5, అక్టోబర్ 2012, శుక్రవారం

వేల కోట్లని చెప్పి రూ.74 కోట్లకు లెక్క

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచారని చెప్పి రూ.74 కోట్లకు మాత్రమే సిబిఐ లెక్క చెప్పిందని జగన్ తరఫు న్యాయవాది సుబ్రహ్మణ్యం శుక్రవారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదించారు. ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభమైంది. జగన్ అరెస్టు అక్రమమని చెప్పారు. జగన్ నేరస్తుడు అని చెప్పడానికి సిబిఐ ఇంత వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. అరెస్టు చేసి 130 రోజులు దాటిందని, అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాది  అన్నారు. ఒక పార్టీ అధినేత  జైలులో ఉండటం సరికాదన్నారు.