17, సెప్టెంబర్ 2012, సోమవారం

సిగరెట్టుతో సిగపట్టు

సిగరెట్‌ తాగేవారికి కంటినిండా కునుకుండదని అర్జెంటీనా పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్‌ అలవాటు లేనివారిలా వీరు నిద్రలో విశ్రాంతిని పొందలేరని 2000మందిపై చేసిన పరిశోధన ద్వారా వీరు కనుగొన్నారు. సిగరెట్‌ తాగేవారిలో 17శాతం మంది తాము ఆరుగంటలు కూడా నిద్రపోవటం లేదని చెప్పారు. 28శాతం మంది తమకు ఎప్పుడూ కలత నిద్రేనని పేర్కొన్నారు. జర్మనీలోని ఛారిటీ బెర్లిన్‌ మెడికల్‌ స్కూల్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలు నిర్వహించారు.

సిగరెట్‌తాగేవారితో పాటు తాగని వారిని కూడా ఎంపిక చేసుకుని ఇరువర్గాల వారి నిద్రని పోల్చి చూశారు. జీవితకాలంలో ఎలాంటి మానసిక సమస్యలు లేనివారిని ఈ పరిశోధనకోసం ఎంపిక చేసుకున్నారు. ఎందుకంటే మానసిక సమస్యలున్నవారు, ఆ కారణంగా సిగరెట్లు ఎక్కువగా కాల్చడం, తద్వారా నిద్రమేలుకునే అవకాశం ఉండటం వలన ఎలాంటి సమస్యలు లేనివారినే పరిశోధనకు ఎంపిక చేసుకున్నారు.

సిగరెట్లు నేరుగా నిద్రని ఆపుతాయని చె ప్పలేమని, సిగరెట్‌తోపాటు ఇతర అలవాట్లు ఉండటం, టివి ఎక్కువగా చూడటం కూడా నిద్రలేమికి కారణం అవుతాయని పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన స్టీఫెన్‌ కోర్స్‌ అన్నారు. సిగరెట్‌లో ఉండే నికోటిన్‌లో ఉత్తేజపరచే గుణం ఉండటం వలన కూడా ఇలా జరగవచ్చని ఆయన అంటున్నారు. సిగరెట్‌ అలవాటు ఉండి నిద్రలేమికి గురవుతుంటే ఈ సమస్యని కూడా సిగరెట్‌ వదలడానికి కారణంగా భావించవచ్చునని, నిద్రపట్టకపోవటం అనేది మరిన్ని అనారోగ్యాలకు దారితీస్తుంది కాబట్టి, నిద్రలేమికి, స్మోకింగ్‌కి ఉన్న సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుని సిగరెట్లు మానేస్తే మంచిదని ఆయన సలహా ఇస్తున్నారు. నిద్రలేమి వలన మధుమేహం, అధికబరువు, గుండె సమస్యలు కూడా తలెత్తుతాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

పొగతాగనివారిని, తాగేవారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. సిగరెట్‌ తాగేవారిలో నాలుగోవంతుమంది తమకి చాలా నిద్ర సమస్యలున్నట్టు తెలిపారు. వీరంతా తీవ్రమైన నిద్ర సమస్య ఇన్‌సోమ్నియాకు దగ్గరగా ఉన్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. పెద్ద వయసు, ఆల్కహాల్‌ తీసుకోవటం, అధికబరువు ఇవన్నీ కూడా నిద్రని తగ్గిస్తాయి. అయితే పరిశోధకులు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. పై సమస్యల వలన కాకుండా రూఢీగా సిగరెట్లు మాత్రమే నిద్రకి హాని చేస్తున్నట్టు వారు కనుగొన్నారు.


ఆంద్రప్రభ నుంచి సేకరణ