16, ఏప్రిల్ 2018, సోమవారం

ఆ ఊరికి ఆమే కాటికాపరి!

  • ‘తూర్పు’ జిల్లాలోని బండారులంకలో మృతదేహాలను కాల్చుతున్న మహిళ
  • శ్మశానవాటికలోనే సత్యామణి నివాసం
మహిళలు శ్మశానంలో అడుగుపెట్టడం ఒకనాడు నిషిద్ధం. ఆ కట్టుబాటు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, అక్కడక్కడా ఆ కట్లు తెంచుకొని మహిళలు ముందుకొస్తున్నారు. తమ కుటుంబ సభ్యులకు దగ్గరుండి అంత్యక్రియలు జరుపుతున్నారు. అయితే, అంత్యక్రియల్లో పాల్గొనడం కాదు.. ఆ కర్మకాండలను స్వయంగా తానే నిర్వహిస్తోంది కర్రి సత్యామణి. శ్మశానంలోనే ఉంటూ, దశాబ్దకాలంగా మృతదేహాలను కాలుస్తోంది ఈ మహిళా కాటికాపరి.
 
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్‌ మండలం బండారులంకకు చెందిన కర్రి సత్యామణికి చదువు లేదు. వేర్వేరు కారణాలతో ఆమె కుటుంబం విచ్ఛిన్నమయింది. శ్మశానంలో గుడిసె వేసుకొని ఒంటరిగా జీవిస్తోంది. శ్మశానానికి వచ్చిన మృతదేహాలను కాలబెడుతూ కడుపు నింపుకొంటోంది. ఆమెది జంగమ దేవర్ల సంప్రదాయం. ఆమె ఎక్కడ నుంచి వచ్చింది, కుటుంబం ఏమయింది అనేది స్థానికులకు కూడా తెలియదు. సత్యామణిని చాలాకాలంగా కాటికాపరిగానే చూస్తున్నామని చెబుతున్నారు. ఊరి పిలుపులకు ఆమె దగ్గరగా ఉండి అంతిమ క్రతువులను పూర్తి చేస్తోంది.
 
అంతేకాదు, నిరుపేద కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు, మంత్రం నుంచి కట్టెల మీద కాల్చేదాకా ప్రతి కార్యక్రమం తానే చూసుకొంటుంది. మంత్రాలు చెప్పేపాండిత్యం ఎక్కడ సంపాదించావు అని సత్యామణిని ప్రశ్నిస్తే, శ్మశానవాటికలో పురోహితులు శ్లోకాలు చదువుతుంటే విని కొన్ని శబ్దాలను, పదాలను తాను చెవినేసుకొన్నట్టు వివరించింది. అంత్యక్రియలు పూర్తి చేసినందుకుగాను మృతదేహానికి రూ.వెయ్యి చొప్పున తీసుకొంటానని సత్యామణి తెలిపింది.