22, సెప్టెంబర్ 2012, శనివారం

నృత్యప్రధానంగా ఎబిసిడి

ఆధునిక పోకడలతో రూపొందిన సంగీత నృత్య ప్రధాన చిత్రం ఎబిసిడి: 'ఎనీబడీ కెన్‌ డ్యాన్స్‌'. నృత్య దర్శకుడుగా, నర్తకుడుగా, దర్శకుడుగా, హీరోగా రాణిస్తున్న ప్రభుదేవా ఒక డ్యాన్సర్‌గా నటించారు రిమో డిసౌజా దర్శకత్వంలో. రోన్నీ స్క్రూవాలా, యూటివి మోషన్‌ పిక్చర్స్‌ సి.ఇ.ఓ. సిద్దార్థ రాయ్‌ కపూర్‌ కలసి నిర్మించి తన చిరకాల స్వప్నం నిజం చేసారని దర్శకుడు రియో డిసౌజా పేర్కొన్నారు. యుటివి మోషన్‌ పిక్చర్స్‌ అన్నివిధాల అండగా నిలవడంతో 3డిలో రూపొందించానని, విడుదలయ్యాక కుటుంబ ప్రేక్షకులను అలరిస్తూ అద్భుతాలు సృష్టిస్తుందనే నమ్మకం తనలో నాటుకుపోయిందన్నారాయన.
ప్రధానపాత్ర పోషించిన ప్రభుదేవా అయితే మిగతా డ్యాన్సర్లతో కలిసి నటిస్తుంటే పునరుత్తేజం పొందారు. యువ నృత్యకళాకారులతో కలిసి నటిస్తున్నప్పుడు సంభ్రమాశ్చర్యాలు ముప్పిరిగొన్నాయట. అద్భుతమైన ప్రతిభ కలిగిన వాళ్ళతో కలసి స్టెప్స్‌ వేయగలనా, డ్యాన్స్‌ చేయగలనా అని పలుమార్లు ఆలోచనలో పడ్డారు కూడా. దాంతో తను టీనేజ్‌ యువకుడుగా మారి నటనకంటే డ్యాన్స్‌లకే ప్రాధాన్యత ఇచ్చారు ప్రభుదేవా.
అమెరికన్‌ డ్యాన్స్‌ రియాల్టిdషోల ద్వారా పాప్యులర్‌ అయిన లారెన్‌ గొట్‌లైబ్‌ మరొక కీలకమైన పాత్ర పోషించడమేకాక తన నృత్యాలతో ఆశ్చర్యం కలిగించారు. హాలీవుడ్‌లో నటించాలన్న లక్ష్యంతో చాలా ప్రయత్నాలు చేసినా నెరవేరక పోవడంతో బాలీవుడ్‌ ద్వారా నటుడుగా, డ్యాన్సర్‌గా నిరూపించుకునే అవకాశం ఏర్పడటం తన అదృష్టంగా భావిస్తున్నారు.
ప్రముఖ డ్యాన్సర్‌ గణష్‌ ఆచార్య మరో కీలక పాత్ర పోషించారు. డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ రియాల్టిd షోలో విజేతలైన సల్మాన్‌ యూసఫ్‌ ఖాన్‌, ధర్మేష్‌ యలండే, మయురేష్‌ వాడ్కర్‌, వృశాలి చవాన్‌ అద్భుతంగా డ్యాన్స్‌లు చేసినట్టు తెలుస్తోంది. పునీత్‌ పథక్‌, కిశోర్‌ అమన్‌, భావనా ఖండూజ, సాజన్‌ సింగ్‌, జితేంద్ర ఆచార్య, అంకిత్‌ గుప్తా మిగతా పాత్రధారులు. దర్శకుడు రియో డిసౌజా కూడా నటించారు.
సబీన్‌ జిగార్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం 1గంట 50 నిముషాల పాటు ప్రదర్శితమయ్యేలా రూపొంది 28వ తేదీన విడుదలవుతోంది.