29, అక్టోబర్ 2010, శుక్రవారం

మన రోడ్ల పైకి వచ్చేసిన 16 కోట్ల కారు


మనదేశంలో అత్యంత ఖరీదైన కారు గురువారం మార్కెట్లోకి విడుదలైంది. వోక్స్‌వాగన్ గ్రూప్ కంపెనీ బుగట్టి ఆటోమొబైల్స్ ఈ సూపర్ ప్రీమియం స్పోర్ట్స్ కారును ప్రవేశపెట్టింది.‘బుగట్టివెరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్స్’ బ్రాండ్ పేరుతో ఆవిష్కరించిన ఈకార్ల ధర రూ.16 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. బుగట్టి ఆమెరికా, యూరప్, మధ్యప్రాచ్యంలో బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత మార్కెట్లోకి దీన్ని ప్రవేశపెడుతున్నామని బుగట్టి ఆటోమొబైల్స్ సేల్స్ మేనేజర్ గై కాక్విలిన్ విలేఖరుల సమావేశంలో చెప్పారు.

రూ.16 కోట్లకుపైన ధర గల బుగట్టి వెరాన్ గ్రాండ్ స్పోర్ట్స్ కార్లను కంపెనీ భారత డీలర్ అయిన ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ పంపిణీ చేయనుందని ఆయన తెలిపారు. సుమారు రూ.5 కోట్ల ధర గల్గిన రోల్స్ రాయిస్ ఫాంటమ్, మెబాక్ మోడల్స్ ఇప్పటిదాకా మనదేశంలో విలువైన కార్లు బుగట్టి వెగాన్ ధర విదేశీ ద్రవ్య కదలికలు, కస్టమరీ డిమాండ్‌ని బట్టి వుంటుందని ఎక్స్‌క్లూజివ్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ సత్య బాగ్లా తెలిపారు.

బుగట్టి వెగాన్ ధర ప్రస్తుతం భారత్‌లో అమ్ముడవుతున్న అతి విలువైన కారు ధరకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువని ఆయన వివరించారు. ఆర్డరు చేసిన తర్వాత ఆరు, ఎనిమిది నెలలకి కారును డెలివరీ చేస్తామని చెప్పారు. ఈఏడాది ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 80 కార్లను మార్కెట్ చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుగట్టి వెరాన్ వేగంలోనూ సాటిలేనిదని, సాధారణ రోడ్లపైన కూడా ఇది గరిష్టంగా గంటకి 407 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీయగలదని, కేవలం 2.7 సెకన్లలో దీని వేగం జీరోస్థాయి నుంచి 100 కిలోమీటర్ల స్థాయికి పెరుగుతుందని కంపెనీ చెబుతోంది




ఆంధ్ర భూమి సౌజన్యంతో