వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారత అత్యున్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీం కోర్టు శుక్రవారం జగన్‌కు బెయిల్‌ను నిరాకరించింది. ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. సిబిఐ తరఫు న్యాయవాది.... దర్యాఫ్తు కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఆయన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని, కాబట్టి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందన్నారు. బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందన్నారు. తాము నాలుగు ఛార్జీషీట్లలో మూడువేల అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు. జగన్ విచారణకు సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించి, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.