5, అక్టోబర్ 2012, శుక్రవారం

దోపిడీదార్లను ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు

రానున్న ఎన్నికల్లో దొంగలను ఎమ్మెల్యేలుగా, దోపిడీదార్లను ఎంపీలుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి . జగన్ జైలుకెళ్లి వంద రోజులు గడిస్తే ఆ పార్టీ కార్యకర్తలు శత దినోత్సవాలను జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు దమ్ముంటే సోనియాగాంధీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో పదవులకు రాజీనామా చేయాలని అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దానంతటదే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని , ప్రభుత్వంలో ప్రాంతీయ, నాయకత్వ విబేధాలు ఏర్పడి ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సఖ్యత కొరవడి ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారన్నారు.

ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్‌తో టీఆర్ఎస్‌ను, జగన్‌ను జైలు నుంచి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన  కాంగ్రెస్‌  టీడీపీని బలహీనపర్చేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు.