4, నవంబర్ 2021, గురువారం

 నవరత్నాలసాకుతో అన్నీ పాత పథకాలను మూసేసినట్టే.. దివ్యాంగుల సంక్షేమానికీ పాతరేశారు. మెగా నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీచేసిన వలంటీర్ల పోస్టుల్లో దివ్యాంగులకు మొండిచేయి చూపారు. వారికి వర్తింపజేయాల్సిన  నాలుగు శాతం రిజర్వేషన్‌ను ఎందుకనో జగన్‌ ప్రభుత్వం అప్పట్లో అమలు చేయలేదు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన మోటారు వాహనాలకూ అధికారంలోకి వచ్చిరాగానే బ్రేకులు వేసింది. ఇన్నాళ్లయినా బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో తమను నియమించడానికి ప్రభుత్వానికి చేతులు రావడం లేదని దిగ్యాంగులు వాపోతున్నారు. ఏర్పాటుచేయడమేగానీ ఏనాడూ తనిఖీ చేసి ఎరుగని వసతిగృహాల పరిస్థితి వారిని మరింత క్షోభకు గురిచేస్తోంది. రాష్ట్రంలో 12 లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు. వీరికోసం గత ప్రభుత్వం ఎంతగానో ఆలోచించి ఎన్నెన్నో కార్యక్రమాలు అమలుచేసింది. అందులో ఒకటి మూడు చక్రాల మోటారు వాహనాల పంపిణీ. యాక్టివ్‌ 5జీ  కంపెనీకి చెందిన అధునాతనమైన వాహనాలను ఉచితంగా చంద్రబాబు ప్రభుత్వం సుమారు 1500 మందికి పంపిణీ చేసింది. కేంద్రప్రభుత్వమిచ్చే సబ్సిడీ పెట్రోల్‌తో దివ్యాంగులు ఈ వాహనాలు నడుపుకొనే వెసులుబాటు కల్పించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ పథకానికి స్వస్తి పలికింది.  తిరిగి త్రిచక్ర సైకిల్‌ వాహనాలు పంపిణీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. బధిరులు, చెవిటి, మూగవారికి ఉపకరణాల పంపిణీ మందగించింది. వయోవృద్ధులకు కల్పించాల్సిన ఉపకరణాలు, కనీసం సౌకర్యాలూ కరువయ్యాయి. 



దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వారికి పెళ్లికానుకగా రూ.1 లక్ష చంద్రబాబు హయాంలో అందించారు. ‘కానుక’ను రూ.1.50 లక్షలకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దివ్యాంగులను సంబరానికి గురిచేసిన ఈ నిర్ణయం ఇప్పటికీ అమలుకాలేదు. బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో పథకం అమలు నిలిచిపోయింది. అలాగే, మిగతా కులాలకు అందుతున్న కానుకలనూ ఆపేశారు. దివ్యాంగులకు గత ప్రభుత్వం అమలుచేసిన స్వయం ఉపాధి పథకాలు ఇప్పుడు దాదాపుగా ఉనికిలో లేవు. చిన్న వ్యాపారాలు చేసుకునే దివ్యాంగులకు ఊతమిస్తూ ఒక్కోక్కరికి రూ.1 లక్ష సబ్సిడీ రూపంలో అప్పట్లో అందింది. బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించారు. వైసీపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలకు బడ్జెట్‌లో నిధులు పెట్టలేదు. నవరత్నాలిస్తున్నామని, మిగతా పథకాలు అవసరం లేదన్న వైఖరే దివ్యాంగుల విషయంలోనూ అమలైంది. 

దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రం చట్టం చేసింది. ఈ చట్టాన్ని అన్నీ శాఖలు విధిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలిచ్చింది. అయితే కేంద్రం ఆదేశాలూ, కోర్టు ఉత్తర్వులూ జగన్‌ ప్రభుత్వం బేఖాతరు చేసింది. అప్పట్లో చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయాలు, వలంటీర్ల నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లను అమలుచేయలేదు. దీనివల్ల తాము సుమారు 10వేల పోస్టులు కోల్పోయినట్టు బాధితులు వాపోతున్నారు.