11, ఫిబ్రవరి 2011, శుక్రవారం

ఎట్టకేలకు చంద్రబాబుకి కొత్త 'జామర్‌'

ఎట్టకేలకు ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వాడుతున్న కాన్వాయ్‌లోకి ప్రభుత్వం జామర్‌ వాహనాన్ని సమకూర్చింది. ముఖ్యమంత్రిగా రోశయ్య బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుకు ప్రభుత్వం టాటా కంపెనీ తయారు చేసిన సఫారీ వాహన శ్రేణిని అందజేసింది. అయితే జామర్‌ వాహనాన్ని ఇవ్వకుండా పాత అంబాసిడర్‌ జామర్‌నే వాడుకోవాలని అప్పట్లో పోలీసు శాఖ కోరింది. అప్పటికే మూడు లక్షల కిలోమీటర్లు తిరిగిన అంబాసిడర్‌ జామర్‌ వాహనం రోడ్డుపై ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కొంత కాలం చంద్రబాబు జామర్‌ వాహనం లేకుండానే తిరిగారు. ప్రతిపక్ష నేతగా ఐదు సంవత్సరాలు డొక్కు అంబాసిడర్‌ కారులోనే చంద్రబాబు తిరిగారు. ఎప్పటికప్పుడు తన వాహన శ్రేణిని మార్చాలని అప్పటి వైఎస్‌ ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు వాహన శ్రేణిని మార్చలేదన్న ఫిర్యాదులు వచ్చాయి.