూడు రోజులలో 43 కిలోమీటర్ల వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు పాల్గొంటున్నాయి.


 ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నందుకు హుజూరాబాద్‌ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ మంగళవారం రాత్రి తన అనుచరులతో కలిసి కరీంనగర్‌లోని ఎస్సారార్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈటల రాజేందర్‌, ఆయన అనుచరులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.



 పెట్రోల్, డీజిల్ రేట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీపావళి పర్వదినం వేళ వాహనదారులకు ఊరటిస్తూ కీలక ప్రకటన చేసింది. పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ. 5, రూ. 10 మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తగ్గించిన ధరలు రేపటి నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ విషయంలో రాష్ట్రాలను కూడా కదిలించింది కేంద్ర ప్రభుత్వం. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని రాష్ట్రాల ప్రభుత్వాలకు సూచించింది. కేంద్రం సూచన మేరకు రాష్ట్రాలు కూడా ఎంతో కొంత ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తే.. వాహనదారులకు నిజంగా అది పెద్ద ఊరటే అవుతుంది.

అయితే, పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో ఇంతకాలం మొండి వైఖరి అవలంభిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఉన్నపళంగా ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ ప్రకటన చేయడం వెనుక పెద్ద కారణమే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించే ప్రసక్తే లేదంటూ ఏకంగా కేంద్ర ఇందన శాఖ మంత్రే ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పు.. బీజేపీకి గట్టిగా తగిలింది. ఈ ఎఫెక్ట్ వల్లే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లపై కాస్త వెనక్కి తగ్గిందని చెబుతున్నారు విశ్లేషకులు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 3 లోక్‌సభ, 30 అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 30న ఉప ఎన్నికలు జరగ్గా.. మంగళవారం నాడు ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మొత్తంగా బీజేపీ కేవలం 7 అసెంబ్లీ సీట్లలో మాత్రమే గెలుపొందింది. చాలాచోట్ల సిట్టింగ్ స్థానాల్లోనూ దారుణ ఓటమిని చవిచూసింది. పైగా ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికల్లో బలం పుంజుకోవడం విశేషం. ఈ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవానికి పెరుగుతున్న ధరలే కారణమని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరల ఎఫెక్ట్ ఎన్నికలపై గట్టిగానే పడిందంటున్నారు. గత నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ దరలు 30 రూపాయలకు పైగా పెరిగాయి. వంట గ్యాస్ ధర వెయ్యి పైగా అయ్యింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ 2 వేలకు చేరింది. వంట నూనలు, నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇలా విరామం లేకుండా పెరుగుతున్న ధరలు, ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన జనాలు.. ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి గుణపాఠం ఇచ్చారు అని విశ్లేషకులు చెబుతున్నారు.
దేశ వ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అందులో భాగంగానే ప్రజలకు ఊరట కల్పించే యత్నం చేస్తూ కీలక ప్రకటన చేశారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. తాము కొంత తగ్గించి.. తెలివిగా రాష్ట్రాలు సైతం పెట్రోల్, డీజిల్ పై సుంకం తగ్గించేలా ఇరకాటంలో పడేసే విధంగా ప్రకటన చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గే సూచనలు లేవని స్వయంగా కేంద్ర ఇంధన శాఖ మంత్రే గతంలో ప్రకటించారు. ఆ తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఒకానొక సందర్భంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే సూచనలు ప్రస్తుతానికి లేవని అన్నారు. ఇలాంటి తరుణంలో తాజా ఎన్నికల ఫలితాల దెబ్బతో.. కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. వినియోగదారులకు కాస్త ఊరట కలిగిస్తూ ప్రకటన చేసింది.


 ● గాజువాక: 


◆ విశాఖలోని అగనంపూడి టోల్‌గేట్‌ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. 


◆ ఆనందపురం నుంచి తమిళనాడుకు వెళుతున్న మినీ వ్యానులో 1,200 కేజీల గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.


◆ బంగాళదుంపల బస్తాల లోడు కింద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని దువ్వాడ పోలీసులకు సమాచారం అందింది. 


◆ ఈ మేరకు తనిఖీలు నిర్వహించిన పోలీసులు వాహనాన్ని గుర్తించి గంజాయిని సీజ్‌ చేశారు. దాన్ని తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


◆ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.